"దొరా జాగ్రత్త" హెచ్చరిస్తూనే..... రామరాజు ప్రక్కకు దుమికాడు. భీముడి కళ్ళమధ్యలోనుంచి వెళ్ళిందో పాముపిల్ల.
ఆ పోదలోవున్న విషపురుగులన్నీ బయటికి వెళ్ళిపోయాయి. ఇక ఆ మొక్కని పీకాలని ముందుకు అడుగువేయబోయిన రామరాజు హఠాత్తుగా వెనక్కి. గెంతి నేలమీద వెల్లకిలా పడ్డాడు. మహర్షి ఆశ్చర్యంగా అటువేపు చూసాడు.
ఎదురుగా నేలకు మూడడుగుల ఎత్తులో వూత్కారం చేస్తూ నాలుగడుగుల పొడవు పడగవేసి నల్లగా మెరుస్తూ కనిపించిందతనకో కృష్ణసర్పం. రామరాజు కదిలితే అది కాటు వేయడానికి సిద్ధంగా వుంది. రామరాజు పాదం సరిగ్గా దానికి అడుగు దూరంలో వుంది. ఏ క్షణంలోనయినా అది కాటు వేయవచ్చు. భయమంటే తెలీని భీముడు కూడా అచేతనుడైనట్టు కళ్ళు పెద్దవి చేస్తూ అలాగే చూస్తుండిపోయాడు. మహర్షి దానికి కుడిపక్కన మూడడుగుల దూరంలో వున్నాడు. అతను పాదాన్ని అంగుళం కదిల్చినా అది ఎటాక్ చేయగలదు. క్షణాలు ఈటెల్లా పొడుస్తున్నాయి.
రామరాజు ఇక తన పని అయిపోయిందనే అనుకున్నాడు. కృష్ణసర్పం కాటుకు అతనికి తెలిసి ఏ మూలికాలేదు. క్షణాల్లో ప్రాణం పోతుంది.
బాధగా కళ్ళు మూసుకున్నాడు రామరాజు.
అప్పుడు జరిగిందా సంఘటన.
ఎక్కడినుండి దూసుకువచ్చిందో ఒక డేగ రివ్వున దూసుకు వచ్చి ఎంత వేగంగా వచ్చిందో..... అంతే వేగంతో ఎగిరిపోయింది.
అంతా నిశ్శబ్దం! రాబోయిన తుఫాను సద్దుమణిగినట్టు భీముడి కళ్ళలో క్రమక్రమంగా రిలీఫ్ కనిపించింది. కళ్ళు తెరిచిన రామరాజుకు జరిగిందేమిటో అర్థంకాలేదు. మొత్తానికి ఏదో జరిగిందని మాత్రం అర్థమై మెల్లగా కళ్ళు తెరిచాడు. అక్కడ సర్పం కనిపించలేదు. ప్రశ్నార్థకంగా చూస్తూ లేచాడు.
భీముడు ఆనందంగా వచ్చి రామరాజు చేయిపట్టుకుని సైగచేస్తూ జరిగిందేమిటో చెప్పాడు. రామరాజు ముఖంలో పోయిన కళ వచ్చినట్టయింది. తేలిగ్గా నిట్టూరుస్తూ ఇంకా ఏమైనా మిగిలాయేమోనని కర్రతోపొదను జాగ్రత్తగా కదిపి చూశాడు, ఏమీ కనిపించలేదు. మెల్లిగా వంగి ఆ చిన్న మొక్కను పీకాడు.
"దొరికింది దొరా. ఇంకా మనం బేగి ఎల్లిపోదాం. ఈడుంటే ఇప్పుడేమోద్దో....?" అన్నాడు రామరాజు.
"ఇదిగాకుండా ఇంకేదో విషం కావాలన్నావుగదా రామరాజూ! అన్నాడు మహర్షి.
"అవున్దొరా. రక్తపింజేరి ఇషం కావాల. అది మన పల్లెలో ఏ పుట్టలోనో పట్టొచ్చు."
