Previous Page Next Page 
అతడు ఆమె ప్రియుడు పేజి 27


    వాడు సమాధానంగా నాలుగైదు కాయలు పగులకొట్టి లోపలి గుజ్జు తీసుకుని తిన్నాడు. 'తినొచ్చు' అని సైగ చేసాక తీసుకుని తినటం ప్రారంభించాడు.

    కడుపునిండిన తర్వాత నిద్రమత్తు ఆవరించింది అతన్ని. టవల్ పరుచుకుని చెట్టుకిందే మేనువాల్చాడు. భీముడు కూడా చెట్టు మొదలుకానుకుని విశ్రమించాడు. కొద్ది సేపటికి ఇద్దరూ గాఢనిద్రలో మునిగిపోయారు.

    తిరిగి వాళ్ళు లేచేసరికి పల్చగా చీకటి ముసురుకుంటోంది. టైమ్ చూసుకున్నాడు సాయంత్రం ఆరయింది. రామరాజు ఇంకా రాలేదు. అలాగే  కూర్చుని రామరాజుకోసం చూస్తూండిపోయారు ఇద్దరూ. ఆరున్నరవుతుండగా వచ్చాడు రామరాజు. ముఖమంతా వడలిపోయి బాగా అలిసిపోయినట్టు వున్నాడు. రాగానే నేలమీద చతికిలబడి కూర్చుంటూ "దొరా! మనం ఈ రేతిరి ఈణ్ణే వుండి తెల్లారినాక ఎల్లాల" అన్నాడు.

    "అవునూ....క్రిందికి దిగాక మళ్ళీ ఎందుకు పైకెళ్ళావు ఒక్కడివే" అడిగాడు మహర్షి.

    "ఇందాక మనం తెచ్చినట్టాంటి మూలిక కోసమే ఎల్లాను దొరా!"

    "ఎందుకు? మనకిది సరిపోదా?"

    "అది ఒక్క మడిసికే సరిపోద్ది. మడిసిక్కూడా గావాల".

    "ఎవరికి?"

    "మీకే దొరా?"

    ఆ మాట వినగానే ఉలిక్కిపడ్డాడు మహర్షి. "నాకేమయింది? నా కళ్ళు బాగానే వున్నాయిగా?"

    "పెమదం మీ కళ్ళకి కాదు. మీ సెరీరానికే వచ్చింది దొరా. ఏమీ కాని  ఓ మడిసికోసంపెనాలకి తెగించి మీరోత్తే..... అది గుర్తించలేని దేవుడు మీకే ఇచ్చేశాడు" అన్నాడు రామరాజు.

    "నువ్వనేది నాకేమీ అర్థం కావడంలేదు నాకేమైంది రామరాజూ?"

    రామరాజు క్షణకాలం మౌనంగా అతని ముఖంవంకే  పరిశీలనగా  చూస్తుండిపోయాడు. పచ్చటి శరీరఛాయతో ఎంతో అందంగా కనిపిస్తున్న ఆ ముఖం, పాము చర్మంకన్నాహీనంగా తయారవబోతోందని తలుచుకుంటేనే అతని గుండెను ముల్లుతో కెలికినట్టవసాగింది. ఎప్పటికైనా చెప్పక తప్పదనిపించి ప్రారంభించాడు.

    "మిమ్మల్ని కాటేసిన ఇస్సపురుగు మామూల్టి కాడు దొరా. దాని కాటు పడినాక మడిసి సెర్మమూ దాని సెర్మంలాగానే పొలుసులు పట్టుద్ది. మడిసిలో ఇషం పెరిగిపోద్ది. ఇకా మడిసికీ, పాముకీ తేడా ఏమీ వుండదు."

    మహర్షి శరీరం జలదరించింది. అప్రయత్నంగా అతని అరచేయి వెళ్ళి ముఖాన్ని తడిమింది. "మరయితే దానికి మందేమీ లేదా?" అని అడిగాడు.

    "ఉంది. మీ స్నేహితుడికి కళ్ళు తెప్పించే ఈ మూలికే దానికి ఇరుగుడు. రసం పిండి రక్తపింజేరి ఇషం కలిపి చంద్రగ్రహణం రోజు ఎన్నెట్లో పెట్టాం. అప్పుడది రాస్తే మీనెత్తురులో కలిసిన ఇషం ఇరుగుడయిపోద్ది. కానీ దొరా...." అని ఆగిపోయాడు ఏదో చెప్పటానికి సంశయిస్తున్నట్టు.

