ఆమె అతడివైపు పిచ్చిదాన్లా చూస్తూ "ని...జ...మే... ని...జ...మే... కదూ..." అని గొణుక్కుంది. పోలీసులు అరెస్ట్ చేసినప్పటి నుంచీ ఆమె ఏడవలేదు. ఇప్పుడొచ్చింది ఏడుపు. చల్లగాలి తాకిడికి మేఘం వర్షించినట్లు... ఒక్క మనిషి తనవైపు వకాల్తా పుచ్చుకుని మాట్లాడేసరికి ఆమె బేలగా ఏడవటం మొదలుపెట్టింది. అప్పటి వరకూ బిగించిపట్టుకున్న బింకంపోయి ఒక సాధారణ స్త్రీలా దుఃఖించ సాగింది.
అతడు ముందుకు చేతులు సాచబోయి చప్పున ఆగిపోయాడు. 'ఊహూ ఇదికాదు, ఇలాకాదు?' అనుకున్నాడా? 'కాదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవటం ప్రేమ అవదు' అనుకున్నాడా? ఏమో. అతడి మనసులో ఏ భావం కదలాడిందో అతడికే తెలీదు. తలవంచుకుని అక్కణ్ణుంచి వెనుదిరిగి కదిలిపోయాడు.
అతడు తలెత్తి చూసేసరికి లేడు.
ఒక చెయ్యి ఫాంటు జేబులో పెట్టుకొని మరొక చెయ్యి చేతిసంచిమీద వేసి, అతడు పోలీస్ స్టేషన్ మెట్లుదిగి కాంపౌండ్ వాల్ గేటు దగ్గర్నుంచి బయటకు వస్తూండగా పక్కనుంచి "సిద్ధార్థస్వామీ" అని వినిపించింది.
ఉలిక్కిపడ్డాడు. చాలాకాలం తరువాత, మొట్టమొదటిసారి అలా అదిరిపడటం!
...ఉలికిపాటును కప్పిపుచ్చుకుంటూ తలతిప్పి చూసేడు.
ఇన్ స్పెక్టర్ రవిశాస్త్రి అతడి దగ్గరకి వస్తున్నాడు.
గుడ్ మార్నింగ్ నా పేరు రవిశాస్త్రి. ఇన్ స్పెక్టర్ ని" చేయిసాచి అన్నాడు.
అనుదీప్ ఆ చెయ్యి అందుకోలేదు. శాస్త్రివైపే చూస్తూ వుండిపోయాడు.
"అలా నడుస్తూ మాట్లాడుకుందామా?" అని అడిగాడు శాస్త్రి. ఇద్దరూ నడక సాగించారు.
"నిన్నే నేను ఖుందేర్ గాఁవ్ నుంచి వచ్చాను" ఉపోద్ఘాతంగా అన్నాడు శాస్త్రి. "పదిహేను రోజుల క్రితం అక్కడ సిద్ధార్థస్వామి మాయమయ్యాడు" వెటకారం ధ్వనించకుండా జాగ్రత్తపడుతూ అన్నాడు.
"వివరాలు అక్కర్లేదు. నేను సిద్ధార్థస్వామిని. అయితే నేనాపేరు పెట్టుకోలేదు. అక్కడి జనం నాకా పేరు పెట్టారు. అందులో నా తప్పేం లేదు".
"మీ తప్పు వుందని నేననలేదు. మీరు అర్థంతరంగా తపస్సు ఎందుకు మానేశారో తెలుసుకోవచ్చా?"
"దైవసాక్షాత్కారం లభించింది కాబట్టి" క్లుప్తంగా అన్నాడు అనుదీప్.
శాస్త్రి ఆశ్చర్యంగా అతడివైపు చూశాడు. అనుదీప్ మొహం భావరహితంగా వుంది.
"దేవుడు కనపడ్డాడా?"
"కనపడ్డాడు".
"ఏమన్నాడు?"
"మామూలే. నీ భక్తికి మెచ్చితిని, నీకేం కావాలో కోరుకో అని".
"మరి ఏం కోరుకున్నారు?"
"ఏమీ కోరుకోలేదు-"
"వ్హాట్?"
