Previous Page Next Page 
రుద్రనేత్ర పేజి 34


    "సస్పెన్షన్ తప్ప వేరే  దారిలేదు" అన్నాడు చీఫ్. "నన్ను సస్పెండ్ చేస్తున్నారా సార్.....?" భయంగా అంది ప్రతిమ.

 

    "నిన్ను కాదు, నన్ను" గంభీరంగా అన్నాడు చీఫ్. "ఇలాంటి బేవర్సు ఆలోచనల్ని  అప్రూవ్ చేసి, నువ్వు అడగ్గానే పదిమంది ఏజంట్లని పంపినందుకు నన్ను తప్పకుండా సస్పెండ్ చేస్తుంది ప్రభుత్వం."

 

    హాస్పిటల్ బెడ్ ల మధ్య నిలబడి మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరూ. యిరు పక్కల బెడ్ ల మీద సి.బి.ఐ. ఏజెంట్లు పడుకుని వున్నారు. కొందరి కాళ్ళు ట్రాక్టన్ లో పెట్టబడి వున్నాయి. కొందరి  చేతులకి బ్యాండేజెస్ వున్నాయి.

 

    "ఇందులో నా తప్పేం లేదు. కొద్దిగా వుంటే నా ప్రాణాలే  పోయి వుండేవి" అన్నాడు నేత్ర.

 

    ప్రతిమ ఈ సంభాషణలో పాల్గొనడం లేదు. ఎప్పుడూ అల్లరి చిల్లరిగా  హుషారుగా మాట్లాడే ఆ అమ్మాయి మౌనంగా, నిశ్శబ్దంగా వుంది. బాధ  కన్నా  అతీతమైన స్థితి అది. కోటి రూపాయల ప్రాజెక్టు ఒక చిన్న క్లర్కు  చేసిన తప్పువల్ల ఫెయిల్ అయి నష్టంవస్తే, ఆ క్లర్కు మానసిక స్థితి ఎలా వుంటుందో ఆమె  అలా వుంది.

 

    హాస్పిటల్ బెడ్ మీద వున్న తోటి ఏజెంట్లు తన అసమర్థతకి నిదర్శనంగా గాయాల్తో కనపడుతున్నారు. అందర్లోకీ తను జూనియర్. అయినా తన ఆలోచనలకి విలువనిచ్చారు. తను దీన్ని చాలా ఆషామాషీ వ్యవహారంలా తీసుకుని వ్యవహరించింది.

 

    ఈ నష్టం నుంచి బయట పడటం డిపార్టుమెంటుకి కష్టం కాదు. రికార్డుల్లోకి ఎక్కకుండా తన చీఫ్ చూసుకుంటాడు. కానీ తను  మాత్రం తన మనసుకి జవాబుదారీ.

 

    ఆమె నిశ్శబ్దంగా బయటికి వచ్చేసింది.

 

    హాస్పిటల్ విజిటర్స్ రూమ్ లో ఒక్కతే కూర్చుంది. ఎంతసేపు అలా వుందో తెలీదు. చీఫ్ తో మాట్లాడి నేత్ర ఆమె కోసం అంతా వెతికి అక్కడికి  వచ్చాడు. ఆమె  అటు తిరిగి వుంది.

 

    "ప్రతిమా" అన్నాడు. ఆమె తిరగలేదు. అతడు దగ్గరికి వెళ్ళి ఆమె  స్థితి అర్థం చేసుకున్నట్టు "బాధపడకు" అన్నాడు. ఆమె వెనక్కి తిరిగి  అతడి  చేతుల మధ్య ఒక్కసారి బావురుమంది.

 

    "ఛా! ఎందుకీ ఏడుపు? ఇప్పుడేమయింది? వాళ్ళు తొందర్లోనే కోలుకుని బయటకొస్తారుగా" అనలేదు అతడు. ఆమెని అలాగే  రోదింపనిచ్చాడు. ఇలాటి విషయాలకీ, తప్పులకీ బాధపడటం అనేది జీవితపు తొలిదశలోనే అయిపోవటం మంచిది. ముందు ముందు ఆమె  చాలా పెద్ద సీక్రెట్ ఏజెంట్ అవుతుందని అతడికి తెలుసు. తప్పో ఒప్పో అనుకున్నది చేసేయ్యటం ఏజెంట్ల ప్రథమ లక్షణం కావాలి.

 

    అతడామెని ప్రేమించాడా లేదా అన్నది ప్రశ్నకాదు. దుఃఖం వచ్చినప్పుడు ఓదార్పు కోసం వేరే మనిషిని వెతుక్కోవటం ధీమంతుల లక్షణం కాదు. పరాయి దేశంలో ఒక్కోసారి శత్రువులమధ్య ఏళ్ళతరబడి వాళ్ళు పెట్టే బాధలు అనుభవిస్తూ వుండవలసి రావచ్చు. అప్పుడు ఓదార్చే చేతులు కానీ  మాటలు గానీ వుండవు. ఆ  సున్నితత్వం పోవాలి. ప్రేమలు ఓదార్పులు, సానుభూతులు, ఆప్యాయతలు ఏజెంట్స్ అనే వారికి అన్నీ ఆమడదూరంలో వుండాలి. అప్పుడే నెంబర్ వన్ అవుతారు తమ రంగంలో.