"మరయితే ఒక ఆలస్యం దేనికి? వెళదాం పద!" అంటూ కదిలాడు మహర్షి.
ముగ్గురూ జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చేటప్పుడు క్లియర్ చేసుకున్న దారిగుండా కిందికి దిగసాగారు. అప్పటికి మధ్యాహ్నమైంది. ఎండ చెండ్రనిప్పులు చెరుగుతోంది. వచ్చినపని అయిపోయిందన్న సంతోషంలో ఉన్నారందరూ. అందుకే కాస్త నెమ్మదిగా దిగటం మొదలు పెట్టారు. దాదాపు క్రిందికి దిగబోతుండగా-
ఒకచోట భీముడు హఠాత్తుగా ఆగిపోయాడు. వాడి చూపులు బాకుల్లా ఒకచోట స్థిరంగా నిల్చిపోవటం చూసి ఇద్దరూ అటువేపు చూసారు. మొగలిపొర మొదట్లో చుట్ట చుట్టుకుని పడుకుని వుందో సర్పం, దాని చర్మమంతా పొలుసులు, పొలుసులుగా వుండి చూడగానే అసహ్యం పుట్టించేలా వుంది. అది మనిషిని కుట్టిందంటే, ప్రాణం పోదుగానీ, మనిషి శరీరం కూడా కొన్నాళ్ళకి అలాగే మారిపోయి, చర్మం పొలుసులుగా ఊడిపోతూంటుంది.
ఆ పామును చూసి తేలిగ్గా "ఎహే.....! అది మన్నేం సేయదులే. పడుకుని వుంది" అంటూ భీముడి చెయ్యి పట్టుకుని కదలబోయాడు రామరాజు. భీముడు కదలలేదు. ఎక్కడో చూసిన జ్ఞాపకం.
హఠాత్తుగా అలాంటి పాముని ఎక్కడ చూశాడో గుర్తుకు వచ్చినట్లుగా రామరాజు వేపు తిరిగి సైగచేస్తూ ఏదో చెప్పాడు. రామరాజుకు ముందేమీ అర్థంకాలేదు.
"సక్కగా సెప్పు. నాకేం అర్థంగాటల్లా" అన్నాడు రామరాజు.
భీముడు కదిలి మహర్షి మెడమీద కాలర్ పక్కకు జరిపి గాట్లు చూపిస్తూ అక్కడ కాటు వేసింది అదే పాము అన్నట్టు సైగ చేశాడు.
అంతే! రామరాజులో క్షణకాలం చలనం ఆగిపోయింది.
భీముడు చెప్పిన విషయం అర్థంకాగానే రామరాజు మెదడు మొద్దుబారి పోయింది. మహర్షి కూడా ఆశ్చర్యంగా ఆ పామును చూసాడు. తన మెడమీద కుట్టింది అంత భయంకరమైన పాము అనుకోగానే ఆప్రయత్నంగా అతని ఒడలు జలదరించింది.
దాని కాటు ప్రభావం తెలిస్తే ఇంకెంత వణికిపోయేవాడో?!
జరగబోయే పరిణామం తెలిసిన ఒకే ఒక వ్యక్తి రామరాజు. ప్రస్తుతం అతని మెదడంతా శూన్యంగా మారిపోయింది.
2
"......ఏమండీ!" సోఫాలో భర్త ప్రక్కన కూర్చుంటూ పిలిచింది సిరిచందన.
"ఏమిటీ!"
"నేనొకటి అడుగుతాను చెబుతారా?"
"అడుగు సిరీ....."
"అదికాదండీ.... ఈ విషయంలో....." ఆ తర్వాత ఏం చెప్పాలో తెలీనట్టు ఆగిపోతూ"......అడగమంటారా" అంది సందిగ్ధంగా.
"అడుగు"
"ఈ ఫోటోలో అమ్మాయి ఎవరండీ?" ఆమె అడిగేసిందన్న మాటేగాని వేల విస్ఫోటనాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందేమో నన్న భయం ఆవహించి అతని ముఖంలోకి చూసింది.
