Previous Page Next Page 
మరణ మృదంగం పేజి 27


    రామూ నవ్వేడు. "అదీ ఒకందుకు మంచిదైంది సాబ్. అంత రక్తం అక్కడ ప్రవహించకపోయి  వుంటే అజా కాగితాలు పూర్తిగా తడిసేవి కావు"

    దాదా ఈ మాటలు వినటం లేదు. ఆలోచిస్తున్నాడు. ఆ విష్ణుశర్మగాడి నోటి వెంట ఒక్క మాట కూడా  బయట ప్రపంచానికి తెలియకూడదని ఇంత మంది -  ఇన్ క్లూడింగ్ ఒక పోలీస్ అధికారి, ఒక డాక్టర్  ప్రాణాలు తీయటం జరిగింది. అటువంటప్పుడు అంత వివరంగా వ్రాసిన ఆ కాగితం తాలూకు మూడో కాపీ ఎక్కడ వుంది?

    "శంకర్- ఎవరికన్నా ఆపరేషన్ చెయ్యవలసి వస్తే ఆస్పత్రి బట్టలు ఎవరు తొడుగుతారు?"

    "విప్పటం గురించైతే నేను చెప్పగలను దాదా. తొడగటం గురించి నాకు తెలీదు."

    వసంత్ దాదా మొహం మీద విసుగు రేఖ స్పష్టంగా కనిపించింది. "షటప్" అన్నాడు గట్టిగా. "శంకర్! ఈ రాత్రికి రాత్రే ఈ విషయం పూర్తయి పోవాలి. మనం  ఇందులో ఎంత లోతు ఇరుక్కున్నామో నీకు బహుశ అర్థం కావటం లేదనుకుంటా".

    "చెప్పు దాదా! రాత్రికి మొత్తం ఆస్పత్రి సిబ్బందినంతా శాశ్వతంగా నోరు మూయించమంటావా?"

    "అక్కర్లేదు.... ఆ కాగితాల సంగతి ఎవరెవరికి తెలుసో వాళ్ళని పట్టుకోగలిగితే చాలు! శంకర్- రేప్పోదున్న నేను ఢిల్లీ వెళ్ళిపోవాలి. నాకిదొక్కటే పని కాదు. చాలా పన్లున్నాయి. అందులో ఒకటి మళ్ళీ నీ  గురించే!ఆ జపాను పోలీసుగాడు అప్పుడే ఇక్కడికి వచ్చి విడిది చేసి వున్నాడు. ఏం చేస్తావో నీ ఇష్టం. నేను రేపు విమానంలో ఢిల్లీ చేరుకునేసరికి ఇక్కడ  ఈ పనంతా పూర్తయిందన్న వార్తా నా టేబిల్ మీద వుండాలి! నాకు అన్పిస్తూన్నదేమిటంటే, ఈ వర్త ఒకరిద్దరి కన్నా ఎక్కువ మందికి తెలిసి వుండదని! వలలు పోలీసులకి ఈ విషయం ఇంకా తెలియబర్బలేదంటే బహుశా భయపడన్నా వుండాలి. లేక పోలీసుల్తో మన కెందుకులే అని వూరుకుని అన్నా వుండాలి. ఆ రెండింటిలో ఏది జరిగినా కూడా - ఇక పర్లేదులే అని మనం  ఉపేక్షించకూడదు. ఎప్పుడో ఒకప్పుడు ఈ వార్త బయటకి పొక్కకమానదు. అందులో ఆ శ్రీకాంత్ గాడు వలపన్ని కూర్చున్నాడు. నీకు తెలియనిదేముంది. ఈ  రాజీవ్ గాంధి ప్రభుత్వం వచ్చాక మన పనులు మరింత కష్టమయ్యాయి. ఈ కట్ మల్ నాకొడుకులందరికీ ఉన్నట్టుండి నిజాయితీ గుర్తొచ్చింది. శంకర్! తెల్లారేసరికల్లా నువ్వీ విషయం కనుక్కోవాలి. ఆ కాగితాలు సంపాదించాలి. వాళ్ల నోళ్ళు మూసెయ్యాలి".

    శంకర్ ఇప్పుడు నవ్వటం లేదు. "అదీ అలా చెప్పావ్ బావుంది. ఇంక నువ్వీ విషయం మర్చిపో దాదా. నేను చూసుకుంటాను" అన్నాడు క్లుప్తంగా.

