Previous Page Next Page 
మరో ముందడుగు పేజి 34

 

    నెలరోజులు చకచక గడిచిపోయాయి. సాయంత్రం పూట భోధన కార్యక్రమం సాగేది. పగటి వేళ వారి జీవన సరళిని గురించి రిపోర్ట్స్ తాయారు చేయటానికి వివరాలు సేకరించేవారు. దగ్గర దగ్గర అడవి ప్రాంతాలలో తిరిగేవారు. ఎండ వేళల తప్ప తాగి పడుకునే మొగవాళ్ళనీ, ఆడవాళ్ళని చూసి లోలోపల బాధపడేవారు. మాస్టారు మాత్రం అందులో పెద్ద బాధ పడవలసింది లేదనీ, ఆ అడవులలో బ్రతికే వాళ్ళకి అదే ఆరోగ్యమని చెప్పేవారు.
    అనుభవం లేకపోవడం వల్ల  మయూర పాఠాలు చెప్పలేకపోయేది. చెప్తోంటే తనూ వింటూ కూచునేది! పాఠాలు చెప్తున్నట్లుగా వాళ్ళు ఎన్నెన్ని విషయాలు చెప్తున్నారో చూసి విస్తుపోయేది . మెచ్చుకునేది. రిపోర్ట్స్ తయారు చెయ్యటంలో మాత్రం సహాయపడేది.
    చదువు చెప్పటం అయిపోయాక, మాస్టారూ, యువతీ యువకులూ కూచుని అనేక విషయాలు చర్చించుకునే వారు.
    మాస్టారు నవ్వుతూ "మీరు చదువు చెప్పే విధానం చూస్తోంటే , మీరు కేవలం విద్యా వ్యాప్తికి వచ్భ్హినట్టు లేదు" అన్నారు.
    "కాదని చెప్పాం కదండీ! అలా అని మేం సాయుధ పోరాటాన్ని బలపరచటం లేదు. మా ప్రభాకరరావు సార్ ఫిలాసఫీ సంగ్రహంగా చెప్తాం వినండి. ప్రస్తుతం సాయుధ విప్లవానికి మనదేశంలో వెనుకబడ్డ ప్రాంతాలు సాంఘికం గానూ, వైజ్ఞానికం గానూ కూడా సిద్దంగా లేవు. వారిని వెర్రి ఆవేశంతో ఉరక లేత్తించడం కాదు మనం చెయ్యవలసింది . అలా చెయ్యటం వల్ల ఫలితం లేదని అనుభవపూర్వకంగా రుజువయింది. అంచేత ముందు పీడిత ప్రజానికానికి తమ స్థితి ఏమిటో తాము తెలుసుకొనే వివేకం కలిగించాలి ఆలోచించే చైతన్యం రగిలించాలి!"
    "ఇదే క్ర్రమంగా సాయుధ పోరాటానికి దారి తీయవచ్చు కదా?"
    "చెప్పలేం! మా కార్యక్రమాలు రహస్యంగా సాగుతున్నవి కాదు కదా? అంచేత జాతి చైతన్యవంతమయి బహిరంగంగా ప్రజాస్వామ్య పద్దతులలోనే స్వార్ధపరులనూ, అవినీతి ఎదుర్కొని విజయం సాధించవచ్చు. లేదా సాయుధ పోరాటమే అనివార్యమయినా కావచ్చు. ఏది యేమయినా నియంతృత్వ విధానానికి అది ఏ విధమయినదయినా సరే!- మేమంతా వ్యతిరేకులమే?
