రేటు గిట్టుబాటయితే, ఎందుకు చెప్పనండీ?"
"అంతకుముందు, దేవిశంకర్ దగ్గర ఈ పనులన్నీ చెయ్యటానికీ డబ్బు తీసుకున్నావు కదూ?"
"డబ్బు లేకుండా ఇట్టాంటి పనులెట్టా జరుగుతుయ్యండీ?"
"మరి డబ్బు తీసుకుని, పనులు చేసి, ఆ తర్వాత రహస్యాలు బయట పెట్టడం నమ్మకద్రోహం కాదా?"
"నమ్మక ద్రోహమేనండీ"
"అది పాపం కాదా?"
"ఎందుకు కాదండీ! అందుకే "బిజినెస్" లో వచ్చిన డబ్బులో కొంతవాటా, పూజలకీ కొబ్బరికాయలకీ మొక్కుబళ్లకీ ఉంచేస్తానండీ! ఆ పాపానికీ. ఈ పుణ్యానికీ బేలన్స్ అయిపోద్ది. మా అయ్యగారే నేర్పించారండి నాకీ ధియరీ! ఆయనగారు భలే పూజలు చేస్తారండీ"
"ఇంక నువ్వు వెళ్లవచ్చు."
"నాకేం అక్కరలేదు! నీలాంటి వాడితో బిజినెస్ చెయ్యాల్సిన అవసరం నాకు లేదు"
"పోనీ ఎక్కువ ఉంటే మరోధర చెప్పండి."
"గెటవుట్!"
అప్పటికి డాక్టర్ తనని నిజంగానే వెళ్లమంటున్నాడని అర్థమయ్యింది వీరన్నకి! గూండాలకీ వెధవపనులు చేస్తున్నప్పుడు, ధైర్యం ఎంత ఉంటుందో అవి బయటపడతాయనుకున్నప్పుడు అంత భయం ఉంటుంది. అలాంటి భయమే పట్టుకుంది వీరన్నకి.
"నా దగ్గర ఏదేదో విని, మా అయ్యగారిని బ్లాక్ మెయిల్ చేద్దామనుకుంటున్నారేమో! అదేం లాభం లేదు. ఆటన్నింటికీ సాక్ష్యాలు నావొక్కడికే తెలుసు"
"గెటవుట్! రాస్కెల్!" గట్టిగా అరిచాడు డాక్టర్.
* * *
డాక్టర్ దగ్గర నోటికొచ్చినట్లు డబ్బుకోసం వాగిన తర్వాత చాలా భయపడ్డాడు వీరన్న, ఎటుపోయి ఎటువస్తుందోనని తనే తిన్నగా దేవిశంకర్ దగ్గరికి వచ్చి, జరిగిన దానికి యధాశక్తి రంగు పులిమి చెప్పాడు.
"ఆయన గోరి పేరు అనంత పద్మనాభస్వామి అంట. నన్ను పిలిచి, మీ గురించి ఎటేంటో అడిగాడు. ఖూనీలూ.....! ఆడోళ్ళూ....!."
"నోర్ముయ్. ఆయన దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావ్?"
"డాక్టర్ కదా అని పిలిపించాడు. ఏంపనో అని ఎల్లాను. పదిమంది దగ్గర పన్లు చేసుకుంటే కదా మా పొట్టలు నిండేది"
"నువ్వు నా దగ్గర మొదట్లో పని చేశావని డాక్టర్ కెలా తెలిసింది?"
"కోడలమ్మగారు చెప్పారంట!"
ఉలిక్కిపడ్డాడు దేవిశంకర్. ఆ రోజు యశోద వీరన్నతో మాట్లాడటానికి ప్రయత్నించడం గుర్తొచ్చింది. ఆ రోజున కేవలం వీరన్నతో ఇంటి కోడలు మాట్లాడటం మర్యాద కాదని అదిలించాను. ఆ మహా తల్లి తనను గురించిన వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తోందా? ఏం చేద్దామని? చూస్తూ ఉండగా ఉగ్రమూర్తి అయిపోయాడు దేవిశంకర్. పేంట్ షర్ట్ వేసుకున్నా కొమ్ములు కోరలూలేని రాక్షసుడిలాగ ఉన్నాడు ఆ క్షణంలో.
"దాన్ని అనుసరించు. ఏమాత్రం ఆధారం దొరికినా వొదలకు" ఆజ్ఞాపించాడు.
