ఈ ప్రయత్నంలో విఫలమయితే రవికి కళ్ళు తెప్పించలేకపోయినందుకు క్షమించగలవు. ఇంతకుమించి నీకేమీ వ్రాయలేక పోతున్నాను.
-శలవు"
ఉత్తరం చదవటం పూర్తికాగానే ఆమె మనసెంతో స్తబ్దంగా మారిపోయింది. కొద్ది క్షణాలు అలాగే కూర్చుండిపోయింది. "మహీ..... మహీ...." అనుకుంది. ఇన్నాళ్ళూ అతని అభిమానం వెనక స్నేహం మాత్రమే వుందనుకుంది గానీ, అంతులేని ప్రేమ దాగి వుందని అనుకోలేదు. ఆమె మనసంతా అతనిమీద జాలితో నిండిపోయింది. కేవలం తనని ప్రేమించినందుకు ప్రాణాలకు తెగించి, తమకు సాయపడాలని చూస్తున్న అతని వ్యక్తిత్వం హిమోన్నత శిఖరంలాగా పెరిగిపోయినట్టు అనుభూతి చెందిందామె.
నిద్రలో అటునుంచి, ఇటు తిరిగి పక్క తడిమిన రవితేజకు భార్య శరీరం తగలకపోవడంతో "సిరీ! అంటూ పిలిచాడు.
ఆమె ఆలోచనల్నుండి 'ఊ!' అంటూ లేచి, ఆ ఉత్తరం సూట్ కేస్ లో బట్టల అడుగున దాచేసింది.
అదే ఆమె చేసిన తప్పు.
5
"ఏమిటి రామరాజూ నువ్వంటున్నది?" ఇంత కష్టపడి సాధించి తెచ్చిన మందు ఆఖరి క్షణంలో ఇవ్వననడంతో అతను అయోమయంగా చూస్తూ అడిగాడు.
"అవును దొరా! ఇది రవిబాబుకి ఇవ్వబోతం లేదు" అన్నాడు రామరాజు స్థిరంగా చూస్తూ.
"ఏం.....ఎందుకు?" కంఠం సన్నగా వణికింది.
"ఎందుకంటే, ఒక మడిసికీ సాయం సేయటం కోసం మీ బతుకు బుగ్గిపాలవటం సూడలేక."
ఒక్కసారిగా రిలీఫ్ గా ఫీలయ్యాడు మహర్షి. తనింకా రామరాజు స్వార్థంకోసం ఆ మందు ఉపయోగించుకోబోతున్నాడని కంగారుపడ్డాడు. "నా గురించి ఆలోచించకు రామరాజూ! ముందు అతనికి కళ్ళు రావటం ముఖ్యం. నాదేముంది? ఎవరూ లేనివాణ్ణి. నా కోసం ఆలోచించడానికి గానీ, బాధపడటానికి గానీ ఎవరూ లేరు" నిర్లిప్తంగా చూస్తూ అన్నాడతను.
"అలాగని మీరు నాశనమవుతోంటే, ఎవరికో ఈ మందునీయలేను. మీ ప్రాణం సిక్కుల్లో పడతావుంటే ఎట్టా చూడగలను దొరా?" రామరాజు గొంతులో ఆత్మీయత తొణికిసలాడింది.
నిన్నటివరకూ ఏమీ కాని వ్యక్తి ఈనాడు తన గురించి బాధపడటం, ఆలోచించటం అతణ్ణి కదిలించింది. అతని కళ్ళు చెమ్మగిల్లుతుండగా "నీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. కానీ ఈ విషయంలో నా నిర్ణయాన్ని మాత్రం మార్చుకోలేని బలహీననుణ్ణి. రామరాజూ నన్ను క్షమించు" అన్నాడు.
"దొరా! అట్టాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి దొరా. త్యాగం సేయ్యడానిక్కూడా ఓ హద్దుంటది. మీరెన్ని చెప్పినా ఈ మందు మీరు వాడాల్సిందే."
