తనకి తెలియని విషయమంటూ ఏదీ లేదన్నట్టు ఈ శ్రీనివాసరావులు ప్రవర్తిస్తారు. 'మొన్న మా ఇంట్లోకి పాము వచ్చిందండీ' అని ఎవరైనా ఆఫీసులో అంటే వెంటనే కల్పించుకుని "పాముని ఎప్పుడూ వెనుక నిలబడి తోకవైపు నుంచి కొట్టాలండీ. ముందు నుంచి కొడితే పైకి ఎగురుతుంది" అంటారు. అదే వాళ్ళ పెరట్లోకి పాముస్తే పెళ్ళాం భుజం వెనుక నిలబడి పక్కింటి వాళ్ళని పిలుస్తారు. 'మొన్న మా జనరల్ మేనేజర్ ఇన్ స్పెక్టర్ వచ్చి అరెస్ట్ చేసాడండీ' అని ఎవరన్నా అంటే, "అసలు మనవాళ్ళకి పూర్తిగా లోకజ్ఞానం లేదండీ. హౌకెన్ ఏన్ ఆర్డినరీ ఇన్ స్పెక్టర్ అరెస్ట్ ఎ జనరల్ మానేజర్? నేనైతే సుప్రీంకోర్టు వరకూ లాగి పరుపు నష్టం దావా వేస్తాను" అంటారు. తెలియని వాళ్ళెవరైనా వుంటే, 'అబ్బ వీళ్ళకి ఎంత తెలుసో-' అనుకుంటారు. "మరి ఇన్ స్పెక్టర్ వారెంట్ తో వస్తే ఏం చెయ్యాలండీ?" అని ఎవరన్నా అమాయకంగా అడిగితే, విజృంభించి, "లాయర్ ని పిలవాలి. అంతా కోర్టులో చూసుకుందాం. ప్రస్తుతానికి వెళ్ళిరండి" అని బెదిరించాలి! అంటారు. ఈ లోపులో కాస్త పేపరు పరిజ్ఞానం వున్న పక్కవాడు "ఎమర్జెన్సీ తర్వాత మరి ఇందిరాగాంధీని అరెస్ట్ చేసినప్పుడు ఆవిడ అలా చేయలేకపోయింది కదండీ! చేతికి బేడీలు వేసే పరిస్థితి కూడా వచ్చింది కదా" అని అడిగితే, బిత్తరపాటుని పైకి కనిపించనివ్వకుండా, "అదంతా పబ్లిసిటీ స్టంట్ అండీ" అని తేల్చేస్తారు. పాము కన్నా ఎక్కువ ప్రమాదకరంగా ఎదుటివాళ్ళ మనసుల్ని విషపూరితం చేస్తాయి వీళ్ళ మాటలు. "మొన్న మా స్నేహితుడోస్తే కలుసుకోవటానికి హొటల్ చోళకి వెళ్ళాను. పక్కరూములో కమల్ హాసన్ వుంటే తీసుకువెళ్ళి పరిచయం చేసాడు మావాడు" అంటారు. జనం ఇంకా వివరాలకోసం ఆసక్తిగా చూస్తూన్నారని గ్రహించి "గురుడు ఫుల్ మందులో వున్నాడ్లెండి. అసలు కాళ్ళమీదే నిలబడలేకపోయాడు" అని పూర్తిచేస్తారు. పక్క నుంచి "కమల్ మందుకొట్టడం మానేసి సంవత్సరం కావొస్తూందే" అని తెలిసిన వాళ్ళెవరయినా అంటే, "అదంతా పబ్లిక్ కోసం! తలుపులు బిగించి ఫుల్ గా బిగిస్తారండీ వీళ్ళు" అని జనరలైజ్ చేసేస్తారు. సారికతో తన సంబంధం గురించి అంత ధైర్యంగా బయటకి రాగలిగిన కమల్ ఇలాటి వాటికి తలుపులు బిగించుకుని మందు కొట్టవలసిన అగత్యం ఏమిటా అన్న ఆలోచన అక్కడ వున్న వాళ్ళలో ఎవరికీరాదు. వస్తే వాళ్ళు భారతదేశపు సగటు పౌరులు కారు. అందుకే శ్రీనివాసరావులు ఉద్భవిస్తారు. ఎంతో కష్టపడి పెంచుకుంటూ వచ్చిన అవతలివాడి వ్యక్తిత్వాన్ని తమ ఒక మాటతో ఛిన్నాభిన్నం చేస్తారు. తెలిసీ తెలియని జ్ఞానంతో లెక్చర్లిచ్చి వినేవాళ్ళ అజ్ఞానానికి మరింత దోహదం చేస్తారు. ప్రస్తుతం ఉత్పల పట్ల అతడు అదే చేసాడు.
