విశ్వనాథం, సంపత్ ల ప్లాన్ ని కథలు కథలుగా పత్రికలు ప్రకటించాయి. యదార్థ సంఘటనల "ఆధారంగా" నవలలు వ్రాసే రచయితలకి అప్పుడే రకరకాల ప్లాట్సు దొరికినయ్. రవిశాస్త్రికి ప్రమోషన్ గ్యారంటీ అనుకున్నారు అందరూ. సిగ్మా ఇన్వెస్టుమెంట్సు మూతపడింది.
విద్యాధరికి ధర్మారావు చాలా దగ్గిర అని అంతకుముందు బయటకొచ్చిన రూమరు ఒక రకంగా హెల్ప్ చేసింది. మరో పెద్ద కంపెనీ ఆ మరుసటిరోజే ఆమెని ఎక్కువ జీతంమీద ఉద్యోగంలోకి తీసుకుంది. నాలుగురోజుల్లో ఇంత మార్పుని ఆ అమ్మాయి అతికష్టంమీద జీర్ణించుకోగలగుతూంది.
ఇంత ఆనందంలోనూ ఆమెకి అర్థంకాని విషయం ఒకటుంది. తనకి దొరకని "బెయిలు" సంపత్ కీ, విశ్వనాథానికీ వెంటనే దొరికింది. ఎప్పటికో వారిమీద ఛార్జిషీటు ఫైలు చేస్తారు. అప్పటివరకూ వాళ్ళు స్వేచ్చగా తిరగొచ్చు. ఎంత గమ్మత్తయిన చట్టం ఇది- అనుకుంది. ఆ విషయం అక్కడితో మర్చిపోయింది.
ఆమెకి తెలియని విషయం ఏమిటంటే -సంపత్, విశ్వనాథాలు ఖాళీగా లేరని- చట్టపు పరిధిలో ఒక్కొక్క సాక్ష్యాన్నే ఎలా మాయం చెయ్యాలని పథకం వేస్తున్నారనీ- అన్నిటికన్నా పెద్ద సాక్ష్యం తనేనని!!
* * *
జూన్ 10
6-00 పి.యం.
పబ్లిషింగ్ హౌస్.
విద్యాధరి షాపులోకి ప్రవేశించి, "పుస్తకం వచ్చిందా" అని అడిగింది.
"రాలేదమ్మా. ఇంకొక్క రెండు పేజీలున్నవట. ఇంకో రెండ్రోజుల్లో పోర్తవుతుందట. ప్రొద్దున్నే ఫోన్ వచ్చింది".
"క్రితం నెల అడిగితే వచ్చేవారం వస్తుందని అన్నారు".
"చెప్పానుకదమ్మా ఇంకా రాయాల్సిందేదో మిగిలిపోయిందట".
విద్యాధరి మనోహరంగా నవ్వి, "ఇంతకీ దేని గురించట ఆయన వ్రాస్తున్నది?" అనడిగింది
"ప్రేమరాహిత్యం గురించి".
ఆమె మొహంలో నవ్వు మాయమైంది. మ్లానమైన వదనంతో మెట్టు దిగి వెళ్ళిపోయింది. ఆమెలో ఆకస్మిక మార్పుని షాపు యజమాని అర్థంకానట్టు చూశాడు.
గదికొచ్చి అలాగే పక్కమీద వాలిపోయింది. అప్పటివరకూ వున్న అనందం పోయింది. తండ్రి.... తల్లి, యజమాని.... అతడి కొడుకు.
ఆమె దృష్టి బల్లమీద వున్న పుస్తకంమీద పడింది. 'థ్రిల్లర్...' అట్ట మెరుస్తూంది. ఒక చేపలాటి జంతువు- (అది ప్రేమ రాహిత్యమా?) లోంచి ఒక అమ్మాయిని బయటకు లాగుతున్నాడు ఒక యువకుడు. ఆమెకి పబ్లిషర్ చెప్పిన-
"రెండ్రోజుల్లో పూర్తి అవుతుందట" అన్న మాటలు గుర్తొచ్చాయి.
ఆమె పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుని.
ఆఖరి రెండు పేజీలు ఖాళీగా వున్నాయి.
ఆమె కూర్చుని వ్రాయసాగింది.