"ఇది త్యాగం కాదు రామరాజూ..... బాధ్యత"
"ఏంటి దొరా మీరనేది?"
"అవును. ఇది నేను పోయే లోపులో తప్పకుండా చేయాల్సిన పని. నిజం చెబితే నువ్వుకూడా అంగీకరిస్తావ్?'
"నిజమా.....? ఎంటి దొరా యివరంగా సెప్పండి!" రామరాజు కళ్ళల్లో కుతూహలం కదలాడింది.
మహర్షి నిటూర్చి, చెప్పటం మొదలు పెట్టాడు. "కొన్ని అనుకొని పరిస్థితుల్లో నా స్న్హితురాలి భర్తకు కళ్ళు పోవడానికి నేనే కారణమయ్యాను. తరువాత తెలిసింది అతను నా చిన్ననాటి నేస్తానికి భర్త అని. నా కారణంగా ఆమె జీవితం నాశనమయిందే అన్న బాధతో రాత్రి, పగలు కృంగిపోయాను. దైవవశాత్తూ చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు కూడా నేను నా స్వార్థం చూసుకుంటే- బ్రతికిన రెండు రోజులూ నా మనస్సాక్షి ముందు దోషిలా తలవంచుకుని బ్రతకాలి . అది నా కిష్టంలేదు. ఇప్పుడు చెప్పు రామరాజూ! నేను చేసేది తప్పంటావా?"
"ఛ.....సదువుకున్నోరు మీరు. పొరపాటున ఆలోసిత్తారని ఎట్టా అనుకుంటాను దొరా, నే సెప్పేది కూడా వింటే....." నసిగాడు.
"చెప్పు రామరాజూ"
"ఏమీ లేద్దొరా. మీరు బతికి బాగుంటే మరో సెంద్రగ్రహణం రాకపోదు అప్పుడు ఆ రవిబాబు కళ్ళు తెప్పించే పూచీ నాది. ఈ రోజు మీకీ మందు వాడకపోతే మీ సేరీరమంతా ఇసంగా మారిపోయి, రాను రాను పాము సిస్టలే వొచ్చేత్తాయి దొరా. నా మాటిని ఇప్పుడు మీరీ మందు తాగండి!"
"వద్దు రామరాజూ! నేను చెప్పేది అర్థం చేసుకో. దయచేసి నన్ను బలవంతం చేయకు. నాకు నా ప్రాణం కన్నా ఆ భార్యభర్తలిద్దరూ క్షేమంగా, సుఖంగా ఉండటమే ముఖ్యం. తెలిసో, తెలీకో నా వల్ల కొన్ని పొరపాట్లు జరిగిపోయాయి. కనీసం ఒక్కటైనా సరిదిద్దుకోనివ్వు."
"మీరేం సెప్పినా నేను యినేది లేదు." మొండిగా అన్నాడు రామరాజు.
మహర్షికి అతన్ని ఎలా వొప్పించాలో అర్థంకాలేదు. ఏదేమైనా అతను తన గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడు కాబట్టి మనసు నొప్పించకుండా మాట్లాడాలి అనుకున్నాడు. చివరికి స్థిరనిశ్చయానికి వచ్చినవాడిలా నిట్టూర్చి-
"నీకో విషయం చెప్పాలి రామరాజూ! నేను ఓ నేరం చేసి జైలుకి వెళ్ళాను. ఉరిశిక్ష పడింది. తప్పించుకున్నాను. మహా అయితే మరో నెలరోజులు పోలీసుల కళ్ళబడకుండా తప్పించుకోగలను. తరువాత ఎలాగూ దొరికిపోక తప్పదు. అయినా, నేనే వెళ్ళి లొంగిపోవాలనుకుంటున్నాను. ఈ పని పూర్తయితే సంతోషంగా వెళ్ళి ఉరికంబం ఎక్కుతాను."
రామరాజు ఆశ్చర్యపోయాడు. మహర్షి నేరం చెయ్యటం .....అదీ ఉరిశిక్ష పడేంత నేరం చేయటం అతను నమ్మలేకుండా వున్నాడు. "ఏంది దొరా మీరనేది?" అన్నాడు.
