పార్వతికి పూర్తిగా వంట బట్టలేదు. ఇంకా.....
"పోనీ జానీతో మాట్లాడటం మానేస్తే ఏం?"
యశోద కళ్ళలో నీళ్ళూ తిరిగాయి.
"అమ్మా నువ్వు నన్ను కూడా అనుమానిస్తున్నావా?"
"ఛ! ఛ! అది కాదు. నేననేది...."
ఆగిపోయింది. ఏమిటంటోంది తను? భర్త కిష్టం లేని వాళ్లతో మాట్లాడొద్దు. అని చెప్పబోతోంది.
యశోద భరించలేదు, అలాంటి భావాలు ఆలోచించి నెమ్మదిగా అంది "వివేక్ దుర్మార్గుడయితే నువ్వు ఎదిరించటం న్యాయం! కానీ మీకిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ ఉన్నప్పుడు చిన్నచిన్న కారణాలతో జీవితం నాశనం చేసుకోవడం ఏం న్యాయం చెప్పమ్మా? ఆడదానికి సహనం ఉండాలమ్మా."
భరించలేకపోయింది యశోద "సహనం! సహనం! నేను ఎంత సహనంతో ఉన్నానో, ఎంతెంత సహించానో నీవూహించలేవు!"
"అంతా వివేక్ కోసమే! వివేక్ ని ప్రేమిస్తున్నాను కనుకనే. ఇప్పుడైనా ఇలా రావటం ఇద్దరికీ మంచిదనుకున్నాకే వచ్చాను. లేకపోతే నేను వివేక్ ని వదిలి రాగలిగేదాన్నికాను"
ఏడుస్తూ తల్లి ఒళ్ళో తలదాచేసుకుంది యశోద.
* * *
ఇంటిముందు కారాగిన చప్పుడు విని బయటికి వచ్చింది పార్వతి. కారులోంచి దిగుతున్న ప్రసూనని చూసింది. సాక్షాత్తూ దేవదూత తన ఇంటిముందు వాలినట్లే అనిపించింది.
"రండి! రండి! వదినగారూ" అంటూ సంభ్రమంగా ఆహ్వానించింది పార్వతి." యశూ! ఎవరొచ్చారో చూడూ!" అంటూ హడావిడి చేసింది. యశోదకి కూడా ప్రసూనని చూడగానే పట్టరాని ఆనందం కలిగింది. లేచి వెళ్ళి పాదాలకు నమస్కారం చేసింది.
"మీ భార్యా భర్తలు అన్యోన్యానురాగాలతో పది కాలాలపాటు ఆనందంగా వర్దిల్లాలి" అని ఆశీర్వదించింది ప్రసూన.
పార్వతి కాఫీ ఫలహారాల కోసం హడావిడి చెయ్యబోతే..." అవన్నీ ఇప్పుడొద్దు. వెంటనే వెళ్ళాలి. యశోదా! త్వరగా బయలుదేరు, వెళ్దాం" అంది ప్రసూన.
యశోద ఒక్కసారి ప్రసూన ముఖంవంక చూసి తలదించుకుంది. లేచే ప్రయత్నం చెయ్యలేదు.
యశోద భుజం చుట్టూ చేయివేసి లాలనగా తట్టింది ప్రసూన.
"యశోదా! నువ్వు నమ్ముతావో లేదో గానీ, నేను కూడా విమన్ విచ్ సపోర్టర్ నే! విమన్ విచ్ కోసం పోట్లాడటమంటే ఇంట్లోంచి పారిపోవడం కాదు. ఇంట్లోనే ఉండి, పోట్లాడి సాధించుకోవడం పిచ్చి పిల్లా! నేను పడిన సంఘర్షణతో పోలిస్తే, నీదెంత మాత్రం? నేను సాధించిన విజయంతో పోలిస్తే, నువ్వు సాధించినదేముందీ?"
ఆశ్చర్యంగా వింది యశోద. అత్తగారి వ్యక్తిత్వం యశోదకి ఎప్పుడూ పరమాద్భుతంగానే ఉంటుంది.
"పోట్లాడటానికి కాదత్తయ్యా!నేను అక్కడ ఉండకపోవటమే వివేక్ కి బాగుండేలా ఉంది"
"ఏమిటీ?" అని విస్తుపోయేలా నవ్వింది ఆవిడ.
