అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ విష్ణుశర్మ, పోలీసు అధికారుల మరణం సంచలనం కలిగించవచ్చు.
"ఒకవేళ ఆ బద్మాష్ గాడు (విష్ణుశర్మ) బయటపడ్డా ఏమై వుండేది దాదా? వాడు పోలీసుల దగ్గిరకెళ్ళి అంతా చెప్పినా ఏ ఆధారంతో మనని అరెస్ట్ చేయగలరు?" అని అడిగాడు సలీం శంకర్- తమలపాకుల మీద జర్దా వేస్తూ, విష్ణుశర్మ తప్పించుకున్నాడు అన్నప్పుడు ఎంత రిలాక్స్ ద్ గా వున్నాడో, ఇప్పుడూ అలాగే వున్నాడతడు.
"పోలీసుల దగ్గిరకి వెళితే పర్వాలేదు. పేపర్లకి తెలుస్తేనే కష్టం. లక్ష కళ్ళు నిన్ను గమనిస్తూ వుంటాయి. ఇక్కడ కోర్టు నుంచి బయటపడ్డ మరుక్షణం నుంచీ అక్కడ జపాన్ లో గాస్ ఛాంబర్ లో ప్రవేశించేవరకూ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు......" అన్నాడు దాదా వ్యంగ్యంగా.
"నాకీ పథకం అంతగా నచ్చలేదు దాదా! నా పేరు మీద జపాన్ కి ఎవ్వడో వెళ్ళిన మరుక్షణం నుంచీ నేనిక్కడ పేరు మార్చుకుని బ్రతకటం-"
"ఆ విషయం గురించి జపాను పవిత్ర భూమిలో నువ్వు రేప్ చేస్తూన్నప్పుడూ హత్యలు చేస్తున్నాప్పుడూ ఆలోచించి వుండవలసింది-" రిటార్ట్ ఇచ్చాడు దాదా హిందీలో. ".......పూర్తిగా అండర్ గ్రౌండ్ కి వెళ్ళి పోకుండా కనీసం బజార్లో - ఇంకో పేరుతోనైనా తిరగటానికి నీకు వీలు దొరికింది. అందుకు సంతోషించు. ఒకసారి మనం చూసుకోవచ్చు! అయినా శంకర్!! ఇంతకాలం నేనే పథకాలు వేస్తూ వచ్చాను కదా! పోనీ నిన్ను తప్పించే విధానమై నువ్వే ఒక ఆలోచన చెప్పకూడదూ ఫరేఛేంజ్?"
చెప్పలేనని అతడికి తెలుసు. నవ్వి- ఆ మాటే అన్నాడు.
"అటువంటప్పుడు నోర్మూసుకుని నేను చెప్పింది చెయ్యి".
దాదా అంత విసుగ్గా వుండటం శంకర్ ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ చిరునవ్వుతో కామ్ గా వుండే మొహంలో ఏదో 'ఇబ్బంది' కనపడుతూంది "ఏమైంది దాదా?" అని అడిగాడు.
దాదా లేచి పచార్లు చేయటం ప్రారంభించాడు.
"ఈ విష్ణుశర్మ విషయం నాకెందుకో, అంత సంతృప్తిగా ముగియలేదనిపిస్తుంది. ఢిల్లీలో వున్నప్పుడు అతడిని వీలైనంత స్వేచ్ఛగా వదిలేసేం. బయటకు వెళ్ళకపొయినా లోలోపల మనతో పాటే తిరిగేవాడు. జపాను వెళ్ళే వరకూ అతడిని ఏ విధంగానూ 'డిస్టర్బ్' చేయకూడదనే అభిప్రాయంతో మనం ఈ విధంగా చేయటం ఇప్పుడు ప్రమాదానికి దారి తీసింది. అతడికి చాలా విషయాలు తెలుసు. అతడిని ఒక బందీగా చూస్తే- ఎదురు తిరుగుతాడేమో అనుకుని, మనవాళ్ళు కూడా అతడిని దాదాపు తమలో ఒకదిగానే చూసుకున్నారు. చావటానికి సిద్ధపడ్డాడు కాబట్టి, తమకన్నా ఎక్కువ ధైర్యవంతుడిగా అతడికి గౌరవం ఇచ్చారు".
"కానీ వాడిప్పుడు మరణించాడు".
దాదా మాట్లాడలేదు. పచార్లు కొనసాగించాడు. కొంచెంసేపటికి ఆగి, అతడు తన పిల్లల గురించి పక్కింట్లో వాకబు చేసాడన్నావు కదూ" అని అడిగాడు.
