నాలుగో అధ్యాయం
వాళ్ళు ఆ అడవిలోకి ప్రవేశించి అప్పటికే ఏడు గంటలైంది. దయం ఆరుగంటలకి కోయపల్లెనుంచి బయలుదేరారు. ఏడేరు మీదుగా ప్రయాణం సాగించి.... ఆ చీకటి కారడవిలోకి ప్రవేశించారు.
మహర్షి తోపాటు రామరాజు కాకుండా మరో కోయ యువకుడు కూడా బయలుదేరాడు. ముగ్గురు ఆ కారడవిలో విశ్రాంతి లేకుండా అన్ని గంటలు ప్రయాణం చేసేసరికి అలుపు వచ్చినట్టుగా అనిపించి....ఓ చెట్టు కింద ఆగారు.
మహర్షి వెంట తెచ్చిన వాటర్ బాటిల్ లోంచి కొన్ని నీళ్ళు త్రాగి ఇచ్చాడు. తనతో తెచ్చిన బ్రెడ్ ప్యాకెట్స్ రెండు వారికిచ్చి ఒకటి తను తీసుకుని చెట్టుకు అనుకుని కూర్చున్నాడు.
"ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయాలి?"
"అబ్బో......ఇంకా శానాదూరం నడవాలి దొరా. ఇప్పటికింకా పావుమందం కూడా అవలేదు. ఏం దొరా కాళ్ళు పీకుతున్నాయా?" బస్తీబాబులు అంటే సుకుమారమనీ, కొద్దిగా కూడా కష్టాన్ని ఓర్చుకోలేరని ఇంతవరకూ అనుకునేవాడు. అలాంటిది తమతోపాటు ఎక్కడా ఆగకుండా, అలుపు లేకుండా అతను ఎండనపడి రావడం రామరాజుకు ఆశ్చర్యంగా వుంది. మహర్షి మీద అభిమానం పెరిగిపోయింది. అందుకే అంత ఆత్మీయంగా అడిగాడు.
"లేదు రామారాజూ, తెలుసుకోవాలని అడిగానంతే" అన్నాడతను. బ్రెడ్ తిని నీళ్ళు తాగాక ఖాళీ అయిన వాటర్ బాటిల్ అందుకుని వెంటవచ్చిన కోయ యువకుడికిస్తూ "భీమా, దగ్గిర్లో నీళ్ళుంటే తేరా" అన్నాడు రామరాజు.
భీముడు అది తీసుకుని లేచాడు. అతడు వెళ్ళాక రామారాజు అతనికేసి చూస్తూ "బండ ఎదవ...... సిన్నప్పటినుంచీ నా సేతుల్లో పెరిగాడు. ఆది అందానికి మాటలు రాకపోటమొక్కటే లోటు తప్పితే, ఆడు ఆనిముత్తె మసొంటోడు బాబూ" అన్నాడు.
"అరే! అతనికి మాటలు రావా? ప్రోద్దుట్నుంచీ ఒక్కమాట కూడా మాట్లాడకుండా నడుస్తూంటే, అతని తత్వమే అంత అనుకున్నాను" అన్నాడు మహర్షి. ఆ యువకుడి అందమైన ముఖం గుర్తొచ్చి మనసంతా జాలితో నిండిపోయింది.
ఇంతలో నీళ్ళకోసం వెళ్ళిన భీముడు రాగానే "ఇక మనం బయలుదేరుదామా?" అన్నాడు రామరాజు. మహర్షి తలూపాడు.
ముగ్గురు కదిలారు. ఆ నిర్జనారణ్యంలో - జనావళికి దూరంగా జంతుజాతికి మధ్యగా....... మృత్యుకోనలో.....అమృతం వేదకాలని!
* * *
రెండ్రోజులనుకున్నది- నాగకోనని చేరుకునేసరికి వారికి మూడురోజులు పట్టింది. వెంట తెచ్చుకున్న బ్రెడ్ ప్యాకెట్లు, బిస్కెట్లు అన్నీ ఎప్పుడో అయిపోయాయి. దారిలో ఎక్కడో, ఏ కాయలో దొరికితే భీముడు వెళ్ళి తెంపుకొచ్చేవాడు. అవే తిని, నీళ్ళు త్రాగి ముగ్గురూ తిరిగి నడక సాగించేవారు.