"ఏముంది వ్రాయటానికి? ప్రేమలాగే ప్రేమరాహిత్యం కూడా వ్యర్థమైన పదమే! మనిషి తన సిద్ధాంతాలతో 'కూటములు' తయారు చేస్తాడు. తనని ప్రేమించే వారందరూ ఒక కూటమి. తనని ద్వేషించే వారందరూ వేరొక కూటమి. ఒకే నాణేనికి రెండువైపులా ఉన్న బొమ్మ-బొరుసుల్లా, ప్రేమ- ద్వేషం అన్నవి ఎంత దగ్గరగా వున్న వ్యతిరేక పదాలు... తనతో ఏకీభవిస్తే ప్రేమ, లేకపోతే ద్వేషం... అంతే".
ఆ పేజీ పూర్తయింది.
ఆ పుస్తకంలో ఇంకొక్క కాగితం మిగిలింది!
టక్... టక్---!
మళ్ళీ తలుపు చప్పుడు.
సర్దుకుని వెళ్ళి తలుపు తీసింది.
ఎదురుగా ఇన్ స్పెక్టర్ రవిశాస్త్రి.
"ఏమ్మా, బాగున్నావా?"
"మీరా? రండి, రండి" అంటూ ఆహ్వానించింది.
కొంచెంసేపు మామూలు సంభాషణ జరిగాక అతడు జేబులోంచి క్యాసెట్ తీసి అందిస్తూ "అనుదీప్ ఇచ్చాడు. దీన్ని... వినమని..." అన్నాడు.
ఆమె మొహం చిట్లించింది. "మీకు తెలుసా అతను-"
"తెలుసు" క్లుప్తంగా అన్నాడు.
"అతనికోసం ధర్మారావుగారు వెతికిస్తున్నారు".
శాస్త్రి జవాబు చెప్పలేదు. అడవుల్లో అతడి తపస్సు గురించి తనకే నమ్మశక్యం కాలేదు. చెప్తే ఈమెక్కడ నమ్ముతుంది?
"అతడు మళ్ళీ ఎక్కడైనా కనపడితే ధర్మారావుగారికి చెప్పండి. ప్రేమ, ప్రేమ అని చాలా సతాయిస్తున్నాడు" అంది.
ఏదో తెలియని ఉద్వేగం అతడిని ఆవహించింది. అతడి గురించి సత్యం తెలిస్తే ఈ అమ్మాయి ఇలాగే మాట్లాడగలుగుతుందా! అతడు లేచి నిలబడ్డాడు.
ఆమె చేతులు జోడించి, "మీకు నేనెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటంలేదు. మీరేగానీ శ్రద్ధ తీసుకుని నిజనిజాలు పరిశోధించకపోయి వుంటే నేనా జైల్లోనే యావజ్జీవితం వుండవలసి వచ్చేది-" అంది.
అతడు వూగిపోయాడు. 'చెప్పెయ్యాలి. ఇదంతా చేసింది నేను కాదు- అని చెప్పెయ్యాలి' అనుకున్నాడు. కానీ అనుదీప్ కిచ్చిన వాగ్దానం గుర్తొచ్చింది. అతికష్టంమీద తమాయించుకుని 'వెళ్ళొస్తాను' అని చెప్పి వచ్చేశాడు.
ఆమె మళ్ళీ ఆలోచనల్లోకి జారుకుంది.
విశ్వనాథం అప్పటికప్పుడు తన వేలిముద్రల్నీ, రివాల్వర్ నీ ఎందుకు పరీక్షించాడో, అంత హడావుడిగా ఎందుకు రిపోర్టులు తయారు చేయించాడో ఆమెకి అర్థమైంది.
అతడు, సంపత్ కలిసి ఇంత పకడ్బందీగా వల బిగించగలరని ఆమె అనుకోలేదు.
అనుదీప్ ఇచ్చిన క్యాసెట్ ఏమిటా అని టేప్ రికార్డర్ లో పెట్టబోతున్న సమయంలో గుమ్మం దగ్గర చప్పుడయింది. ఆమె తలెత్తి చూసింది.
అనుదీప్.
"నువ్వా" అంది.
