Previous Page Next Page 
మరో ముందడుగు పేజి 30

 

    ఎంతకీ యతి రాకపోయేసరికి ఈసారి ఇల్లంతా తిరిగి చూశాడు - యతి కనపడలేదు. గాభరాగా "కమలా! యతి ఎక్కడికి వెళ్ళాడు, నీకేమయినా చెప్పాడా!" అన్నాడు. కమల అంతకన్నా గాభరాగా "లేదండీ! " "లేడా" ఎక్కడికి వెళ్ళిపోయాడు? అయ్యో! నిజంగా వెళ్ళిపోయాడా? మళ్ళీ వస్తాడేమో- " అంది.
    యతి వెళ్ళిపోయాడనుకొనే సరికి ఆ దంపతులిద్దరికీ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
    "నేను ఏం లోటు చేసానూ! ఎందుకు వెళ్ళి పోయాడూ? నా కుడి భుజం విరిగినట్లుంది. " అన్నాడు ప్రభాకర్ బేలగా.
    "వస్తాడండి - నన్ను చూడకుండా ఉండలేడు" అంది కమల ప్రభాకర్ కి ధైర్యం చెపుతున్నట్లు తనకు తను ధైర్యం చెపుకుంటూ.
    తన తల్లిదండ్రులిద్దరూ తన కళ్ళ ముందే యతి కోసం ఇలా బాధపడటం వేణు వంటికి కారం రాసినట్లుగా వుంది. అయినా యతి వెళ్ళిపోయినందుకు పరమానందంగా వుంది.  
    "అమ్మాయి కేమయినా తేలుస్తుందేమో? వుండు అడుగుతాను" అంటూ మయూర గదిలోకి వచ్చాడు ప్రభాకర్. ఆ పరిస్టితిలో మయూరకు ఆ విషయం చెప్పటం యెంత ప్రమాదమో , పాపం ! ప్రభాకర్ కి తెలియదు. ఎలాగైనా యతి జాడ తెలుసుకోవాలనే ఆరాటమే ఆయనకి. కానీ, అది మయూర కెలాంటి దెబ్బో బాగా తెలిసన వేణు అయన వెనకాతలే తనూ వచ్చాడు. ఆ ఆనందాన్ని మనసారా అనుభవించటానికి.
    "అమ్మా! మయూరా! యతి ఎక్కడకు వెళ్ళాడో నీకేమయినా చెప్పాడా?" మయూర మంచం దగ్గరగా వచ్చి ముందుకు వంగి నెమ్మదిగా అడిగాడు ప్రభాకర్.
    "ఆ!" అని అరిచింది మయూర.....మయూర అప్పుడున్న పరిస్థితిలో అది పిచ్చిదాని అరుపులా తోచింది ప్రభాకర్ కి. దెబ్బతిన్న పిట్ట అరుపని అర్ధమయింది వేణుకి మాత్రమే.
    "ఏం లేదులే! ఊరుకోమ్మా ఊరుకో!" బుజ్జగింపుగా మయూర భుజం తట్టాడు. కానీ, మయూర ముఖం అప్పటికే ఎర్రగా అయిపొయింది. చూపులు ఒకచోట నిలపాలని ప్రయత్నిస్తున్నా మనసుకి ఆ శక్తి లేక తీవ్రమైన బాధతో చలించిపోతున్నాయి అలా చెలించిపోతున్న చూపుల ముందు నిలించింది వేణు నవ్వు - పరమ పిశాచికమైన విజయ గర్వాన్ని సూచించే నవ్వు -
    "నో!" అని ఒక్క అరుపు అరిచి సొమ్మసిల్లి పడిపోయింది మయూర. ప్రభాకర్ డాక్టర్ కోసం పరుగెత్తాడు.
    తెలివిలేక కట్టేలా పడున్న మయూర శరీరాన్ని తృప్తిగా చూసుకున్నాడు వేణు.
    ఆ మరునాటికి మయూర మంచం మీద లేదు. ఆ ఇంట్లోనూ లేదు. నిలబడి నాలుగడుగులు వేయలేని స్థితిలో మయూర ఎక్కడికి వెళ్ళిందోమ ఎలా వెళ్ళిందో , ప్రభాకర్ ఊహకి కూడా అందని స్థితి.
