Previous Page Next Page 
రుద్రనేత్ర పేజి 35


    "చాలా బాగా  గ్రహించావు భూషణ్ రావు. మా ఉద్దేశ్యం అదే" మొహంలో ఏ భావమూ లేకుండా అన్నాడు. భూషరావు మొహం ఎర్రబడింది.

 

    "కోర్టుకెళ్తాను"

 

    "రెండు సంవత్సరాలకు తక్కువ కాలం  పట్టదు అక్కడ కేసు తేలడానికి" నవ్వాడు వామనమూర్తి. నవ్వుతూ కుర్చీలో నుంచి లేచి అతని దగ్గరికి వచ్చాడు. "నువ్వు దేశ ద్రోహివని అందరికీ తెలుసు. నిన్ను  ప్రభుత్వం ఏమీ  చెయ్యలేదు. కోర్టులేమీ చెయ్యలేవు. ఐ.ఫై.సి., ఫెరా, నాసా, మీసాలు నిన్ను తాకలేవు. మరేంచెయ్యాలి? ఈ పరిస్థితుల్లో నిన్ను నాలుగు  వైపుల నుంచి మానసికంగా  ఆర్థికంగా నొక్కెయ్యడానికి మార్గాల్ని సూచిస్తూ మాకొక వ్యక్తి సలహా యిచ్చాడు. మేము నిన్ను బంధించం. జైల్లో పెట్టం. కేసులు వెయ్యం. కానీ నువ్వు ఏ పని చేసినా డానికి ఏదో విధంగా అడ్డుపడతాం. ఈ కొత్త టెక్నిక్ బాగుందా....?"

 

    భూషణరావు కోపాన్ని అణచుకుంటూ "ఎవరు మీకీ  సలహా యిచ్చింది.....?" అని అడిగాడు.

 

    "నేత్ర"

 

    "అమ్మాయిల్తోనూ, తుపాకుల్తోనూ ఆడుకునే ఏజెంట్, ఆర్ధిక విషయాల్లో కూడా ప్రభుత్వానికి సలహా యిస్తున్నాడా.....? గుడ్...... దీన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. వారం రోజుల లోగా నాలు ఆ దిగుమతి లైసెన్సు కావాలి మీరిస్తారా.....? నన్ను  సంపాదించుకోమంటారా.......?"

 

    వామనమూర్తి నవ్వాడు. "నేను రష్యాలో వుండి వచ్చాను యిన్నాళ్ళూ ఎవర్ని ఎలా ఎక్కడుంచాలో రష్యన్స్ కి బాగా తెలుసు యస్.బి.ఆర్! నీ ఆటలు నా దగ్గర సాగవు. ఆ పని మీదే నన్నీ పోస్టులో వేశారు" చివరి వాక్యాన్ని వత్తుతూ పలికాడు.

 

    యస్.బి.ఆర్. కూడా నవ్వాడు. "నేను ఇండియాలో పుట్టి పెరిగాను మూర్తి. ఎవరితో ఎలా పనులు చేయించుకోవాలో ఇండియన్ ఇండస్ట్రీయలిస్టులకు బాగా తెలుసు. వెళ్ళొస్తాను" అంటూ లేచాడు.

 

    అతడు బైటకొచ్చి కార్లో కూర్చున్నాడు వెనుక సీట్లో. అతడి పక్క క్యూ వున్నాడు.

 

    "ఏమైంది?"

 

    "ఆ వామనమూర్తి చాలా గట్టివాడిలా వున్నాడు. ప్రతిదానికి  అడ్డుపడుతున్నాడు. అంతకన్నా  పెద్ద సమస్య  నేత్ర దగ్గర నుంచి వస్తూంది. అతడు నిజంగా నేత్రో, యాదగిరో తెలియడం లేదు."

 

    క్యూ నవ్వాడు. "ఇంగ్లీషులో ఒక సామెతుంది. టూ బర్డ్స్ ఎట్  ఏ షాట్  అని; అతను నేత్రే  అయితే అతడినీ, వామనమూర్తిని లేపేయడానికి ఒకే ఒక ఫిరంగిలాంటి ఆయుధం వుంది."

 

    "ఏమిటా ఆయుధం.......?"

 

    "ఆ ఆయుధం పేరు రెడ్డినాయుడు. ఆ ఫిరంగిలో వాడే గుండు. అతని కొడుకు" అన్నాడు అతను. అతని మాటల్లో ఉపమాలంకారం ఏమీ లేదు.

 

    ఎంతో తెలివైనవాడూ, ఎన్నో విషమ సమస్యల్ని తేలిగ్గా పరిష్కరించిన వాడూ అయిన యస్.బి.ఆర్.కి. ఈ చదరంగం ఎత్తు అర్థంకాలేదు. క్యూ వైపు చూచాడు. అతడు నిర్వికారంగా వున్నాడు. అతడు పక్కనుంటే కొండంత ధైర్యం  కలిగినట్టు వుంది. నేత్రని ఎదుర్కోగల ఏకైక వ్యక్తి యితడే అని నమ్మకం కలిగింది.