"ఈ కాగితాన్ని పోలీసులకిస్తావా?" అన్నాడు
ఆమె అతడివైపు- మరింకేం చెయ్యాలన్నట్టు చూసింది.
"ఈ వుత్తరం వాళ్ళకిచ్చిన మరుక్షణం నిన్ను అరెస్ట్ చేస్తారు. అసలే సాక్ష్యం దొరక్క ఛస్తున్నారు. ఇన్ని హత్యలు జరిగాక వెంటనే ఎవర్నో ఒకర్ని అరెస్ట్ చేసినట్టు చెప్పకపొతే ప్రజలు వూరుకోరు" అన్నాడు.
"మరేం చేద్దాం?" అందామె భయంగా.
"దీన్ని గురించి మర్చిపో...... అసలు నీకేం తెలీదు...... అంతే" కాగితాన్ని తను వుంచుకుంటూ అన్నాడు. "పోలీసులు జోలికి మనం వెళ్ళకూడదు. అసలు పోలీసుకేసు అంటే ఎలావుంటుందో తెలుసా నీకు? పగలనకా రాత్రనకా వస్తారు. ఇంటి నుంచి పోలీసు వాన్లో స్టేషన్ కి తీసుకెళ్తారు. కోర్టుకి రమ్మంటారు. నువ్వూహించ లేవు. నీతో నిజం చెప్పించటానికి నానా బాధలూ పెడతారు. అఫ్ కోర్స్ నాకు సి.బి.ఐ. లోనూ, పోలీసుల్లోనూ చాలా మంది తెలుసనకో. అయినా ఎందుకంత గొడవ?"
ఆమె మాట్లాడలేదు.
రిక్షా ఆమె ఇంటిముందు ఆగింది. "నేనూ లోపలికి వచ్చి మీ నాన్నగార్నొకసారి కలుసుకోనా?"
"వద్దు. వద్దు. నేను వెళతాను".
"సరే. రేపు కలుసుకుందాం. రేపట్నుంచి హరనాథరావుగారులేని ఆస్పత్రి ఎలా వుంటుందో-పోనీయవోయ్-" రిక్షా కదిలింది.
ఆమె వెళ్ళి తలుపు తట్టింది. అందరూ గాఢ నిద్రలో వున్నారు. కాబట్టి గట్టిగా బాదవలసి వచ్చింది. తండ్రి వచ్చి తలుపు తీసాడు. తల్లి కూడా లేచింది. అర్థరాత్రి ఇంటికొచ్చిన అమ్మాయిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కూతురుమొహం అదోలా వుండటం చూసి, "ఏమయిందే" అని అడిగింది తల్లి. ఉత్పల అందరివైపూ చూసింది. అంతమంది తన వాళ్ళ కళ్ళలో అంత ఆత్మీయతా భావాన్ని చూడగానే అప్పటి వరకూ ఆపుకున్న దుఃఖం ఒక్కసారిగా బయటకు వచ్చింది. తల్లిని కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది.
తన ఇంటికి వెళ్ళే వరకూ శ్రీనివాసరావుకి గాలిలో తెలిపోతున్నట్టే వుంది. పక్కన ఇంకా ఉత్పల తాలూకు మెత్తటి శరీరం తగులుతున్నట్టే వూహించుకోసాగాడు.
ఇంటి దగ్గర రిక్షాదిగి, డబ్బులిచ్చి పంపేసి తలుపు కొట్టాడు. భార్య వచ్చి తలుపు తీసింది. అతడలా అర్థరాత్రిపూట ఇంటికి రావటం అలవాటే. నైట్ డ్యూటీ అని చెపుతాడు. కానీ కాదని ఆవిడ నమ్మకం. నైట్ డ్యూటీలున్న రాత్రిళ్ళు ఇంటికి వస్తాడు.
