Previous Page Next Page 
భార్యతో రెండో పెళ్ళి పేజి 36


    "కానీ ఇప్పుడు నేను వచ్చింది, నా ప్రోబ్లమ్ గురించి కాదు డాక్టర్!. వివేక్ ప్రోబ్లమ్ సాల్వ్ చెయ్యటానికి ఒక క్లూ దొరికింది!"
    కుతూహలంగా ముందుకు వంగాడు డాక్టర్ "ఏమిటదీ?"  
    "మా మావగారి దగ్గర, చాలా చిన్నప్పట్నుండీ వీరన్న అనే ఒక నౌకరు ఉన్నాడట. అతడికి వివేక్ బాల్యంలో సంగతులన్నీ తెలుసునట. అతడు ప్రస్తుతం ఇక్కడే ఉన్నాడు. అతడితో మాట్లాడితే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో"     
    "నువ్వు మాట్లాడి చూడకపోయావా?"   
    "అతడు గూండా నౌకరు. అతడితో మాట్లాడటం ప్రమాదకరమని హెచ్చరించారు అందరూ. ప్రమాదం సంగతి వొదిలెయ్యండి. ఇంట్లో మాట్లాడితే, అత్తగారూ మావగారూ ఇద్దరూ ఒప్పుకోరు. బైట మాట్లాడితే, అందరు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. నేను ఆడదాన్ని కావటం వల్ల అతి సామాన్యమైన విషయం పరమ వికృతంగా రూపొందే ప్రమాదం ఉంది...."
    "ఒద్దు! ఒద్దు! అతడితో నేనే మాట్లాడతాను! వివేక్ కి ఫోన్ చేస్తాను, అతడిని పంపమని"
    "థేంక్యూ డాక్టర్! ఇది చెప్పటానికే వచ్చాను."  
    అనంత పద్మనాభస్వామికి నమస్కారం చేసి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయాక కూడా స్వామి ఆమెని గురించే ఆలోచించాడు. వివేక్ సమస్య చాలా సహనంతో అర్థం చేసుకుని అన్ని విధాలా అతనికి సహకరించింది, నార్మల్ గా కావటానికి మార్గాలు వెతుకుతోంది.
    మరి ఆ ప్రెగ్నెన్సీ హిస్టరీ ఏమిటో!
                                  * * *
    వివేక్ పర్సనల్ ఫోన్ నంబరు స్వామి దగ్గర ఉంది. అందరు పేషెంట్స్ వి ఉంచుకుంటాడు. వివేక్ కి ఫోన్ చేశాడు. స్వామి గొంతు గుర్తు పట్టి "గుడ్ మార్నింగ్ డాక్టర్!" అన్నాడు వివేక్.
    "వెరీ గుడ్ మార్నింగ్! హౌ ఆర్ యూ?"
    "ఫైన్!" వణికింది వివేక్ గొంతు.       
    "మీ ఇంట్లో "వీరన్న" అనే నౌఖరు ఉన్నాడట కదా!"
    "ఉన్నాడూ!"
    "అతడితో కొంత మాట్లాడాలి. మా క్లినిక్ కి పంపిస్తావా?"
    "అలాగే అతడితో మాట్లాడవలసిన అవసరమేముందీ?"   
    "అతడు నీ చిన్నతనం నుంచీ ఉన్న నౌకరట. నీ చిన్నతనానికి సంబంధించిన విషయాలు అతనితో మాట్లాడాలని. ఒక్కొక్కసారి నీకు తెలియనివి, నీ దృష్టిలో అంత ప్రాముఖ్యం అనిపించనివి అయిన విషయాలూ అతనికి తెలియవచ్చు."    
    "ఓ!" అన్నాడు. అతడిని ఒక్కసారిగా నిరుత్సాహం ఆవహించింది. ఇటీవల అతడు డాక్టర్ని కన్సల్ట్ చెయ్యడం లేదు. తను నార్మల్ గా ఉండగలనన్న విశ్వాసం నశించిపోతోంది, అతనిలో బాగా తాగి తన ముందుకు ఏ దృశ్యాలూ రాకుండా చేసుకోవడమే అతడు కోరుకునేది.