    "ఇక నేను పడుకుంటాను"

    శంకర్, రాము, డేవిడ్ ఆ గదిలోంచి బయట కొచ్చేసారు. అయిదు నిముషాల తరువాత శంకర్ తిరిగి తలుపు తట్టాడు. "కమిన్" పక్క మీద నుంచే దాదా అన్నాడు.

    శంకర్ లోపలికి ప్రవేశిస్తూ "శర్మ దగ్గర్నుంచి ఆ కాగితాలు తీయటానికి ఎవరెవరికి స్కోపుందో తెలుసుకున్నాను దాదా" అన్నాడు.

    "ఇంత తొందరగానా"

    శంకర్ గర్వంగా నవ్వాడు "ఇద్దరు అసిస్టెంట్లు శర్మని ఆపరేషన్ కి సిద్ధం చేశారు. వాళ్ళే బట్టలు కూడా మార్చింది".

    "ఎవరు వాళ్ళు"

    "ఒకడి పేరు శ్రీనివాసరావు. ఆ ఆస్పత్రిలోనే అసిస్టెంట్ గా ఆరేళ్ళ నుంచి పని చేస్తున్నాడు. రెండో  వాడు కొత్తగా జాయిన్ అయ్యాడు".

    "కొత్తగానా?"

    "అవును. మూడు నాలుగు నెలలయింది. ఇరవై ఏళ్ళ కుర్రవాడు. ఇంకా అంత అనుభవం లేదు. బహుశా వాడికేం తెలియకపోవచ్చు. నేను వెళ్ళి ఆ శ్రీనివాసరావు అనేవాదితో మాట్లాడతాను" అంటూ అతడు బయల్దేరాడు.

    "శంకర్"

    శంకర్ గుమ్మం దగ్గిర ఆగి వెనక్కి తిరిగి చూసాడు.

    "మరీ అవసరమైతే తప్ప కత్తి తీయకు. ఈ మధ్య మరీ ఎక్కువ చేస్తున్నాం"

    శంకర్ తలూపి అక్కణుంచి కదిలాడు.


                        *    *    *   

    ఉత్పల తన జీవితంలో అంత భయంకరమైన దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేదు. ఆపరేషన్ చేస్తున్న ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు నర్సులు, ఇన్ స్పెక్టర్లు, ఒక  పోలీసు ఆపరేషన్ టేబిల్ మీద రోగి, మొత్తం  ఏడుగురూ రక్తపు మడుగులో విలవిలా కొట్టుకుంటూ మరణించటం!

    ఎప్పుడూ నవ్వుతూ, చిన్న చిన్న లెక్కలతో అవతలి వాళ్ళ మతులు పోగొడుతూ, హడావుడిగా తిరిగే డాక్టర్ హరనాథరావు శరీరం అచేతనంగా , ఎంత పెద్ద ఆపరేషన్ అయినా చకచకా చేయగల చేతి వేళ్ళు కదలిక లేకుండా  పడి వున్నాయి. ప్రాణం పూర్తిగా పోక ఒక నర్సు రెండు నిమిషాల పాటు గిలగిల కొట్టుకుంది.

    అంతా క్షణాలో జరిగిపోయింది అది!

    ఆ తరువాత రెండు నిముషాలకి ఆ ఆస్పత్రి అంతా  భయంకరమైన కేకల్తో దద్దరిల్లిపోయింది.

    ఉత్పల మాత్రం డీప్ షాక్ లో శిలాప్రతిమలా నిలబడిపోయింది. ఇన్ స్పెక్టర్ తో కూడా  ఆమె లోపలికి వెళ్ళి వుంటే-  ఆమె శరీరం కూడా ఛిద్రం అయిపోయి వుండేదే! వెంట్రుక వాసిలో మృత్యువు పక్క నుంచి దూసుకుపోయేదే! కానీ ఆ సంగతి ఆలోచించగలిగే స్థితిలో లేదు ఆమె. సనాతన సాంప్రదాయాలు గల కుటుంబంలో పుట్టి- అమాయకంగా పెరిగిన ఆ అమ్మాయికి- అసలు ఇలాటి సంఘటనలు నిజ జీవితంలో జరుగుతాయని కూడా తెలీదు. బల్లని అనుకుని అలాగే చాలా సేపు నిలబడి పోయింది. ఆ తరువాత కొంత సేపటికి పోలీసులు రావటం, హడావుడి- అందర్నీ వరుసగా ప్రశ్నించడం జరిగింది. ఆమెనెవరూ పట్టించుకోలేదు. ప్రశ్నించలేదు కూడా.