అతడు లోపలికి వచ్చి పుస్తకాల అల్మైరాలో కాగితాలు పడేసి, చొక్కా విప్పసాగాడు. అతడి మొహం అదోలా వుండటం చూసి, "ఏం జరిగిందండీ" అని అడిగింది భార్య. శ్రీనివాసరావు "ఏం లేదులే" అని పక్కమీదవాలేడు. అలా అడిగింది భార్య కాకుండా మరే స్త్రీ అయినా, ఆమెకు యాభై ఏళ్ళ వయసున్నా కూడా, అతడు వివరంగా చెప్పేవాడే. కానీ ప్రస్తుతం అటు తిరిగి కళ్ళు మూసుకున్నాడు. అయిదు నిముషాలు గడిచాయి.
శ్రీనివాసరావు భార్య పక్కకి తిరిగి భర్త వైపు చూసింది. అతడి కృష్ణలీలలు. అర్థరాత్రి ఆస్పత్రి నుంచి వచ్చే డ్యూటీలూ ఆవిడకి తెలుసు. ఈ రోజు వచ్చినప్పుడు అతడి మొహంలో అదోలాటి మార్పు గమనించింది. చేతిలో కాగితాల్ని చూసింది.ఏ ఆడపిల్లో "మీకు పెళ్ళయినా ఫర్వాలేదు. మనది జన్మజన్మల అనుబంధం" లాటి వుత్తరం వ్రాసిందేమో అనుకుంది. ఈ లోపల బాత్ రూమ్ లోకి వెళ్తున్నట్టు మంచందిగి! వెళ్తూ వెళ్తూ యథాలాపంగా, పుస్తకాల మీదవున్న ఆ వుత్తరాన్ని తనతోపాటు తీసుకువెళ్ళింది. బాత్ రూమ్ బోల్టు బిగించుకుని ఉత్తరం చదవటం ప్రారంభించ బోయింది.
అంతలో బయట తలుపుకొట్టిన చప్పుడు వినిపించింది.
శ్రీనివాసరావుకి అప్పుడే నిద్రపడుతూంది. అంతలో తలుపు చప్పుడు వినిపించింది. అంత అర్థరాత్రి తలుపు తట్టేదెవరా అనుకుంటూ వెళ్ళి తీసాడు. ఎదురుగా ఒక బలిష్టమైన వ్యక్తి నిలబడి "శ్రీనివాసరావు గారు మీరేనా" అని అడిగాడు.
"అవును"
"నేను సి.బి.ఐ. నుంచి వచ్చాను".
శ్రీనివాసురావుకి భయం వేసింది "ఏం..... ఏం కావాలి" అని అడిగాడు.
"లోపలికి రావొచ్చా-"
"రం. రండి-"
అతడు లోపలికివచ్చి ముందుగదిలో కూర్చున్నాడు. ఇంతలో బాత్ రూమ్ లోపల్నుంచి శ్రీనివాసరావు భార్య వచ్చేసింది. ఆమె ఆ వుత్తరాన్ని చదవలేదు. 'నేను- నా పిల్లలు' అని చూడగానే ముఖ్యంగా అదేదో మొగవాడు వ్రాసిన వుత్తరం అని తెలియగానే ఆమెకి దానిమీద వుత్సాహం పోయింది. వస్తూ వస్తూ దాన్ని తీసిన చోటే పడేసింది.
బయట సంభాషణ జరుగుతూంది.
"రెండు గంటల క్రితం ఆస్పత్రిలో వరుసగా హత్యలు జరిగినప్పుడు మీరక్కడే వున్నారు కదూ".
"ఉన్నాను. కానీ నేనేమీ చూడలేదు" భయంగా అన్నాడు శ్రీనివాసరావు. అరగంట క్రితం అమ్మాయి పక్కన పులిలా మాట్లాడిన వాడు ఇప్పుడు పిల్లిలా వున్నాడు.
"అబ్బే మీరు చూసారనటం లేదు. మా డ్యూటీ మేం చెయ్యాలి కదా. అందుకే వరుసగా అందర్నీ ప్రశ్నించుకుంటూ వస్తున్నాం. ఇదంతా రొటీన్. రెండు మూడు రోజుల్లో ఫైలు మూసేస్తాం- అసలు హంతకుల్ని పట్టుకుని".