"అవును"
"ప్రొద్దున్న రైల్లో దిగి- సాయంత్రం వరకూ ఇంటి దగ్గర చూసి, పిల్లలు కనపడకపోవడంతో ఆపుకోలేక పక్కింటికి వెళ్ళి వుంటాడు. అక్కడ కూడా మనవాళ్ళని పెట్టాను. కానీ వీలైనంతవరకూ విష్ణుశర్మని ప్రాణాల్తోనే పట్టుకొమ్మని చెప్పాను."
"ఎందుకు"
"వాడికి పిల్లలంటే చాలా ప్రేమ. వీళ్ళని కాస్త బాధ పెడితే గప్ చుప్ గా జపాను వెళ్ళిపోతాడు అనుకున్నాను. ఆ విషయంలో నేను హామీ ఇవ్వగలను".
"ఇప్పుడింకేం లాభం? అంతా అయిపొయిందిగా".
దాదా ఆ మాటల్ని పట్టించుకోలేదు. సాలోచనగా "సాయంత్రం వరకూ ఏదీ బయటకు పొక్కలేదంటే, వాడీ విషయాన్ని ఎవరికీ చెప్పలేదన్నమాట" అన్నాడు.
"ఆ పోలీస్ స్టేషన్ తాలూకు సబ్ ఇన్ స్పెక్టర్ మనవాడు కాకపోవటంతో వచ్చింది ఇదంతా".
"అవును. ఆ కట్ మల్ గాడు నీతి నిజాయితీ అంటూ మాట్లాడుతూ వుంటాడు".
చాలా సేపటి తరువాత వసంత్ దాదా మొహంలో చిరునవ్వు కనపడింది.
"అందుకేగా ఫలితం అనుభవించాడు" అన్నాడు. సరిగ్గా అదే సమయానికి తలుపు తెరుచుకుని డేవిడ్ లోపలికి వచ్చాడు.
"ఏమైంది డేవిడ్? ఏం జరుగుతుంది అక్కడ?"
"చాలా హడావుడిగా వుంది. పోలీస్ స్టేషన్ మెట్ల మీద, ఆపరేషన్ థియేటర్లో- ముఖ్యంగా పోలీసుల్ని చంపటంతో దాదాపు పత్రికల వాళ్ళంతా అక్కడే వున్నారు. డి.సి.పి. కూడా వచ్చాడు".
"ఏడిసాడు. అర్థరాత్రి పెళ్ళాం పక్కలోంచి లేచొచ్చి ఏం సాధిస్తాడట?" శంకర్ పక్కనుంచి అన్నాడు.
"రుజువులూ సాక్ష్యాలు దొరికాయి. హంతకుల్ని త్వరలోనే బంధిస్తాం- అని విలేకర్లతో చెప్పాడు".
ఈసారి శంకర్, వసంత్ దాదా- ఇద్దరూ నవ్వారు. "నడిరోడ్డున రిక్షాలోంచి లాగి చంపినప్పుడూ అదే చెపుతారు వాళ్ళు" అన్నాడు శంకర్.
"కాదు. ఏదో కాగితం దొరికిందట. 'నేను చచ్చిపోతే' అనో- 'నామరణం సంభవిస్తే' అనో దాని మీద వ్రాసుందట".
హఠాత్తుగా ఇద్దరి మొహాల్లో చిరునవ్వు మాయమైంది. ఒకర్నొకరు చూసుకున్నారు. డేవిడ్ తొందర తొందరగా మిగతాది చెప్పాడు. "మనవాళ్ళు అనుకున్నట్టు జరిగిపోయింది. మనవాళ్ళు వెళ్ళిపోయినా రెండు నిముషాలకి లోపల్నుంచి కేకలు అరుపులు వినపడ్డాయి. ఇద్దరు ముగ్గురు అరుస్తూ బయటి కొచ్చారు. పదిహేను నిముషాల తర్వాత పోలీసులు అక్కడికి వచ్చే సమయానికి అక్కడంతా తీర్థ ప్రజల్లా తయారయ్యారు అంతా జనమే. నేనూ సంతోషించాను. ఎంత మంది జనం చేరితే అంత కంగాళి అయి, మిగిలిన సాక్ష్యాలేమన్నా వుంటే పోతాయి."
"అవన్నీ అక్కర్లేదు. అసలు విషయం చెప్పరా బాడఖోవ్" శంకర్ అరిచాడు.