"నిజమే రామరాజు! జైలులో ఉంటే ఈపాటికి ఉరిశిక్ష అమలు జరిగేది నేనెలాగూ నాలుగు రోజుల్లో పోవలసినవాణ్ణి, కనీసం ఆ జంటయినా సుఖంగా కాపురం చేసుకుంటే చాలు."
రామరాజు కదిలిపోయాడు. చావుకు నాలుగడుగుల దూరంలో వున్నా...... వళ్ళంతా విషమైపోతున్నా కూడా చలించకుండా ఇతరుల సుఖం కోసమే ఆలోచిస్తున్న అతడి మనస్తత్వం ఆ కోయవాడికి అద్భుతంగా తోచింది. గురుదక్షిణకోసం బొటన వ్రేలిని కోసిచ్చిన ఏకలవ్వుడి అంకిత అద్భుతంగా భావం ఏదో అతని కళ్ళల్లో కన్పించినట్టుగా తోచి అప్రయత్నంగా చేతులు జోడించాడు. అంతకుమించి అతన్నెలా పొగడాలో తెలియలేదు రామరాజుకు.
చివరికి నిట్టూర్చి "మీ ఇష్టం దొరా!" అన్నాడు.
* * *
మహర్షి నడుస్తున్నాడన్న మాటేగాని అతనికి చాలా తొందరగా వుంది. వచ్చేటప్పుడు సిరిచందన కిచ్చిన ఉత్తరం, ఆమె చదవకముందు తిరిగి తీసుకోవాలని అతని ఆరాటం. తొందరగా నడవసాగాడు. రామరాజు అతనిక్కాస్త దూరంలో వెనకగా వస్తున్నాడు. అప్పుడు వచ్చింది ఆ ఆలోచన. రవికి తిరిగి కళ్ళు వస్తే తనని తప్పకుండా గుర్తు పడతాడు. తనని అరెస్ట్ చేయటం..... అది వేరే విషయం కానీ, సిరి..... సిరికీ విషయం తెలిసిందంటే- తను భార్యని చంపి, జైలునుంచి తప్పించుకున్న ఓ హంతకుడని తెలిస్తే...... ఆమె చూపుల్లో కనిపించే అసహ్యాన్ని క్షణంపాటు ఊహించుకుని సన్నగా వణికాడు.
అతని చేతిలోని భరిణెలో వున్న ఆ మందు క్షణంపాటు సిరి మనసులో స్థానాన్ని కూలద్రోసే కాలకూట విషంలా అనిపించింది. అప్రయత్నంగా అతని నడకలో వేగం తగ్గింది.
మహర్షి వెనకాల వస్తున్న రామరాజు "యేంది దొరా? ఆగిపోయినారూ?" అని అడిగాడు. మహర్షి ఒక్కక్షణం తడబడ్డాడు. క్షణంపాటు మనసులోకి వచ్చిముల్లులా పొడిచిన అనుమాన బీజం రామరాజుకు తెలిసిపోయిందేమో అన్నట్టుగా ఫీలవయ్యాడు.
దాన్ని కప్పిపుచ్చుకుంటూ "ఏమీలేదు రామరాజూ..... అవునూ ఇంకెంతసేపు నడవాలి మనం?" అని మాట మార్చాడు.
"వొచ్చేసినాం దొరా. అదిగో..... ఆ కనిపించే సిట్టడివి దాటితే అరకొచ్చేసినట్టే"
మహర్షి ఇంకేం ప్రశ్నించలేదు. తిరిగి ఆలోచనల్లో మునిగిపోయాడు. ఒకవేళ రవికి కళ్ళు వచ్చి నన్ను గుర్తుపడితే..... 'భూమి గుండ్రంగా వుండును' అన్నట్టుగా ఆలోచనల్నీ తిరగి ఆ కేంద్రం దగ్గరికే చేరుకుంటున్నాయి. తరువాత అనిపించింది అతనికి, రవికి కళ్ళు వచ్చి తనని అరెస్టు చేయించడం జరిగితే...... సిరిచందన తప్పకుండా కారణం అడుగుతుంది. అప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు సమాధానం చెప్పక తప్పదు. ఇందులో పరోక్షంగా , ప్రత్యక్షంగా రవికీ, తనకీ ఇద్దరికీ భాగం వుంది. కాబట్టి రవి చెప్పలేడు. గుర్తుపట్టినా బయటపడడు. తనూ అంతే. సిరిచందనకి ఈ విషయం చెప్పి ఆమెమనసులో తనవైపున్న సదభిప్రాయాన్ని దూరం చేసుకోలేడు.
