"స్నేహితుడిగా నేనో కోరతాను, తీరుస్తావా?" అని అడిగాడు.
"చెప్పు మహీ"
"ఏమీ లేదు. తిరిగి నువ్వు రవితేజ మునపట్లా మామూలుగా వుండాలి"
అతడు నొచ్చుకుంటున్నట్టు చూసి "బాధపెట్టానా సిరీ" అన్నాడు.
ఆమె జారే కన్నీటిని తుడుచుకుంటూ "బాధ నాకు కొత్త కాదు మహీ! కానీ మిత్రుడివైయుండి నేను చేసే పనిని సమర్థించలేకపోతున్నావే అనే నా బాధంతా" అంది.
"లేదు సిరీ! నువ్వెప్పుడూ రాంగ్ డెసిషన్ తీసుకుంటావని నేననుకోలేదు. కానీ, ఇది అన్నిటిలా కాదుకదా! జీవితానికిసంబంధించిన సమస్య. కొన్ని విషయాల్లో సర్దుకుపోక తప్పదు."
"నా మాటకేంగానీ మహీ, నీ విషయం చెప్పు" ఆ మాటతో తాత్కలికంగా ఆమె తాలుకు ఆలోచనల్నుంచి బయటపడ్డాడు.
"నా గురించేం వుంటుంది. ఒంటరివాడిని" నిట్టూరుస్తూ అన్నాడతను.
"ఇదిగో ఆ నిరాశే వద్దు. మేమంతా లేమా? నీకో మంచి అమ్మాయిని చూసి పెళ్లిచేసి, మంచి ఉద్యోగం ఒకటి చూసి మా ఇంట్లోనే వుంచేసుకుంటాను" మీ యిద్దరినీ."
అతడు సమాధానం చెప్పలేదు. ఒక అబద్ధం ఆమె జాలిచూపులనుండి తప్పించగలిగినప్పుడు ఎందుకు చెప్పాలి? అనుకుంటూ మౌనంగా ఉండిపోయాడు.
"ఏంటి సమాధానం చెప్పవు? అవునా? అన్నట్టు అప్పుడప్పుడూ నువ్విలా యోగముద్రలోకి వెళ్ళిపోయినట్టు మారిపోతావు దేనికి!"
"ఏమీలేదు. ప్రశ్న, జవాబూ నువ్వే చెప్పినప్పుడు మాట్లాడ్డానికి ఏముంటుందని ఊరికే ఉంటాను. అంతే" అతను తడబడ్డాడు.
"అదికాదు. మాట్లాడేప్పుడే కాకుండా ఒంటరిగా కూర్చున్నప్పుడు కూడా నువ్వు అలాగే వుంటావు. శూన్యంలోకి చూస్తూ కూర్చుంటావు. నిన్ను అరకులో చూసినప్పటినుండీ గమనిస్తూ వున్నాను. అడగాలంటే అవకాశం రాలేదు. ఎందుకు మహీ, అలా వుంటావు?"
"ఏమీలేదు. ప్రశాంతంగా వుండటమె నా కిష్టం. అంతకుమించి ఏమీ లేదు" అతను తప్పించుకోవాలని చూశాడు. మాటమార్చటంలో మాత్రం సిద్ధహస్తుడివి" ఆమె నవ్వింది.
ఇబ్బందికరమైన సంభాషణ ప్రక్కకు మళ్ళటంతో, అతనూ తేలిగ్గా ఊపిరి పీల్చుకుని ఆమె నవ్వుతో శృతి కలిపాడు.
అదే వారిద్దరిమధ్య 'చివరి నవ్వు' అని చెప్పడానికై అప్పుడే ఆ కంపౌండ్ లో ఓ జీప్ ప్రవేశించింది.
సిరిచందన కిటికీలోంచి జీప్ వస్తున్న శబ్దానికి బైటికి చూసింది. దానిమీద 'పోలీస్' అని రాసి వుండటంతో, తమ కారు పాడయ్యిందేమో, భర్త అందులో వస్తున్నాడేమో అనుకుంది. కానీ మరో ఇన్ స్పెక్టర్ దిగటంతో ఆమె గెస్ట్ హౌస్ బయట కొచ్చింది. ఇన్ స్పెక్టర్ ఆమె దగ్గరికి వస్తూ, "మేడమ్, మహర్షి అనే వ్యక్తి ఇక్కడున్నాడా?" అని అడిగాడు.