"ఆ ఇన్ స్పెక్టర్ నన్ను గుర్తుపడతాడు. అందుకని రామూని లోపలికి పంపాను. అతడొచ్చి F.I.R.(ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) ఇచ్చి లోపలికి వెళ్ళిపోయాడు. ఏదో కాగితం మాత్రం రక్తంలో తేలుతూ వుందట. దాని మీద హెడ్డింగ్ మాత్రం ఇది వుందట".
"రామూ ఏడి? క్విక్ ...... రామూ ఏడి?"
"ఇంకో అయిదు నిముషాల్లో మొత్తం వివరాలన్నీ పట్టుకొస్తాడు".
"మనం అక్కడికి వెళ్ళాలి-" అని లేవబోతూన్న శంకర్ చేతి మీద చెయ్యి వేశాడు దాదా. "వద్దు. వాడినే రానీ, నువ్వీ సమయంలో అక్కడికి వెళ్ళటం అంత మంచిది కాదు. చీకట్లో వున్నాసరే....."
ఆ అయిదు నిముషాలూ టెన్షన్ తో గడిచాయి. రామూ వచ్చాడు. అతడొ చిన్న తరహా గూండా. శంకర్ కి అనుచరుడు. పొట్టిగా లావుగా వున్నాడు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులతో భాగం పంచుకుని వాగన్లు లూటీ చేస్తూ వుంటాడు. మత కలహాల సమయంలో ఇళ్ళని దోచేస్తాడు. పోలీసుల్తో దగ్గిర పరిచయాలున్నాయి. ఇన్ఫార్మెంట్ లా నటించి వాళ్ళ నుంచి వివరాలు రాబడతాడు.
రామూ మొత్తం వివరాలన్నీ చెప్పాడు. దాని సారాంశం ఇది.
-విష్ణుశర్మ చనిపోబోయే ముందు అంతా వ్రాసి పెట్టుకున్నాడు. అవి మూడుకాపీలు తీసాడు. రెండు రక్తంలో తడిసి దొరికొనయ్. వాటి వల్ల ప్రమాదం లేదు. అక్కడక్కడా కొన్ని వాక్యాలు కనిపిస్తున్నా ఏమీ అర్థం కాదు. కానీ అందులో ఒక వాక్యమే- ఇటువంటివి మూడు కాపీలు తీసాను అన్నదే అనుమానాలు రేకెత్తిస్తున్నది. ఒక వేళ వాడుగానీ అలా తీసి వుంటే ఆ మూడో కాపీ ఏమైంది అంతు బట్టడం లేదు.
రామూ చెప్పింది విని సలీంశంకర్, వసంత్ దాదాలు ఆలోచనలో పడ్డారు. ఆ కాగితాల్లో ఎంతవరకూ వ్రాసి వుంటాడు అన్నదే వాళ్ళ ఆలోచన.
"ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక తప్పైనా చేస్తూ వుంటాడు దాదా! ఆ విష్ణుశర్మ గాడ్ని పూర్తిగా నమ్మటమే నువ్వు చేసిన తప్పు".
"అవును...... కానీ చేసిన తప్పుని ఎంత తొందరగా దిద్దుకోగలమా అన్నదాన్ని మీదే మన తెలివితేటలు అక్కరకు రావాలి! ఇప్పుడు మనకి తెలియవలసిన ఏమేం ప్రమాదకరమైన పాయింట్లు వెల్లడి చేయాలనుకున్నాడు? ఇది మొదటిది. ఆ కాగితం ఎక్కడుంది? -ఇది రెండోది-అతి ముఖ్యమైనది" సాలోచనగా అన్నాడు వసంత్ దాదా. కొంచెం సేపు ఆగి, మళ్ళీ అన్నాడు.
".......విష్ణుశర్మ పోలీస్ స్టేషన్ మెట్ల మీద కూలిపోగానే లోపల్నుంచి పరుగెత్తుకు వచ్చిన సాబ్ ఇన్ స్పెక్టర్, అంబులెన్స్ కోసం కూడా చూడకుండా, జనరల్ హాస్పిటల్ వరకూ వెళ్ళకుందా దగ్గరలో వున్న ఆస్పత్రికి తీసుకు వెళ్ళాడు. ఈ విషయం ఇన్ఫార్మెంటు ధృవీకరించాడు".