    ఆ సంభాషణలన్నీ వింటుంటే, మయూరకు మరో కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లుగా వుండేది. విచిత్రంగా మయూర ఆనారోగ్యం ఎక్కడి దక్కడ ఎగిరిపోయింది. ఏదో చెయ్యాలనే ఆరాటమూ, ఎంతో కొంత చెయ్యగలుగుతున్నానన్న తృప్తి మయూర మనసుకు కొత్త బలాన్ని తెచ్చి పెట్టాయి.
    నెలరోజులు గడిచిపోయాయి. మిత్ర బృందమంతా తిరుగు ప్రయాణ మయ్యారు. కొండ జనులందరూ యెంతో స్నేహంతో వీడ్కోలు చెప్పారు. ఏవేవో పూసలూ, గవ్వలూ మొదలైనవి వాళ్ళు బహుమానంగా యిచ్చారు. బిస్కెట్ పెకేట్స్ - స్వీట్స్ పెకేట్స్ వీళ్ళు బహుమానంగా ఇచ్చారు.
    సంచులు భుజాలకు తగిలించుకుని ప్రయాణమయ్యారు. తిరుగు ప్రయాణంలో సంచులు చాలా తేలిగ్గానే వున్నాయి. అంతకంటే తేలిగ్గా వున్నాయి వాళ్ళ మనసులు. నెలరోజులుగా ఇళ్ళను వదిలి పెట్టిన వాళ్ళంతా తిరుగు ప్రయాణంలో ఇంటిని గురించీ, తలిదండ్రుల గురించి, అక్క చెల్లెళ్ళ గురించి అన్నదమ్ముల గురించీ ఎక్కువగా మాట్లాడుకోసాగారు. ఎప్పుడు ఇంటికి చేరుకుందామా అనే ఆరాటం అందరిలోనూ కనిపిస్తోంది. వాళ్ళలో మయూర ఒక్కటే ఏమి మాట్లాడడం లేదు. ఆ విషయం గమనించింది మమత.
    "మయూర! మీరిక్కడికి వెళ్ళాలి?' అని అడిగింది. నడుస్తున్న మయూర నిలబడిపోయింది. ఏ సమాధానమూ రాలేదు. తేజస్వి వచ్చి మయూర భుజం మీద చెయ్యి వేసి "మీకు యెక్కడికి వెళ్ళాలని వుందో చెప్పండి - అక్కడ దింపి వెళ్తాం" అంది.
    అప్పటికి మయూర కదిలి "యతి దగ్గరికి వెళ్తాను" అంది.
    "యతి ఎవరూ?" అని అడిగాడు ఉదయ్.
    "యతి ....యతీంద్ర"
    "ఓ! నెంబర్ టూ గ్రూప్ లీడర్ యతీంద్ర కావచ్చు అంతేనా? ప్రభాకర్ సార్ ఇంట్లో వుంటాడు - అతనే కదూ?"
    "అవునవును!"
    "అయితే మిమ్మల్ని ప్రభాకర్ సార యింట్లో దింపాలన్న మాట! మేము ముందుగా అక్కడకే వెళ్తాం?"
    "కాదు! కాదు!"
    "ఏమిటండీ? సరిగా చెప్పండి?"
    "నేను ప్రభాకరరావు సార్ యింటికి రాను. యతి ఇప్పుడక్కడ లేడు?"
    "మికెలా తెలుసు?"
    మయూర మాట్లాడలేదు.
    "యతీంద్ర ఇప్పుడెక్కడున్నాడో ఎలా తెలుసుకోవటం?"
    ఏం చెప్పగలడు మయూర?
    తేజస్వి అలోచించి "సరే! మీరు నాతొ రండి! తరువాత చూసుకుందాం!" అంది. మయూర సంతోషంగా ఒప్పుకుంది.