ఆమె అనుమానంగా "ఎందుకు?" అని అడిగింది.
"అతన్ని అరెస్ట్ చెయ్యటానికి"
సిరిచందన షాక్ తిన్నట్టుగా "ఎందుకు?" అంది.
"అతను జైలునుంచి పారిపోయిన ఖైదీమేడమ్" అన్నాడు ఇన్ స్పెక్టర్.
సిరిచందన ఉలిక్కిపడింది. భృకుటి ముడిపడింది. "ఏం మాట్లాడుతున్నారు మీరు ఇన్ స్పెక్టర్?" అంది కటువుగా.
"అవును మేడమ్! అతనికి భార్యని చంపిన నేరంమీద ఉరిశిక్ష పడింది. మరుసటిరోజు తెల్లవారుజామున ఉరితీస్తారనగా ఆ రాత్రే తప్పించుకున్నాడు. అక్కడ సెంట్రీని కూడా దారుణంగా చంపాడు. ఇన్నాళ్ళూ అతనికోసం పోలీస్ డిపార్ట్ మెంటంతా వెతుకుతోంది. ఇక్కడ వచ్చి చేరాడని మాకు నమ్మకంగా తెలిసింది."
"ఎవరు చెప్పారు?"
అరెస్ట్ చేయడానికి వచ్చిన ఇన్ స్పెక్టర్ పేరు రవికిరణ్. అతనికి రవితేజ స్పష్టంగా చెప్పాడు. ఎటువంటి పరిస్థితుల్లో తన పేరు బయటికి రాకూడదని.
ఇన్ స్పెక్టర్ కిరణ్ ఒక్కక్షణం తటపటాయించి "మహర్షికి వర్మ అని ఒక స్నేహితుడున్నాడు మేడమ్. అతణ్ణి అరెస్టు చేసి ఇంటరాగేట్ చేస్తే ఈ విషయం తెలిపాడు" అన్నాడు.
"ఆ అవుట్ హౌస్ లో ఉంటాడు చూడండి"
ఇన్ స్పెక్టర్ కిరణ్ పోలీసులతోసహా వడివడిగా అవుట్ హౌస్ వైపు వెళ్ళాడు. అతడొచ్చేవరకూ ఆమె అక్కడే నిలబడివుంది. వస్తున్న ఇన్ స్పెక్టర్ మొహం పాలిపోయివుంది. "అవుట్ హౌస్ లో మహర్షి లేడు మేడమ్ " అన్నాడు. ఆమె తన పై ఆఫీసర్ అయినట్టు, అక్కడ జరిగింది ఆమెకి చెప్పాలన్నట్టు.
తన మొహంలో భావాలు కనిపించకుండా "మైగాడ్! తప్పించుకున్నాడా?" అంది సిరిచందన.
"అలాగే కనబడుతోంది. సూట్ కేసంతా సర్దివుంది. బహుశా వెళ్ళిపోవటానికి సిద్ధమై వుంటాడు. అంతలో మా పోలీస్ జీప్ శబ్దంవిని సూట్ కేసు తీసుకోకుండా పారిపోయుంటాడు. మేం వెళ్తాం మేడమ్ చుట్టప్రక్కల అంతా గాలించాలి" అంటూ ఇన్ స్పెక్టర్ పోలీసులతో సహా జీప్ ఎక్కి హడావుడిగా వెళ్లిపోయాడు. ఆమె లోపలి కొచ్చింది.
బయట జరుగుతున్న సంభాషణ ఏమీ తెలియని మహర్షి "ఏం జరిగింది సిరీ?" అని అడిగాడు.
ఆమె తాపీగా ఎదుటి కుర్చీలో కూర్చుంటూ "ఏంలేదు. ఆయన కోసం ఎవరో వచ్చారు" అంది. ఆమెకి కొంచెంసేపు ఒంటరిగా ఉండాలని పించింది. అలా అని అతన్నుంచి దూరంగా వెళ్ళాలనికూడా అనిపించలేదు. "నేను కాఫీ కలిపి తీసుకొస్తాను" అని ఆ నెపంమీద వంటింట్లోకి వెళ్ళింది.