మూడో రోజు సాయంత్రానికల్లా వారు ఆ నాగకోన దరిదాపులకి చేరుకున్నారు.
"చీకటిపడే సమయమయింది. ఉదయం వెళ్ళటం మంచిది. అందాకా చెట్టునీడన పడుకుందాం" అన్నాడు రామరాజు. మహర్షికి కూడా నిజమే ననిపించింది. శారీరకంగా బాగా అలసిపోయాడతను. బ్యాగ్ లో మిగిలిన నాలుగు కాయలు తీసి అవే తిని, నీళ్ళు త్రాగి చెట్టుని అనుకుని విశ్రమించాడు మహర్షి. రామరాజు, భీముడు కూడా అతనికి చేరోపక్కన నేలమీద జింకచర్మం పరుచుకుని పడుకున్నారు.
కొద్దిసేపటికి అతనికి నిద్ర ముంచుకు వస్తున్నట్లు కళ్ళు మూతలు పడసాగాయి. చెట్ల సందుల్లోంచి మసకవెన్నెల అతను పడుకున్న మేరంతా పడి చీకటిని తరిమే వెలుగుదివ్వెలా వెలిగి పోతున్నాడు అతడు.
మహర్షికి మాగన్నుగా నిద్రపట్టింది. భీముడు నిద్రపట్టక లేచి కూర్చున్నాడు. రామరాజు ఎప్పుడో నిద్రలోకి జారుకుని గుర్రు పెట్టసాగాడు. మొగలి పరిమళం మత్తుగా వీస్తోంది.
కొద్ది సేపటికి మహర్షి చప్పున లేచి కూర్చున్నాడు. మెడ దగ్గర ఏదో గుచ్చుకున్నట్టుగా అనిపించేసరికి చేత్తో మెడ తడుముకుంటూ కూర్చున్నాడు. అతను లేవటం, మెడ రాసుకోవటం చూసి 'ఏమైందన్నట్టు' సైగ చేసి అడిగాడు భీముడు.
"ఏమో....ఇక్కడ ఏదో కుట్టినట్టు అనిపించింది" అన్నాడు మహర్షి.
అనుమానంతో భీముడి కళ్ళు మహర్షి చుట్టుప్రక్కగా గాలించి, ఒకచోట హఠాత్తుగా నిలిచిపోయి పెద్దవయ్యాయి.
చీకట్లో తళతళా మెరుస్తూ వేగంగా కదిలిపోతున్న సర్పాన్ని చూడగానే చప్పున మహర్షి జరిగి మెడమీద చూశాడు.
కోరలు దిగిన గుర్తు.
అంటే..... మాటలు రావనే విషయం కూడా మరిచి అప్రయత్నంగా అరవబోయాడు.
అతడి గొంతునుండి ఏ శబ్ధమూ రాలేదు. కంగారుగా రామరాజును లేపాడు. "ఏమిరా?" రామరాజు లేస్తూ అడిగాడు.
భీముడు ఆదుర్దాగా ఏదో సైగచేసి చెప్పాడు.
ఇదంతా మహర్షికి ఏమీ అర్థంకావడంలేదు. భీముడు అంతగా ఎందుకు కంగారుపడుతున్నాడో తెలీక అలాగే చూస్తుండిపోయాడు.
భీముడి సైగలు అర్థంకాగానే రామరాజు గబగబా లేచి మెడమీద కాలర్ జరిపి చూశాడు. అంతే....... అతని కళ్ళు వెడల్పయ్యాయి.
గబగబా లేచి అతనివెంట తెచ్చుకున్న నార సంచిలోంచి ఏదో మూలిక తీసి రసం ఆ కోరలు దిగినచోట పిండాడు.