(సాధారణంగా మాఫియా ఆపరేషన్స్ ఎలా వుంటాయంటే, ఒక హత్య చేసి ఒక గ్రూపు వెళ్ళి పోతుంది. రెండో గ్రూపు అక్కడే జనంతో చేరి శవం చుట్టూ చేరి, మిగతా ఏవైనా సాక్ష్యాధారాలుంటే వాటిని నాశనం చేస్తారు. పోలీసులు ఏం మాట్లాడుకునేది వినటానికి ప్రయత్నిస్తారు. దీని మీద రిపోర్టుని తమ బాస కి నివేదిస్తారు. ఆ రిపోర్ట్ నే F.I.R.అంటారు)
".......కాబట్టి విష్ణుశర్మ బట్టల్లో ఆ మూడు కాపీలూ వుండి వుండాలన్న మాట" అంటూ తన ఆలోచనని పూర్తి చేశాడు.
"కానీ తన పోలీస్ స్టేషన్ ఆఫీసు ముందు ఒక హత్యా ప్రయత్నం జరిగితే- అసలా చచ్చిపోబోతున్న వాడెవడా అని జేబులు వెతక్కుండా వుంటాడా ఆ ఇన్ స్పెక్టర్?" సందేహం వెలిబుచ్చాడు సలీంశంకర్.
"మామూలు ఇన్ స్పెక్టరైతే అదే చేసేవాడు. అంతేకాదు. జనరల్ ఆస్పత్రి పది కిలోమీటర్ల దూరం వున్నా రూల్స్ ప్రకారం అక్కడికే తీసుకెళ్ళేవాడు. మధ్యలో రోగి చచ్చి పోయినా సరే! అంతేకాదు. రేప్రోద్దున తనని సస్పెండ్ చేస్తారుమోనని భయపడి, అంబులెన్సు వచ్చే వరకూ ఆగేవాడు. ఈ సాబినస్పెక్టర్ అదేమీ చేయలేదంటే, రూల్స్ కన్నా ప్రాణం ముఖ్యం అని నమ్మినవాడై వుంటాడు! అలాటివాడు ఆ కాగితాలు వెతికి పట్టుకుంటాడని అనుకోను".
-సరీగ్గా అరగంట క్రితం ఏడు హత్యలు జరిగినా కూడా అంత నిబ్బరంగా తర్కం ఆలోచిస్తున్న దాదా వైపు ఈసారి సలీం శంకర్ కూడా ఆశ్చర్యంగా చూసాడు.
"........కాబట్టి ఎవరో ఈ ఇన్ స్పెక్టర్ కి కాగితాలు తెచ్చి అందించి వుండాలి. ఎవరై వుంటారు?"
"విష్ణుశర్మ శరీరం నుంచి బట్టలు విప్పిన వాళ్ళయి వుంటారు" శంకర్ చప్పున అన్నాడు.
"అవును" అన్నాడు రాము పక్క నుంచి అందుకుని. "మన గ్రూపు పిస్తోళ్ళు కాల్చి వెళ్ళిపోగానే మిగతా జనంతో పాటూ నేనూ లోపలికి పరుగెత్తాను. మొత్తం ఆరుగురూ చచ్చిపోయి వున్నారు. ఆపరేషన్ టేబుల్ మీద వున్న వాడితో సహా కలిసి ఏడుగురు. అందరూ పూర్తిగా చచ్చారో లేదో చూడమని నన్ను పంపారు. జనంలో కలిసి పోయి నేను చేసింది అదే. అప్పుడు చూసాను-ఆ శర్మగాడి వంటి మీద బట్టల్లేవు. ఆస్పత్రి గుడ్డలున్నాయంతే. ఇంకా ఆపరేషన్ మొదలవలేదట. అప్పుడే వాడికి స్పృహ రావటంతో వాడెలాగూ బ్రతకడని నిశ్చయించుకుని, డాక్టరు ఇనస్పెక్టర్ని లోపలికి రమ్మని పిలిచాడు, వాజ్ఞూలం కోసం".
"ఇనస్పెక్టర్ లోపలికెళ్ళేసరికి మనవాళ్ళు మొత్తం అందర్నీ చంపాల్సి వచ్చింది. ఆ విష్ణు శర్మగాడు వాళ్ళకి ఆ పాటికే ఏం చెప్పి వుంటాడో, మన వాళ్ళకి తెలీదు కదా! ఏ మాత్రం రిస్కు తీసుకోవద్దనీ, ఏ శేషమూ మిగల్లేదు" అన్నాడు శంకర్.