Previous Page Next Page 
భార్యతో రెండో పెళ్ళి పేజి 38


    ఆ బిడ్డ వంక చూస్తూనే తెల్లబోయాడు వివేక్, సాధారణంగా పసిపిల్లల్లో పోలికలు తెలియవంటారు.
    కానీ ఆ పసికందును చూసీ చూడగానే, ప్రసూన గుర్తుకు వచ్చేలా ఉన్నాడు. పసివాడి మీదినుంచి దృష్టి మరల్చలేకపోతున్న వివేక్ ని "దిష్టి కొడుతుంది మీ బాబుకి" అని వేళాకోళం చేసింది.
    ప్రసూన కూడా చాలా స్పష్టంగా కనబడుతున్న తన పోలిక గుర్తించింది. ఆనందాన్ని మనసులో దాచుకుని తల మీద చెయ్యి వేసి లోలోపల అస్పష్టంగా ఆశీర్వదించుకుంది.
    "ఇంక నేను వెళ్తాను... వివేక్ వస్తావా? స్నానం చేసి విశ్రాంతి తీసుకుంటాను" అని బయలుదేరింది.
    వివేక్ తల్లి వెంట వచ్చాడు. కానీ అతడి మనసుని పసివాడి రూపం గాలంవేసి లాగుతున్నట్లనిపించింది. ఎంతగా మర్చిపోదామనుకున్నా మరిచిపోకుండే ఆ పసిముఖం అతని ముందుకు వస్తోంది.  
    దేవిశంకర్ హాస్పిటల్ కి వెళ్ళి, పసివాడిని చూసి వచ్చాడు. ప్రసూన పోలికలు అతడూ గుర్తించాడు. మనవడి మీద మమకారమూ కోడలి మీద ద్వేషమూ ఒకే క్షణంలో పొంగాయి అతనిలో.   
    ఇంటికి రాగానే భార్యతో అన్నాడు దేవిశంకర్ "పసివాడు నీలాగే ఉన్నాడు....!"
    "చెప్పలేం! పసిపిల్లల్లో పోలికలు మారిపోతూ ఉంటాయి!"
    "కావచ్చు.... ఫలానీ పోలికలని కాదు. వాడిని చూడగానే నువ్వు గుర్తొస్తున్నావు"
    "ఏం? మీకు నచ్చలేదా?"
    "అందుకే వాడంటే ప్రేమ పొంగుతోంది."
    భర్త మొహంలోకి చూసి తలదించుకుంది ప్రసూన.
    "థేంక్యూ!" గొణుగుతున్నట్లు అంది.
                                    * * *
    లేత గులాబీ రంగులో చిన్నారి పిడికిళ్ళు మూసుకుని పొత్తిళ్లలో పడుకుని ఉన్న పసివాడిని చూస్తున్న కొద్దీ, ఈ సృష్టి ఎంత అద్భుతమో అనిపిస్తోంది యశోదకి. కళ్ళు తెరువని పసికందు మీద మమకారం పొంగి వస్తోంది మనసులో. ఆ పసివాడే తన జీవితమంతా అనిపిస్తుంది.
    వాడు తనలో తాను నవ్వుకుంటాడు. తనలో తాను ఏడుస్తాడు. జాగ్రత్తగా పరిశీలిస్తే అలా నవ్వుకోవటమూ, ఏడవటమూ, రెండూ.. శిశువు నిద్రలోంచి లేచేటప్పుడో. లేదా మెలుకువలోంచి నిద్రలోకి జారుకునేటప్పుడో జరుగుతాయి. అంటే శుద్ధ చేతన ఏ భావమూ స్పష్టంగా అందుకోలేని దశలోనే, అవ్యక్త చేతనలో సంచలనం ప్రారంభమవుతుందన్నమాట. మనసు పూర్తిగా వికసించక ముందే ఆ వ్యక్త చేతనలో భావతరంగాలు కదులుతాయి. ఇదే అర్ధసుషుప్తావస్తా.. పెద్ద వాళ్ళకి సహితం ఈ దశలో తమ ఆలోచనల రూపం స్పష్టం కాదు. సైకాలజీకంతకు ఈ అవస్థ చేతనలో కదిలే భావతరంగాలే మూలాధారం. పసికందు అవ్యక్తచేతన ఏయే స్మృతులలో పరిభ్రమిస్తుందో.