"ఏమయింది రామరాజూ" అంతవరకూ వారిద్దరి కదలికల్ని ఆశ్చర్యంగా గమనిస్తు మహర్షి అడిగాడు.
"యేమీ లేద్దొరా..... యేదో సిన్న ఇసప్పురుగ్గుట్టింది, యేమనిపిస్తోంది దొరా?" అతని ముఖ కవళికలనే పరిశీలనగా గమనిస్తూ అడిగాడు.
"ఏదో కొద్దిగా మత్తుగా ఉందంతే!"
"ఈ పూటకి కునుకు తీయమాకండి. జాగారం సేయాల. సిన్న కునుకు తీసినా ఇసం సెరీరం అంతా పాకుద్ది. మందేసినాను. భయమేమి లేద్దొరా. మీరిలా కూకోండి" అంటూ మహర్షిని కాస్త దగ్గరగా కూర్చోబెట్టుకున్నాడు.
"భీమా. కాసిని నీళ్ళియ్యిరా?"
భీముడు వాటర్ బాటిల్ తీసి అందించాడు.
"ఈటితో మొఖంమీద సల్లుకోండి. మత్తెగిరిపోద్ది" అంటూ ఆ బాటిల్ ని అందించాడు రామరాజు. ఈ నీటితో ముఖం కడుక్కుని టవల్ తో తుడుచుకుంటూ "రామరాజూ! నాకో సాయం చేస్తావా?" అని అడిగాడు.
"సెప్పండి దొరా!"
"ఏమీ లేదు. యిక్కడ నాకేమయినా జరిగితే ఆ మందును నా స్నేహితురాలి భర్తకు అందించగలవా?"
"అలా మాటాడకండి దొరా. మీకేమీ కాదు. మా పాణాలొగ్గయినా మిమ్మల్ని సేమంగా ఇంటికి సేర్చే పూచీ నాది. అలాంటివేం ఆలోసించకుండా ధైర్యంగా వుండండి".
"ఒకవేళ జరగరాని దేదయినా జరిగే పక్షంలో....."
రామరాజు అతని ముఖంవంకే పరిశీలనగా చూశాడు. తన కేమయిన ఫర్వాలేదు...... స్నేహితురాలి భర్త క్షేమం ముఖ్యం అనుకోవటం......రామరాజుకు చాలా అద్భుతంగా తోచింది. పులో, ఎలుగుబంటో తరుముతూంటే పక్కవాడి గురించి పట్టించుకోకుండా తమ ప్రాణం దక్కిందే చాలన్నట్టుగా పరుగుతీసే ఆటవికన్యాయంలొ- ఈ వ్యక్తిత్వం విశిష్టమైనదిగా అనిపించింది.
తెల్లవారేవరకూ ముగ్గురూ అలాగే కూర్చున్నారు.
మహర్షిలొ మార్పే లేకపోవడంతో "మందు బాగా పన్జేసింది దొరా!" అన్నాడు.
ఆరుగంటలకి అక్కణ్ణించి ప్రయాణమయ్యారు. ముందు చిన్న అడవి. అది దాటింతరువాత దట్టంగా పెరిగిన మొగలి పొదల్తో ..... కాస్త యేటవాలుగా ఉన్న ఆ నాగాకోన ప్రారంభమైంది. మొగలిపొదలు తప్ప ఆ ప్రాంతంలో మరే చెట్లూ కనిపించడంలేదు.
ముగ్గురూ కాగ్రట్టగా చూసుకుంటూ యేటవాలుగా వున్న ఆ కొండని ఎక్కసాగారు. మహర్షి చెరో ప్రక్కరామరాజూ, భీముడూ కవర్ చేస్తూ నడుస్తూన్నారు. భీముడి చేతిలో 'చిల్లకర్ర' ని ఎలర్ట్ గా పట్టుకుని ఉన్నాడు. ఏక్షణంలొ ఏ సర్పం అటాక్ చేస్తుందో అన్నట్టుగా భీముడి చూపులు డేగచూపుల్లో చూస్తున్నాయి.
