Previous Page Next Page 
థ్రిల్లర్ పేజి 27


    "చేసిన నిర్వాకం చాల్లేండి. మళ్ళీ వెళ్ళి పలకరించటం కూడా దేనికి! పైగా పక్కన వాళ్ళావిడ వుండగా-"

    "అమ్మకెప్పుడు ఎవరిమీద కోపం వస్తుందో, ఎప్పుడు జాలి వేస్తుందో నాకు ఊహ తెలుశాక అర్థంకాలేదు నాన్నా".

    "నీకేమిటమ్మా, నాకు పెళ్ళయినప్పటినుంచీ తెలియటం లేదు".

    ఆ గదిలో బిగ్గరగా నవ్వులు ప్రతిధ్వనించాయి. సరీగ్గా అప్పుడే -

    వాళ్ళ నవ్వుల్ని అధిగమిస్తూ, ఆ గదిలో వస్తువులు అదిరిపోయేలా వినిపించింది రివాల్వర్ శబ్దం.

    రవిశాస్త్రి భార్య చేతిలో గరిట టేబుల్ మీద పడింది. కూతురు కెవ్వున కేక వేయబోయి అతికష్టంమీద ఆపుకుంది. శాస్త్రి ఒక్క ఉదుటున లేచి ముందుగదిలోకి వచ్చాడు.

    ముందు గది తలుపులు వేసి వున్నాయి.

    గదిలో ఎవరూ లేరు.

    శబ్దం వినిపించింది టేప్ రికార్డర్ లోంచి అని తెలుసుకోవటానికి అతడికి అరనిముషం పట్టింది.

    సరీగ్గా అప్పుడే ఫోన్ మ్రోగింది.

                                      *    *    *

    మోటార్ సైకిల్ అపి రవిశాస్త్రి గుడిమెట్లు ఎక్కాడు. స్థంభం పక్కకూర్చుని వున్నాడు అనుదీప్. చాలా హడావుడిగా వచ్చినట్టు శాస్త్రి మొహంమీద చెమట చుక్కలు మెరుస్తున్నాయి.

    "అయితే వాళ్ళు నలుగురూ విన్నది టేప్ రికార్డర్ లో శబ్దమన్నమాట" అన్నాడు రాగానే ఉపోద్ఘాతం లేకుండా.

    "అయ్యుండవచ్చు - అన్న అనుమానం మీకు రాకపోవడం దురదృష్టకరం".

    "నీ ఫోన్ వచ్చినప్పటినుంచీ, ఇక్కడికి వచ్చేవరకూ ఆలోచిస్తూనే వున్నాను. నాకు ఒక్కటీ అర్థంకాలేదు. విద్యాధరి చెప్పిందంతా నిజమైతే రహస్యపు అరలోంచి పిస్టల్ ఆమే తీసింది. అదే అక్కడ ఉంది. దాని శబ్దమే అందరూ విన్నారు. మరి దాన్ని ఎవరు పేల్చారు? అంతకుముందు దాని శబ్దం ఆమె వినలేదు కదా-" అనుదీప్ నవ్వేడు "నేను భగవంతుడిని కాను. నిజంగా జరిగిందేమిటో నాకు తెలియదు. విద్యాధరిని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఆమె చెప్పినదంతా నిజమని నమ్మి, ఆ కోణం నుంచి తార్కికంగా ఆలోచిస్తూ వస్తే నాకు తోచింది అది. అదే మీకు చెప్పాను. మిగతా ఇన్వెస్టిగేషను మీరు పూర్తిచేస్తే ఇంకా కొన్ని విషయాలు తెలియవచ్చు".    

    శాస్త్రి తల గోక్కుంటూ, "ఇంకేం చెయ్యాలి? అసలెక్కణ్ణుంచి ప్రారంభించాలి?" అన్నాడు- పోలీసు డిపార్టుమెంటు సగటు ప్రతినిధిలా.

