"సరే..... పన్నెండవని చూద్దాం" అన్నాడేగానీ, అతడికి యిదంతా అయోమయంగానూ, ఎగ్జయిటింగ్ గానూ వుంది. హంసలేఖ తనను ఇంటికి రమ్మని పిలిచిందంటే నమ్మలేకపోతున్నాడు.
* * *
నేత్ర గేటు ముందు నిలబడ్డాడు. అంతా చీకటిగా వుంది. గేటు తాళం వేసి లేదు.
ప్రతిమ చెప్పింది నిజమేనేమో అన్న అనుమానం కలిగింది. పైకి ఎంతో అమాయకంగా కనిపించిన ఆ అమ్మాయి, నిజంగా ప్రతిమ చెప్పిన టైపేనేమో? తనని ఫూల్ చేస్తుందేమో....?
అతడు తలుపు తీసుకుని లోపలికి ప్రవేశించాడు.
కాలింగ్ బెల్ నొక్కబోతూ వుంటే తలుపు తెరుచుకుంది. ఎదురుగా హంసలేఖ నిలబడి వుంది. అతదామెనే చూస్తూ ఉండిపోయాడు. ఒక నిశ్శబ్ద పవనం స్నేహ పరిమళానని తీసుకుని యిద్దరి మధ్యనుండీ సాగిపోయింది. ఆమె తెల్లచీరెలో వుంది. మంచు బిందువుల్లో స్నానం చేసిన మల్లెపూవు, మేఘాల్లోంచి జారి తెల్లవారుఝాము శీతలత్వాన్ని సంతరించుకున్నట్టు వుంది.
"నిద్రపోలేదా.....?" అడిగాడు.
"పైన బాల్కనీ నుంచి మీ కోసమే చూస్తున్నాను."
"బాల్కనీలోంచా....?"
"మరి ఎక్కాడ వుంటాననుకున్నారు.....?"
"బెడ్ రూంలో వుంటావనుకున్నాను."
"ఆ అమ్మాయి బెదిరినట్టు చూచింది. "నేనిలా అర్దరాత్రి పిలిచినందుకు మీరేమీ అపార్థం చేసుకోరుగా."
అతడు ఇబ్బందిగా "ఇందులో అపార్థం ఏముంది....? యు లవ్ మీ.. డోంట్ యు...?" అన్నాడు.
ఆమె కళ్ళు దించుకుంది.
ఆ క్షణం ఆమె అతనికి ముగ్ధ మనోహరంగా, విచ్చుకున్న మల్లె పూవులా కనబడింది.
ద్వైధీభావంతో అతడు కొట్టుమిట్టులాడుతున్నాడు.
ఈమేమిటి? ఛరస్- మార్జువానాలకి అలవాటుపడటమేమిటి? మొగవాళ్ళని దుస్తులు మార్చినట్టు మార్చటం ఏమిటి అని అతడిలోని పరిశోధకుడు మాటిమాటికీ అనుకుంటున్నాడు. ఆమె స్వచ్ఛతనం అతడిని పరిమళంలా చుట్టు ముడుతూంది.
అతడి కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది.
* * *
హంసలేఖ అతికష్టం మీద కారు పక్కకి తీసి ఆపు చేసింది. లేకపోతే మధ్యలో ఆగిపోయి, ట్రాఫిక్ జామ్ అయ్యేది. రోడ్డు బాగా రష్ గా వుంది.
ఆమెకి అంత విసుగూ, కోపం ఎప్పుడూ రాలేదు. టైమ్ చూసుకుంది ఇంకా పది నిముషాలుంది. ఇటువంటి పరిస్థితి ఆమెకి తటస్థించలేదు. కొత్త కాదది.
ఆమెకేం చెయ్యాలో అర్థం కాలేదు. కారు డోర్ లాక్ వేసి- చుట్టూ చూసింది. ఆమె జీన్స్ పంట మీద లూజ్ షర్టు వేసుకుంది. అయినాసరే ఆమె ఆకృతి, చూపరుల దృష్టిని మెడ క్రింద నిలుపుతోంది. ఫంక్షన్స్ కి, పార్టీలకి, కాలేజీకి కారులో వెళ్ళటం- ఇవే ఆమె అలవాట్లు, ఇలా నడిరోడ్డు మీద నిస్సహాయంగా నిలబడవలసి రావటం అదోలా వుంది. అయినా ఇవేమీ కావు ఆమె విసుగుకి కారణం- టైమ్ ఇంక తొమ్మిది నిముషాలుంది.
ఆటోల కోసం చూసింది. ఒక్కటి కూడా ఖాళీ లేదు.
మరో నిముషం గడిచింది.
రిక్షా ఒకటి ఖాళీగా వెళ్తోంది. ఆమె దాన్ని ఆపుచేసి ఎక్కి "పోనీ" అంది అంత మోడరన్ అమ్మాయి రిక్షా ఎక్కటం చిత్రంగా అనిపించినా, దాన్ని బయటపెట్టకుండా, "ఎక్కడికమ్మా-" అన్నాడు.