"అవును. నేను తపస్సు చేసింది విద్యాధరి అనే అమ్మాయి ప్రేమ కోసం. కానీ అన్నేళ్ళు తపస్సు చేసి తీరా దేవుడు ప్రత్యక్షమయ్యాక నాకేమనిపించిందంటే...."
"ఏమనిపించింది?"
"నా ప్రేమకి భగవంతుడి రికమండేషన్ ఎందుకు అనిపించింది. నేను కోరగానే ఆ దేవుడు గాలిలో చెయ్యి ఊపుతాడు... విద్యాధరి గుండెల్నిండా ప్రేమ పొంగి పొర్లి - నన్ను ప్రేమించటం మొదలుపెడుతుంది. అలాటి ప్రేమ నాకెందుకు? నా స్వశక్తితో సంపాదించుకోవాలి గానీ, భగవంతుడి సాయంతో కాదు. ఆ మాటే దేవుడితో చెప్పాను".
"ఏమన్నాడు?"
"ఆశ్చర్యపోయాడు. మరింతకాలం తపస్సు ఎందుకు చేశావు అని అడిగాడు. ఈ సత్యం తెలుసుకోవటానికి అన్నాను. నవ్వేడు. నీ పేర్న బోలెడు పుణ్యం జమ అయివుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చెయ్. స్వర్గంలో స్థానం ఉంటుంది- అన్నాడు".
"మరి అతడితోపాటు వెళ్ళిపోకుండా మనుష్యుల మధ్యకి తిరిగి ఎందుకొచ్చావు?"
"ఆఖరి ప్రయత్నం చేద్దామని".
"ఏదీ విద్యాధరి ప్రేమని పొందటమా?"
"అవును. ఈ విషయం చెప్తే దేవుడు దానికి కూడా నవ్వేడు. పిచ్చివాడా! దేవుడినై ఉండి నేనే మనుష్యుల గుండెల్లో గుప్పెడంత ప్రేమని నింపలేకపోయాను. నువ్వేం చేయగలవు అన్నాడు. ప్రయత్నించటంలో తప్పులేదుగా- అన్నాను. మేమిద్దరం కలిసి కొన్ని సూత్రాలు పెట్టుకున్నాం. ఆ నిబంధననలకు లోబడి ఆమె ప్రేమని పొందాలన్నమాట".
"ఏమిటవి?"
1. "నన్ను నన్నుగా ఆ అమ్మాయి ప్రేమించేలా చేసుకోవాలి. నా వాక్చాతుర్యంతో గాని, నా ధీరోదాత్త మయిన చర్యలతోగానీ, మంచి బహుమతులు ఇవ్వటం ద్వారాగానీ, మోర్నింగ్ షోలకి తీసుకువెళ్ళటం ద్వారాగానీ, పొరపాటున తగిలినట్టు శరీరం తాకించి, ఆ విధంగా ఆ అమ్మాయిలో మొగస్పర్శ తాలూకు టెమ్టేషన్ కలిగించటం ద్వారాగానీ, ఆ అమ్మాయికి దగ్గర కాకూడదు.
2. ఆ అమ్మాయి అభిప్రాయాల్తో ఏకీభవిస్తున్నట్టు మాట్లాడటం, ఆ అమ్మాయి కష్టాల్లో వుంటే ఓదార్చి, ఆ విధంగా దగ్గరవటం, నా కష్టాలు ఆమెకి చెప్పి ఆమె సానుభూతి పొందటానికి ప్రయత్నించటం- ఇలాటివి చెయ్యకూడదు.
3. ఏ విధమైన వాగ్ధానాలూ - అంటే, మంచి భవిష్యత్తు, సుఖప్రదమైన సంసారం, సెక్యూరిటీ, ఇలాటివేమీ ఆశ చూపకూడదు" అనుదీప్ గుర్తు తెచ్చుకుంటూ చెప్పాడు.
శాస్త్రి అతడివైపు వెర్రివాణ్ణి చూసినట్టు చూశాడు.