"ఏ ఫోటో....?" అతను అర్థంకానట్టు అడిగాడు.
"మీ పర్సులో దొరికిందండీ!"
అతను ఒక్కక్షణం మౌనంగా అయిపోయాడు. అభావంగా కనిపించే అతని కళ్ళవెనుక ఎన్ని దృశ్యాలు సినిమా రీళ్ళలా తిరుగుతున్నాయో ఊహించలేని ఆమె, అతను మాట్లాడకపోవటంతో తిరిగి రెట్టించింది. "చెప్పండి. ఎవరా అమ్మాయిని అంటూ.
"సిరి! అదంతా నా జీవితంలో జరిగిన ఓ విషాదగాథ. ఇప్పుడదంతా ఎందుకు? సమయ మొచ్చినప్పుడు నేనే నీకు చెబుతాను" అన్నాడతను.
'విషాదగాథ' అంటే భగ్న ప్రేమ అన్న అనుమానం ఆమెలో ప్రవేశించింది తెరిచినా మూసుకున్నాట్లు- ఏ భావమూ లేకుండా ఉన్న అతని కళ్ళల్లోకి వెదుకుతూ "ఇప్పుడే చెప్పాలి" అంది పట్టుదలగా.
ఆమె కంఠంలో పలికిన స్థిరత్వానికి అతడు భీతిచెందినా, అది బహిర్గత పరచకుండా "సరే నీ ఇష్టం ఎప్పటికయినా నీకు చెప్పాలనుకుంటున్న విషయమే ఇది" అంటూ చెప్పటం ప్రారంభించాడు.
"నేను ఐ.పి.యస్. ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఓ రోజు ఒక ముసలాయన్ని యాక్సిడెంట్ నుండి రక్షించాను. ఆయన కృతజ్ఞతతో నన్ను దగ్గర్లోనే వున్న వారింటికి తీసుకువెళ్ళాడు. వాళ్ళమ్మాయి శ్రీవాణి- తన తండ్రిని రక్షించినందుకు నన్ను ఎంతో మెచ్చుకుని 'అన్నయ్యా' అంటూ రాఖీ కట్టింది. అప్పటినుండి ఆమె నా చెల్లెలే అనుకునేవాడిని. నా ట్రైనింగ్ పూర్తయ్యాక ఆ అమ్మాయికి పెళ్ళై వైజాగ్ లో ఉంటుందని తెలిసి అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాను. చాలా రోజుల తరువాత కలుసుకున్నందుకు చనువుగా మాట్లాడుకుంటుండగా వాళ్ళ భర్తవచ్చి అపార్థం చేసుకుని, నేనెంత చెబుతున్నా వినిపించుకోకుండా నాకళ్ళముందే ఆమెని చంపి తప్పించుకుని పారిపోయాడు. ఆ తరువాత అతడికి ఉరిశిక్ష పడిందనుకో. అలా చనిపోయిన నా చెల్లెలు ఫోటో తెచ్చుకుని అప్పుడప్పుడు గుర్తుచేసుకుని బాధపడేవాడిని. అది తప్పంటావా?" చెప్పటం ఆపి ఆమె చేతిమీద తన చేతిని వేసి "చెప్పు నేను చేసింది తప్పయితే ఆ ఫోటోని ఇప్పుడే చించి ముక్కలుచేసి బైట పడేస్తాను" అన్నాడు.
పూర్తిగా చెప్పగానే ఆమె మనసు మేఘంలా కరిగిపోయి కనుగవాకాశంనుండి దుఃఖాశ్రువులను వర్షింపజేసింది. అతనిచేతిని గుండెలకు హత్తుకుంటూ "నన్ను క్షమించండి" అంది.