"చిత్తం!" అన్నాడు వీరన్న, యజమాని నుంచి ఆ మాత్రం సూచన చాలు ఒక జీవితం నాశనం చెయ్యటానికి.
* * *
ఏడోనెల వచ్చిన దగ్గర్నుంచీ, యశోద ఎక్కువగా ప్రసూనతోనే గడుపుతోంది. ఆవిడ సమక్షంలో ఉన్నంత వరకూ యశోద మనసుకి చల్లగా హాయిగా ఉండేది.
తర్వాత పురిటికి వెళ్ళినా, ప్రసూన దగ్గర కొంచెం గడపటం కోసమే అత్తవారింటికి వచ్చేది. అలా రమ్మని ప్రసూన అడిగింది. ప్రతీరోజూ ఏదో ఒక స్వీట్ తయారు చేసి యశోద కోసం సిద్ధంగా ఉంచేది. తింటేగానీ వదిలిపెట్టేది కాదు.
యశోదకి నెలలు నిండుతున్న కొద్దీ యశోద గర్భాన్ని వివేక్ భయంగా, బాధగా చూసేవాడు. దగ్గరగా రాలేకపోయేవాడు. దూరంగా ఉండలేకపోయేవాడు. ప్రేమించకుండా ఉండటం అతనితరం కావడం లేదు.
ఈర్ష్య అణచిన కొద్దీ విజృంభించి అతడి మనశ్శరీరాలను కాల్చేస్తోంది. ఈ సంఘర్షణ యశోద అర్థం చేసుకుంది కానీ ఏమి చెయ్యలేని నిస్సహాయురాలైపోయింది.
యశోదకి నొప్పులు రాగానే, దక్షిణామూర్తి ప్రసూనతోనూ, వివేక్ తోనూ చెప్పి వచ్చాడు. ఇద్దరూ వెంటనే హాస్పిటల్ కి వచ్చాడు. డెలివరీ రూంకి వెళ్లబోతూ, స్ట్రెచర్ మీద పడుకుని జాలిగా వివేక్ ని చూసింది యశోద. అతడు చటుక్కున వచ్చి, యశోద రెండు చేతులూ పట్టుకున్నాడు. ఇద్దరి కళ్ళలోనూ చెమ్మ.
"దిగులుపడకు. అంతా సవ్యంగానే జరుగుతుంది!" చాలారోజుల తర్వాత అతడు ప్రేమతో మాట్లాడిన మాటలివి.
అతడి చేతులు కళ్లకద్దుకుని వదిలేసింది యశోద. నడుములోంచి పొత్తికడుపులోకి ప్రవేశించి బాధ భరింపరానిదిగా ఉంది. మూలిగి ఏడ్చి గొడవ చెయ్యటం ఇష్టం లేనిది కావటం వల్ల పెదిమల మధ్యన బాధను భరిస్తూ అత్తగారి కోసం చూసింది.
కొయ్యబల్లమీద బాసింపట్టువేసుకుని కళ్ళు మూసుకుని కూచుని ఉంది ఆవిడ... ఆవిడని అర్థం చేసుకోలేని వాళ్ళు కూచునే నిద్రపోతుందని అనుకుంటారు. కానీ యశోదకి తెలుసు. ఆవిడ ధ్యానంలో ఉందని అటు చూసి మనసులో నమస్కారం చేసుకుంది.
యశోదని డెలివరీ రూంలోకి తీసుకుపోయారు.
సన్నగా నొక్కిపట్టి అరుస్తున్నట్లు, యశోద మూలుగులు వినపడుతున్నాయి. కొంతసేపటికి పసిబిడ్డ 'కేర్'మనే ఏడుపు వినపడింది. అప్పుడు కళ్ళు తెరిచింది ప్రసూన.
మొదట పిచ్చివాడిలా గాభరాపడిపోతూ అయోమయంగా చూస్తున్న వివేక్ కనిపించాడు. అతడి దగ్గరగా వచ్చి తలమీద చెయ్యివేసి" తండ్రివయ్యావు వివేక్!" అంది.
"ఆ?" అన్నాడు అతడు. ఆ మాటలు అతడికి ఆనందం కలిగించకపోగా గుండెలో గునపాలు పెట్టి పొడిచినట్లు అనిపించింది.
నర్స్ పొత్తిళ్లలో చుట్టి, పసిబిడ్డని తీసుకొచ్చి చూపించింది.
"మొగపిల్లాడు!"