"ఈ క్రింద వున్నది ఆక్సిలేటరు. దీన్ని నొక్కితే వేగం పెరుగుతుంది. మరీ స్పీడు ఎక్కువైతే, ఇదిగో ఈ మధ్య దాన్ని సుతారంగా నొక్కాలి. దాన్ని బ్రేకు అంటారు. అలా అని చెప్పి, ఒక్కసారిగా బ్రేక్ వేసెయ్యకూడదు. క్లచ్ ని కొద్ది కొద్దిగా నొక్కుతూ వేగం తగ్గించాలి. అప్పటికీ ఆగకపొతే హేండ్ బ్రేక్ ని చేత్తో....."
"వేటూరి సుందర్రామ్మూర్తిగారు మీకేమవుతారు?"
అకస్మాత్తుగా ఆమె అలా అడిగేసరికి అతను తెల్లబోయి "ఆయనకీ నేను చెప్పేదానికీ ఏమిటి సంబంధం?" అని అడిగాడు.
"ఏం లేదు చెప్పండి-"
"లవ్ కీ - కారు డ్రయివింగ్ నేర్చుకోవటానికి దగ్గర పోలికలున్నాయి తెలుసా"
ఆమె విస్మయంగా "ఏమిటవి-?" అని అడిగింది.
"L అంటే లెర్నింగ్. O అంటే ఓ అమ్మాయి, V అంటే వర్జిన్, E అంటే ఎంట్రీ."
"మీరేదో ద్వంద్వార్థంతో మాట్లాడుతున్నట్టున్నారు?"
"చూశారా? వేటూరి వారిని కూడా సెన్సార్ వారు ఇలాగే అపార్థం చేసుకుంటారు. నా అభిప్రాయం ఏమిటంటే- ఒక కన్నెపిల్ల హృదయంలోకి ప్రవేశించటాన్నే ప్రేమ అంటారు-" అని, బైదిబై మనం ఈ నేర్చుకోవటాలు, నేర్చుకోవటాలూ రేపట్నుంచి ప్రారంభిద్దామా?"
"రేపు సాయంత్రం నా స్నేహితురాలి పెళ్ళి వుంది. వెళ్ళాలి-"
"రేపా?" ఆశ్చర్యం నటిస్తూ అన్నాడు నేత్ర.
"ఆ జంట చాలా అదృష్టవంతులు-"
"ఎందుకు?"
"రేపు డిసెంబరు 21"
"అయితే?" అర్థం కాక అడిగింది.
"సైన్సు మనుష్యులు మీకామాత్రం తెలీదా?"
"ఉహూ"
"సంవత్సరంలో కెల్లా సుదీర్ఘమైన రాత్రి వుండేది ఆ రోజే"
"అయితే ఏమిటట?" అంది.
"అది కూడా చెప్పాలా?"
ఆమె మాట్లాడలేదు. 'ఏమిటి- రాత్రంతా ముద్దులు పెట్టుకుంటూనే వుంటారా ఎంత సుదీర్ఘమైన శోభనం అయితే మాత్రం'- అనుకుంది మనసులో.
"మిమ్మల్ని చూస్తుంటే ప్రొఫెసర్ పసట్ లాల్ గుర్తు వస్తున్నాడు మాడమ్."
"అతనెవరు? ఎందుకు గుర్తొస్తున్నాడు?"
"మీలాగే కెమిస్ట్రీలో రిసెర్చి చేస్తూ వుంటాడు"
"నేను రిసెర్చి చేయటం లేదు. కేవలం స్టూడెం" ఆమె మాటలు పూర్తికాకుండా "నన్ను పూర్తిగా చెప్పనివ్వరా?" అన్నాడు.
"చెప్పండి-"
"తన లేడీ సెక్రటరీతో కలిసి పరాయి వూరు ఏదో మీటింగ్ కి వెళ్తూ ఆ రాత్రి అక్కడే వుండిపొవల్సి వచ్చిందట. హోటల్ లో ఒకే డబుల్ రూమ్ వుంటే 'తప్పనిసరై అదే తీసుకోవలసి వచ్చి; చెరో పక్క మీదా పడుకున్నారట. అర్థరాత్రి చలేసి సెక్రటరీ "కాస్త మీవైపున్న కిటికీ తలుపు వేస్తారా?" అని అడిగిందట. ఆయన పక్కమీదే ఇటు వత్తిగిలి "ఈ ఒక్క రాత్రికీ నా భారీగా వుండగలవా?" అని అడిగాడట. ఆమె బోలెడు ఉత్సాహంతో "తప్పకుండా సర్" అందట. "అయితే ఏమీ అనుకోక నువ్వే వేసుకో" అని అటు తిరిగి పడుకున్నాడట".
ఆమె మొహం ఎర్రబడింది.
"ఇలాంటి కథలు చెప్పటానికా రమ్మన్నారు?" అంది కోపంగా.
"కాదు ఒక అబ్బాయి...... అందమైన అమ్మాయిని సాయంత్రం షికారుకి ఆహ్వానించాడూ అంటే అది స్నేహానికి ఫైనల్ స్టెప్. ప్రేమకి మొదటి స్టెప్పు"
"మన ప్రేమ యింకా ఈ స్టెప్పుల స్టేజీలోనే వుందని నేను అనుకోవడం లేదు."