"బుస్" మన్న శబ్దం. మహర్షి ఎగిరి రెండడుగులు ప్రక్కకు దూకాడు. క్షణంలో ప్రమాదం తప్పింది. గోధుమవన్నె త్రాచు ఒకటి దారికడ్డంగా పడగవిప్పి బుసలు కొడుతోంది. వళ్ళు జలదరించినట్లుగా అయింది అతనికి. అది దారికడ్డంగా వుండి వారిని కదలనివ్వడంలేదు.
భీముడివంక సాభిప్రాయంగా చూశాడు రామరాజు. మరుక్షణం భీముడి చేతిలోంచి కర్ర పాము పడగని నేలకేసి కొట్టింది. అలాగే రెండు నిముషాలు నలుపుతూ వుండిపోయాడు. కాసేపు తోక అటూ యిటూ కొట్టుకొని, ఆ తరువాత చలనం ఆగిపోయింది.
మహర్షి నుదుటిమీద చిరు చెమటలు అలుముకున్నాయి. కాస్తలో ఎంత ప్రమాదం తప్పిందో ఊహించుకుంటేనే శరీరం రోమాంచితమైంది అతనికి. జరగాల్సిన ప్రమాదం ముందే జరిగి పోయిందవీ...... గరళం క్షణక్షణానికీ అతని నరనరాన వ్యాపిస్తుందనీ తెలీని అతను, తేలిగ్గా నిట్టూరుస్తూ ముందుకు కదిలాడు.
ఎండ క్షణక్షణానికీ ఎక్కువవుతోంది. వళ్ళంతా చమటతో తడిసి ముద్దయిపోసాగింది. దానికితోడు దట్టంగా పెరిగిన మొగలి పొదలు వెళ్ళడానికి వీలులేకుండా వున్నాయి. అక్కడక్కడా అడ్డంగా భీముడు వాటిల్లో మూలికలకోసం వెదుకుతూనే చిన్న కొడవలితో కొమ్మలు నరుకుతూ దారి సుగమనం చేయసాగాడు. మహర్షికి సంజీవినీ మూలికకోసం వెతికే హనుమంతుడు గుర్తొచ్చాడు. వాయుపుత్రుడు కాబట్టి ఏకంగా పర్వతాన్నే తీసుకువచ్చాడు.
ఇక్కడ ప్రయత్నం కూడా అలాంటిదే. అయితే తాము మాత్రం పెఅతి మొక్కా వెతకాల్సిందే.
చెప్పులు తెగిపోయాయి. వళ్ళు గీరుకుపోయింది. చర్మం నల్లబడింది.పెదాలు పగిలిపోయాయి. అతడు కూడా ఒక ఆటవికుడి లాగానే వున్నాడు. పళ్ళబిగువున పట్టుదల అదిమిపట్టి వారితో కలిసి నడుస్తున్నాడు.
నడుస్తున్న రామరాజు చప్పున ఆగిపోయాడు.
కొద్దిదూరంలో చిన్న మొక్క! లేత పసుపు రంగులో భూమికి ఆరంగుళాల ఎత్తులో వుందది.
"అదే.......ఆ మొక్కనే!" గట్టిగా అరిచాడు రామరాజు ముందుకు వంగుతూ. భీముడు చప్పున దాన్ని అందుకోబోయాడు. అది గమనించి భుజం పట్టి ఆపేశాడు రామరాజు.
"అదున్నసోట పాముంటది.......జాగ్రత్తగా తెంపాల. అట్టా తొందరపడితే పానానికే పెమాదం. ఆ సిల్ల కర్రిటియ్యి" అంటూ అతని చేతిలోని కర్రను తీసుకుని పొదలో అలికిడి చేశాడు.
అంతే! సముద్రపు ఒడ్డున చిన్న చేపపిల్లను వేస్తే బిరియల్లోంచి పీతలన్నీ ఎలా పరుగుపరుగున వస్తాయో....అలా ఆ పొదలోనుంచి నాలుగైదు పాముపిల్లలు అతి వేగంగా బయటికి పరుగుతీశాయి.