Previous Page Next Page 
రుద్రనేత్ర పేజి 32


    "సార్..... నాకు పది మంది ఏజెంట్లు కావాలి" అంది ప్రతిమ.

 

    "ఎందుకు.....?" అడిగాడు చీఫ్.

 

    ఎంతో ముఖమైన పని అయితే తప్ప బలగాన్ని ఉపయోగించకూడదు.

 

    "ఒక రహస్యమైన కార్యక్రమం ఫ్లాన్ చేస్తున్నాను. టాప్ సీక్రెట్. ఆ పది మందికీ బ్లాక్ కమెండోస్ డ్రస్ కావాలి" అంటూ తనకి కావాల్సిన వివరాలు చెప్పింది.

 

    "అసలు విషయం ఏమిటో చెప్పు ప్రతిమా......"

 

    "రేపు సాయంత్రం తెలుస్తుంది."

 

    చీఫ్ గెడ్డం గోక్కున్నాడు. ఏజెంట్ ని వివరాలు అడిగే హక్కు అతడికుంది. కానీ ఏజెంట్ చెప్పటానికి ఇష్టపడకపొతే బలవంతం చెయ్యటం నైతిక ధర్మం కాదు. అందులోనూ ప్రతిమ ఇప్పుడిప్పుడే డిపార్ట్ మెంట్ లో  మంచి పేరు తెచ్చుకుంటున్న అమ్మాయి. తలూపి "సరే" అన్నాడు.

 

    
                                   *    *    *    

 

    నేత్ర చేతిలో వైర్ లెస్ పరికరం వుంది. అతడు దాని అంటెనాని కిటికీలోంచి బయటకు బిగించాడు.

 

    టేబుల్ మీద కార్డ్ లెస్ ఫోన్ వుంది. అతడు రిసీవర్ ఎత్తుతూ  ఉండగా హడావుడిగా ప్రతిమ వచ్చింది. అతడామె వైపు తిరక్కుండా, తన  పనిలో నిమగ్నమై. "సర్పభూషణరావు ఫోన్ టాప్ చేశాను. ఇక నుంచి అతడి ఫోన్ కి వచ్చే కాల్స్, వెళ్ళే కాల్స్  అన్నీ వినవచ్చు" అన్నాడు.

 

    "ఆ వినటం సరే. ఇంతకీ నేను ఎందుకొచ్చానో విను. రేపు సాయంత్రం  నువ్వు ఆ అమ్మాయిని తీసుకుని బొంబాయి రోడ్ మీద వెళ్తూంటే పదిమంది బ్లాక్  కమెండోస్ వచ్చి నీతో ఫైట్ చేస్తారు. వాళ్ళని చావా బాదకు. వాళ్ళు  మన ఏజెంట్లే."

 

    అతడి చేతిలో వైర్ జారి పడింది.

 

    "మన ఏజెంట్లేమిటి.....? ఫైట్ చెయ్యడం ఏమిటి-?" విస్తుపోతూ అడిగాడు.

 

    "ఆ అమ్మాయికి జాకీచాన్ అంటే యిష్టం అందిగా! అందుకని చిన్న  ఫిటింగ్ షో ఏర్పాటు చేశాను."

 

    "నీకు నిజంగా మతిపోయింది."

 

    "నువ్వు నాకు ప్రామిస్ చేశావ్. నేనేమో వెళ్ళి చీఫ్ తో కూడా మాట్లాడాను."

 

    "చీఫ్ తో మాట్లాడావా.....?" వెనక్కి తగ్గాడు.

 

    "అవును...... పది మంది ఏజెంట్లని యివ్వటానికి కూడా ఒప్పుకున్నాడు. నీదే ఆలస్యం."

 

    నేత్ర జవాబు చెప్పలేకపోయాడు. చీఫ్ కూడా దీనికి ఒప్పుకుంటే ఇక చేసేదేముంది!

 

    అంతలో వైర్ లెస్ ఇండికేటర్ నుంచి, బీమింగ్ చప్పుడు వినిపించింది. నేత్ర వెళ్ళి చప్పున రిసీవర్ తీసుకున్నాడు.

 

    సర్పభూషణరావు కిటికీ దగ్గర నిలబడి ఎవరితోనో ఫోన్ లో మాట్లాడడం వినిపించింది.

 

    "పాస్ట్..... రష్యా అంబాసిడర్...... యస్....... అతడితో రేపు అపాయింట్ మెంట్ తీసుకోండి" అని పెట్టేసాడు. ఇటు నేత్ర కూడా ఫోన్ పెట్టేసాడు.

 

    ఒకప్పటి రష్యాలో మన రాయబారితో సర్పభూషణరావుకి ఇప్పుడు పనేమిటి.....? ఇందులో ఏదో తిరకాసుంది!" సాలోచనగా అన్నాడు.