                                                                  23

    రాష్ట్రంలో అనేక మార్పు లోచ్చాయి . వెంకటయ్య మంత్రి కావటం అందులో ముఖ్యమైనది - అప్పోజిషన్ లో వెంకటయ్య లాంటి ప్రముఖుడు ఉండడం ముఖ్యమంత్రికి కత్తి మీద సాములా తయారయింది. ఎక్కడేక్కడి లోపాలూ కెలికి కెలికి బయటకు తీస్తున్నాడు. ఆ తరువాత ఆందోళనల పేరిట నానా అల్లరీ చేస్తున్నాడు.  అతనితో పంతం పెంచుకోవటం కంటే తన వైపు తిప్పుకోవటమే మేలనిపించింది ముఖ్యమంత్రికి. వెంటనే మంతనాలు సాగినాయి. వెంకటయ్య పార్టీ మారాడు. మంత్రి కూడా అయిపోయాడు. అతని చిరకాల వాంచితం నెరవేరింది.
    మిసెస్ జ్వాలాకుమారి ప్రభుత్వానికి అనుబంధంగా ఏదో స్త్రీలకు సంబంధించిన శాఖకు చైర్మన్ అయింది. ఆవిడ ఆ పదవిని ఎలా సంపాదించింది అనే దానిపైన రకరకాల వార్తలు ప్రచారంలో వున్నాయి. ప్రస్తుతం స్త్రీలకు సంబంధించిన కొన్ని కొన్ని సంస్థలకు గ్రాంట్లు శాంక్షన్ చేసే అధికారం ఆవిడ చేతుల్లో వుంది. ఆవిడ హుందాగా కుర్చీలో కూచుని, చుట్టూ ఒక పదిమంది గ్రాంట్సు కోసం చేతులు నలుపుకొంటూ   నిరీక్షిస్తూ వుండగా తన అధికారాన్ని అన్ని విధాల 'సద్వినియోగం ' చేసుకొంటుంది. తన పాతకారు అమ్మేసి కొత్త అంబాసిడర్ కొనుకుంది. కొడుకు పేరా ఒక మేడ కట్టించింది. సొంత ఊళ్ళో ఆస్తులు అమ్మి కట్టించానని చెప్పుకొంటుంది. అనేక మహిళా సంస్థలు ఆవిడను కాశ్మీరు శాలువాలతో సన్మానించారు. ఆ సన్మానాలన్నీ తన సంఘసేవకు, అభ్యుదయ దృక్పధానికి అని చాటుకుంటుంది ఆవిడ - "జ్వాలా కుమారా? ఆవిడను తలచుకోగానే "ఖల్లునకు నిలువెల్లా విషము గదరా సుమతీ!" అనే సుమతి శతకంలో పద్యం గుర్తుకొస్తుంది. " అనేవాళ్ళ సంఖ్య తక్కువ లేదు. అయితేనేం? అనేక కారణాల వాళ్ళ ఆవిడ చుట్టూ తిరుగుతూ, ఆవిడ గొప్ప సంఘ సేవకురాలని ప్రచారం చేసే వాళ్ళు చాలామందే వున్నారు.
    వెంకటయ్య పార్టీ మారాడనీ, మంత్రి అయ్యాడనీ తెలిసిన క్షణం నిర్ఘాంత పోయాడు యతి. ప్రభాకర్ ప్రభోదాలలోని చేదు నిజాలన్నీ ప్రత్యక్షంగా ఎదుట నిలిచినట్లయింది. ఛీ! ఈ స్వార్ధపరుడి మాయజాలంలో పడి బంగారం లాంటి జీవితంలో ఎంత కాలం వ్యర్ధం చేసుకున్నాడు? ఎన్ని జీవితాలు ఈ స్వార్ధపరుడి సోపానాలుగా మారటానికి కారకుడయ్యాడు? ఈ దుర్మార్గులు మంత్రి పదవి అధిష్టించి బొజ్జ పెంచుకుంటూ కూచున్నాడు. ఇతని ఆదేశాలు పాటించి రామదండు లో చేరి ఆందోళనలలో పాల్గొన్న విద్యార్ధులు ఇంకా జైళ్ళలోనే మగ్గుతున్నారు! కనీసం వాళ్ళని విడిపించాలనే ఆలోచన అయినా రాలేదు ఆ దేశాద్దారకుడికి! యతి మనసు మరిగిపో సాగింది. వెంకటయ్యతో మాట్లాడటానికి ప్రయత్నించాడు, కానీ అతనికి వెంకటయ్యతో ఇంటర్వ్యు దొరకలేదు.
    "ప్రభాకర్ తో చేతులు కలిపిన ఉగ్రవాదులతో నాకు సంబంధాలు లేవు" అని వెంకటయ్య అన్నట్లు అతని కెవరో చెప్పారు. "ఉగ్రవాదులా" అంటే? యతి వుడికిపోయాడు. అతడు నిజంగా ఉగ్రమూర్తి అయిపోయాడు. "రామదండు" అనే పేరుతొ మొదటి నుంచీ అన్ని వివరాలూ పత్రికా ముఖంగా ప్రపంచానికి తెలియ జేయాలను కున్నాడు. ఒక మంత్రి గారికి వ్యతిరేకంగా జరిగే ఈ ప్రచారానికి పబ్లిసిటి ఇవ్వటానికి చాలా పత్రికలు ముందుకు రాలేదు. ఎంతటి రిస్క్ అయినా సిద్దపడి ఇలాంటి విషయాలు బహిరంగం చేయటమే ధ్యేయంగా పెట్టుకొన్న ఒక పక్ష పత్రిక ఆ వివరాలు ప్రచురించటానికి ముందుకు వచ్చింది. "రామదండు"  శీర్షికతో ధారావాహికంగా వ్యాసాలు రాసాగాయి. జనం విరగబడి చదవసాగారు. వెంకటయ్య తనను తలుసుకోమని యతికి కబురు చేసాడు. "నేను ఉగ్రవాదిని, అధికార కాంక్షతో రంగులు మార్చేసే వూసర వెల్లులతో నేను మాట్లాడను" అని సమాధానం పంపించాడు యతి.

 Previous Page Next Page