ప్రమద్వర ఇంటి పరిస్థితులు నాకు తెలుసు. ఆమె చుట్టూ రాబందులు కాచుకుని వున్నాయి. వాటినుంచి ఆమెని తప్పించి, ఒక ఇంటిదాన్ని చేస్తే మరణం ముందు నా జీవితానికి ఒక సార్ధకత లభిస్తుంది.
ఆ తరువాత కొంచెం సేపటికి ఆమెని కలుసుకున్నాను.
డాక్టర్లు చెప్పింది ఆమెకి వివరించాను.
రెండుచేతులూ వళ్ళో పెట్టుకుని, తలవంచుకుని కూర్చుని నేను చెప్పినదంతా మౌనంగా, నిశ్శబ్దంగా వింది. ఆమె మొహంలో మారే భావాల్ని ఆ మసకనీడల మధ్య నేను గమనించలేకపోయాను. అంతా విన్నాక కూడా ఆమె మౌనంగానే వుండిపోయింది. ఆ నిశ్శబ్ధాన్ని చీలుస్తూ అన్నాను. "ప్రమద్వరా- నేను కోరేది ఒకటే నువ్వు ఎవర్నైనా వివాహం చేసుకో".
ఆమె చిన్న స్వరంతో "చేసుకుంటాను ఎవర్నో కాదు, మిమ్మల్నే..." అంది. నాకు ఆమె చెపుతున్నది అర్ధంకాక "ఏమిటీ" అన్నాను ఆమె తిరిగి ఆ మాటల్నే చెప్పింది.
"నేను ఎన్నో దినాలు బ్రతకను ప్రమద్వరా-"
"నేనూ అంతే".
"నువ్వేం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా నీకు?"
ఆమె తలెత్తి అన్నది- "నా ప్రేమ లైలా పార్వతీలంత గొప్పది కాకపోవచ్చు. కానీ మీరు లేని లోకంలో నేనూ వుండను".
"చాలా చిన్న పిల్లలా, తెలిసీ తెలియని వయసులో సినిమాలు చూసి మాట్లాడే ఆడపిల్లలా మాట్లాడుతున్నావు నువు-"
"మీరేమయినా అనుకోండి. నా నిర్ణయం మారదు".
"కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించు".
"ప్రాక్టికల్ గా ఆలోచించే చెపుతున్నాను, మీరేగానీ నా జీవితంలోకి రాకపోయివుంటే నా తల్లి, నా మావయ్య కలిసి నా బ్రతుకు ఏనాడో కుక్కలు చింపిన విస్తరి చేసి వుండేవారు. మీ స్నేహమే నన్ను వారి కెదురుగా ధైర్యంగా నిలబెట్టింది. ఇప్పుడు మీరు కాదంటే నన్ను వాళ్ళు కబళించి వేస్తారు-"
"అందుకని ఏం చేస్తావు ప్రమద్వరా?"
"మనం ఈ ఊరునుంచి వెళ్ళిపోదాం. నాకేదో ఒక చిన్న ఉద్యోగం దొరక్కపోదు. సాధ్యమయినంతలో మీకు వైద్య సహాయం జరిగేలా చూద్దాం".
నాకు నవ్వొచ్చింది. ఈ సర్జెరీకి "సాధ్యమైనంతలో" అన్న పదం లేదు. అది జరుగుతే బ్రతుకుతాను. జరక్కపోతే బ్రతకను అంతే! "నే నొకటి చెపుతాను వింటావా?"
ఏమిటన్నట్టు చూసింది ప్రమద్వర.
"నువ్వు మీ ఇంట్లోంచి బయటపడటం చాలా ముఖ్యం. నేను బ్రతికి వుండగానే అది జరగాలి. నీకు మంచి సంబంధం చూస్తాను".
ఈసారి ఆమె నవ్వింది. ఆమె వివాహం జరగటం నా సర్జెరీకి ధనం సమకూర్చగలగట మన్నంత కష్టసాధ్యమని, ఆమె నవ్వుకి అర్ధం కాబోలు. నాకు ప్రపంచంమీద కసిగా వుంది. మరణం గురించిన వార్త వల్ల వచ్చిన కసికాదు అది. ఒక మంచి అమ్మాయి, చదువుకున్నది-తన కులవృత్తిలోంచి బయటపడి గృహిణిగా మారడానికి ఇన్ని అడ్డంకులా, అన్న బాధవల్ల వచ్చిన కసి అది, ప్రతిదానికీ డబ్బు కావాలి. ఆమె వివాహానికీ, నా జబ్బు నయం కావటానికీ- అన్నింటికీ డబ్బే ప్రధానం.