"నేనే-"
"ఏమిటి? క్యాసెట్ ఇచ్చావట? మళ్ళీ ఏదైనా ప్రేమ సందేశమా" వెటకారంగా అడిగింది.
"అవును. ఆఖరి పేజీలో వ్రాయవలసిన సందేశం. ఒక పేజీ సరిపోదు గాబట్టి టేప్ చేశాను" అంటూ లోపలికి వచ్చి, "బావున్నావా విద్యాధరీ" అన్నాడు ఆప్యాయంగా.
ఆమె ఆ ఆప్యాయతని గుర్తించకుండా-
"ఆహా! నీ దయవల్ల బాగానే వున్నాను" అంది.
"నా దయ ఏముంది? తప్పు చేయలేదు కాబట్టి బైటపడ్డావు".
"మతప్రవక్తలాగా నీతివాక్యాలు చెప్పటం దయచేసి మానేస్తావా?" కోపంగా అంది... "ఆ మురికికూపంలాంటి లాకప్ లో ఇన్నిరోజులు వుంటే ఏమాత్రం పట్టించుకోకుండా ఇప్పుడు బయట పడేసరికి తిరిగి తయరయ్యావా? నిన్ను చూస్తుంటే నాకు అసహ్యమేస్తూంది. నువ్వో అవకాశవాదివి" అలా అన్న తరువాత మళ్ళీ ఎందుకన్నానా అని బాధపడింది. ఈ మధ్య నోరుజారటం ఎక్కువైంది. అయితే ఎప్పటిలాగే అతడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. "నిజమే విద్యాధరీ! మనకెంత ఆప్తులైనవారయినా మనం కష్టాల్లో వున్నప్పుడు పట్టించుకోకుండా, మళ్ళీ మన కష్టాలు తీరిపోయాక వారు వచ్చి పరామర్శిస్తే ఇలాగే కోపం వస్తుంది. వారు మనకి ఎంతటా దగ్గిరవారైనా సరే...! కానీ నా సంగతి వేరు..."
"ఏమిటో నీ ప్రత్యేకత?"
"వాళ్ళందరూ ఒకర్నొకరు ఇష్టపడ్డవాళ్ళు!! కాబట్టి కష్టాల్లోవున్నా సుఖాల్లో వున్నా అవతలివారికి అండగా నిలబడటం వారి కర్తవ్యం. నా సంగతి అలాకాదు. నేనింకా నీ ప్రేమకోసం వీధి ముంగిట్లో నిలబడి వున్నవాణ్ణి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో ఇంకా చెప్పనేలేదు నువ్వు. ఇటువంటి పరిస్థితుల్లో నీ ప్రేమ సంపాదించటం కోసం నీపట్ల తాపత్రయపడ్డట్టు కనిపించడం నా అభిమతం కాదు. ఈ 'కనిపించటం' నెది ఆత్మవంచనకి మొదటిమెట్టు. ఎంతోమంది ఈ మెట్టుమీద నిలబడే తాము ప్రేమికులమని తమని తాము ఆత్మవంచన చేసుకుంటున్నారు. లేకపోతే ఇన్ని ప్రేమవివాహాలు ఎందుకు ఫెయిలవుతాయి? ఇంత మంది అవివాహితులకి అబార్షన్లు ఎందుకు అవుతాయి? ఇన్ని పార్కులూ, సినిమాహాళ్ళు వీళ్ళతో ఎందుకు నిండుతాయి? ప్రేమించటం అనేది జీవితాంతం ఒకరికొకరు బాసటగా నిలచే పరస్పర అంగీకారమయినప్పుడు -అది 'వెంటనే' పెళ్ళికి దారి తియ్యాలికదా".
"పెళ్ళికి ఎన్నో ఆటంకాలు వుండవచ్చు".
"ఉండవచ్చు, చదువు పూర్తికాకపోవటం, పెళ్ళికి కావలసిన అక్కలు వుండటం, ఉద్యోగం దొరక్కపోవటం, వగైరా వగైరా. వెంటనే పెళ్ళి చేసుకోవటానికి ఇవి కారణాలయినప్పుడు కనీసం తమ తల్లిదండ్రులకయినా ఈ ప్రేమ విషయం చెప్పాలి కదా".
"ఇంట్లోంచి తన్ని తగిలేస్తారు".