    దట్టంగా వున్న ఆ అడవిలో చెట్ల ఆకుల సందుల గుండా సూర్యకిరణాలు సూటిగా వచ్చి డేరాల చిన్న చిన్న కిటికీల్లోంచి ముఖాల మీద పడేసరికి అబ్బా అమ్మా!" అంటూ వళ్ళు విరుచుకొంటూ లేచారు డేరాలో అందరూ. పక్క డేరాలో ఇంకా నిద్ర పోతున్నారు మరికొందరు. వీళ్ళు లేచి డేరాలోంచి బయటకు వచ్చేసరికి సూర్యోదయమయి చాలా సేపే అయిందని అర్ధమయింది. "అబ్బాయిలు! అమ్మాయిలూ నిద్ర లేవండి." అని గోలగా అరిచి వాళ్ళను కూడా నిద్ర లేపారు. అంతా కలిసి పన్నెండు మంది ఉన్నారు వాళ్ళు. ఎనమండుగురు అబ్బాయిలు, నలుగురు ఆడపిల్లలు. అడవులలో తిరగటానికి వీలుగా అందరూ పెంట్స్ తోనే వున్నారు. ఏదో నీటి పారుదల ప్రదేశం చూసుకునే, రాత్రి ఆగటం చేత కాలకృత్యాలకు ఇబ్బంది కలగలేదు. ఆడపిల్లలంతా పెద్దింటి పిల్లలే. చదువూ సంస్కారాలున్న వాళ్ళే! అరణ్య ప్రదేశం కావడం వల్ల ఎక్కడికి కదిలినా నలుగురు కలిసి కదిలేవారు. అందరి దగ్గరా రైఫిల్స్ వున్నాయి. వాటిని వుపయోగించే విధానము అందరికీ తెలుసు.
    కాలకృత్యాలు ముగించుకొని పన్నెండుగురూ బ్రేక్ ఫాస్ట్ కి కూచున్నారు. టిన్స్ లో చిన్న బిస్కట్స్ , బ్రెడ్ బటర్ మొదలైనవి ఓపెన్ చేశారు. టిన్స్ పై మూతలనే ప్లేటుగా వాడుతూ అది అందరూ ఉపయోగించుకొంటూ తినసాగారు.
    "నేను స్నానం చేస్తున్నప్పుడు అక్కడ ఒక అందమైన రాయి కనిపించింది. ఎంత అందంగా వుందో! షో కేసులో వుంచుకుంటే ఎంతో బాగుండేది! ఇంకా ముచ్చట పడిపోతూ అంది మనోహరి.
    "తెవలసింది మరి, మనదగ్గరున్న ఫుడ్ టిన్స్ రెండు క్రింద పారేసి ఆ రాయి మోసుకు పోయేవాళ్ళం" వెక్కిరింపుగా అన్నాడు హేమంత్.
    "అందుకే వదిలేశాను. ఇప్పటికే ఈ బరువు మోయ్యలేక చస్తున్నాను. ఇంకా రాళ్ళు కూడా ఎక్కడ మోయ్యగలం!"
    "బ్రహ్మాండమైన అడవిలో కొంతమంది మాత్రం మనుషులు , అతి కొద్ది పాటి ఆహార పదార్ధాలు , అలాంటప్పుడు రాసులకు రాసులు బంగారం కనిపిస్తుందనుకోండి అప్పుడు మనిషి బంగారం మోసుకుపోతాడా! ఆహారం మోసుకు పోతాడా! ఆలోచించండి."
    "ఇంచుమించు ఇలాంటి అయిడియా మీద ఈ మద్య ఎవరో నవల వ్రాశారు."
    "నాకు తెలుసు! నేను చదివాను. అందరూ ఒకరినొకరు చంపుకోటానికి ప్రయత్నిస్తారు.'
    "ఒక్కడు తప్ప. కానీ అతడూ చంపేస్తాడు . తనని తాను కాపాడుకోవటానికి. కానీ ఇక్కడ సమస్య అది కాదు. ఆహారం వుంది. బంగారం ఉంది. ఈ రెంటిలో ఒకటి మోస్తే మరొకటి మోయ్యలేదు. ఆ పరిస్థితిల్లో మనిషి యేది మోస్తాడు?"