మహర్షికిపెళ్ళయిందా? భార్యని చంపాడా? ఆమె నమ్మలేకపోతోంది. క్షీరసాగరాన్ని హాలాహలనిలయంగా నమ్మవలసి వచ్చినప్పుడు కలిగే దిగ్ర్భాంతి ఆమెని ఆవరించింది.
ఒక స్నేహితురాలి క్షేమంకోసం......ఒక జీవితం అంధకార బంధురంగా మారకుండా ఉండటంకోసం..... తన జీవితాన్నే కానుకగా సమర్పించిన ఒక మహొన్నత వ్యక్తి.....ఒక ఆడదాన్ని చంపటమా?
మనసు స్తబ్థమయింది.
ఆమె నిశ్శబ్దమయింది.
అక్కడి వాతావరణం బాధాతప్తమైంది.
.....ఆమె కాఫీ కప్పులు తీసుకొచ్చి ఒకటి అతనికిచ్చి తను ఒకటి అందుకొంది. "మహర్షీ, నాకో నిజం చెప్తావా?"
కాఫీ కప్పు పెదిమలదగ్గర పెట్టుకోబోతున్న మహర్షి ఆగి, ఆమెవైపు ఆశ్చర్యంగా చూసి, "ఏమిటి సిరీ, నీ దగ్గర కూడా నాకు దాపరికాలున్నాయా? చెప్పు" అన్నాడు.
"నా భర్తలాగే నువ్వూ నన్ను మోసం చేయాలని చూస్తున్నావా?
అతడు శబ్దం కాకుండా కాఫీ కప్పు బల్లమీద పెట్టాడు. ఆమెవైపు చూశాడు. ఆమె కన్నార్పకుండా అతన్నే చూస్తోంది.
ఆమెకేదో తెలిసిందన్నది అర్థమైంది. అతనికి అర్థమైందన్న విషయం ఆమెకీ తెలిసింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ అలాగే వుండిపోయారు.
"మహర్షీ, నీకు పెళ్ళయింది కదూ?"
అతడు తలదించుకుని "అయ్యింది" అన్నాడు నెమ్మదిగా.
"నువ్వు..... నువ్వు...." ఆమె వాక్యం పూర్తిచేయలేక పోయింది.
అతనన్నాడు "నేనే చంపాను. నా భార్యని నేనే చంపేశాను."
"నమ్మను. నమ్మలేను" హిస్టీరిక్ గా అరిచింది సిరిచందన. "నువ్వు నీ భార్యను చంపావంటే నేను నమ్మలేను"
చాలాసేపు నిశ్శబ్దం తర్వాత అతని కంఠం ఆ గదిలో ప్రతిధ్వనించింది. "ఈ ప్రపంచంలో నేనీ హత్య చేయలేదని నమ్మింది నువ్వే.... నువ్వే సిరీ! మొదటిదానివీ, చివరిదానివీ కూడా నువ్వే! అదొక యాక్సిడెంట్, అంతే, నా భార్యని మరొకరిచేతిలో చూసినప్పుడు నేను ఆవేశం ఆపుకోలేక పోయాను. ఒక్కక్షణం ఆవేశపడ్డాను. కానీ, మనిషి జీవితాన్ని మార్చటానికి ఒక్క క్షణం చాలు. అయినా నేను ప్రమాణం చేసి చెబుతున్నాను. నేను నా భార్యని చంపలేదు, అదొక యాక్సిడెంట్ అంతే."
"నీ భార్య పేరు?"
"శ్రీవాణి"
ఆమె తర్వాతి ప్రశ్న ఆ గదిలో బాంబులా పేలింది. "నీ భార్య ప్రియుడి పేరు?"
