తనపై రేగుతున్న ఈ దుమారానికి హడాలిపోయాడు వెంకటయ్య - అతడు అత్యంత చతురుడైన రాజకీయ వేత్త - తాను అంతకాలంగా నిర్లక్ష్యం చేసిన జైళ్ళలో ,మగ్గుతోన్న రామదండులోని విద్యార్ధులను విడుదల చేయించాడు. "రాజకీయ బాధితులుగా" గా ముద్ర వేయించి అందరికి వారి వారి అర్హతలకు తగిన వుద్యోగాలు లిప్పించేసాడు. వూసురుమనిపోయాడు యతి! ఏమిటి జాతి! ఒక బొమిక ముక్క పడేయగానే తోకడించుకుంటూ కుక్కల్లా అయిపోతారు. వెంకటయ్య వుద్యోగా లిప్పించగానే , అప్పటివరకూ అతడు తమకూ, దేశానికి చేసిన అపకారం మరచిపోయారు. ఉద్యోగాల కుర్చిలలో కూచుని పూర్తిగా యంత్రాలయి పోయారు. అంతే! ఎవరైనా తాత్కాలిక ప్రయోజనమే ఆశిస్తున్నారు ఎలా బాగుపడుతుంది ఈ జాతి?
"రామదండు" లో ఆ తరువాతి వ్యాసం వ్రాయాలని కాగితాలు ముందు వేసుకు కూచున్నాడు యతి.
తేజస్వి, మమత, హేమంత్, ప్రతాప్ మొదలైన వాళ్ళంతా వచ్చేసరికి "హలో!" అంటూ లేచిన యతి అలాగే నిలబడిపోయాడు. వాళ్ళలో మయూర కూడా వుంది. "హయ్ యతీ! ఏమిటలా నిలబదిపోయావ్? వుండుండి ఎలా మాయమై పోయావ్? చచ్చామనుకో! నీ అడ్రస్ కనుక్కోలేక! "రామదండు " వ్యాసాల కారణంగా వెతుక్కుంటూ రాగాలిగాం! భలే దులిపెస్తున్నవులే! బైదిబై! ఈ మయూర సంగతేమిటి? "నీ కేవరున్నారు?" అంటే "యతి- యతీంద్ర" అని చెప్పింది. అనుకోకుండా లక్కీగా మాకు కలిసింది. సో మీట్ యువర్ మయూరా"
గడగడ మాట్లాడేస్తోంది మమత. మయూర, యతి ఒకరి నొకరు చూసుకుంటూ అలాగే నిలబడిపోయారు. ఇద్దరిలో ఒక్కరు కూడా ఒక్కడగు ముందుకు వెయ్యలేక పోయారు.
తేజస్వి యతిని చూసి "డు యు లవ్ హర్?" అని అడిగింది.
"యస్!" అన్నాడు యతి వెంటనే. మయూర దగ్గరగా వచ్చి మయూర చేతులు పట్టుకుని మంచం మీద కూచోబెట్టాడు . ఆ గదిలో కుర్చీ ఒక్కటే వుండటం వల్ల మిగిలిన అందరూ ఆ మంచం మీదే కూచున్నారు.
"నీ వంట్లో ఎలా వుంది మయూరా? ఇంట్లోంచి ఎలా వచ్చేశావు? ఎంత రిస్క్" అన్నాడు యతి....
"నిన్ను పంపించేసి వేణు నా మీద దెబ్బ తీశాననుకున్నాడు. అతనికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఎంత రిస్క్ అయినా తీసుకోటానికి సిద్దపడ్డాను. కానీ నిన్ను పంపేసి నన్ను ఏడిపించగలిగాననే అనందం అతనికి దక్కనీయ కూడదను కున్నాను."
మయూర తమను ఎలా కలిసిందో , తమతో పాటు ఎలా పనిచేసిందో వివరంగా చెప్పింది తేజస్వి. చాలా ఆశ్చర్యపోయాడు యతి.
'అంత అనారోగ్యంలో ....." అన్నాడు! అప్పటికీ తనను తను నమ్మించుకోలేక.\
"చూడు నన్ను! ఆరోగ్యంగా లేనూ?" నవ్వుతూ అంది మయూర. నిజమే! మయూర ఇంకా సన్నగా బలహీనంగానే వుంది. అయినా ఇదివరకులా , యంత్రంలా లేదు. ఆ ముఖంలోకి జీవకళ వచ్చింది. కళ్ళలోకి ఉత్సాహం వచ్చింది.
"వాట్ నెక్స్ట్?" అన్నాడు యతి బాధగా తల పట్టుకొంటూ. ఆ ప్రశ్న వినగానే మయూర ముఖం పాలిపోయింది.
తేజస్వి కలిపించుకొని "అదేం ప్రశ్న? మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని ఒప్పుకుంటున్నారు కదా? పెళ్ళి చేసుకోండి!" అంది.
"ఆవిడకు ఇదివరకే పెళ్ళయింది!" అన్నాడు యతి.
మమత నిర్లక్ష్యంగా భుజాలు ఎగరేసి "అయితే ఏం? ఆ భర్తకు ఈవిడకు పడటం లేదని అర్ధమవుతోంది కదా? ఇష్టం లేని సంసారం చచ్చినట్లు ఎందుకు చేయాలి? ఆతనికి విడాకులు ఇచ్చేస్తుంది. నిన్ను పెళ్ళి చేసుకుంటుంది?" అంది. అదేదో అత్యంత సామాన్యమైన విషయం అన్నట్లు.