    "ఒక్కొక్క విషయమే ఆలోచించుకుంటూ రండి. ఉదాహరణకి- కమీషనర్ ధర్మారావ్ గారు చెప్పిన దాని ప్రకారం, విశ్వనాథం అనే యస్సై టెలిఫోన్ బూత్ నుంచి కమీషనర్ గారికి ఫోన్ చేశాడు. 'ఇప్పుడే సంపత్ ఆ ఇంట్లోకి వెళుతున్నాడు. నన్నుకూడా వెళ్ళమంటారా సార్' అని అడిగాడు. ఆయన వెళ్ళమనగానే ఇద్దరు పోలీసుల్ని తీసుకుని అ ఇంట్లోకి వెళ్ళాడు. అప్పటివరకూ సంపత్ ఏం చేస్తున్నాడు? టెలిఫోన్ బూత్ నుంచి చక్రధర్ ఇంటికి నడక అయిదు నిముషాలుపడితే, ఈ అయిదు నిముషాలు కార్లోనే కూర్చుని సంపత్..... ఎవరొస్తారా అని ఎదురు చూస్తున్నాడా? విశ్వనాథానికైనా అతడు అప్పుడే కారు దిగుతూంటే అనుమానం రాలేదా? లేక ఇద్దరూ కలిసి......"

    "ఆగు" చప్పున అన్నాడు రవిశాస్త్రి, "...ఇదంతా నిజమేలా వుంది. మైగాడ్... మా డిపార్టుమెంట్ ...మైగాడ్..."

    "మీరు మాటి మాటికి దేవుడిని తల్చుకోనవసరంలేదు. ఈ సంఘటనలన్నీ వరుసగా పేరిస్తే చదివే పాఠకుల్లో సగం మందికి పైగా ఈ అనుమానాలే వచ్చివుండవు. వాళ్ళకన్నా మీరు నయం. కనీసం నన్ను అనుమానించలే..." అతడిమాటలు పూర్తి కాలేదు. రవిశాస్త్రి ఫీల్డులో కూడా అంత వేగంగా పరుగెత్తి వుండడు. అలా పరుగెత్తి మోటారు సైకిలెక్కాడు.

                                      *    *    *

    ముందు అప్పాయింట్ మెంట్ లేకుండా, స్లిప్ పంపకుండా సరాసరి లోపలికి వచ్చేసిన శాస్త్రివైపు ధర్మారావు తలెత్తి ఆశ్చర్యంగా చూశాడు.

    శాస్త్రి చెప్పడం మొదలుపెట్టాడు. మొత్తం జరిగినదంతా వేరే కోణంలోంచి అతడు చెప్పటం పూర్తిచెయ్యటానికి పదినిముషాలు పట్టింది. ధర్మారావు స్థాణువై విన్నాడు. ఇంత జరిగిందని నమ్మటమే ఊహకందని విషయం. అతడు అలాగే అచేతనంగా కుర్చీలో చాలాసేపు కూర్చుండిపోయాడు. చివరికి అన్నాడు-

    "...ఇదంతా నిజమే అయితే, ఈ డిపార్టుమెంట్ ప్రతినిధిగా నన్ను ఆ అమ్మాయి జీవితంలో క్షమించదు శాస్త్రి. పాపం మొదటినుంచీ చెపుతూనే వుంది. మనమే వినలేదు".

    చాలామంది ఈ డిపార్టుమెంట్ ని క్షమించరని శాస్త్రికి తెలుసు. మాట్లాడలేదు.

    ధర్మారావు ఆలోచనలో పడ్డాడు.

    ఏం చెయ్యాలి?

    ఎలా నిరూపించాలి?

    ...అయిదు నిముషాలు గడిచాయి.

    ఒక నిర్ణయానికి వచ్చినట్లు లేచాడు. శాస్త్రిని తనతో రమ్మన్నట్టు తలూపి వెళ్ళి కారులో కూర్చున్నాడు. డ్రైవర్ తో సంపత్ ఇంటికిపోనీ- అని చెప్పి, ఆశ్చర్యంగా చూస్తున్న శాస్త్రితో "నేను చాలా తప్పు చేశాను శాస్త్రి! ఆ అమ్మాయి పట్ల నేను చాలా ద్రోహంగా ప్రవర్తించాను. ఉద్యోగం, హోదాలాటి హిపోక్రసీలతో, ఈ రిటైరయ్యే వయసులో పేపర్ల కెక్కటం దేనికని, విద్యుక్తధర్మ పేరిట ఆత్మవంచన చేసుకున్నాను. దీనికి పరిష్కారంగా ఈ రహస్యాన్ని సంపత్ నోటివెంట నేనే స్వయంగా చెప్పిస్తాను".