అతడొక్కక్షణం ఆగి, నెమ్మదిగా "సూర్యనారాయణ" అన్నాడు. ఆమె గాఢంగా విశ్వసించింది. తర్వాత తనలో తానే అనుకుంటున్నట్టు "కొందరు ఆడవాళ్ళు భర్తల్ని ఎంత మోసం చేస్తారు! నీలాంటివాడిని కాదని, పెళ్ళయిన తర్వాత కూడా ప్రియుడితోనే కలిసివుందంటే ఆమెని ఉరితీయాలి మహర్షీ" అంది.
మహర్షి తల అడ్డంగా వూపుతూ "శ్రీవాణి చాలా అమాయకమయిన అమ్మాయి. ఒక మగవాడే ఆ అమాయకత్వాన్ని తన స్వార్థానికి ఉపయోగించుకున్నాడు. ఆ వయసులో మగవాడు ఏం చెప్పినా ఆడపిల్లలు నమ్ముతారు. అలా తన కనుగుణంగా ఆమెని మార్చుకున్నాడు" అన్నాడు.
"నీ భార్య కాబట్టి నువ్వలా అనుకుంటున్నావేమో?"
"కాదు. నేనూ ముందు ఆమె గురించి అలాగే హీనంగా ఆలోచించాను. కానీ ఆమె డైరీ చదివిన తర్వాత తప్పు ఆమెది కాదని, ఆమె ప్రియుడిదని తెలిసింది. అయినా ఇప్పుడదంతా ఎందుకు? అయిందేదో అయిపోయింది. నా మీద ఉరిశిక్ష ఇంకా అలాగే వుంది. నేను వెళ్ళి సరెండర్ అయిపోతాను. ఎప్పటికైనా పోలీసులకు దొరికిపోవాల్సినవాడినేగా" అంటూ లేచాడు. వెళ్ళబోతూ ఆగి "ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో సిరిచందనా! మరణించబోయే ముందు నిన్ను చూడలని వచ్చాను. చూశాను. నా రాకవల్ల నీ జీవితంలో ఇంత విషాదకరమైన మార్పు జరుగుతుందంటే నేనసలు రాకపోయుండేవాణ్ణి. ఇప్పటికైనా నా ఆఖరి కోరిక, నువ్వు నీ భర్తతో కలిసి వుండటం" అని అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు. అతనిపోటు లేవటానికి కూడా ఓపిక లేనట్టు కూర్చుండి పోయింది.
శ్రీ....వా....ణి!
ఎక్కడో విన్నదా పేరు? ఎక్కడ?
ఆమెకి చిన్న అనుమానం కలిగింది. చప్పున కుర్చీలోంచి లేచి అవుట్ హౌస్ వైపు దాదాపు పరిగెత్తుతున్నట్లు వెళ్ళింది. అప్పుడే మహర్షి అక్కణ్ణుంచి బయలుదేరబోతున్నాడు.
"మహర్షీ! నీభార్య అమాయకురాలని, కేవలం ఆమె ప్రియుడే ఆమెని మోసం చేశాడేని చెప్పావు కదా? నువ్వా నిర్ణయానికి ఎలా వచ్చావు?" అని అడిగింది.
"ఇప్పుడవన్నీ ఎందుకు?" అని అడిగాడు.
"లేదు నాక్కావాలి. నువ్వు అబద్ధం చెబుతున్నావో లేదో నేను తెలుసుకోవాలి" అంది.
"నమ్మను. నేనెవ్వర్నీ నమ్మను. కట్టుకున్న భర్తనీ, ప్రేమించిన స్నేహితుడ్నీ ఎవర్నీ నమ్మను. మీరే- మీరంతా కలిసి నాలో ఈ అపనమ్మకాన్ని ఏర్పరిచారు. నువ్వు నన్ను నిజంగా ప్రేమించి వుంటే, నీ మీద నాకు మంచి అభిప్రాయం కలగాలంటే నీకా విషయం ఎలా తెలిసిందో చెప్పాలి. తప్పదు" అంది.
"నా భార్య డైరీవల్ల" అన్నాడతను.
"నాకు ఆ డైరీ కావాలి" స్థిరంగా అడిగింది సిరిచందన.
"దాన్ని నేను కాల్చేశాను" అన్నాడతను.
ఆమె అతడివైపు సూటిగా చూసింది. అతడు తల దిండుకున్నాడు. "ఆమె ఫోటో నీ దగ్గరుందా?"