"ఇలా అయితే విద్యాధరి కాదుకదా...ఏ అమ్మాయీ నిన్ను ప్రేమించదు. ఏ అమ్మాయి అయినా నిన్నెందుకు ప్రేమించాలి? నువ్వామె భర్తవి కావు. కనీసం సరదాగా కూడా మాట్లాడవు. చిన్న బహుమతి కూడా కొనిపెట్టవు. కనీసం ముద్దుకూడా పెట్టుకోవు. మరి నిన్నెందుకు ప్రేమించాలి? ఆమె 'సరే అంటే' పెళ్ళి చేసుకోవటానికి ఎందరో యువకులు ఉన్నారు. 'ఉట్టి స్నేహమే' అయితే లక్షలమంది క్యూలో ఉంటారు. ఇందర్ని కాదని నిన్నెందుకు ప్రేమించాలి?"
"అందరికన్నా ఎక్కువగా నేను ఆమెను ప్రేమిస్తున్నాను కాబట్టి. వాళ్ళందరిదీ స్వార్థం. సంసారం, శారీరక సుఖం, పొగడ్త, తమకో గృహం... ఇవన్నీ ఆలోచించి ప్రేమిస్తున్నారు. నేనలా కాదు. నా ప్రేమ నిస్వార్థమైనది. ఆమె నాకవసరంలేదు. గుర్తింపు కావాలి. నిస్వార్థమైన ప్రేమకి ఈ ప్రపంచంలో గుర్తింపు లేదా? ఆ ప్రశ్నకి జవాబు కావాలి".
రవిశాస్త్రికి కొద్దిగా అర్థమైంది - కొద్దిగా కాలేదు.
"ఆమెకి నీ గురించి ఏమీ తెలీదు. ఎందుకు ప్రేమించాలి?"
"చాలా మంచి ప్రశ్న. నేటి యువతరపు గుండెల్లోకి సూటిగా వెళ్ళవలసిన ప్రశ్న. ఏం తెలుసుకొని ఒకర్నొకరు ప్రేమిస్తున్నారు అన్నది. నాలుగుసార్లు కలుసుకోగానే ప్రేమ ఉత్పన్నమవుతున్నది వీరిమధ్య. దానికన్నా నా ప్రేమ బెటరుకదా. నేను ప్రేమించమని అడగడం న్యాయసమ్మతం కదా".
"మరి దీనికి దేవుడు ఏం సమాధానం చెప్పాడు?"
"సర్వ సార్వభౌమత్వం అడుగు ఇస్తాను. మణులు మాణిక్యాలు అడుగు ఇస్తాను. ఇలాంటి ఇబ్బందికరమైన ప్రశ్నలు మాత్రం అడక్కు. మనుష్యుల సంగతి నాకు తెలీదు-అన్నాడు. నేనే కనుక్కుంటాను. నెల రోజుల టైమ్ ఇమ్మనమని అన్నాను. ఇరవై అయిదు రోజులు అయిపోయాయి. ఇంకో అయిదు రోజులే ఉంది. ఈ లోపు ఆమె నా ప్రేమని అంగీకరిస్తే వుంటాను. లేకపోతే వెళ్ళిపోతాను".
"కానీ ఆమె మెడలోతు ఊబిలో కూరుకుపోయి వుంది ప్రస్తుతం. అయిదు రోజులు కాదుకదా అయిదు సంవత్సరాలకయినా బయటపడుతుందని నేను అనుకోను. అన్నట్లు నువ్వు సర్వశక్తి సంపన్నుడివి కదా. నీ ప్రేమ స్వచ్చమైనదీ, బలమైనదీ అయితే ఆమెని బయటికి తెచ్చేమార్గం ఆలోచించలేవూ? అఫ్ కోర్స్.... ఆమె నిర్దోషి అయితేనే సుమా".
"ఆమె దోషో కాదో నిర్ణయించటానికి మానవాతీత శక్తులూ, దైవమహిమలూ అవసరం లేదనుకుంటాను. మీ డిపార్టుమెంటు వారు కాస్త తార్కికంగా ఆలోచిస్తే చాలు".
"ఏమిటి నీ ఉద్దేశ్యం?"
"ఇప్పుడే లోపల చెప్పి వచ్చాను" అంటూ ఫ్లవర్ వేజ్ గురించి వివరణ ఇచ్చాడు. శాస్త్రి అంతా విని ఆలోచనలో పడ్డాడు. కానీ వెంటనే సాలోచనగా "అది డిఫెన్సుకి ఏ విధంగానూ ఉపయోగపడదు. ఆమె అతడిని చంపి మరణం నిర్థారణం కాక ఫ్లవర్ వేజ్ ని ఎత్తి చంపటానికి మరోసారి ప్రయత్నం చేసి వుండవచ్చు. అలా అని ప్రాసిక్యూటర్ వాదిస్తాడు".
