Previous Page Next Page 
వెన్నెల్లో గోదారి పేజి 28


    
    చాలా వేగంగా ప్రయాణం చేయగల శక్తి వంతమైన ఈ రూమరు సహజంగా చుట్టుప్రక్కల గ్రామాలకి కూడా త్వరత్వరగా వ్యాప్తిచెందింది. ఒకరిద్దరు నా వద్దకు వచ్చి తరళ తండ్రిని ఎదిరించైనా సరే, ఈ వివాహం చేసుకొమ్మని సలహా ఇచ్చారు. ఈ ఒకరిద్దరే తరళ తండ్రివద్దకు వెళ్ళి నా గురించి చెడుగా చెప్పి, వీలైతే నన్ను కొట్టించమని కూడా సలహా ఇచ్చి వుంటారని నేను వూహించగలను.
    
    ప్రమద్వర చెప్పిన మాటలు వినకపోవటంలో గల తప్పు నాకిప్పుడే అర్ధమవుతోంది. తరళకి ఈ విషయం ముందే చెప్పేసి వుంటే ఈ గొడవ లేకపోవును. ఆమె అన్నట్టు- గోటితో పోయేదాన్ని గొడ్డలివరకూ అనవసరంగా తెచ్చుకున్నాము.
    
    ఎంతయినా కానీ, నేను చేసినదాన్లో తప్పు లేదని నాకు తెలుసు. తరళ అడగందే "నేను నిన్ను ప్రేమించటంలేదు" అని ఎలా చెప్పటం? ఆ అమ్మాయి ఏ మాత్రం తెలివైనదయినా వెంటనే గ్రహించేలా వుంది. ఆ మాత్రం తెలివితేటలుంటే తరళ ఎందుకవుతుంది?
    
    నేనింక ఈ విషయాలు ఏమీ పట్టించుకోదల్చుకోలేదు. ఆ అమ్మాయి గోదాట్లో దూకనీ, సముద్రంలో దూకనీ నా కనవసరం. ప్రమద్వరని వివాహం చేసుకుంటే మా రూమర్లన్నిటికీ ఆనకట్ట పడుతుంది.
    
    తన ప్రేమకి ఫ్రేముకట్టి వూరంతా ప్రచారం చేసుకోవటం తరళ తప్పు నా దగ్గిర కనీసం ఒకమాట కూడా చెప్పకుండా ఈ హడావుడంతా ఎవరు చేయమన్నారామెని?
    
    ఇవన్నీ ఆలోచించి చివరికి ఓ నిర్ణయానికొచ్చి ప్రమద్వరకి ఉత్తరం వ్రాశాను. సాయంత్రం గుడికి రమ్మనీ, అక్కడ పెళ్ళి చేసుకుందామనీ ఒక్కసారి ఈ తంతుకాస్తా జరిగిపోతే మిగతా విషయాలన్నీ వాటంతట అవే సర్దుకుంటాయని నాకు తెలుసు.
    
    ఆ రోజు నా ఆరోగ్యం కూడా అంతగా బాగోలేదు. రెండ్రోజుల్నుంచి బాగా దగ్గు వస్తోంది. పెళ్ళయిన మరుక్షణం నుంచీ సిగరెట్స్ మానెయ్యాలి.
    
    ప్రొద్దున్నే పొరుగూరికి వెళ్ళి అక్కడి పురోహితుడిని రమ్మని చెప్పాను. ఈ వూరివాడయితే కొన్ని ప్రమాదాలున్నాయని నాకు తెలుసు. మరుసటిరోజు నుంచీ శలవు పెట్టాను.
    
    వివాహం అవగానే ఈ వూరినుంచి కొద్దికాలం బయట తిరిగి రావాలి. నాకు ఫర్వాలేదుగానీ, ఈ గ్రామ ప్రజల్ని ప్రమద్వర తట్టుకోలేదు.

    సాయంత్రం అయిదయింది. ఇక గుడికి వెళ్దామని అనుకుంటూ వుండగా- అప్పుడొచ్చింది గుండెల్లో నొప్పి... సన్నగా.
    
    ముందు దాన్ని అంతగా పట్టించుకోలేదు గానీ, సమయం గడిచేకొద్దీ అది ఎక్కువ అవసాగింది. ఇక భరించలేక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను.
    
    ప్రమద్వర ఈ పాటికి గుడికి వెళ్ళి వుంటుందని అనుకున్నాను. డాక్టర్ దగ్గర్నుంచి త్వరగా బయటపడాలన్న నా కోర్కె సులభంగా తీరలేదు.
    
    దాదాపు గంటసేపు పరీక్షలు జరిపాడు.
    
    అప్పటికి ఆరున్నర అయింది.
    
    డాక్టరు రిజల్టు మరుసటిరోజు చెప్తానన్నాడు. నేను దాని గురించి అంతగా పట్టించుకోలేదు. బాగా నీరసంగా వుంది. అయినా వురుకులూ పరుగులుమీద గుడికి వెళ్ళాను.
    