 

    ప్రతిమ అలా అవ్వాలి.

 

    హి లైక్స్ హర్.


    
    హి లైక్స్ హర్ ప్రొఫెషనల్లీ.

 

    
                                                       *    *    *    

 

    విదేశాంగ శాఖ ఆఫీసు రెండో అంతస్తులో ఇ అండ్ ఐ కమీషనర్ గదిలో కూర్చుని వున్నారు వాళ్ళిద్దరూ.

 

    "ఎంత కాలమైందిరా  నిన్ను చూసి.....? అయిదు సంవత్సరాలు కాలేదూ......?" అన్నాడు గజపతిరావు.

 

    "మాస్కోకి రాయబారిగా వెళ్ళాక యిటువైపు రావడమే పడలేదురా. ఢిల్లీ, మాస్కోల మధ్య షటిల్ సర్వీస్  సరిపోయింది" అన్నాడు వామనమూర్తి. "ఇప్పుడిక ఇండియా వచ్చేశాను కాబట్టి తరచు కలుస్తూ వుండచ్చు. బైదిబై..... వచ్చే  ఇరవై నాలుగవ తారీఖు రష్యన్ సర్కస్  వుంది. కల్చరల్ వింగ్ వాళ్ళు స్పాన్సర్ హేస్తున్నారు. ఇదిగో వి.ఐ.పి. ఇన్విటేషన్, తప్పకుండా రావాలి!"

 

    "వస్తాన్లేరా..... ఈ వయసులో అంతకన్నా పనేముంది....." ఆహ్వానపత్రాలు తీసుకుంటూ గజపతిరావు అన్నాడు.

 

    "నువ్వొక్కడివే కాదు. ఇంట్లో అందర్నీ తీసుకురావాలి."

 

    "తప్పకుండా."

 

    గజపతిరావు వెళ్ళి పోతుంటే యస్.బి.ఆర్. లోపలికి వస్తూ కనిపించాడు. గజపతిరావుని చూస్తూ ఆగి, వ్యంగ్యంగా "హలో రిటైర్డ్ కల్నల్..... దేశం  ఎలా వుంది.....?" అని అడిగాడు సర్పభూషణరావు.

 

    "బయట శత్రువుల వల్ల ప్రమాదం ఏమీ కనబడటం లేదు. లోపల్నుంచే కష్టమవుతూంది" అంటే పదునుగా  సమాధానమిచ్చాడు గజపతిరావు.

 

    "దేశం కోసం కీర్తిశేషులైన నీ మనవడు  లాంటి వాళ్ళున్నంత కాలం దేశానికేమీ ప్రమాదం లేదులే!" నవ్వాడు.

 

    "వ్యాపారం తప్ప మామూలు వార్తలు చదవడం మానేసావా యస్బీఆర్? నా మనవడు  చచ్చిపోవడం- అదీ - అంతా నాటకం. నేత్ర చాలా హాయిగా....... చాలా మామూలుగా వున్నాడు."

 

    "నువ్వూ, పోలీసులు కలిసి ఆడుతున్న నాటకం అది. నాకు తెలుసు! మనవడు చచ్చిపోయినందుకు మనసులో కొండంత దుఃఖం పెట్టుకుని, పైకి చాలా సంతోషంగా వున్నట్టు నటించవలసి రావడం  ఎంత కష్టమో నేను ఊహించగలను."

 

    గజపతిరావు అతడి వైపు చిరాగ్గా చూశాడు. అటువంటి వాడితో వాదించడం అవసరం అనిపించింది. "సరే...... అలాగే అనుకుని సంతృప్తిపడు" అని తన కారు వైపు వెళ్ళిపోయాడు.

 

    యస్.బి.ఆర్. ఆఫీసు లోపల వామనమూర్తి దగ్గరకు వెళ్ళాడు. పరస్పర పరిచయాలయ్యాక వచ్చినపని చెప్పాడు. "విదేశాల్నుంచి నేను చేసుకోవలసిన  ఆమ్ల జాలం దిగుమతిని ప్రభుత్వం ఆపు చేసింది. కారణాలు చెప్పడం  లేదు. ఏ  కారణంగా  నాకు రావలసిన సరుకు ఆపు చెయ్యగలరు మీరు.....?"

 

    "అంత ఖరీదైన ఆమ్లజలం అవసరం మీకేమిటో మాకు అర్థం  కావడం లేదు మిస్టర్ యస్.బి.ఆర్."

 

    "నాకు సవాలక్ష పరిశ్రమలకు ఆ ప్రోడక్ట్ అవసరం వుందా లేదా అని విచారించడం కోసం కమిటీ వేస్తున్నాను" వామనమూర్తి తాపీగా అన్నాడు.

 

    "నాన్ సెన్స్......" అరిచాడు యస్బీఆర్. "ఇదంతా కేవలం నన్ను  కష్టపెట్టటానికి మీరాడుతున్న నాటకం. ఆ కమిటీ ఎప్పటికీ రిపోర్టు యివ్వదు. నా లైసెన్స్  ఎన్నటికీ  సాంక్షన్ కాదు."

 Previous Page Next Page