"ఇందులో క్షమాపణ ప్రసక్తి దేనికి? అది సహజం. 'భర్త' మనీ పర్సులో ఓ అమ్మాయి ఫోటో కనిపిస్తే ఎవరైనా ఎలా రియాక్టు అవుతారో నువ్వూ అంతే. ఇంకా నేను అదృష్టవంతుడిని. చెప్పేది వినిపించుకోకుండా ఆ ఒక్క ఆధారంతో జీవితాంతం సాధించేవారిని ఎందర్నో చూశాను. నీలాంటి సహృదయురాలు నాకు భార్యగా దొరకటం నా అదృష్టం."
అసలే మెత్తబడ్డ మనసు...... మరింత మెత్తనై..... తెలికయి పోయింది. ఆమెలో ఆనందం అధికమయింది. కన్నీరు విషాదానికీ, సంతోషానికీ దగ్గరి చుట్టం. ఆనందభాష్పమాట. "అసలే ఆనదు చూపు- ఆపై యీ కన్నీరు తీరా దయచేసినాక నీ రూపు తోచదయ్యయ్యో" అన్నట్టుగా నీటితో మసకబారిన కళ్ళను తుడుచుకుంటూ ఆమె భర్తవైపు చూసింది. మసక వెన్నెల్లో పలుచని మేఘం కప్పిన చంద్రుడిలా కనుపించాడతనామె కళ్ళకి. చప్పున అతనిగుండెల్లో తల దాచుకుంది.
తుఫాను ఉధృతం తగ్గినట్టు అనిపించగానే అతను తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు. ఆమె ఊపిరి అతనిరొమ్ము భాగంలో వెచ్చగా తగులుతూంటే...... అతనిలో సహజమైన చిలిపితనం బయటపడింది. "దేవిగారికి మంచి మూడ్ వచ్చినట్టుంది" అన్నాడు.
"ఛీ....పొండి అంది. తలను మరింత గట్టిగా అతని గుండెలకి ఆనిస్తూ.
"ఎటు పోవాలన్నా నువ్వు తీసికెళ్ళాల్సిందే" అంటూ చిన్నగా నవ్వాడతను.
"మీరలా మాట్లాడొద్దని ఎన్ని సార్లు చెప్పాను?" అంది చిరుకోపంగా.
"సరే సరే. ఇంకెప్పుడూ అననులే" చెంపలు వాయించుకోబోతూ అన్నాడతను. అతని చేతుల్ని గట్టిగా పట్టుకుని వారిస్తూ- "అయినా ఈ బాధ మీకెంతో కాలం ఉండదులెండి! మరో మూడు రోజుల్లో మహర్షి ఆ మందేదో తీసుకువస్తాడు అడవి దారిలో ఒంటరిగా వెళుతున్న మహర్షి రూపమే మెదిలి, ఒక్కక్షణం మనస్సు కలుక్కుమంది. తన స్వార్థం కోసం అతను మృత్యుగహరం లాంటి అడవిలోకి వెళుతున్నా వారించలేకపోయింది అనుకుంది. ఆమెకు మహర్షి మంచితనాన్ని భర్తకు వివరించాలనిపించింది.
"నిజంగా మహర్షి ఎంతో మంచివాడు కదండీ!"
"ఇప్పుడవన్నీ ఎందుకు?"
"అదికాదండీ, మీకోసం అతనెంత రిస్క్ తీసుకుంటున్నాడు?"
"నిజమే., కాని, ఇలాంటి సమయంలో అతన్ని గూర్చి ఎందుకు చెప్పు?" అన్నాడతను మత్తుగా ఆమె మెడ వంపులో ముఖాన్ని దాచుకుంటూ.
"మంచిని మెచ్చుకోవడానికి సమయం, సందర్భం దేనికి......?" అందామె. భర్త అతనిలోని మంచిని గుర్తించలేకపోతున్నాడనే బాధ, గుర్తించాలనే తపన ఆమె కంఠంలో ధ్వనించింది. తన కిష్టమైనవారి గురించి తనవాళ్ళు కూడా ఇష్టంగా మాట్లాడాలనే అమాయకత్వం ఆమెలోనూ వుంది. అందుకే "అతను ఏ మాత్రం స్వార్థం లేకుండా ఈ పని చేస్తున్నాడు. మీ కోసం ఆలోచించే వ్యక్తి గురించి మీరు కాస్త కూడా ఆలోచించకపోవడం ఏం బాగాలేదు" అంది.