"నువ్వొక్కసారి ఇంటికొచ్చి చూడు. వాడికి ఏది బాగుంటుందో నీకే తెలుస్తుంది. ఏదో పెద్ద జబ్బు చేసి పస్తులున్నవాడిలా తయారయ్యాడు. రెండు రోజుల నుంచీ వాళ్ళ నాన్నగారితో వెళ్ళటం లేదు. ఇవాళ కూడా బయలుదేరకుండా పడుకుంటే, నిన్ను తీసుకు రమ్మని ఆయనే పంపించారు పద! బయల్దేరు!"
యశోద లేచింది. హేండ్ బేగ్ అందుకుని. "అమ్మా! వెళ్ళొస్తాను" అంది.
"ఒక్కనిముషం ఉండు"
పార్వతి గబగబా యశోద కొన్న కొత్త బట్టలన్నీ ఏర్ బేగ్ లో కూరి తీసుకొచ్చింది.
"ఇవి ఇక్కడుండనీ!" అంది యశోద.
"ఒద్దు. మళ్ళీ వీటి అవసరం రాకూడదు" అంది పార్వతి.
ఆ మాటకి వియ్యపురాళ్ళిద్దరూ మనసారా నవ్వుకున్నారు.
మాసిన గెడ్డంతో, దిగులు నిండిన కళ్లతోవాలు కుర్చీలో పడుకుని ఉన్నాడు వివేక్. నిద్రపోవటం లేదు. ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నవాడిలా ఉన్నాడు. ఎఱ్రగా ఉన్నాయి కళ్ళు. గదిలోకి వచ్చిన యశోదను చూడగానే, చిరునవ్వుతో ముఖమంతా వెలిగింది. దిగ్గునలేచి ఒకడుగు ముందుకువేసి ఆగిపోయాడు, అతడి వళ్ళోంచి ఏదో కిందపడింది, ఏమిటా అని చూసింది యశోద. జానీ ఫోటో!
11
అనంత పద్మనాభస్వామి క్లినిక్ కి వచ్చింది యశోద. జానీ విషయంలో వివేక్ అనుమానాలు చూశాక కొంత కాలం అతనితో మాట్లాడకపోవడమే మంచిదనుకుంది, అంచేత వీరన్న విషయం డైరెక్ట్ గా అనంత పద్మనాభస్వామితో మాట్లాడటమే మంచిదనుకుంది.
"గుడ్ మార్నింగ్ డాక్టర్!" చిరునవ్వుతో విష్ చేసింది యశోద.
యశోద ప్రెగ్నెన్సీ గుర్తించి "వెరీ గుడ్ మార్నింగ్" అన్నాడు డాక్టర్ హుషారుగా.
కూచోమని సోఫా చూపించాడు. టీ ఆఫర్ చేశాడు. యశోదని అతను ఎప్పుడూ కష్టమర్ లా చూడడు. ఫ్రెండ్ లాగ ట్రీట్ చేస్తాడు. సైకాలజిస్ట్ గా ఆ అమ్మాయి తెలివి తేటలపట్ల అతనికి గౌరవం ఉంది.
"సో! యువర్ ప్రోబ్లం ఈజ్ సాల్వ్ డ్" అన్నాడు అర్ధయుక్తంగా.
"నో డాక్టర్!" తల దించుకుని అంది.
"అంటే.....?"
"వివేక్ యధాప్రకారమే ఉన్నాడు. తాగకపోతే నరక దృశ్యాలు కనిపిస్తాయి. తాగితే తెలివి తప్పి మత్తుగా నిద్రపోతాడు."
"ఓ!.... ఓ!....."
కొన్ని క్షణాలాగాడు, సంకోచం చీల్చుకుంటూ అడిగాడు" మరి నువ్వు..."
"ఏం జరిగిందో, ఎలా జరిగిందో, నాకు తెలియటం లేదు డాక్టర్. దీనివల్ల ప్రాబ్లమ్స్ పెరిగాయి. వివేక్ నన్ను అనుమానిస్తున్నాడు."
"ఓ!..... ఓ!......"
ఎంబ్రేసింగ్ గా ఫీలయినప్పుడు, డాక్టర్ అలా ఓ.. ఓ.. ల మాటున తన ఇబ్బంది కమ్ముకుంటాడు.