 

    అతడు  భవిష్యత్తు గురించి ఆలోచించాడు. స్వర్ణరేఖ అడిగిన ఆమ్లజలం గురించి ఆలోచించాడు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా అది వారం రోజుల్లోగా  రావాలి. లేకపోతే పరిశోధన పూర్తిఅవదు. అది పూర్తయితే భవిష్యత్తు బంగారు భవనమే.

 

    తెప్పిస్తున్న ఆమ్లజలం కేవలం పేరుకీ, అధికారుల కన్నుకప్పటానికి అని అతడికి తెలుసు. వస్తూన్న రెండు వేల లీటర్ల ఆమ్లజలం కంటెయినర్లలో కోటిరూపాయల విలువచేసే సూక్ష్మాతి సూక్ష్మమైన ప్లూటోనియంని కూడా (తమకి సాయపడుతున్న) శత్రు దేశం పంపుతూందని కూడా కేవలం ముగ్గురికే తెలుసు.

 

    అతడికి, ఏజెంట్ క్యూకి....... స్వర్ణరేఖకి.


                                   *    *    *

 

    "తొందరగా నువ్వీ కేసు ఒక కొలిక్కి తేవాలి నేత్రా. సర్పభూషణరావు విదేశాంగశాఖని బెదిరించాడు. అతడు ఎలాగయినా తనక్కావల్సిన సరుకు  దిగుమతి చేసుకుంటాడు."

 

    "అంతేకాదు...... అతడికి దిగుమతి అవుతున్న సరుకు  మన శత్రుదేశపు రాజధాని మీదుగా వస్తూంది. అది ప్రమాదకరమైన  విషయం. ఏ వస్తు  మార్పిడి అయినా అక్కడ  జరగొచ్చు" అన్నాడు నేత్ర.

 

    చీఫ్ కళ్ళు పెద్దవి  చేసి " ఆ విషయం  నేను ఆలోచించలేదు సుమా" అన్నాడు.

 

    నేత్ర లేచి, "ఏది ఏమైనా రేపు సాయంత్రంలోగా ఈ కేసుని ఒక దారికి తీసుకొస్తాను సార్" అన్నాడు.

 

    "ఎలా.....?"

 

    "దీనికి మనకున్న ఆయుధం ఒకే ఒకటి...... రేఖ. ఆ అమ్మాయి ద్వారానే అసలు రహస్యం బయట పెట్టించాలి" అంటూ కుర్చీలోంచి లేచాడు.

 

    ఆ రాత్రికే అతడు హంసలేఖతో (అతని దృష్టిలో స్వర్ణరేఖ) అటో ఇటో తేల్చుకోదల్చుకున్నాడు.


                                                   *    *    *

 

    లోపలికి వస్తున్న రెడ్డినాయుడిని చూసి...... "ఎవరు....? ఏం కావాలి.....?" అని అడిగాడు గజపతిరావు. ఈ లోపు నేత్ర అతన్ని చూసి, నవ్వుతూ దగ్గరకు వచ్చాడు.

 

    ఫుల్ సూట్ లో వున్న నేత్రని కళ్ళు విస్ఫారితం చేసి  చూశాడు రెడ్డినాయుడు. అతడి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. "దొరా...... నన్ను మాఫ్ జెయ్యాలె...... నీతో సెయ్యి నొక్కించుకున్న. చాకిరీ చేయించుకున్న. నువ్వింత పెద్ద  ఆఫీసర్ వని తెలియక ఏమో పన్లు జేసిన......" అన్నాడు ప్రెసిడెంట్.

 

    నేత్ర అతని భుజం మీద  ఆప్యాయంగా చెయ్యి వేశాడు. "ఇందులో అంత బాధ పడాల్సింది ఏముంది.....?? చిన్న విషయం......"

 

    ప్రెసిడెంట్ అతడివైపు భక్తిగా  చూస్తున్నాడు. అతడిని తను ట్రీట్ చేసిన విధానానికి సిగ్గు పడుతున్నాడని కళ్ళలోని గిల్టీ ఫీలింగే చెపుతూంది.

 

    "ఎక్కడుంటావు నువ్వు.....?"

 

    "నిన్ను చూసేదానికే వచ్చిన దొరా...... ఎవరో చెప్తే ముందు నమ్మలె. వెతుక్కుంటూ వచ్చిన."

 

    "మా యింట్లోనే రెండు  రోజులుండు."

 

    "లేద్దొర..... పోత....."

 

    "ఇంత దూరం వచ్చిన వాడివి, అప్పుడే వెళ్ళడం ఏమిటి.....? ఉండే వెళ్ళు. ఆర్నెల్లపాటు ఇంట్లో వుంచుకుని పోషించిన వాడివి- నువ్వు వస్తే అంత తొందరగా  పంపిస్తానా......?"

 

    ప్రెసిడెంట్ సరే  అన్నట్టు తలూపాడు.

 

    "నేనిక్కడ వున్నట్టు నీకెవరు చెప్పారు.....?" అని ఒకటి రెండు ప్రశ్నలు వేసివుంటే, త్వరలో తన మీద జరగబోయే హత్యా ప్రయత్నం గురించి అతడికి తెలిసి వుండేది.

                                 *      *    *

 Previous Page Next Page