    కారు సంపత్ ఇంటిముందు ఆగింది. శాస్త్రి దిగబోతుంటే ధర్మారావు వారించాడు. "రేప్పొద్దున్న లాకప్ మరణం సంభవిస్తే నువ్వుకూడా ఇరుక్కోవటం నాకిష్టంలేదు. నేనే వెళతాను" కారు దిగాడు.

    రెండు నిముషాల్లో ఆయనవెంట సంపత్ వస్తూ వుండటాన్ని శాస్త్రి చూశాడు. తనని ఎక్కడికి తీసుకువెళుతున్నాడో తెలియని అయోమయం సంపత్ మొహంలో కనపడుతూంది. డిపార్టుమెంటులో ఇలాటివి మామూలే కానీ కమీషనర్ స్వయంగా పూనుకోవటం మాత్రం కొత్త. ఆయనోమాట చెపితే సబ్- ఇన్ స్పెక్టర్లే ఈ పని చేస్తారు. కానీ ఆయన స్వయం ప్రక్షాళనా కార్యక్రమంలో వున్నారు. కారు ఆగింది.

    సంపత్ ని లోపలికి తీసుకొని ఆయన వెళ్ళారు.

    వెళ్ళిన రెండు నిముషాలకి మొదటి చప్పుడు వినిపించింది.

                                                                   *    *    *

    "అరగంట క్రితం విద్యాధరిని వదిలిపెట్టేశారు" మెరుస్తున్న కళ్ళతో అన్నాడు రవిశాస్త్రి. సాధారణంగా పోలీసు డిపార్టుమెంటులో వ్యక్తులు ఏ విషయానికీ ఎగ్జెయిట్ అవరు. అటువంటిది అతడు చాలా ఉద్వేగంగా కనిపిస్తున్నాడు.

    "ఈ విషయం తెలియగానే ముందు నీకే చెప్పాలని వచ్చేశాను" కాస్త ఆయాసపడుతూ అన్నాడు. "చాలా గొప్ప ప్లాన్ వేశారు. నిజానికి నాకే మతిపోయింది. సంపత్ ఒక పట్టాన చెప్పలేదు".

    "ఆ రెండోవ్యక్తి సబ్ ఇనస్పెక్టర్ విశ్వనాథమే కదూ-" అనుదీప్ అడిగాడు.

    "అవును. సంపత్ కి ఫోనుచేసి లక్షరూపాయలకి బేరం పెట్టాడట. విద్యాధరి పాపం విశ్వనాథాన్ని నమ్మి అంతా చెప్పింది. చక్రధర్ మరణిస్తే సంపత్ కి చాలా లాభమని విశ్వనాథానికి తెలుసు. అందుకే బేరం పెట్టాడు. ఇద్దరూ కలిసి ప్లాన్ వేశారు. విద్యాధరి వుండగానే చంక్రధర్ ని సంపత్ చంపేశాడు. అదీ తన పిస్టల్ తో. ఆ తర్వాత టేప్ రికార్డర్ పెట్టి కరెంటు ఆఫ్ చేశాడు. ఏమీ ఎరగనట్టు కలిసి లోపలికి వెళుతూ వుండగా తిరిగి మెయిన్ ఆన్ చేశాడు. అప్పుడే పిస్తోలు శబ్దం అందరికీ వినిపించింది. ఇక మిగతాదంతా విశ్వనాథం పూర్తిచేశాడు. చక్రధర్ అప్పుడే మరణించినట్లు హడావుడి చేశాడు. ఎవరూ చూడకుండా పక్కనున్న పిస్టల్ కి సైలెన్సర్ అమర్చి రెండుగుళ్లు గాలిలోకి పేల్చేశారు. అందరూ ఆ పిస్టల్ ద్వారానే హత్య జరిగిందనుకున్నారు. పోలీసులు శవాన్ని చూసిన షాక్ లో వుండగా విశ్వనాథం టేప్ ఆఫ్ చేశాడు".

    "ఆ విషయం నాకు తెలుసు".

    ప్రవాహంలా చెప్పుకుపోతున్న రవిశాస్త్రి చప్పున ఆపి, "నీకెలా తెలుసు?" అని అడిగాడు.

    "పోలీసులందరూ వెళ్ళిపోగానే నేను ఆ ఇంటిలోకి వెళ్ళాను. మీకిచ్చిన క్యాసెట్ అదే..."

    రవిశాస్త్రి నిరుత్తరుడై చూసి, ఏదో స్ఫురించిన వాడిలా "కొంప ముంచావు కదయ్యా-" అన్నాడు "ఏమైందీ?"

