"లేదు" అని ఆమెకి దగ్గరగా వస్తూ, " నువ్వు ఇన్ని ప్రశ్నలు ఎందుకు వేస్తున్నావో నాకు అర్థంకావటంలేదు సిరిచందనా. నా భార్యకి ఒక ప్రియుడున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి వుండగా చూసి నేను తోసేశాను. ఆమె మరణించింది. ఆమె తనంతట తానే అతన్ని ప్రేమించిందా, లేక అతనే ఆమెని మోసం చేశాడా, ఇవన్నీ అప్రస్తుత విషయాలు. ఆమెని హత్యచేసిన నేరానికి నాకు ఉరికంబం అక్కడ సిద్ధంగా వుంది. అది మాత్రం నిజం. ఇంతకన్నా మిగతా విషయాలన్నీ అనవసరం. అప్రస్తుతం" అని బయటికి నడవబోయాడు.
"నేను నిన్ను విశాఖపట్నం వరకూ డ్రాప్ చేస్తాను. రావటానికి ఏమన్నా అభ్యంతరం వుందా?" అడిగింది సిరిచందన.
అతడు ఆశ్చర్యంగా "ఎందుకు?" అన్నాడు.
"ఆఖరి నిమిషం వరకూ నీతో కలిసి వుండటంకోసం. ఏం వుండకూడదా?"
అతడునొచ్చుకుంటున్నట్టు "అలాంటిదేం లేదు సిరీ, పద వెళ్దాం" అన్నాడు.
కారులో వారిద్దరూ ఎక్కువ మాట్లాడుకోలేదు. విశాఖపట్నం పొలిమేరలకు వచ్చిన తర్వాత "నిన్నెక్కడ డ్రాప్ చెయ్యాలి!" అని అడిగింది.
"పోలీస్ స్టేషన్ దగ్గర"
ఆమె మారుమాటాడకుండా కారు పోలీస్ స్టేషన్ దగ్గర ఆపుచేసింది. అతడు కారు దిగి ఆమెవైపు చూశాడు.అదే ఆఖరి చూపని తెలిసినట్టు అతడు అలాగే నిలబడిపోయాడు. ఆమె తిరగి కారు స్టార్టు చేసి నెమ్మదిగా అక్కడినుంచి సాగిపోయింది. ఆమె ప్రవర్తన అతని కర్థంకాలేదు.
అక్కడే ఒక క్షణం ఆగి నెమ్మదిగా పోలీస్ స్టేషన్ లోకి నడిచాడు.
13
ఇంట్లో హాల్లో కూర్చుని పేపర్ చూస్తున్నాడు వర్మ. ప్రతి రోజూ ప్రొద్దున్నే పేపర్ రాగానే దాన్ని మొదటినుంచీ చివరివరకూ కూలంకషంగా చూస్తూనే వున్నాడు. "జైలునుంచి తప్పించుకున్న ఖైదీ పట్టివేత" అన్న వార్త పేపర్ లో ఏ మూలైనా కనబడుతుందేమో అని అతడి ఆశ. అది ఆశకూడా కాదు, అలా కనిపించకూడదనే అతడి కోరిక. కానీ మహర్షి అరకు వెళ్ళిన దగ్గర్నుంచీ అతడి జాడే లేదు. అక్కడేం జరుగుతుందో అతడికి అర్థంకాలేదు. సిరిచందనని చూసిన తర్వాత ప్రాణంమీద తీపితో అతడు అక్కడే వుండిపోయాడా అన్న అనుమానం కలుగుతోంది. అయితే మహర్షి విషయం బాగా తెలిసిన వాడవటం చేత అలా అయ్యుండదు అని అతడిలో మరోవైపు నమ్మకం కూడా వుంది.
ఇలా పరస్పర విరుద్ధమైన భావాల్తో కొట్టుమిట్టాడుతూ అతడు తలుపు తీసి చేశాడు.
ఎదురుగా ఒక యువతి నిలబడి వుంది. "నమస్తే" అంది.
అతడు ఆ అపరిచిత వ్యక్తివైపు ఆశ్చర్యంగా చూస్తూ "మీరు.....?" అన్నాడు.
"నేను సిరిచందనని."
