"ఒసేయ్.... ఈ రోజు సాయంత్రం ఎక్కడికి వెళ్ళకు" అంది నాయనమ్మ.
"భారత సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ని పట్టుకుని 'ఒసేయ్' అన్నావంటే కళ్ళు పోతాయి నాయనమ్మా. విషయం ఏమిటో చెప్పు" భోజనం చేస్తూ అంది.
"సాయంత్రం నిన్ను చూసుకోటానికి పెళ్ళివారు వస్తున్నారు."
ప్రతిమకి పొలమారింది.
"అదేమిటి..... ఎవరో తల్చుకుంటున్నట్టున్నారు!"
"నా ప్రియుడు నాయనమ్మా."
"ఓసి నీ యిల్లు బంగారంగాను. ఎంతకు బరితెగించావే........?"
"ఇంకా తెగించలేదు బామ్మా. బరిలోపలె వున్నావు."
"ఎవరే అతను.....?"
"నేత్ర అని సీక్రెట్ ఏజంటు" చెయ్యి కడుక్కుంటూ అంది.
"ఒక ఏజెంట్ కే ఛస్తున్నా. ఇంట్లో ఇద్దరు ఏజెంట్లా....?"
అంతలో ఫోన్ మోగింది. ప్రతిమ "హలో" అని "చూసావా నాయనమ్మా ..... మాటల్లోనే ఫోన్ చేశాడు" అంది.
"నేను ..... నేత్రని ...... సాయంత్రం ఒక ప్రోగ్రాం వుంది. రాగలవా...."
"సాయంత్రమా......?? వెంటనే రానా......??"
"వస్తే రా...."
ఆమె ఫోన్ పెట్టేసింది.
"సాయంత్రం రానా అంటున్నావు. ఎక్కడికే......?" అడిగింది నాయనమ్మ.
"ఇద్దరు ప్రేమికుల్ని కలపడానికి."
ఆవిడ అర్థం కానట్టు "మరిప్పుడు ఫోన్ చేసింది నువ్వు చేసుకోబోయే వాడన్నావుగదే....?" అంది.
ప్రతిమ నవ్వి "ప్రేమ త్యాగాన్ని కోరుతుంది నాయనమ్మా" అంటూ కన్నుకొట్టి, అక్కడినుంచి వెళ్ళిపోయింది.
* * *
"ఈ డ్రెస్ లో నువ్వు చాలా బాగున్నావు" అన్నాడు అతను. ఫోన్ పట్టుకున్న హంసలేఖ నవ్వి "గాలిలో బాణాలు వేయడం మీకు బాగా అలవాటు అనుకుంటాను. నేనే డ్రస్ లో వున్నానో మీకెలా తెలిసింది.....?" అని అడిగింది కిటికీలోంచి అతడి ఇంటి బాల్కనీవైపు చూస్తూ!
అతను అక్కడ లేడు.
మినీ టెలిస్కోప్ లో చూస్తున్నాడు కిటికీనుంచి. ఆ అమ్మాయి మంచం పక్కన నిలబడి మాట్లాడడం స్పష్టంగా కనిపిస్తూంది. సల్వార్ కమీజ్ మీద గులాబీపువ్వు అందంగా వుంది.
"మనసైన అబ్బాయిని కలుసుకునే ముందు అమ్మాయిలు కుడివైపు గులాబిపువ్వు పెట్టుకుంటారు. చెంపలకు దూమెరుగ్గా పౌడరు రాసుకుంటారు. టెన్షన్ తో మాటి మాటికి గడ్డాన్ని కర్చీఫ్ తో తుడుచుకుంటారు. ఇవన్నీ ప్రేమ లక్షణాలు."
గెడ్డం మీదనుంచి చెయ్యి తీసేసి ఆమె నవ్వుతూ మంచంమీద జారి పడుకుని "ఇంకా....?" అంది- రిసీవర్ ఈ చేతిలోంచి ఆ చేతిలోకి మార్చుకుంటూ.
ఇప్పుడు అతనికి మరింత స్పష్టంగా కనపడుతూంది.
"ప్రేమించిన వాళ్ళతో ఫోన్లో రాత్రిపూట మాట్లాడటం కన్నా ఆనందకరమైనది ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు" అన్నాడు. ".....ప్రపంచం అంతా నిద్రలో వుంటుంది. ప్రేమికులు ఇద్దరే మెలకువగా వుంటారు. కాలం తెలీదు. మాటలు బాసలవుతాయి. చీకటి ప్రోత్సహిస్తుంది."