అందుకే వీళ్ళని సి.బి.ఐ. కీ వున్న తేడా తెలియదు అతడికి! హత్య జరిగిన రెండు గంటల్లోనే సి.బి.ఐ. రంగంలోకి దిగే అవకాశం లేదనీ, అది పోలీసు కేసనీ, ఆ మాటకొస్తే పోలీసులకన్నా సి.బి.ఐ. నాలుగు రెట్లు మందకొడిగా పనిచేస్తుందనీ తెలిసే అవకాశం లేదు.
"విష్ణుశర్మని మీ ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు బట్టలు మార్చింది మీరే కదా-"
శ్రీనివాసరావు గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి.
"నేను కాదు. కొత్తగా జాయినయిన ఇంకో కుర్రవాడు ...... దేనికి?"
"ఎందుకిలా అడుగుతున్నారు?"
"సాధారణంగా ఇలాటివి జరిగినప్పుడు పోలీఉస్లు ముందు జేబులు వెతకాలి. కానీ ఆ డిపార్ట్ మెంట్ సంగతి మీకు తెలియనిదేముంది? అంతా హడావుడి....."
-సి.బి.ఐ. ఆఫీసర్ అంత మర్యాదగా మాట్లాడుతూ వుండేసరికి అతడు సర్దుకున్నాడు.
"ఆ చచ్చిపోయిన రోగి బట్టల్లో ఏమైనా వున్నాయేమోనని కనుక్కోవటానికి వచ్చాను అంతే".
ఉత్తరం సంగతి చెపుదామనుకున్నాడు. కానీ భయం వేసింది. అప్పుడే ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నిస్తారేమో అనుకున్నాడు. కానీ అంతలోనే మరో భయం వేసింది. ఈ రాత్రికి రాత్రే వీళ్ళు పరిశోధన ప్రారంభించారంటే బహుశా ఇంకో గంటలో ఉత్పల దగ్గిరకి కూడా వెళతారు. ఆ వుత్తరం గురించి కానీ ఆమె చెప్పేస్తే....
"మీరెందుకో తటపటాయిస్తున్నారు. మీకేదైనా తెలుస్తే చెప్పండి"
శ్రీనివాసరావు చెప్పలేదు.
"ఈ కేసు విషయంలో సహాయం చేసిన వాళ్ళకి రెండు వేల రూపాయిలు బహుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిశ్చయం చేసింది".
ఉలిక్కిపడ్డాడు! రెం....డు....వే....ల.....రూ.....పా....య...లు.
"ఒక ఉత్తరం వుంది" అన్నాడు.
బుల్లెట్ లా , వెంటనే దూసుకువచ్చింది "ఏ వుత్తరం?" అన్న ప్రశ్న.
"విష్ణుశర్మ చనిపోతూ వ్రాసింది."
"ఎక్కడుంది అదీ?"
శ్రీనివాసరావు కళ్ళముందు ఒక దృశ్యం మెదిలింది.
పెద్ద ఫంక్షను.....పోలీసు అధికారులందరూ బారులు తీర్చి వేదిక మీద కూర్చున్నారు......ముఖ్యమంత్రి చిరునవ్వుతో మైకు దగ్గర నిలబడి పేరు పిల్చారు..... ఒక హత్య కేసులో సాయపడినందుకు చెక్కు అందివ్వబడింది..... అంతా హర్షథ్వానాలు..... ఉత్పల, తను వెళ్ళి.....
అవును. ఉత్పల కూడా కావాలి!
అతడి ఆలోచన్లు రాకెట్ కన్నా వేగంగా సాగుతున్నాయి.
ఈ సందర్భంగా ఉత్పలతో స్నేహం పెంచుకోవచ్చు. ఈ వుత్తరం దొరికింది ఆమెకే అని చెపుతే ఆమెకి తన మీద గౌరవం పెరుగుతుంది. ఆమెతో పరిచయంపెరుగుతుంది. ఆ నేఒం మీద ఆమెని చాలాసార్లు పోలీస్ స్టేషన్ కీ, ఇంకా బయటకీ తీసుకువెళ్ళవచ్చు. ఓ వెయ్యి రూపాయిలు వదులుకోవటం ద్వారా ఆమె దృష్టిలో తనో గొప్పవాడుగా స్థిరపడవచ్చు. ఆమెని తనతో కలుపుకోవచ్చు.
"ఎక్కడుందా వుత్తరం?"
"ప్రస్తుతం ఉత్పల అనే ఆమె దగ్గరుంది".
"ఆవిడ దగ్గరకి ఎలా వెళ్ళింది?"