ఆమె సమస్యని నేను తీర్చలేను.
నా సమస్య ఆమె తీర్చలేదు.
ప్రేమ ఎంతో గొప్పదనీ, ఎన్నో పరీక్షలకు అది నిలుస్తుందనీ చరిత్రకారులు నిరూపించారు. అది ఎంత అవాస్తవికమో ఇప్పుడు అర్ధమవుతూంది.
"నేనొక విషయం అడుగుతాను చెబుతారా?"
"ఏమిటి ప్రమద్వరా?"
"మనం అనుకున్నట్టుగానే సరీగ్గా సమయానికి ఆ గుళ్ళో కలుసుకున్నా మనుకోండి. మన వివాహం జరిగిపోయి వుండేది. ఆ తరువాత మనకి ఈ విషయం తెలిసి వుండేది. అవునా?"
"అవును అయితే?"
"ఇప్పుడదే జరిగిందనుకుందాం మనం పెళ్ళి చేసుకుందాం"
"మన వివాహం జరగటం దేముడికి ఇష్టంలేకే, నిన్ను గుడికి ఆలస్యంగా రప్పించాడేమో!"
ఆమె ఏదో అనబోతూ వుంటే ఆపుచేసి, "ఇంకా ఈ వాదనలన్నీ అనవసరం ప్రమద్వరా! జరిగిందేదో మన మంచికే జరిగిందనుకుందాం. ప్రేమించటం దైవత్వమైతే అవ్వొచ్చేమోగానీ, మరణించేముందు వివాహం ఆ ప్రేమకు పరాకాష్ట అనుకోవడం మూర్ఖత్వం నాకున్న ఈ కొద్ది జీవితకాలంలో నేను నీ జీవితానికి ఏం చేయగలనా అన్నది ఆలోచించుకోనీ" అన్నాను దృఢంతా.
ఆమె లేచి నిలబడి, అంతే స్థిరమైన కంఠంతో "నేను చెప్పేది మీరుకూడా వినండి, నా ప్రేమ మీద మీకు మొదటి నుంచీ అంత పెద్ద నమ్మకం లేనట్టుంది. మిమ్మల్ని తప్ప ఇంకెవర్నీ నేను చేసుకోను. ముల్లోకాలూ ఏకమైనా సరే-" అంది.
"అదే మూర్ఖత్వమంటే."
"మీరు దానికి ఏమైనా పెట్టుకోండి" అని అక్కన్నుంచి వెళ్ళిపోయింది.
నేనొక్కన్నే మిగిలాను చీకట్లో.
గది నిశ్శబ్దంగా వుంది.
ఎంతసేపలా కూర్చొని వున్నానో తెలీదు.
గుమ్మం దగ్గిర అలికిడైతె తలెత్తి చూశాను. తరళ తండ్రి!!!
"ఏమిటి అలా చీకట్లో కూర్చున్నావ్?" లైటువేస్తూ అడిగాడు. నేను సమాధానం చెప్పలేదు. ఆయన ఆ సమయంలో రావటం చాలా ఆశ్చర్యంగా వుంది.
ఆయన నా సమాధానం కోసం వేచి చూడకుండా, "తరళ గోదాట్లో దూకినప్పటి నుంచీ ఈ వూర్లో తలెత్తుకు తిరగలేకపోతున్నాను. ఆ విషయం నీకు తెలిసే వుంటుంది" అన్నాడు ఉపోద్ఘాతంగా.
ఆయన ఈ ఊర్లో ఎలా తిరుగుతున్నాడో నేను చూడలేదు. కాబట్టి దానికి కూడా సమాధానం చెప్పలేదు.
"ఈ వివాహం ఎలా చెయ్యాలా అని నేను మధనపడుతూ వచ్చాను. నా కూతురు అడిగిన దానికి నేనెప్పుడూ కాదనలేదు ఇంతవరకూ".
"ఇదంతా మీరిదివర కొకసారి చెప్పారు నాకు".
"చెప్పాను కానీ అప్పుడు నా అవసరం కోసం చెప్పాను. ఇప్పుడు నీ కోసం చెపుతున్నాను".
"నా కోసమా? ఏమిటది?"
"ఇప్పుడే డాక్టర్ చెప్పాడు నీ గుండెజబ్బు సంగతి".
మైగాడ్- ఎంత వేగంగా పాకిపోతోంది ఈ సంగతి.
"చూసేరా ఎంత అదృష్టవంతులో మీరు. తొందరపడి ఈ వివాహం జరిపివుంటే పసుపు కుంకుమలకు దూరమైన కూతుర్ని నట్టింట్లో జీవితాంతం చూస్తూ గడపవలసి వచ్చేది" అన్నాను.