"స్టేషన్ కి-"
రిక్షా భారంగా కదిలింది. ఆమె అందులో సరిగ్గా కూర్చోలేకపోతుంది. ఎంతో నెమ్మదిగా వెళ్తున్నట్టు అనిపించింది. అదృష్టవశాత్తు తొందర్లోనే ఆటో దొరికింది. ఆమె ఒక గెంతులో రిక్షా దిగి, యాభై రూపాయల నోటు అతడి మీదకు విసిరేసి ఆటో ఎక్కింది.
టైమ్ ఇంకా అయిదు నిముషాలుంది. ఆటోస్టేషన్ వైపు దూసుకుపోతోంది. ఆమె మనసులోనే లెక్క వేసుకుంది. ఇలాగే వెళ్తే సరిగ్గా రెండు నిముషాలు టైమ్ వుంటుంది. రెండు నిమిషాలు అక్కర్లేదు- రెండు క్షణాలు చాలు ట్రైన్ వెళ్ళకపొతే...
ఆటో ఆగటంతో ఆమె ఈ లోకంలోకి వచ్చింది.
స్టేషన్ కనపడలేదు. చుట్టూ ఆగివున్న వాహనాలు కనపడ్డాయి- "ట్రాఫిక్ జామ్ అమ్మగారూ- " అన్నాడు. ఆమె ఆలస్యం చెయ్యలేదు. దూరంగా రెండు ఫర్లాంగుల దూరంలో స్టేషన్ టవర్ కనపడుతోంది.
ఆమె పరుగెట్టటం ప్రారంభించింది.
ఒక్కక్షణం చుట్టూ వున్నవాళ్ళకి అర్థం కాలేదు. సైకిళ్ళ వాళ్ళు కార్లవాళ్ళు అందరూ చిత్రంగా ఆమెనే చూస్తున్నారు. ఆమె అదేమీ పట్టించుకోలేదు. ఊపిరి బిగపట్టి పరుగెడ్తూనే వుంది. ఆమెది చాలా మంచి హెయిర్ స్టయిలు- మొహానికి ఖరీదైన మేకప్ వుంది. అణువణువునా సోఫిస్టికేషన్ నిండివున్న ఆ అమ్మాయి అంత ఎండలో అలా రోడ్డుమీద పరుగెట్టటం, చూసేవారికి అపూర్వ దృశ్యం.
ఆమె స్టేషన్ చేరుకునేసరికి మరో రెండు నిముషాలు గడిచాయి. ఫ్లాట్ ఫామ్ టిక్కెట్టు అడుగుతున్న కలెక్టర్ ని పట్టించుకోకుండా, లోపలికి పరుగెత్తింది. అప్పుడే ట్రెయిన్ కూత వినిపించింది.
ఆమె ఒక్కొక్క కంపార్ట్ మెంట్ వెతుకుంటూ వెళ్ళింది. తనని ఎవరెలా చూస్తున్నారు- ఎంత ఆసక్తితో గమనిస్తున్నారు?- ఇవేమీ పట్టించుకోలేదామె. ట్రెయిన్ నెమ్మదిగా కదిలింది.
ఆమెకు ఏడుపోక్కటే తరువాయి.
అంతలో ఆమెకి నేత్ర కనపడ్డాడు. ఫస్ట్ క్లాస్ బోగీ కిటికీ పక్కన కూర్చుని ఏదో మేగజైన్ చదువుకుంటున్నవాడల్లా, ఆమెని ఆ స్థితిలో అలా చూసి ఆశ్చర్యపోయాడు. "రేఖా" అన్నాడు విస్మయంతో "........ఇదేమిటి - నువ్వెందుకు వచ్చావ్?"
"మీరు వూరెళ్తున్నారుగా."
"అయితే?" అన్నాడు "..... రేపు సాయంత్రం వచ్చేస్తానని నిన్న కలిసినప్పుడు చెప్పానుగా."
"ఏమో- నాకు చూడాలనిపించింది" చిన్నపిల్లలా, గారాబంగా అంది. అతన్ని చూసిన ఆనందం ఆమె కళ్ళల్లో ప్రతిబింబిస్తూంది. ట్రైన్ నెమ్మదిగా వేగం పుంజుకుంటూంది. ఆమె దానితోపాటూ ఫ్లాట్ ఫాం మీద వేగంగా నడుస్తూంది. అతడి దృష్టి. చెమటతో తడిసి నుదుటికి అంటుకున్న ముంగురుల మీదా, బటన్ వూడిపోయిన షర్ట్ మీదా పడింది. ఆమె ఇంకా రొప్పుతూనే వుంది.
"పరుగెత్తుకుంటూ వచ్చావా?" అని అడిగాడు.