    "పరవాలేదు చెప్పు. ఇంతకన్నా భయంకర నిజాలను ఈ గుండె తట్టుకోగలిగింది" అన్నాడు మహర్షి. అప్పటికే అతనిలోఏదో వైరాగ్యభావం చోటు చేసుకోసాగింది.

    ".....మరో మూలికేదో లేద్దొరా. నాలుగు రోజుల్లో ఆ మందు మీరు త్రాగకపోతే, ఇసమంతా సెరీరం నిండిపోద్ది. అప్పుడే మందేసినా పన్చేయదు."

    అతను కొద్దిగా కంపించాడు. ఏమీ మాట్లాడలేక అలాగే చూస్తూండిపోయాడు.

    రామరాజు తిరిగి కొనసాగించాడు. "అందుకే మల్లీ వెనక్కెళ్ళింది. ఇటుపక్క ఎక్కడా దొరకలేదు. రేపు పొద్దుపొడిసే ఏళకి ఎల్లి ముగ్గురమూ కొనకాపక్క నెదకాల. అదృష్టం బాగుండి దొరికితే మీ ఆరోగ్యం బాగుపడుద్ది" అన్నాడు.

    మహర్షి సమాధానం చెప్పలేదు. మౌనంగా కూర్చొని వున్నాడు. అతనికి జరగబోయేది తలుచుకుంటే బాధ కలగటం లేదు. అంతకుముందు గతంలో తన జీవితంలో జరిగిన సంఘటనలకన్నా పెద్దదేమీ కానట్టుగా అతని ముఖం భావరహితంగా వుంది.

    .....ఉదయం లేవగానే ముగ్గురూ మళ్ళీ బయలుదేరారు. ఆ రాత్రి ముగ్గురూ వంతులవారీగా కాపలా వుండటంవల్ల సరిగ్గా నిద్రలేక అందరికీ నీరసంగా వుంది. దానికితోడు మూడు రోజులనుకున్నది అయిదురోజులయింది. సరియైన ఆహారం లేదు. నడక ఎక్కువవడం వలన కాళ్ళు లాగుతున్నాయి.

    అయినా పట్టువదలకుండా ముగ్గురూ నాగకోనకి అవతలి ప్రక్కగా  ప్రయణం సాగించారు ముందువేపునుండి చూస్తే చిన్నగా కనిపించే ఆ కోన, చుట్టూ తిరిగే కొద్దీ చాలా విశాలంగా మారిపోయి వుంది. ముందుగా కోన ఎక్కకుండా క్రిందనుంచే కొద్ది దూరం నడిచి కోనకి వెనుకవేపుకి వెళ్ళారు. అటువేపు మరింత దట్టమైన పొదలతో నిండి వుంది. భీముడి రెండు ఎండుకొమ్మలు విరిచి 'చిల్లకర్రలా' తయారుచేసి మహర్షికి ఒకటిచ్చి తనోటి తీసుకున్నాడు. వారివెంట తెచ్చుకుంది రామరాజు చేతిలో వుంది. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ సాధ్యమైనంతవరకూ కొమ్మలను నరికే అవసరం లేకుండా చిన్న సందులా వున్నా, అందులోంచి దూరిపోతూ కొద్దిదూరం వెళ్ళారు. పాముపిల్లలు బొద్దింకల్లా దారికడ్డంగా తిరుగుతూనే వున్నాయి.

    రామరాజూ, భీముడు ప్రతి పోదా వెదకసాగారు ఆ మూలికకోసం. ఎంత గాలించినా దొరకడం లేదు. పైన ఎండ తల మాడ్చేస్తోంది. వళ్ళంతా చెమటతో తడిసిపోయి బట్టలన్నీ ముద్దగా మారిపోసాగాయి. విపరీతమైన దాహం వేయసాగింది వారికి.

    బయలుదేరేటప్పుడు బరువెందుకని తమవెంట తెచ్చుకున్న సామాన్లన్నీ వారు అంతకుముందు విశ్రాంతి తీసుకున్న చెట్టుదగ్గరే వదిలేసి వచ్చారు. వాటితోపాటు వాటర్ బాటిల్సూ అక్కడే వుండి పోయాయి. కోన ఎక్కేముందు చిన్న ఏరులాంటిది కనబడితే త్రాగారు.