 

    "మనం అనుకున్న దానికన్నా ప్రమాదకరంగా కనపడుతున్నాడు ఈ సర్పభూషనరావు" అంది ప్రతిమ. "ఏదో  ఒకటి చెయ్యాలి తొందరగా మనకున్న ఒకే ఒక ఆయుధం ఆ రేఖ. ఇప్పుడు లాబ్ ఎక్కడుందో కూడా మనకి తెలీదు. ఏం తెలుసుకున్నా ఆ రేఖ  ద్వారానే  తెలుసుకోవాలి."

 

    నేత్ర ఫోన్  తీసి డయల్ చేశాడు. అట్నుంచి యస్బీయర్ కంఠం "ఎవరూ....?" అని వినపడగానే "నేనే ..... నేత్రని. బాగున్నావా మావా....?" అన్నాడు.

 

    "ఎవరూ...?"

 

    "నీ తల్లి..... నన్నే మర్చినావు..... నేనేన్వయ్యా.... యాద్గిర్ని"

 

    "యూ ఇడియట్..... ఎంత ధైర్యంరా...... నాకే ఫోన్ చేస్తావా.....?"

 

    "ఫోన్ నేన్నీకు బెట్టలే, నీ కూతుర్కి బెట్టిన. నువ్వెందుకు ఎత్తినావు.....? దింపు ..... నువ్వు దింపు. నీ కూతుర్ని ఎత్త్మను. రేఖని ఎత్తమను. ఉన్నదా రేఖ?"

 

    "పోన్ కట్ అయింది. పది నిమిషాలు తరువాత మళ్ళీ ఫోన్ చేశాడు. రెండు నిముషాలు మాట్లాడి పెట్టేస్తూ "రేపు వస్తానంది ఆ అమ్మాయి-" అన్నాడు.

 

    ఇక్కడ ఈ సంభాషణ జరుగుతున్న సమయానికి అక్కడ సర్పభూషణరావు రేఖతో అంటున్నాడు. "చూడమ్మా! ఆ రోజు పార్టీలో నిన్ను కలిశాడు- నేత్ర అని గుర్తుందా"

 

    "ఉంది నాన్నా"

 

    "అతను యాదగిరి! సీక్రెట్ ఏజెంట్ వేషంలో వున్నాడు. మన గురించి ఏమీ చెప్పకు-"

 

    స్వర్ణ ఆశ్చర్యంగా "నేనెందుకు చెపుతాను? అసలు అతనెవరో పోలికలు కూడా గుర్తు లేవు" అంది.

 

    "మళ్ళీ అతను ఆ తరువాత నిన్ను కలుసుకోనే లేదా-?"

 

    "లేదే"

 

    "నిజం??"

 

    "నిజం నాన్నా! నీ కెందుకు అనుమానం వచ్చింది. అయినా నేనంత  ఫూల్ లాగా అతనితో ఎందుకు మాట్లాడతాను."

 

    యాస్బీఆర్ కి ఆమె చెపుతున్నది నిజమే అనిపించింది. కేవలం  తనని  మానసికంగా బలహీనం చెయ్యటానికే డిపార్ట్ మెంట్  ఈ నాటకం ఆడుతున్నట్టుంది. లేకపోతే తన ఎదురుగానే కూతురితో ఎందుకు ఆ పార్టీలో మాట్లాడతాడు?......

 

    అయినా ఈ విషయం అంత తేలిగ్గా వదలదల్చుకోలేదు అతడు. తనతోనే  జోకులేస్తున్న వాడిని ఓ పట్టుపట్టి చూడాలనుకున్నాడు. సెక్రటరీని పిల్చి  చెప్పాడు.

 

    "ఈ యాదగిరి గాడెవడో కాస్త  చూడు. సూటు బూటు వెయ్యగానే తోక జాడిస్తున్నాడు."

 

    సెక్రటరీ నమ్రతగా "రేపు సాయంత్రమే ఓ పదిమంది రోవ్దీల్ని ఏర్పాటు చేసి వాడి సంగతి చూస్తాను సార" అన్నాడు.

 

    
                                     *    *    *    

 

    "ఎందుకు రమ్మన్నారు....." అడిగింది హంసలేఖ.

 

    కారు వేగంగా వెళ్తూంది. దూరంగా కోట కనపడుతూంది.

 

    ఆ మాటకి నేత్ర  సమాధానం చెప్పకుండా, "నీకు కారు  డ్రయివింగ్ వచ్చా?" అని అడిగాడు.

 

    "నాన్నగారికి ఆక్సిడెంట్ చేస్తానని భయం"

 

    "మీ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటాను."

 

    ఆమె సమాధానం చెప్పలేదు.

 

    "నేను నేర్పనా?"

 

    "ఊ"

 Previous Page Next Page