"అదంతా నా కోసం కాదు!"
ఆమెకు అర్థంకాలేదు.
"........అవును. అతనంతా చేసేది నీకోసం!" అన్నాడతను.
ఆమె అదిరిపడి దూరంగా జరుగుథూ "ఏమిటండీ మీరనేది?" అంది "నా ఉద్దేశ్యం...... స్నేహితురాలు కష్టం చూడలేక అంత రిస్క్ తీసుకున్నాడని."
మీద దూకుతున్న పులి తోక ముడుచుకుని పిల్లిలా వెళ్ళిపోయినట్టు అనిపించిందామెకా మాట. 'అదంతా నీకోసం చేస్తున్నాడు' అనగానే ఆమె ఆ మాటకి 'మరో అర్థం' తీసుకుని భయపడింది. అతను 'మరో జోడించి ఆ మాట అన్నాడని తెలీక ఆమె కృతజ్ఞతతో అతని భుజం మీద తలన్చింది.
3
ఆ పాము పొలుసులు గురించి ఏమీ తెలీని మహర్షి ప్రమాదం తప్పిపోయింది కదా అనుకున్నాడు.
కానీ రామరాజులో కలవరం క్షణక్షణానికి పెరిగిపోసాగింది. అయితే వయసు నేర్పిన అనుభవం వల్ల అతను బయటపడలేదు.
కొద్దిసేపటి తరువాత తేరుకుంటూ ఒక నిశ్చయానికి వచ్చిన వాడిలా "మీరిద్దరూ డిగి కింద ఆ చెట్టు కింద కూకోండి. నేనెనకాలొత్తాను" అనేసి, సమాధానం కోసం చూడకుండా వెనక్కీ తిరిగి పొదల్లో కలిసిపోయాడు.
వెళుతున్న అతన్ని చూసి మహర్షి ఏదో అడగబోయి- బహుశ వేరే మూలికలకోసమో వెదకటానికి వెళుతున్నాడనుకుని మౌనంగా క్రిందికి దిగసాగాడు. భీముడు కూడా అతని ప్రక్కనే అడుగులు వేస్తూ అతన్ని అనుసరించాడు. భీముడి మొహం కూడా ఉద్వేగంగా వుంది.
క్రిందికి దిగి చెట్టునీడన కాసేపు సేదతీరాక అప్పుడు గుర్తుకొచ్చింది. ఆకలి. బ్యాగ్ లొ ఏమైనా కాయల్లాంటివి మిగిలాయెమోనని చూశాడు. ఏమీలేవు. భీముడివేపు తిరిగి "ఇక్కడేమయినా తింటానికి పనికొచ్చే కాయలు దొరుకుతాయా?" అని అడిగాడు.
"చూసొస్తా" నని సైగచేసి వెళ్లిపోయాడు భీముడు.
మహర్షి వాటర్ బాటిల్ లొ మిగిలిన నీళ్ళు త్రగేసి కొద్ది నీళ్ళు ముఖం మీద చల్లుకుని టవల్ తో తుడుచుకున్నాడు. జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకుని చెట్టు కానుకుని కూర్చున్నాడు. సిగరెట త్రాగడం అయిపోయేసరికి భీముడు టవల్ నిండా ఎవో కాయలు మూటగట్టుకుని తీసుకువచ్చాడు.
లేత గోధుమ రంగులో గుండ్రంగా నిమ్మకాయ సైజులొ వున్నాయవి. "ఏం కాయలివి?" అడిగాడు మహర్షి. తొందరపడి తింటే ఏవైనా ప్రమాదం జరుగుతుందేమోననే అనుమానంతో. కానీ వాడికి నోరులేదన్న విషయం గుర్తుకొచ్చి "తినొచ్చా?" అని సైగచేశాడు.