"ఇంకా....." అంది నవ్వు ఆపుకుంటూ. నేత్ర కొనసాగించాడు.
"కొంచెంసేపు నిలబడతారు. కొంచెంసేపు కూర్చుంటారు. తరువాత పక్కమీద పడుకుంటారు. ఇటు తిరుగుతారు. అటు తిరుగుతారు. నువ్వు ఇప్పుడు వేసుకున్నట్టు గుండెల మీద చెయ్యి వేసుకుంటారు."
అతడి మాటలు పూర్తి కాకుండానే ఆమె తన చెయ్యి ఎక్కడ వుందో చూసుకుని, సన్నగా అరిచి, చేతిని కిందికి జారుస్తూ "ఇవన్నీ మీకెలా తెలుస్తున్నాయి......?" అని అడిగింది.
"చెప్తాను గానీ...... నీ చెయ్యి పొజిషన్ అక్కడ కూడా బాగోలేదు. తీసెయ్యి" అన్నాడు తాపీగా.
ఆమె చప్పున లేచి కూర్చుని "ఇవన్నీ మీకెలా తెలుస్తున్నాయి.....?" అంది ఎక్సైటెడ్ గా.
"నా రూముకి వస్తే చెపుతాను."
"ఇప్పుడా.....?"
"అవును...... రేపు నా బర్త్ డే...... ఏ కేకో సెలెక్ట్ చెయ్యాలి. బజారు వెళ్దాం".
"మైగాడ్ .....రేపు మీ బర్త్ డేనా.....? నిజంగా..... రేపటికి ఎన్నేళ్ళు నిండుతాయి.....?"
నేత్ర ఇబ్బందిగా "మొగాళ్ళ వయస్సు అడక్కూడదు" అన్నాడు.
"ఎప్పుడు పుట్టారో చెప్పండి ప్లీజ్......"
"క్రీస్తు శకారంభంలో అనుకో."
ఆ అమ్మాయి కాస్త తటపటాయించి "ఈ రోజు రాత్రి పన్నెండింటికి యింటికి రాగలరా?" అంది.
అదిరిపడ్డాడు. "వాట్......??" అన్నాడు.
"మరేమీ అనుకోకూడదు. రాగలరా.....? నాన్నగారు వూళ్ళోలేరు"
"ఎందుకు......?"
"వచ్చాక చెప్తాను" ఫోన్ డిస్ కనెక్ట్ అయింది.
నేత్ర ప్రతిమతో సంభాషణంతా చెప్పాడు.
"పడింది. రొట్టె విరిగి నేతిలో పడింది." ఎగిరి గంతేసినంత పని చేసింది ప్రతిమ. "నేను చెప్తే విన్లేదు చూశావా....? ఆ అమ్మాయి నీ అడ్వెంచర్ కి ప్లాట్ అయిపోయింది. అర్థరాత్రి ఆహ్వానిస్తూంది."
"నమ్మలేకపోతున్నాను."
"నేను చెప్పానుగా...... చాలా ఫాస్టని..... మొగవాళ్ళు ఆవిడకి కొత్తకాదు అంటూంటే సడన్ గా ప్రతిమ మొహం వాడిపోయింది. "కొంపదీసి నువ్వూ మత్తులో పడిపోతావా......?"
నేత్రకి నవ్వు వచ్చింది. "నువ్వేగా నన్ను యింతదూరం తోసింది."
"అయినా సరే...... కాస్త ప్రేమించి ఆ రహస్యాలు రాబట్టు చాలు. అన్నట్టు ఆవిడగారు పాలల్లో ఏ చరస్సో కలిపి యిస్తుందేమో.....? మార్ఫియా ఇంజక్షన్లు కలిసి తీసుకుందాం అని బలవంతం చేస్తుందేమో.....? అటువంటి పనులేమీ చెయ్యనని ఒట్టెయ్యి,"
"ఆ పని చేస్తేగాని తండ్రి రహస్యం చెప్పనని అంటే.....?"
"అయినా సరే...."
"మరి దేశం గురించి ఏం చేసినా ఫర్వాలేదన్నావు.....?"
"ఏం చేసినా అంటే..... అదొక్కటీ కాదు" ఏడుపు మొహంతో అన్నది.