"అంటే సెక్యూరిటీ పోతుందేమో అన్న భయం. భయం ముందు ఈ యువతీ యువకుల ప్రేమ చాలా చిన్నదన్నమాట!!! తనమీద ఎంతో నమ్మకముంచి తమని చిన్నప్పటి నుంచీ పెంచి పెద్దచేసి చదివిస్తూన్న తల్లిదండ్రుల్నే మోసం చేస్తున్న ఈ యువతీ యువకులు- వీరేం ప్రేమికులు? రేప్రొద్దున్న లైఫ్ పార్టనర్ ని మాత్రం ఈ విధంగా మోసం చేయరని నమ్మకం ఏమిటి? కేవలం సెక్యూరిటీ బేస్ గానే వీళ్ళందరూ దంపతులు అవుతున్నారన్నమాట".
"నీదంతా సినిసిజం. ప్రతీదాన్ని భూతద్దంతో శల్యపరీక్ష చేస్తే చివరికి గులాబీ పువ్వుకూడా సెపెల్స్, పెటిల్స్ గా విడిపోతుంది. అలాగే ప్రేమకూడా.... ప్రేమించిన మరుక్షణంనుంచీ ఎప్పుడెప్పుడు ఒకటవుదామా అనీ ఇద్దరు తహతాహలాడుతూనే వుంటారు. తొందరగా పెళ్ళాడమని ప్రియురాలు ప్రియుడిని వత్తిడి చేస్తూనే వుంటుంది" ఆవేశంగా అంది.
"అలా చేస్తుందేతప్ప-ఆ ప్రియుడి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి మీ అబ్బాయీ నేనూ ప్రేమించుకున్నాం. ఫలానా సంవత్సరంలో పెళ్ళాడబోతున్నాం అని చెప్పదు. అలా చెప్పటానికి ఒక్కకేసులో, కనీసం ఒక్క కేసులో వూహించు. వెంటనే ఆ కుర్రవాడు ఏమంటాడో తెలుసా? 'ఈ అమ్మాయి నన్ను ట్రాప్ చేస్తుందని అనుకోలేదు నాన్నా, క్షమించు' అంటాడు. ఆ అమ్మాయి నిలదీస్తే- 'అవునుమరి నా మీద నమ్మకం లేకేకదా మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళావు. ఛీ నీలాటిదాన్ని ప్రేమించటం నా బుద్ధితక్కువ' అంటాడు. ఆ అమ్మాయిని వదిలిపెట్టటానికి తన తరఫు నుంచి క్రమంగా వాదనల్ని నిర్మించుకుంటాడు".
"ఎంత దారుణంగా ఆలోచిస్తున్నావు".
"వాస్తవాన్ని శోధిస్తున్నాను".
"ప్రతీ ప్రేమకీ పెళ్ళే చివరి గమ్యం కానవసరం లేదు".
"ఆ విషయం నిజాయితీగా ప్రేమికులిద్దరూ ముందే వప్పుకున్న ప్రాతిపదిక మీద ప్రేమ సాగితే నాకు అభ్యంతరం లేదు".
"నీ అభ్యంతరాల కోసం, అంగీకారాల కోసం ఎవరూ ఇక్కడ ఎదురుచూడడంలేదు. ఒకరిపట్ల ప్రేమ కలగటానికి ఏ కారణాలూ అవసరంలేదు. ఎందుకో ప్రేమ కలుగుతుంది. వివాహితులకీ కలగవచ్చు. వృద్ధులకీ కలగవచ్చు. పదేళ్ళ పిల్లలకీ కలగవచ్చు! బంధాలకి అతీతమైనది ప్రేమ. జీవితంలో ఒంటరితనంతో కుమిలిపోయే వాళ్ళకి ప్రేమ అన్నది దివ్యఔషధం. అది కారణాలనీ, పరిణామాలనీ ఆలోచించదు. Where there is a will there is a way అన్నది ప్రేమకే వర్తిస్తుంది. మనసున్నచోట ప్రేమకూడా వుంటుంది".
"విల్ అంటే ఏమిటో తెలుసా?"
"ఏమిటి?"
అకస్మాత్తుగా అతడి మొహంలో నవ్వు తొంగిచూసింది.