"అయితే ఒక విషయం చెప్పు. రష్యానుంచి వచ్చిన అంబాసిడర్ కీ మీ నాన్నకి ఏమిటి సంబంధం.....? ఆయన పేరు వామనరావు. మొన్నటి వరకూ రష్యాలో పనిచేసి, ఇక్కడ విదేశాంగ శాఖకి వచ్చాడు. చాలా సిన్సియర్ అధికారి. ఆయన్ని మీ నాన్న ఎందుకు కలుసుకోవాలనుకుంటున్నాడు?"
"అది మీకెందుకు?" తిరుగు ప్రశ్న వేసింది. నేత్ర ఈ సంభాషణలో తనకేమీ వుత్సాహం లేనట్టు "నీ యిష్టం ..... ప్రేమికుల మధ్య రహస్యాలు వుండకూడదని నువ్వనుకుంటే చెప్పు" అన్నాడు.
హంసలేఖ అమాయకంగా "రష్యన్ సర్కస్ వచ్చింది కదా. దానికి ప్రీ పాసుల గురించి అడగటానికేమో" అంది. ఆ జవాబుకి నేత్ర ఆమెని తినేసేలా చూశాడు. "నిన్నరాత్రి ఫోన్ లో నాన్న ఎవరితోనో" అంటూ చెప్పబోయింది. అంతలో ఎదురుగా మోటారు సైకిల్స్ వచ్చాయి. అతడు కారు ఆపాడు.
ఎదురుగా వాళ్ళు అర్థవృత్తాకారంలో నిలబడి వున్నారు. అతడు కారు దిగి, వాళ్ళ దగ్గరకు వెళ్ళి, రహస్యంగా "మీ అవసరం లేదు. వెళ్ళి ప్రతిమకి చెప్పండి. ఆ అమ్మాయి స్వతహాగానే అన్ని విషయాలు చెప్పేసేట్టు వుంది" అన్నాడు కారువైపు చూపిస్తూ.
జవాబుగా అతని మెడపైన ముష్టి ఘాతం పడింది. దూరంగా వెళ్ళిపడ్డాడు. అతడికి అర్థం కాలేదు. లేచి వెళ్ళి "నాటకం కూడా సరిగ్గా ఆడలేరా.....?" అన్నాడు విసుగ్గా. అంతలో మెరుపుకన్నా వేగంగా ఒక కత్తి వచ్చి అతని షర్ట్ ను చీలుస్తూ వెళ్ళింది. చర్మం ఎర్రగా మారింది. అతడు ఆ చేతిని పట్టుకుని విసురుగా లాగేలోపు మరొకడు ఎటాక్ చేశాడు.
నేత్రకి ఏదో మోసం జరిగినట్టు తోచింది. ప్రతిమ చీఫ్ తో చెప్పటం ఎవరైనా తెలుసుకుని నాటకం ఆడారా అనుకున్నాడు. మరి ఆలస్యం చెయ్యలేదు. రెండు క్షణాల్లో అలర్ట్ అయ్యాడు. ఒక బ్యాక్ కిక్, రెండు ఫిష్ ఫిస్ట్ లు..... అతడి చెయ్యి మెరుపుకన్నా వేగంగా కదిలింది. ప్రత్యర్థులు దగ్గరికి రాగానే అతడు గాలిలోకి డైవ్ చేశాడు. వచ్చినవాళ్ళు ఈ వృత్తిలో పెద్ద నైపుణ్యం వున్నవాళ్ళు కాదు. అతడేమో ప్రొఫెషనల్. హంసలేఖ భయంగా చూస్తూంది. వరుసగా ఒక్కొక్కరే శక్తి కూడదీసుకుని అక్కడ నుంచి పారిపోయారు.
అతడు కారు దగ్గరకొచ్చి "చూశావా...... మీ నాన్న ఎంత దుర్మార్గుడో...... ఎటువంటి వాడికి నువ్వు సాయం చేస్తున్నావో" అన్నాడు.
"సాయమా.....?" అంది అర్థం కానట్టు.
"అవును. ఇప్పుడు చెప్పు. మీరు చేస్తున్న రిసెర్చి....." అంటూ- నేత్ర ఏదో అనబోయాడు. అంతలో బ్లాక్ కమెండోస్ తిరిగి వచ్చారు. మళ్ళీ అక్కడ భీకర సంగ్రామం మొదలైంది. ఎవరో ఏమిటో అరుస్తున్నారు. నేత్ర కొద్దిగా కూడా రిలాక్స్ అవలేదు. అవతలి వాడిని మాట్లాడనివ్వలేదు. చివరివాడి మొహంమీద చరిచినప్పుడు మాత్రం "చంపెశావు బాస్" అని వినపడింది. మొహంమీద ముసుగులాగి చూచాడు. తన తోటి ఏజెంట్. 'మైగాడ్.....' అనుకున్నాడు. అప్పటికే ఆలస్యమైంది.