ఒక్కక్షణం చకితుడై ఆమెవైపు చూశాడు.
సిరిచందన నవ్వుతూ "ఏం, పేరు చెప్పినా నన్ను గుర్తుపట్టలేదా?" అని అడిగింది.
కళ్ళకింద నల్లగీతలు, నిద్రలేమిని సూచించే కళ్ళు, చెదిరిన జుట్టు ఆమె అందాన్ని దాచలేకపోతున్నాయి. ఐనా ఆమెలో ఎంతో మార్పు కనబడుతోంది. అతడి నిశ్శబ్దాన్ని చూసి, ఆమె - "ఇలా నిలబడే మాట్లాడేస్తారా ఏమిటి?" అంది చొరవగా.
అతడు సోఫా చూపించాడు. అతడింకా ఆశ్చర్యంనుంచి తేరుకోలేదు. ఆమె కూర్చుంటూ "చిన్న ఇన్ ఫర్ మేషన్ తెలుసుకుందామని వచ్చాను" అంది.
"మహర్షి...... మహర్షి మిమ్మల్ని కలుసుకోవటానికి వచ్చాడా?" ఆమెని ఏకవచనంలో సంబోధించాలో, బహువచనంలో సంబోధించాలో తెలియనట్టు అడిగాడు వర్మ.,
"వచ్చాడు, వెళ్ళాడు"
"ఎక్కడికి?"
"పోలీస్ స్టేషన్ లో సరెండర్ అవటానికి"
వర్మ గాఢంగా విశ్వసించాడు. ఏదైతే జరగకూడదనుకుంటున్నాడో అది జరిగిపోయింది.
"వర్మా! నాకో ఇన్ ఫర్ మేషన్ కావాలి. మహర్షి భార్య పేరు శ్రీవాణి కదూ?"
ఆమె ఆ ప్రశ్న ఎందుకడుగుతుందో అర్థంకాక అతడు "అవును" అన్నాడు.
"శ్రీవాణిని మహర్షి హత్యచేశాడు కదూ?"
"నో" అరిచాడు వర్మ..... "అదొక యాక్సిడెంట్. అంతే! ఆమెని ఆమె ప్రియుడి కౌగిలిలో చూసి కోపంతో తోశాడు. ఆమె కిందపడటంతో యాక్సిడెంటల్ గా మరణించింది. ఆమె ప్రియుడు ఆ సాక్ష్యం చెప్పటానికి నిరాకరించాడు. అందువల్లే మహర్షికి ఉరిశిక్ష పడింది. కనీసం నువ్వన్నా ఇది నమ్మాలి. కేవలం నీమీది ప్రేమతో అతడు జైలునుంచి తప్పించుకొని వచ్చి నిన్ను కలుసుకున్నాడు" ఆవేశంగా అన్నాడు. "అవును. అదంతా నాకు తెలుసు. నేను నమ్ముతున్నాను కూడా. నేను నమ్మని విషయం ఏమిటంటే శ్రీవాణికీ , ఆమె ప్రియుడికి ఏమీ సంబంధంలేదు, కేవలం వాళ్ళది అన్నాచెల్లెళ్ళ సంబంధం మాత్రమే."
"నాన్సెస్స్! ఎవరు చెప్పారా విషయం?"
"శ్రీవాణిని చెల్లెల్లా చూసుకునే వ్యక్తే చెప్పాడు."
"అంతకన్నా పెద్ద ఆత్మవంచన మరోటిలేదు. నేను శ్రీవాణి డైరీ మొదట్నుంచీ చివరి వరకూ చదివాను. ఆమెని ట్రాప్ చేసి, ఆమె అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని, ఆమెని అనుభవించి, చివరికి వదిలేసాడు నీచుడు"
"ఆ నీచుడి పేరు?"
"రవితేజ"
అంతే, దూరంగా ఎక్కడో సముద్రం ఆకాశంతో కలిసే చోట ఒక విస్ఫోటన కలిగిన భావన!
ఒక నమ్మకం విఘాతమైంది.
ఆమె హృదయ దర్పణంలో భర్త ప్రతిబింబం వికృతంగా మారింది. చేష్టలుడిగినట్లు, చలనం లేనట్టు ఆమె అలాగే కూర్చుండి పోయింది.