    చీకటి పడేవరకూ కోన మొత్తం చుట్టివచ్చినా వారికామూలిక దొరకలేదు. ఇక లాభంలేదని క్రిందికి దిగారు. మసక చీకటి క్రమ్ముకుంటోంది. దిగాక ఏటినీరు త్రాగి ముఖాలు కడుక్కున్నారు.

    "ఏం సేద్దాం దొరా?" రామరాజు అడిగాడు మహర్షిని.

    "ఏం వుంది? తిరిగి వెళ్ళిపోదాం చంద్రగ్రహణం దగ్గర పడుతోంది. అనుకున్న సమయానికి మనం కోయపల్లె చేరుకోవాలి" అన్నాడతను. "అదికాదు దొరా...."

    రామరాజు చెప్పబోయేది అర్థమైనట్టు "నా గురించి ఆలోచించకు రామరాజూ. ముందు నా స్నేహితురాలి జీవితం బాగుపడాలి" అన్నాడు.

    రామరాజు ఏమనుకున్నాడో ఏమో తర్కించలేదు. ముగ్గురూ కలిసి ఆ మసక వెన్నెల్లో తిరుగు ప్రయణం సాగించారు.

    అక్కడక్కడా అరగంటకన్నా ఎక్కువ విశ్రాంతి తీసుకోకుండానడిచి రెండురోజుల్లో కోయపల్లె  చేరుకున్నారు. ఆ రాత్రే చంద్రగ్రహణం.

     వెళ్ళగానే మహర్షిని విశ్రాంతి తీసుకోమని చెప్పి రామరాజు  రక్తపింజేరి విషం కోసం  గూడెపు  యువకుల్ని నాలుగు జుట్లుచేసి అడవికి పంపిచాడు. వారు సాయంత్రం ఏడులోపు ఆ విషం తీసుకువచ్చారు. ఈ లోపులో రామరాజు నాగకోన నుండి తెచ్చిన మూలిక రసం పిండి ఒక ఎద్దుకొమ్ముతో చేసిన భరణిలో పోశాడు. వాళ్ళా  విషం తీసుకురాగానే అది ఆ రసంలో కలిపాడు. కొండదేవర ముందున్న బలిపీఠం మీద పెట్టి ఆ రాత్రంతా జాగారం చేశాడు రామరాజు.....కోందదేవరని పూజిస్తూ.

    తెల్లవారింది. మహర్షి రామరాజు దగ్గరికి వెళ్ళి "మందు తయారయిందా రామరాజూ?" అని అడిగాడు. "అయింది దొరా!"

    "మరయితే ఆలస్యం దేనికీ, తొందరగా వెళ్ళి రవితేజ కళ్ళు తెప్పించే ప్రయత్నం చేద్దాం" అన్నాడు మహర్షి.

    రామరాజు క్షణం మౌనంగా వుండి, తరువాత స్థిరంగా చూస్తూ- "ఈ మందు ఎవరికీ ఈయదల్చుకోలేదు దొరా" అన్నాడు.

    అదిరిపడ్డాడు మహర్షి.

                            4

    సిరిచందన నిద్రరాక అటూ ఇటూ దోర్లుతోంది. ప్రక్కన భర్త అటు తిరిగి నిద్రపోతున్నాడు. టైమ్ చూసింది. పన్నెండూ ముప్పై అవుతోంది. ఎంతోసేపటినుంచి కళ్ళు మూసుకుని బలవ్మతంగా నిద్రపోవాలన్నా పోలేక పోతూంది. ఆ రోజే చంద్రగ్రహణం. మహర్షికి ఆ మూలికలు దొరికాయోలేదో? ఆ అడవిలో సరియైన తిండిలేక ఎన్ని అవస్థలు పడుతున్నాడో? అనిపించసాగింది. భగవంతుడి దయవల్ల రవితేజకు కళ్ళు వస్తే చాలు.......
   
    అవే ఆలోచనల్తో ఉన్న ఆమెకు అప్పుడు గుర్తుకొచ్చింది 'ఉత్తరం'! చంద్రగ్రహణం దాటినా మరునాడు గనుక రాకపోయుంటే చదవమన్నాడు. ఒకవేళ వస్తే......

    చదవకుండానే తిరిగి ఇచ్చేయమని చెప్పివెళ్ళాడు.