అదీగాక తనంతట తాను ఈ విషయం సిరిచందనకి చెప్పటంవల్ల వారి దాంపత్యం భిన్నాభిన్నం చేసినవాడవుతాడు. ఇంతాచేసి, ప్రాణాలకు తెగించి మూలిక మందు సాధించుకొచ్చింది వారిద్దరూ విడిపోవడానికి కాదు. అతనా కోణంలోంచి ఆలోచించాక కొద్దిగా సంతృప్తి చెందాడు.
.......... అరకు చేరేసరికి సాయంత్రం నాలుగయింది.
6
"ఏమండీ?"
"ఏమిటి సిరీ!"
"మహర్షి ఆ మందు తప్పకుండా తీసుకు వస్తాడంటారా?"
అతడు ఆశ్చర్యంగా "నిన్నటివరకూ నాకు ధైర్యం చెప్పిన దానివి, ఈ రోజేమిటి క్రొత్తగా అలా అడుగుతున్నావ్?" అన్నాడు. "ఎందుకో క్షణాలు గడిచే కొద్దీ నాకు భయం పెరిగి పోతోందండీ"
అతను పక్కమీద చేత్తో తడిమి, ఆమెను దగ్గరికితీసుకుంటూ "అలాంటి భయాలు పెట్టుకుని మనసు పాడుచేసుకోకు.
ఆమె కొద్దిసేపు మౌనంగా వుండి, "నిన్నరాత్రే చంద్రగ్రహణం పట్టింది. అంతవరకూ రాలేదంటే మహర్షి కేదయినా ఆపద కలిగి వుంటుందేమో" అంది స్వగతంగా.
రవితేజ సమాధానం చెప్పలేదు. అభావంగా ఉన్న అతని కళ్ళల్లో కూడా అదే భావం మెదలుతుందని ఆమె గుర్తించలేదు. ఆమె తల అతని భుజం వంపులో వుంది. గడిచే సమయం ఇద్దరిలోనూ అభద్రతా భావాన్ని ఇనుమడింపచేస్తూంది.
ముందుగా అతనే తెప్పరిల్లి చిన్నగా నిట్టూరుస్తూ "ఇక్కడ వుంటే నీ ఆలోచనలన్నీ ఆమందుచుట్టే తిరుగుతుంటాయిగానీ, రా! అలా బయట గార్డెన్ లో కూర్చుందాం" అన్నాడు.
అతనన్నదీ నిజమేననిపించి ఆమె లేచింది.
ఇద్దరూ గార్డెన్ లో కుర్చీలు వేయించుకుని కూర్చున్నారు. సాయంకాలపు నీ రెండ పచ్చటి అతని శరీరఛాయని మరింత పెంచుతోంది. పల్చగా పెరిగిన గడ్డం ఆకుపచ్చ రంగులో కనిపిస్తూ అతని అందాన్ని రెట్టింపు చేస్తోంది.
చంద్రుడిలో వున్న మచ్చలా అంత అందమైన ముఖంలో జీవంలేని కళ్ళు చూస్తూ ఆమె మామూలుగా ఉండలేకపోతోంది. మహర్షి త్వరగా రావాలని ఆమె మనసులో వేయి దేవుళ్ళకి మొక్కుకుంటోంది. అయినా పైకి గంభీరంగా వుండి భర్తతో మామూలుగా సంభాషించసాగింది.