"అది నన్ను ఏడిపిస్తుంది. దాన్ని నేను ఎడిపిస్తాను అన్నాడు ముద్దముద్దగా. ప్రభాకర్ ఆ మాటల పూర్తీ అర్ధం బోధపడలేదు. వేణు సమిపిస్తూనే మయూర భరించలేకపోయేదని అతనికి తెలుసు. కాలక్రమాన అదే సర్దుకొంటుందని అనుకున్నాడు. కానీ వేణు నీడ సోకినా వణికి పోయే మయూరను చూసి చాలా దిగులుపడ్డాడు. ఇటీవల అన్నీ సర్దుకు పోయాయేమోననే ఆశ కలిగింది. కానీ ఎవ్వరూ ఏమీ మారలేదు.
మయూరను నడిపించుకుంటూ లోపలి గదిలోకి తీసికెళ్ళి ఒక స్లీపింగ్ టాబ్లెట్ ఇచ్చి పడుకోబెట్టాడు. పసిపిల్లలా పడుకుంది మయూర. ఒకనాడు జీవం వుండీ లేనట్లుగా మయూర గడిపిన రోజులు గుర్తుకు వచ్చాయి. ప్రాణం వూసురుమంది.
తన గది తలుపులు తెరచుకుని బయటకు వచ్చింది కమల. ఆ భార్యా భర్తలిద్దరూ కొన్ని క్షణాలు ఒకరినొకరు చూసుకున్నారు. "కమలా! నువ్వు ఉండీ వాడిలా రెచ్చిపోతుంటే చూస్తూ కూచున్నావా?" అన్నాడు ప్రభాకర్.
కమల భరించలేకపోయింది. ఏడుస్తూ "ఏం చేయ్యమంటారండీ! ఒక్కనోక్క కొడుకు ! నా కళ్ళ ముందు వాడి బ్రతుకు సర్వనాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోవటం తప్ప ఏమి చెయ్యలేకపోతున్నాను. మీకు పుణ్యం వుంటుంది వాడిని కాపాడండి. నాకోసం కాపాడండి!" అంది.
విచిత్రంగా అందరిలో తానే అపరాధి నయినట్లు తోచింది ప్రభాకర్ కి. కమలను దగ్గరగా తీసుకుని ఓదార్పుగా భుజం తట్టాడు.
ముందు గదిలో సందడి తగ్గిపోయింది. అందరు చల్లగా జారుకున్నట్లున్నారు. వేణు ఏం చేస్తున్నాడో చూద్దామని వెళ్ళాడు ప్రభాకర్. సోఫా చేతిపైన తల ఆనించి కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు వేణు.
ఇదా? తన కొడుకు ఇంత ఖర్చు చేసి, ఇన్ని అవమానాలను సిద్దపడి సంపాదిస్తున్న సుఖం?
ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి.
మయూర మళ్ళీ మంచంలో పడింది. లోపలి గదుల్లో అయోమయ అవస్థలో వుంది. బయటి గదిలో వున్న యతి మనసులో మంటలు లేస్తున్నాయి. ఒక్కసారిగా ఆ గోడలన్నీ పగులగొట్టి, హడ్డులన్నీ చెరిపేసి మయూరను తన చేతులలో ఎత్తుకుని ఈ చికాకులకన్నిటికీ దూరంగా తీసుకు పోవాలని వుంది.
ఏం జరిగిందో తెలుసుకున్నాడు యతి. మయూరను హింసించటమే ధ్యేయంగా పెట్టుకున్న వేణు మయూర కళ్ళ ముందే బజారు ఆడవాళ్ళతో కులకాలని సంకల్పించినట్లున్నాడు. ఆ చర్యలోని పాశవికత మయూర మనసులో మానుతున్న గాయాన్ని కెలికి వుంటుంది. ఒకనాడు ఏ దెబ్బకు తట్టుకోలేక మతి కోల్పోయిందో ఆ స్మృతులను కెలికి వుంటుంది.
భగవాన్!........రెండు చేతులతో తలపట్టుకుని తనను తాను అదుపులో వుంచుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు యతి. ఇది అన్యాయం! దారుణమైన అన్యాయం. సంఘమూ, పెద్దలూ, న్యాయమూ , నీతి అన్నీ కలిసి మానవత్వానికి చేస్తున్న అన్యాయం! ఈ సంప్రదాయాలూ, నీతి నియమ నిబంధనలూ ఒక జీవితం కంటే విలువైనవా? ఒక సుకుమారమైన మనసు నిష్కారణంగా ఇలా నలిగిపోయి ఉన్మాద దశకు చేరుకుంటూ ఉంటే పరిష్కారం తెలిసి కూడా సంఘానికీ. ఆ సంఘం అనుసరించే నీతికి భయపడి చేతులు కట్టుకు కూచోవలసిందేనా? ఆ తరువాత ఉన్మాదినిగా మారిన మయూరను చూసి "ఖర్మ" అని తల పగులగొట్టు కోవలసిందేనా?