"మెడ వెనుక పిస్టల్ పెట్టి కల్చెవరకూ రేప్ చేస్తున్న వ్యక్తి ఊరుకోడు. అలా కాల్చిన తరువాత తీరిగ్గా కుర్చీలో కూర్చుని చావడు".
"అదీ పాయింటే. కానీ ఒకరు కాదు నలుగురు సాక్ష్యమున్నారు. వాళ్ళు లోపలికి ప్రవేశిస్తూంటే శబ్దం వినిపించింది. ఆ పిస్టల్ అక్కడే వుంది. అన్నిటికన్నా ముఖ్యంగా రెండు గుళ్ళు అందులోనుంచే వదలబడ్డాయి. ఎవరూ లోపలికి వెళ్ళటానికి దారి లేదు" అన్నాడు శాస్త్రి.
అనుదీప్ నవ్వేడు. నవ్వుతూ జేబులోంచి ఒక క్యాసెట్ తీసి ఇచ్చేడు - "ఇది వినండి. మీ చాలా అనుమానాలకి ఇది సమాధానం చెపుతుంది".
"ఏముంది ఇందులో?"
"వింటారుగా. ఎంత తొందరగా వింటే అంత తొందరగా విద్యాధరి విడుదల అవుతుందని అనుకుంటున్నాను. వెళ్ళొస్తాను" అంటూ అక్కణ్ణుంచి కదిలిపోయాడు.
శాస్త్రి అలాగే వుండిపోయాడు. వింధ్యపర్వతాల గురించి ఎన్నో అనుమానాలు అలాగే వుండిపోయాయి. అతడి మనసులో - ఎన్నో అడుగుదామనుకున్నాడు అనుదీప్ ని. కానీ వాటికన్నా ఈ కేసు ఇంటరెస్టింగ్ గా వుంది.
అతడు మరి ఆలస్యం చేయలేదు. వెంటనే ఇంటికి బయలుదేరాడు. మనసంతా, ఆ క్యాసెట్ లో ఏముందో అన్న టెన్షన్. హాల్లోకి వెళ్ళగానే టేప్ రికార్డర్ ఆన్ చేస్తున్న తండ్రిని చూసి కూతుళ్ళు ఏవైనా కొత్త పాటలా నాన్నా? అని అడిగారు. అతడు సమాధానం చెప్పకుండా PLAY అన్న బటన్ నొక్కాడు. ఒకటి....రెండు...మూడు నిముషాలు గడిచాయి.
ఏమీ లేదు.
నిశ్శబ్దంగా కదుల్తోంది క్యాసెట్.
తిప్పి పెట్టాడు.
అటూ ఏమీలేదు.
సిద్ధార్థస్వామి తనమీద ప్రాక్టికల్ జోక్ వేశాడేమో అనుకున్నాడు. కాస్సేపు దాన్ని అటూ ఇటూ తిప్పి ప్రయత్నించాడు. ఏమీలేదు.
"ఇక దానితోనే కూర్చుంటారా- భోజనానికి వస్తారా?" అంది. కూతుళ్ళు కూడా అతడికోసం ఎదురుచూస్తున్నారు. టేప్ విషయం మర్చిపోయి కబుర్లలో పడ్డాడు.
"అన్నట్టు చెప్పటం మర్చిపోయా నాన్నా! మొన్న అక్కయ్య బస్సులో ఎవర్నో కొట్టిందన్నాను చూడు. వాడికి పెళ్ళయినట్టుంది".
ముద్ద నోట్లో పెట్టుకోబోతూ శాస్త్రి తలెత్తి నవ్వాడు. "నిజంగా పెళ్ళయిందా?"
"ఇంకెవరో అమ్మాయితో కలిసి కనపడ్డాడు".
"భార్యేనో లేక ఎవత్తెనైనా వెంటేసుకుని తిరుగుతున్నాడో" శాస్త్రి భార్య అంది.
"నేను వెళ్ళి పలకరిద్దామనుకున్నాను నాన్నా. అక్కయ్య వద్దంది".