"మీ కందరకు తెలియని విషయం ఒకటుంది. ఈవిడ మన ప్రభాకర్ సార్ కోడలు!" అన్నాడు యతి.
గదంతా ఒక్కసారిగా నిశ్సబ్దమయిపోయింది. యెవరూ మాట్లాడలేక పోయారు. మయూర బేలగా అందరినీ చూడసాగింది. ఆ చుపులకూ మనసు కరిగిపోయింది తేజస్వికి. అందరిలో ఆవిడే ఒక నిర్ణయానికి రాగలిగింది.
"మన కందరికీ ప్రభాకర్ సార్ అంటే చాలా గౌరవం అయన న్యాయబుద్ధిలోనూ, వివేకంలోనూ కూడా మనకందరికీ విశ్వాసం వుంది. ఈ సమస్యను ఇలా రహస్యంగా వుంచి ప్రయోజనం లేదు. సమస్యను ప్రభాకర్ రావు సార్ ముందే వుంచుదాం ?"
మయూర , యతి ఒకరినొకరు చూసుకున్నారు.
"నాకు అభ్యంతరం లేదు" అన్నాడు యతి. ఊపిరి బిగపట్టి తలూపింది మయూర.
24
వంటింట్లో కూరలు తరుగుతోంది కమల. అడుగుల చప్పుడు విని తలెత్తింది. ప్రభాకర్ వచ్చాడు. ఇంచుమించు రోజూ అడుగుతున్నా ప్రశ్న అలవాటుగా అడిగింది. "యతి వచ్చాడా?" ప్రభాకర్ నవ్వాడు. ఆ నవ్వు ఆ ముఖమూ కూడా వింతగా తోచాయి కమలకి. చిన్నప్పుడు హరిశ్చంద్ర నాటకంలో చూసిన కాటికాపరి హరిశ్చంద్ర ముఖం గుర్తొచ్చింది.
"అలా వున్నారేం? యతి యింకా కనపడలేదా?"
"మనింటికే వచ్చాడు!"
"ఆ! వచ్చాడా!" తరుగుతున్న కూరలు అక్కడే పడేసి లేచి నిలబడింది కమల. సంభ్రమంగా "యేమిటో ఉన్నది కొంచెం రోజులే అయినా , సొంతబిడ్డలా అలవాటు పడిపోయాడు బెంగపడిపోయాను. నిన్న కల్లోకి కూడా వచ్చాడు. "అమ్మా!" అని పిలిచినట్లే అనిపించింది. పదండి చూద్దాం! ఎవరో పరాయి మనిషిలా బయట నిలబడటం దేనికి? లోపలికి రాకూడదూ?" అని బయలు దేరబోయింది.
ప్రభాకర్ కమల భుజాలు పట్టుకొని అపుచేసాడు. "కొంచెం అగు వెళుదువు గాని, అతడొక్కడే కాదు, వచ్చింది మన మయూర కూడా అతనితో వుంది!" అన్నాడు.
అతడు మాట్లాడుతున్న దేమిటో అర్ధం కాని దానిలా కొంచెం సేపు పిచ్చి చూపులు చూసింది కమల. అంతలో పాలిపోయిన ముఖంలోకి జీవం తెచ్చుకుంటూ "ఓహో! యతి మన మయూరను వేడికి తీసుకోచ్చాడా? బంగారు తండ్రి! పాపం! మనకోసం ఎంత శ్రమైన పడతాడు. ఎలా వుంది మయూర? ఎక్కడా దొరకలేదన్నారు/ పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారో? ఏడ్చారో? మతిస్థిమితం లేకుండా వెళ్ళిపోయిందా? చూద్దాం పదండి! పసిపిల్ల ఏం అవస్థలు పడిందో?" అంటూ బయలుదేర బోతున్న కమలని మళ్ళీ భుజాలు పట్టుకున్నాడు.
"ఏమిటండీ ? ఎందుకు నన్నిలా ఆపేస్తున్నారు? మీరెందుకిలా అయిపోతున్నారు? ఏం జరిగింది?"
ప్రభాకర్ కి మాటలు రావటం కష్టమవుతోంది.
"కమలా! యతి, మయూర వచ్చారు. వాళ్ళు......వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోవాలను కొంటున్నారు" అనేశాడు. "ఆ!' అంది నిర్ఘాంతపోతూ కమల. అంతలో ఆమె కడుపు మంట శోకంగా మారింది.
"ఇదెక్కడి అన్యాయమండి! మీరు వాళ్ళకెంత చేసారు? దానికిదా ప్రలిఫలం ? దాన్ని------ ఆ చెడిపోయిన దాన్ని కొడుక్కిచ్చి పెళ్ళి చేసారు. మతీ మన్ను లేకుండా పడివుంటే , మనిషిని చేసారు. వాడు ......పోలీసులు తరుముకోస్తుంటే , చావుబ్రతుకుల మధ్య ఇంటికొస్తే చావబోతున్న వాడికి ప్రాణం పోశారు. దోసిళ్ళతో డబ్బు గుమ్మరించి పోలీసుల బారినుంచి కాపాడారు. కన్నకొడుకులా చూసారు. అందుకు ఇదా ప్రతిఫలం ! వాళ్ళని.... వాళ్ళని .......యేడుస్తూ శాపనార్ధాలు అనబోతున్న కమల నోరు మూసేసాడు ప్రభాకర్.