    అంటే...... అసలు ఆ ఉత్తరంలో ఏముంది? ఏం వ్రాసుంటాడు? ఆమెకా ఉత్తరం గుర్తుకు రాగానే ఆసక్తి ఆపుకోలేక పోయింది. లేచి టేబుల్ లాంప్ వెలిగించి డ్రాయర్ లో వున్న ఆ కవరు బయటికి తీసింది. కుర్చీ దగ్గరకు లాక్కుని తెరిచింది. గులాబీరంగు కాగితంమీద అందమైన అక్షరాలూ.

    .....ఆమె కళ్ళు అక్షరాల వెంట పరుగు తీశాయి.

    "సిరీ....
   
    కొన్ని రోజుల మానసిక ఘర్షణకు ఫలితమే ఈ ఉత్తరం. దయచేసి మనసుపెట్టి చదువు! నగ్నసత్యాలన్నీ నన్ను కార్చిచ్చులా దహించివేస్తూంటే తట్టుకోలేక అందులోంచి కనీసం ఒక్కటయినా నీతో పంచుకోవాలన్పించింది. చెప్పగూడని సమయంలో ఈ విషయం చెప్పి నీ మనసులో స్థానం సంపాదించుకోవాలనే దురుద్దేశం నాకు మాత్రం లేదు. కానీ, చెప్పకుండా వుండలేని పరిస్థితి నన్నావరించింది.

    నేను వెళ్ళేది దాదాపు మృత్యుగహ్వరం లాంటి చోటుకి. అనుకొని సంఘటన జరిగి అక్కడే నా ప్రాణాలు విడవాల్సివస్తే......పోయేముందు ఒకే ఒక్క నిజం నీకు చెప్పాలనిపించింది.

    మనం కాలేజీలో  చదువుకునే రోజుల్లో- నీ అల్లరి, చదువులో చురుకుతనం, ఇవన్నీ చూసి నేను నిన్ను ఆరాధించడం మొదలు పెట్టాను. ఒక్కరోజు నువ్వుకాలేజీకి రాకపోయినా ఏదో దిగులు నన్నావరించేది. రానురానూ మానసికంగా నీ మీద పూర్తిగా డిపెండ్ అయ్యాను. కానీ, అందరితోనూ చనువుగా మెదిలే నువ్వు, నా  కళ్ళల్లో నీ పట్ల పెరిగే ప్రేమ భావాన్ని గుర్తించలేక నన్నూ ఓ మిత్రుడిగానే ఎంచుకున్నావు. రోజు రోజుకీ నీ మీద పెరిగే ఆకర్షణ, అభిమానం నన్ను పిచ్చివాణ్ణి చేశాయి. చెప్పాలని నీ ముందుకు వచ్చికూడా చెప్పలేకపోయేవాడిని. ఒకవేళ నా  ప్రేమను నువ్వు 'కాదు' అంటే, అది తట్టుకునే మానసిక స్థయిర్యం నాకు లేదు.ఎన్ని  రాత్రిళ్ళు నీకు నా ప్రేమ విషయం  చెప్పాలని రిహార్సల్ వేసుకున్నా, నీ వరకూ  రాగానే ఆడంతా మాయమై మౌనంగా మారిపోయేవాడిని.

    చివరికి నీ స్నేహం స్నేహంగానే మిగిలిపోయింది. పరీక్ష అయిపోగానే  నీ దారిన నువ్వు వెళ్ళిపోయావు. నా ప్రేమ నాలోనే సమాధి అయిపోయింది. తర్వాత ఏ పని చేస్తున్నా నువ్వే గుర్తుకు వచ్చే దానివి. ఆ తర్వాత అరకులోనే నిన్ను చూడటం.

    నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన నీ జీవితం అంధకారంలో మ్రగ్గిపోవటం నేను భరించలేక పోతున్నాను. నీ జీవితం బాగుపడటం కోసం నా ప్రాణాలైనా ఇవ్వాలనిపించేది.

    అవకాశం వచ్చింది. వెళుతున్నాను. నేను తిరిగి రాకపోయినా, నా ప్రయత్నం విజయవంతమై రవితేజకు కళ్ళు వస్తే అంతకన్నా నాకు కావలసిందేమీ లేదు. రవీ, నువ్వూ తిరిగి సంతోషంగా ఉండాలని నా కోరిక.    

 Previous Page Next Page