    ప్రసూన రోజూ వస్తుంది. పసివాడిని చూడటానికి వాడు లేత గులాబీరంగులో ఉండటం వల్ల ఆవిడే వాడికి 'పింకూ' అని పేరు పెట్టింది, పింకూని ఎత్తుకోవడానికి వియ్యపురాళ్ళిద్దరూ పోటీలు పడతారు.
    వాడు "ఊ, ఆ" అన్నా, బోర్లా పడడానికి ప్రయత్నించినా, నవ్వినా అన్నీ అబ్బురంగానే కనిపించేవి. వాడి ప్రతీ కదలికకీ. ఒక అర్థం.. వాడి నోట్లోంచి వచ్చే ప్రతీ చిన్న శబ్దానికీ ఒక వ్యాఖ్యానం చెప్పుకునేవారు.
    వివేక్ దూరం బాబుని చూసేవాడు, ఎత్తుకోవటానికి సిగ్గుపడుతున్నాడని చూసే వాళ్లకి అనిపించేది. అతడి మనసులో ఉన్న సంఘర్షణ, ఊహించగలిగింది యశోద మాత్రమే.
    దేవిశంకర్ ఒక్కసారి మాత్రమే వచ్చాడు, మనవడిని చాలా ఆప్యాయంగా ఎత్తుకున్నాడు. బంగారపు గొలుసు ఉన్న వాచీ బహుమానంగా ఇచ్చాడు.
    కానీ అతడు యశోదని చూసిన చూపు, యశోద లాంటి ధీరురాలు కూడా గడగడ వణికింది ఆ చూపుల క్రౌర్యానికి, పింకుని మూడో నెల రాగానే తన ఇంటికి తెచ్చేసుకుంది ప్రసూన...
    తప్ప తాగి వచ్చాడు వివేక్. వివేక్ ఇదివరలో అతడు తాగినా ఏం చేసినా ఇంట్లో వాళ్లకి తెలిసేది కాదు. ఇప్పుడు పింకూ కోసం ప్రసూన ఇంచుమించుగా ఆ గదిలోనే ఉంటుంది. అప్పుడప్పుడూ దేవిశంకర్ కూడా వస్తున్నాడు.   
    వివేక్ ఇదివరకటి కంటే ఎక్కువగా తాగుతున్నాడు. అదుపులో పెట్టుకోలేకపోతుంది యశోద.
    పింకూని ఎత్తుకుంటాడు, ముద్దు చేస్తాడు, బొమ్మలు అవి కొంటాడు. కానీ ఉండుండి ఆ పసివాడు ఏదో అంటరాని వాడైనట్లు దభాలున వదిలేసి వెళ్ళిపోతాడు. ఈ  ధోరణి యశోదకి చాలా భయంగా ఉంది.  
    తాగిన మైకంలో పింకూని ఎత్తుకోబోతే అడ్డుకుంది యశోద.
    "నేను వీడిని తీసుకుపోతాను!" ముద్దగా అన్నాడు వివేక్.
    "వొద్దు!"
    "ఎందుకువద్దూ? వీడు నా కొడుకు కాడా?"
    "కాడు! మీరు పడుకోండి!"
    అత్తగారి కళ్ళముందు ఇదంతా జరుగుతున్నందుకు చాలా బాధగా ఉంది యశోదకి. మావగారు కూడా ఉన్నారు.
    "కాడూ? నా కొడుకు కాడూ? ఎవరి కొడుకో చెప్పు!"
    "అత్తగారి మనవడు"
    "అత్తగారి.... అహ్హహ్హ అహ్హహ్హ"
    "పడుకోండి!"
    "నేను పడుకున్నాక ఎక్కడికి వెళ్తావు?"
    "ఎక్కడికీ వెళ్లను!"
    "వెళతావు! పారిపోతావు.... నాకూ తెలుసు! నువ్వు పారిపోతావు" ఏడవడం మొదలు పెట్టాడు వివేక్.
    ఇంక భరించలేకపోయింది ప్రసూన. కొడుకుని ఆ స్థితిలో అంతకు ముందెన్నడూ చూడలేదు. ఆవిడ పింకూని ఉయ్యాలలో వేసేసి ఆ గదిలో నుండి వెళ్ళిపోయింది. దేవిశంకర్ యశోదని కాల్చి నుసి చేసేలా చూశాడు.   
                                     * * *

 Previous Page Next Page