బోనులా సింహంలా రొప్పుతూ అటూ ఇటూ తిరుగుతున్నా యతి ముందుకు వచ్చి నిలబడ్డాడు.
"నువ్వు పశువ్వి!" అరిచాడు యతి.
"హుష్! అరవకు, నాన్న ఇంట్లో వున్నారు."
యతి ఒక్కసారిగా చల్లబడిపోయాడు. వేణు నవ్వుతున్నాడు. ఏం నవ్వు అది! రోము నగరం తగలబడుతుండగా చూస్తూ నీరో అలానే నవ్వుకున్నాడెమో! కొంతమంది శాడిస్ట్ లు తాము ప్రేమించిన స్త్రీ శరీరాన్ని సిగరెట్లతో కాల్చి ఆ బాధతో పాపం వాళ్ళు విలవిల లాడుతుంటే చూసి అనందిస్తారట! ఆ నవ్వు ఇలాగే ఉంటుందేమో! ఆ చూపుల నిండా అల్పత్వం! క్రౌర్యం! పాశవికత! అధమాధమ వ్యక్తిత్వపు వికారం! "మిస్టర్ యతి! నేను పశువునా? అవును. పశువును చేస్తున్న దేవరో తెలుసా ? నువ్వు."
"నేనా!"
"అవును! అవును! అవును! రాస్కెల్! ఏం తెలియనట్లు నటిడ్డామను కొంటున్నావా! నేను పశువునే కాని చవటను కాదురా! నీలా డిగ్రీలు లేకపోవచ్చును కాని వాజమ్మను కాదురా! నువ్వు నా భార్యను ప్రేమిస్తూ ఇక్కడ కూచుంటే నేను చూస్తూ ఆనందిస్తూ పరవశించి పోతానాను కొంటున్నావటరా! నీకు సకల సేవలు చేస్తుందా? ఒరేయ్! మీ ఇద్దరినీ నా కాలి కింద నల్లుల్ని నలిపి పారేసినట్లు నలిపి పారేస్తా కాని మిమ్మల్ని సుఖపడ నియ్యనురా! అర్ధమయిందిరా నేనేలాంటి పశువునో!"
పళ్ళు పటపటా నూరుతూ వికృతంగా వున్న ఆ ముఖం చూస్తే ఎవరికయినా అర్ధమయి పోతుంది. ఆ మనిషి పశువు మాత్రమే కాదు, రక్షసుడని?
యతి ఉద్రేకం పెరిగిపోతోంది.
"పశువా! నీలాంటి పశువులకూ, పిశాచాలకూ నేను భయపడను. మయూరను ఇప్పుడే, ఈ క్షణమే నాతొ తీసుకు పోతాను! ఏం చేస్తావో చేసుకో!" వేణు నవ్వాడు. అదే పైశాచికపు నవ్వు! ఎదుటి వాళ్ళను హింసించి అనందం పొందే నవ్వు.
"మైడియర్ బ్రదర్! ఎవరి మంచితనం ఆధారంగా నువ్వు ఈ కప్పు కింద నిలవగలుగుతున్నావో వారి మంచితనం ఆధారంగానే నేను మిమ్మల్ని చిత్ర వధ చేస్తాను. మయూర లోపలి గదిలో వుంది. నాన్నగారి పర్యవేక్షణలో వుంది. అక్కడికి నాన్నగారు ఎవ్వరినీ నన్ను కూడా రానియ్యటం లేదు డాక్టర్ సలహాను పాటించి. అక్కడికి ఎలా వెళ్తావో వెళ్ళు." ఏం చెప్తావో చెప్పు. మయూర మతి లేని స్థితిలో వుంది. ఈ స్థితిలో నువ్వు బలాత్కారంగా మయూరను తీసుకుపోతే సంఘమూ, చట్టమూ నిన్ను, దాన్ని ఇద్దరినీ శిక్షించి దాన్ని నా కాళ్ళ ముందు విసిరి పారేస్తాయి. అప్పుడు ఇంతకు పదింతలుగా కసి తీర్చుకుంటాను. అంచేత నువ్వు అలాంటి వెధవ పనులెవి చెయ్యలేవు. నువ్వు నిజంగా మయూర మేలుకోరితే నువ్వు చెయ్యగలిగే పని ఒక్కటే వుంది."