    "మనిషి ఒక్కడే అయితే తప్పకుండా ఆహారమే మోస్తాడు. కాని మనిషి ఒక్కడే వుండదు. వుండలేడు. నలుగురిలో వుండాలనుకుంటాడు . అ నలుగురిలో  తానె ఎక్కువగా వుండాలనుకుంటాడు. ఈ రెండు లక్షణాలు మానవస్వభావంలో విడదీయరానంతలా కలిసిపోయి వున్నాయి. నలుగురున్నప్పుడు ప్రతి ఒక్కరి దృష్టి బంగారం మీదే వుంటుంది. ఆహారంతో పాటుగా బంగారాన్ని కూడా తరలించుకు పోవాలనే ఆశ ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. బలవంతుడైన వాడు ఆహారాన్ని చేజిక్కించుకుని మిగిలిన వాళ్ళను అర్ధకాలితో మాడ్చి వాళ్లతో బంగారం మోయించి చివరకు ఆ బంగారం కూడా తన అధీనం చేసుకుని పెత్తనం చెలాయిస్తాడు. ఈనాడు ప్రపంచమంతట జరుగుతున్న అన్ని అన్యాయాలకు అక్రమాలకూ బీజం ఇదే!" ఆలోచిస్తూ వ్యాఖ్యానిస్తున్నట్లు అన్నాడు ఉదయ్.
    "మిగిలిన వాళ్ళు అర్ధాకలితో వుంటేనేం? వాళ్ళంతా కలిసి బంగారం చేజిక్కించుకునే ఒక్కణ్ణి చితకతన్ని సుఖంగా ఆహారాన్ని, బంగారాన్ని అందరూ అనుభవించవచ్చు కదా!" ఉద్రేకంగా అంది మమత - ఉద్రేకంగా తల ఊపుతూ మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయి ఉంగరాల బాబ్డ్ హెయిర్ విచ్చల విడిగా ముఖం మీద పడుతూ ఉంటుంది -  చేత్తో తీసుకోవటానికి కూడా విసుగే ఆ అమ్మాయికి. పొగరుగా తల ఒక్కసారి పైకి ఎగరేస్తుంది జుట్టు వెనక్కి పడేలా!
    మమత మాటలకు తేజస్వి ఒప్పుకోలేదు. "నువ్వు సూచించింది పరిష్కార మార్గం కాదనను. కానీ అది సంపూర్ణ పరిష్కార మార్గం కాదు- మిగిలిన వాళ్ళంతా కలసి ఒక్కణ్ణి ఆణిచేస్తారు - అంతవరకూ చాలా తేలికే! మళ్ళీ వీళ్ళలో కొందరు మొదటి వాడిలాగే తయారవుతారు. కధ మొదటి కొస్తుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళను చంపాలి. వాళ్ళని వీళ్ళూ, వీళ్ళని వాళ్ళు చంపుకొంటూ పోవడమే నిరంతరంగా సాగుతుంది. ఇంత కంటే ఆ నలుగురు సంపూర్ణ మానవత్వంతో నిండైన మనుష్యుల్లా ప్రవర్తిస్తే ఇలాంటి సమస్యలు రానేరావు-
    "ఈ మనుష్యుల్లో సంపూర్ణ మానవత్వ కదండీ, మానవత్వం పూర్ణంగా - అంటే 'సున్నగా, వుంటుంది ' వాళ్ళను చావగొట్టి చెవులు ముయ్యకపోతే బుద్ది రాదు"  కోపంగా అన్నాడు విమల్!
    తేజస్వి ఒప్పుకోలేదు.
    "అలా అంటే ఎలా? ఇప్పుడు మనమే వున్నాం! పన్నెండు మందిమి బయలుదేరాం- ఇంతవరకూ ఎప్పుడైనా ఒకరికి దక్కకుండా మరొకరం ఏదైనా తినటానికి ప్రయత్నించామా?
    "నాకు తెలుసు, మీరేం , అనబోతున్నారో! మనలో వున్న సంస్కారం వాళ్ళలో లేదని? ఒప్పుకుంటాను, కాని ఆ సంస్కారమే కలిగించటానికి ఎందుకు ప్రయత్నించకూడదు తేజస్వి మాటలను ఖండిస్తూ రవి అందుకున్నాడు.
    "శరీరం మీద వ్రణం లేనప్పుడు ముందు ఆ వ్రణానికి శస్త్రచికిత్స చేసి ఆ తరవాత వ్రణం రావటానికి గల కారణాలను , నివారణోపాయలనూ ఆలోచిస్తాం! ఈ మహానుభావులకు సంస్కారం మెత్తని మాటలతో రాదు లెండి!"    

 Previous Page Next Page