    ప్రమద్వర లేదు. లోపల పూజారి ఒక్కడే ఉన్నాడు. అతఃదిని పలకరించాను. మాటల్లో ఎక్కడా ప్రమద్వర వచ్చి వెళ్ళిపోయినట్టు అతడు చెప్పలేదు. పేరు చెప్పకుండా విషయం రాబట్టటానికి ప్రయత్నించాను. ఆ గుడికి చివరి భక్తుడు వచ్చి వారం రోజులు అయిందనీ, జీవనం కష్టంగా ఉందని, సోదంతా చెప్పుకొచ్చాడు పూజారి.

 

    ఏడున్నర అయింది. ప్రమద్వర రాలేదు.
    
    బహుశా భయపడి వుంటుంది. ఆ అమ్మాయి భయాన్ని అర్ధం చేసుకోగలను. గుడినుంచి బయటకొచ్చి, అక్కడే వేచివున్న పురోహితుడ్ని వెళ్ళిపొమ్మని, ప్రమద్వర ఇంటికి బయల్దేరాను. నాకు తనమీద కోపం రాలేదు. ఎంతో ధైర్యం వుంటే తప్ప ఇంటినుంచి, ఒక ఆడపిల్ల ఒంటరిగా బయటపడటం అంత సులభం కాదు. అయినా ఇంత చాటుగా, ఏదో తప్పుచేసినట్టు పెళ్ళి చేసుకోవలసిన ఖర్మ నాకేం పట్టింది అనిపించింది.
    
    రోడ్డుమీద నడుస్తూవుంటే ఎదురుగా మోపెడ్ మీద డాక్టర్ వస్తూ కనిపించాడు.
    
    నన్ను చూడగానే మోపెడ్ ఆపి, "మీ గురించే అర్జెంటుగా వస్తున్నాను" అన్నాడు. 'విషయం ఏమిటి' అని అడిగాను అక్కడ చెప్పకుండా క్లినిక్ కి తీసుకెళ్ళాడు.
    
    అక్కడ ఇంకో డాక్టర్ ఉన్నాడు. ఆయన్ని పరిచయంచేస్తూ "పట్నంలో ఈయన కార్దియాలజిస్టు- నా స్నేహితుడు లక్కీగా ఈ రోజు వచ్చాడు. మీ రిపోర్టులు చూస్తే నాకు అనుమానం వచ్చింది. ఈయనకి చూపించాను. మీరొకసారి పట్నం వెళ్ళి చూపించుకుంటే మంచిదని ఈయన అభిప్రాయపడుతున్నాడు" అన్నాడు.
    
    "ఏమిటి మీ అనుమానం?" అని అడిగాను.
    
    ఆ కార్డియాలజిస్టు ఇబ్బందిగా చూస్తూ "పరీక్షలైన తరువాత ఒక నిర్ణయానికి రావటం మంచిది" అన్నాడు. "విషయాన్ని నేను అర్ధం చేసుకోగలను- చెప్పండి" అన్నాను.
    
    "గుండెకి చిన్న రంధ్రం ఏర్పడిందేమో అని అనుమానంగా ఉంది" అన్నాడు. తేలిక భాషలో నాకు అర్ధమయ్యేలా చెప్పటానికి ప్రయత్నిస్తూ ఈ పల్లెటూళ్ళల్లో అలా చెప్తేగానీ అర్ధంకాదని అనుకుని వుంటాడు ఆయన. కానీ నేనూ సైన్సు చదువుకున్నాను. కార్దియల్ డిజార్డర్ గురించి అర్ధంచేసుకోగలను.
    
    నా కాళ్ళకింద భూమి కదులుతున్నట్టు అనిపించింది. ఆ గదిలో వస్తువులు గిర్రున తిరుగుతున్నట్టు కనిపించాయి.
    
    "చిన్న ఆపరేషన్ తో తగ్గిపోతుంది. ఫర్వాలేదు" అంటున్నాడు డాక్టర్. రాదని నాకు తెలుసు.
    
                                         10
    
    ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. డాక్టర్లు పూర్తిగా చెప్పక పోయినా నాకు తెలుసు. మరణం అతి సమీపంలో వుంది. చేతులుసాచి పొంచివుంది.... నాకు భయం వెయ్యటంలేదు. ఎవరైనా ఆ మృత్యువు ఒడిలోకి చివరకు చేరుకోవలసిందే. నా ఆలోచన్లన్నీ ప్రమద్వర చుట్టూనే తిరుగుతున్నాయి. పాపం ఆ అమ్మాయి జీవితాన్ని నేనే నాశనం చేశాను. ఆశలు పెంచి చివర్లో తృంచివేశాను.
    
    ఒకందుకు నాకు సంతోషంగా వుంది. ప్రేమ పేరిట మేము తొందరపడలేదు....ఆమె మలినం కాలేదు..... ఇప్పుడు నేను చేయవలసింది ఒకటే. జరిగిన వాస్తవం ఆమెకు జీర్ణమయ్యేలా నచ్చచెప్పటం. ఆమె నా నుంచి మరొకరితో వివాహానికి వప్పించటం. ఇది కష్టమయిన పనైనా అసాధ్యమైనది కాదు.

 Previous Page Next Page