    "కేవలం సంపత్ సాక్ష్యంమీద విశ్వనాథానికి శిక్షపడదు. ఆ క్యాసెట్ మీద అతని వేలిముద్రలు కూడా వుంటే కేసు మరింత బలంగా వుండేది. ప్చ్- ఏం చేస్తాం? నేనే ఆ క్యాసెట్ ని అటూ ఇటూ నాలుగైదుసార్లు తిప్పాను."

    "ఆ విషయం కేవలం మీకూ నాకూ తెలుసు. అతనికి తెలీదు కదా" నవ్వుతూ అన్నాడు అనుదీప్. ".... ప్రతిదీ చట్టప్రకారమే వెళ్ళాలంటే కుదరదనుకుంటాను".

    శాస్త్రి మొహం వెయ్యి క్యాండిల్ బల్బులా వెలిగింది. "అసలు నువ్వు మా డిపార్ట్ మెంటులో వుండాల్సింది, ఈ పాటికి కమీషనర్ వై పోయి వుండేవాడివి".

    "అంత అదృష్టం వద్దులెండి. మీరు నాకో సాయంచేస్తారా?"

    "తప్పకుండా! ఏమిటది? చెప్పు".

    "ఆ క్యాసెట్ విద్యాధరి కిస్తారా? వింటుంది".

    "ఎందుకు? అందులో ఏమీలేదే-"

    "వుంటుంది".

    "నేను అట్నుంచి ఇటూ, ఇట్నుంచి అటూ చాలాసేపు విన్నానయ్యా. అందులో పిస్తోలు రెండుసార్లు పేలిన చప్పుడు తప్ప మరేమీ లేదు".

    "నా మనసు బహిర్గతం చేసే అంతర్మధన తరంగాలు ఆ టేప్ మీద అదృశ్యంగా స్థిరపడి శబ్దప్రకంపనాలు అవుతాయిలెండి. ఆమెకివ్వండి".

    "నీ ప్రేమ గురించే కదా దిగులు! ఈ రోజు నువ్వు చేసిన సాయానికి ఆ అమ్మాయి నిన్ను జీవితాంతం ప్రేమిస్తూనే వుంటుంది".

    "మీరు నాకో సాయం చేస్తారా?" చేయి ముందుకు సాచుతూ అడిగాడు అనుదీప్. శాస్త్రి విస్తుబోయి "ఏమిటి?" అన్నాడు.

    "ఈ తెరవెనుక నేనున్నానన్న విషయం విద్యాధరికి తెలియనివ్వనని వాగ్దానం చేయండి".

    "ఎందుకు?... ఈ రోజుగాని నువ్వు చెప్పకపోతే..."

    అతడి మాటలు పూర్తికాకుండానే "ప్లీజ్ -నాకోసం" అన్నాడు. అనుదీప్ చెయ్యి అలాగే వుంది. అతడి కళ్ళలోని అభ్యర్థనని కాదనలేక-

    "సరే. అలాగే చెప్పనుగాని- నువ్వు తనని రక్షించావన్న విషయం ఆమెకు ఎందుకు తెలియరాదు?" అని అడిగాడు శాస్త్రి.

    "ఒక మనిషి కష్టాల్లో వుండగా సాయం చేయటంద్వారా ఆ మనిషి ప్రేమ పొందకూడదు అన్న నిబంధన... నేనూ దేవుడూ చేసుకున్న ఒడంబడికలో వుంది కాబట్టి" అని అక్కణ్ణుంచి కదిలిపోయాడు అనుదీప్.

                                                                 *    *    *

    జరిగినదంతా ఒక కలగా వుంది విద్యాధరికి.

    దీని వెనుక విశ్వనాథం వున్నాడన్న విషయం ఆమెని దిగ్భ్రాంతురాలిని చేసింది.

    లాకప్ నుంచి బయటికొచ్చేసరికి ప్రపంచమంతా మళ్ళీ మంచిదై పోయింది. ఆహ్లాదంగా ఆహ్వానం పలికింది. ఇదే ప్రపంచం... ఈ కేసుని ఇంత బాగా ఇన్వెస్టిగేట్ చేసినందుకు శాస్త్రిని, డిపార్టుమెంటు అభినందించింది. విద్యాధరి బయట పడినందుకు అందరికంటే ఎక్కువ అభినందించింది ధర్మారావు.

 Previous Page Next Page