    దాదాపు గంట తరువాత అందరూ వెళ్ళిపోవటానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. ప్రతి వాళ్ళ దగ్గిరా అడ్రసులు తీసుకున్నారు.

    ఆస్పత్రికి దగ్గిర్లోనే చచ్చిపోయిన ఒక నర్సు ఇల్లుంది. ఆమె తాలూకు పిల్లల ఏడుపు హృదయ విదారకంగా వినిపిస్తూంది. భర్త కూడా రోదిస్తున్నాడు. శరీరాల్ని పోస్ట్ మార్టమ్ కోసం తరలిస్తున్నారు.

    పోలీసులు అనుమతి ఇవ్వగానే 'బ్రతుకు జీవుడా' అంటూ ఆస్పత్రి సిబ్బంది బయటపడి ఇళ్ళకు పోవటానికి ఆయత్తమవసాగారు.

    ఉత్పల ఇంకా అలాగే నిలబడి వుంది.

    "రండి. మిమ్మల్ని దిగబెట్టి నేను వెళ్ళిపోతాను. మీ ఇంటి దగ్గరే  మా ఇల్లు" అన్న స్వరం వినపడి తలెత్తి చూసింది ఉత్పల. ఇంకా పూర్తిగా అయోమయం నుంచి తేరుకోనట్టు ఆమె మాట్లాడలేదు.

    "అందరూ వెళ్ళిపోయారు. మనిద్దరమే మిగిలాం" అన్నాడు శ్రీనివాసరావు.

    అతడంటే ఆమెకు మంచి అభిప్రాయం లేదు. కావాలని చేతి వేళ్ళు తగిలించటం. చొరవ తీసుకోవటం చేస్తూ వుంటాడు. సీనియర్ అసిస్టెంట్ కాబట్టి జూనియర్లు ఏమీ చేయలేక వూరుకుంటూ వుంటారు.

    ఉత్పలకి  వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలని వుంది. నాన్న, తమ్ముడు, అక్క అందరి మధ్యా అమ్మ వళ్ళో తల పెట్టుకుని ఏడవాలని వుంది. ఏడవకపోతే పిచ్చెక్కేలా వుంది. అలాటి స్థితిలోనే బయటకు నడిచింది. రిక్షాలో ఎక్కారిద్దరూ. పిచ్చెక్కేలా వుంది. అలాటి స్థితిలోనే బయటకు నడిచింది. రిక్షాలో ఎక్కరిద్దరూ.

    అర్థరాత్రి దాటి చాలా సేపయింది.

    పక్కన శ్రీనివాసరావు కూర్చున్నాడన్న విషయం కూడా పట్టించుకోలేదు. రిక్షా కుదుపులకి కదులుతూంది. పక్కనున్న ఇనుప చువ్వని పట్టుకోబోతూ అప్పుడు గమనించింది. తన చేతిలో కాగితాల్ని!

    రిక్షా మలుపు తిరుగుతూ వుండగా ఆ సందులోకి సలీంశంకర్ కారు ప్రవేశించింది.

    తన చేతిలో కాగితాన్ని చూడగానే ఉత్పలకి గతం అంతా ఒక్కసారిగా గుర్తొచ్చింది. మెదడును ఆలోచింపనివ్వకుండా నొక్కిపట్టి వుంచిన పొరలు నెమ్మదిగా తొలగినట్టయింది. అప్పటివరకూ, జరిగిందంతా ఒక కలలాగా అనిపించింది. అప్పుడే అది కలకాదనీ నిజమనీ నమ్మకం కుదురుతోంది.

    పోలీసులు ఆమెని ప్రశ్నించివుంటే ఎలా వుండేదో కానీ వాళ్ళు మిగతా రొటీన్ లో నిమగ్నమై- సిబ్బందిని వివరంగా మరుసటిరోజు ప్రశ్నిద్దామని వదిలెయ్యటంతో ఆమె ఆ షాక్ లోనే వచ్చి రిక్షా ఎక్కింది.

    ఇప్పుడీ కాగితం గురించి గుర్తుకు రాగానే అప్రయత్నంగా 'అయ్యో' అంది. వాలుగా ఆమె చెంప మీద పడుతున్న నీడనీ, జారే ముంగురుల్ని చూస్తున్న శ్రీనివాసరావు 'ఏం జరిగింది' అని ప్రశ్నించాడు. అతడికి నలుగురు పిల్లలు. వయసు నలభై అయిదు దాటింది. అయినా ఆస్పత్రిలో ఆడపేషెంట్లతోటీ, సిస్టర్స్ తోటీ సరసాలు ఆడుతూనే వుంటాడు. కొంత మంది వప్పుకుంటారు. వప్పుకోని వాళ్ళని ఏదో విధంగా ఇరుకున పెట్టి ఏడిపిస్తూ వుంటాడు.