    "వీరన్న విషయం మీతో ఎవరు చెప్పారూ?"
    "నీ భార్య.. యశోద"
    యశోద... ఇప్పటికీ డాక్టర్ దగ్గరికి వెళ్తోందా? తనకోసం ప్రయత్నిస్తోందా?
    వివేక్ వైపు నుంచి వెంటనే సమాధానం రాకపోవటం డాక్టర్ కి ఆశ్చర్యం కలిగించలేదు. తన మాటల ప్రభావం ఎలా ఉంటుందో డాక్టర్ కి తెలుసు.     
    "ఆల్ రైట్ డాక్టర్! వీరన్నని పంపిస్తాను!" కొన్ని క్షణాల తర్వాత వచ్చింది వివేక్ సమాధానం అతని గొంతులో కోపం లేనందుకు డాక్టర్ కి ఆశ్చర్యం కలిగింది.... సంతోషమూ కలిగింది...  
                                   * * *
    సైకియాట్రిస్ట్ అనంత పద్మనాభస్వామి ఇల్లు కనుక్కోవడం వీరన్నకి పెద్ద కష్టం కాలేదు. వివేక్ అతడికి వివరాలన్నీ చెప్పాడు. కానీ ఒక పొరపాటు చేశాడు.
    "డాక్టర్ అడిగిన ప్రశ్నలు అన్నింటికీ సమాధానాలు చెప్పు. కానీ ఇలా డాక్టర్ తో చెప్పినట్లు నాన్నగారితో మాత్రం చెప్పకు!" అన్నాడు అనటమే కాదు. పదిరూపాయలు చేతిలో పెట్టాడు అది చాలు. వీరన్న లాంటి వాడికి వేయికళ్లతో ఆలోచనలతో కోటి నోళ్ళతో వచ్చాడు డాక్టర్ దగ్గరికి.   
    "కూచో" వీరన్నని నఖశిఖ పర్యంతం పరీక్షగా చూస్తూ స్టూల్ చూపించాడు కూచోవటానికి. వీరన్న డాక్టర్ ని కోరగా చూసి కుర్చీలో కూర్చున్నాడు.
    "నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను... నిజం చెప్పాలి."
    "చెప్తే నిజమే చెప్తానండీ"
    "అంటే?"
    "గిట్టుబాటు కాకపోతే అస్సలు చెప్పనండి"
    "గిట్టుబాటా?"
    "అసలు మీరేం అడుగుతారో చెప్పండి."
    "వివేక్ చిన్నతనపు విశేషాలు! దేవిశంకర్ కి సంబంధించిన విశేషాలు..."
    "అద్గదీ! అందుకే గిట్టుబాటు అన్నానండి!"
    "దేనికీ గిట్టుబాటు?"
    "నే చెప్పిన రహస్యాలకి..."
    "అంత విలువైనవా, అవి?"
    "హమ్మమ్మో! శానా విలువైనవి...."
    "ఎలాంటివి?"
    "ఖూనీ విశేషాలయితే, ఒక్కొక్క దానికి పదివేల వుద్ది. ఆడోళ్ల యవ్వారాలయితే, రెండు... రెండు వేలుచాలు! ఆడోళ్ల వ్యవహారాలన్నీ ఒకలా గుండవు లెండి!. తప్పుడు కేసులు బనాయించటాలూ. ఖైదు లో పెట్టించటాలూ వగైరాలకైతే, వెయ్యి వెయ్యి చాలు. అయ్యి శానామందికి తెలిసినవే"  
    ఎందరెందరి నోటనో, ఎన్నెన్ని అద్భుత విషయాలనో విన్న డాక్టర్ సహితం ఈ ధోరణికి గతుక్కుమన్నాడు.
    "ఇవన్నీ నిజంగానే చెప్తావా?"                        

 Previous Page Next Page