అదేమిటని యతి అడగలేదు వేణుతో మాట్లాడాలంటే అతనికి అసహ్యంగా వుంది. వేణు తనే చెప్పాడు.
"నువ్వుపో! ఇక్కడి నుంచి నువ్వు వెంటనే పో! అలా అయినా, మయూర అలా మంచంలో పడి ఏడుస్తూ ఉంటుంది. కనీసం ఆ మాత్రం కరుణిస్తాను. అలా కాక నువ్వు ఇక్కడే ఉన్నావంటే మయూరను పిచ్చిదాన్ని చేసేస్తాను. జట్టు పీక్కుంటూ ఏడుస్తూ రోడ్ల మీద తిరిగే పిచ్చిదాన్ని చేసేస్తాను. పో! నువ్వు పో"
ఉద్రేకంలో పళ్ళు పటపట కొరుకుతూ యతి ముఖం మీదికి పిడికిలి బిగించి ఊపి గిర్రున తిరిగి వెళ్ళిపోయాడు వేణు .
యతి నవనాడులు కృంగిపోయాయి. తనకు ప్రత్యర్ధి వేణు ఒక్కడే అయితే సునాయాసంగా ఎదుర్కో గలిగే వాడు కానీ, అక్కడ ప్రభాకర్ ఉన్నాడు. దుర్మార్గాన్ని ఎదుర్కోవటం అంత తేలిక కాదు, మంచితనాన్ని ఎదిరించటం. వేణు అన్నంత పని చేస్తాడనటంలో ఏమి సందేహం లేదు యతికి. మయూర జుట్టు పీక్కుంటూ ఏడ్చుకుంటూ వీధుల వెంట తిరగటం ..........ఊహ మాత్రంగా కూడా ఆ దృశ్యం భరించలేక నిలువునా వణికాడు యతి. ఆ రాత్రంతా అతడు నిద్రపోలేదు - అయినా ఏం లాభం? మయూర దరిదాపులకు వెళ్ళే అవకాశం కూడా అతనికి లేదు. మౌనంగా ఆ ఆత్మ ఏది అర్దిస్తుందో, అది అందించగలిగే స్థితిలో లేడు - ఒక్కసారి నెమ్మదిగా తలుపులు తోసి లోపలికి చూసాడు. - చిరుత పులి కళ్ళలా తీక్షణంగా వున్న వేణు చూపులు కనిపించాయి. తాగి, తాగి ఎర్రగా వున్నాయి ఆ చూపులు. ఇక లాభం లేదు ఈ దుర్మార్గుడు తననేమీ చెయ్యలేక అక్కసంతా ఆసహయురైన మయూర మీద తీర్చుకుంటాడు. ముందు మయూర కోలుకోవాలి. అదే ప్రధానంగా ఆలోచించవలసిన విషయం. మిగిలిన సమస్యలన్నీ ఆ తర్వాత ఆలోచించు కోవచ్చు.
అప్పటికప్పుడు తన సామానులన్నీ సర్దుకుని, మయూర పడుకున్న గది దిక్కుగా చీకట్లోకి నిరాశగా చూసి, ఆ యిల్లు వదిలి వచ్చేశాడు.
తెల్లవారింది ఉదయమే పేపర్ చదవగానే , అ రోజు విశేషాలు యతితో చర్చించటం ప్రభాకర్ కి అలవాటు! అలాగే పేపర్ చేత్తో పట్టుకుని యతి గది ముందుకి వచ్చి "యతీ! చూసావా...." అంటూ ఆగిపోయాడు. యతి గదిలో లేడు- అచ్చమైన మంచితనం తప్ప కుత్సితాలు తెలియని అయన మనసు గదిలో యతి సామానులు లేవనే విషయాన్ని గమనించనే లేదు. ఎక్కడికో వెళ్ళి ఉంటాడనుకొని, మళ్ళీ వాలు కుర్చీలో కూచుని దేశంలో నానా చికాకుగా ఉన్న రాజకీయల గురించి ఆలోచించసాగాడు. జంషెడ్ పూర్ లో అల్లర్లు, హత్యలు! కొట్లాటలు! ప్రత్యెక కోర్టుల బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు- ఆందోళనలు! అల్లర్లు.....అంతే! నిజంగా దేశానికి ఏం కావాలో ఆలోచించేవాడు లేడు. కమిషన్లూ కోట్ల ఖర్చు.....సాధించేది శూన్యం! శూన్యం! శూన్యం!