    ఉత్పలతోపాటే ఒకే రిక్షాలో కూర్చునే అవకాశం దొరికినందుకు అతడు మనసులోనే పొంగిపోయాడు. అతడు ఆమెకోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. కానీ ఈ అమాయకప్పిల్లకి తన గురించి ఒక మొగవాడు ప్రయత్నిస్తున్నాడన్న విషయం గ్రహించేటంత విజ్ఞానం లేదు. అతడు ద్వందార్థంతో మాట్లాడే మాటల్ని అర్థం చేసుకోలేదు, తాకినా పొరపాటున తాకినట్టే అనుకునేది.

    రిక్షాలో కూర్చోగానే అతడు వెనుకనుంచి చెయ్యివేసి రాడ్ పట్టుకున్నట్టు కొంచెం సేపు వుంచి తరువాత దాన్ని వదిలేసి, చెయ్యి మాత్రం అలాగే వుంచాడు. అర్ధరాత్రి దాటి, రోడ్డు చీకటిగా వుంది. రిక్షా కుదుపుల్లో అప్రయత్నంగా కదిలినట్టు అతడి చెయ్యి కదులుతోంది. ఆమె జాకెట్ తాలూకు పొందికైన వంపుని వేళ్ళతో స్పృశిస్తూ అతడు ఆనందించసాగాడు. ఆమె తన ప్రస్తుత నిర్వికారమైన స్థితిలో దాన్ని గమనించలేదు. అతడు మరింత దగ్గరగా  జరిగాడు. ఆమె జఘనపు పక్కభాగం అతడి నడుముకు వత్తుకొని స్పర్శాసుఖాన్ని ఇవ్వసాగింది. అప్పటివరకూ చౌకబారు స్త్రీలతోనే పరిచయం వున్న అతడికి నిండు యవ్వనంలో పూర్తిగా తాకుతూ వున్న ఈ అనాఘ్రాత శరీరం ఏదో లోకాల్లో తేలిపోయేట్టు చేస్తోంది. సరీగ్గా  అదే సమయానికి ఆమె ఈ లోకంలోకి వచ్చినట్టు 'అయ్యో' అంది.

    "ఏం జరిగింది ....." అని అడిగాడు.

    "ఈ కాగితం ....." అంది చేతిలో కాగితాన్ని చూపిస్తూ.

    "ఏమిటది?"

    ఆమె చెప్పింది. తనకి మూడు కాపీలు దొరకటం-వాటిని ఇన్ స్పెక్టర్ కివ్వటం, ఇంతలో లోపల్నుంచి రోగి చివరి క్షణాల్లో వున్నాడని తెలియగానే మరణ వాజ్ఞ్మూలం తీసుకోవడానికి ఇన్ స్పెక్టర్ లోపలికి వెళ్ళటం, ఈ లోపులో ఈ ఘాతుకం జరగటం అంతా వివరంగా చెప్పింది.

    "ఏముందా వుత్తరంలో?"

    "వసంత్ దాదా అట ఎవడో- వాడి గురించి చాలా వివరాలున్నాయి. ఇంకెవడో సలీంశంకర్ అట. వాడ్ని రక్షించటంకోసం ఏదో ప్లాన్ వేసి, ఇప్పుడు చచ్చిపోయాడే ఆ శర్మని అందులో ఇరికించబోయారట. చాలా వ్రాశాడ. సగం అర్థమయింది. సగం కాలేదు".

    శ్రీనివాసరావు చెయ్యి తీసేసి నిటారుగా కూర్చున్నాడు. ఆమె దగ్గర్నుంచి కాగితం తీసుకున్నాడు. రిక్షా సందులోనుంచి మెయిన్ రోడ్డు మీదకి వచ్చింది. మూడు నిమిషాల్లో వుత్తరం అంతా చదవటం పూర్తిచేశాడు. అతడికి కూడా మాఫియా గురించి పూర్తిగా తెలీదు. కానీ చాలా వరకూ అర్థమైంది.

    "ఈ వుత్తరాన్ని పోలీసులకివ్వటం మార్చిపోయాం" అంది ఉత్పల భయంగా.

    శ్రీనివాసరావు నవ్వేడు.

    ఇక్కడ శ్రీనివాసరావు గురించి మరికొంత చెప్పాలి.

 Previous Page Next Page