Previous Page Next Page 
థ్రిల్లర్ పేజి 25


    "ఇది సిద్ధార్థస్వామిదే" ఒకరి తరువాత ఒకరు అన్నారు.

    "కానీ అతను-"

    "అతనేమిటి బాబూ... ఆయన అను. ఆయన నెల రోజుల్నుంచీ కనపడటం లేదు. నిర్యాణం చెందారని కొందరు.. లేదు హిమాలయాలకు వెళ్ళారని కొందరు-"

    "ఆయన వయసు?"

    "వయసా -వయసెంతుంటుంది? పాతిక సంవత్సరాలుండవూ. ఈ కొండల్లోకి వచ్చే పది సంవత్సరాలవుద్దేమో... ఎవడితోనూ మాట్లాడేవాడు కాదు. అందుకే సిద్ధార్థస్వామి అని పిల్చేవారు. తేజస్సు చూస్తే యాభై సంవత్సరాలున్నట్టు కనపడేది. కానీ వయసెంతుంటది? పాతిక సంవత్సరాలుండదూ... వచ్చే పది సంవత్సరాలవుద్దేమో కదరా అన్నా...." వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.

    రవిశాస్త్రికి అర్థమైపోయింది.

    అనుదీప్ చెప్పింది...

    బస్ స్టాఫ్ లో అమ్మాయిని చూసి, ఆ ప్రేమని ఎలా చెప్పాలో తెలియక ఏడు సంవత్సరాలు తపస్సు చేశానని అతను చెప్పినదంతా...

    నిజమే!  

                                                               *    *    *

    "గోవాకన్నా ఈ ట్రిప్పే బాగుంది నాన్నా".

    "అవునమ్మా-"

    రైలు వరంగల్ దాటి విజయవాడవైపు ప్రయాణం చేస్తూంది. అ రోజు నాల్గుగంటలు లేటు.

    భార్య కల్పించుకుని "ఇంకేం, ప్రతి సంవత్సరం అరణ్యాల్లోకి, కొండల్లోకి తీసుకువెళ్ళండి" అంది కోపంగా. కూతురు తల్లిని ఆటపట్టిస్తూ "అమ్మకయితే అసలు ఈ ట్రిప్ నచ్చలేదు నాన్నా. గోవాలో చీరలు చౌకని ఎవరో చెప్పార్ట" అంది. శాస్త్రి నవ్వేడు. కూతుళ్ళిద్దరూ పక్క కూపేలోకి వెళ్ళి పడుకున్నారు. రైలు నెమ్మదిగా వెళ్తూంది.

    నిద్రకుపక్రమించబోతున్న భార్యతో శాస్త్రి అన్నాడు. "ఏవోఁయ్ ఒక ప్రశ్నడుగుతాను సమాధానం చెపుతావా?"

    ఆవిడ ఆశ్చర్యంగా చూసి, "ఏమిటి?" అంది.

    "ఇరవై ఏళ్ల సర్వీసులో నేనెన్నోసార్లు ఎన్ కౌంటర్లకీ, నక్సలైట్ల మధ్యకీ వెళ్ళాను కదా? నేను రావటం ఆలస్యమయితే దేవుడిని ఎప్పుడన్నా ప్రార్థించావా?"

    "ప్రార్థించటం ఏమిటండీ... ఎన్నిసార్లు మొక్కుకున్నానో నాకే తెలీదు".

    "ఒకవేళ దేవుడు కనపడి- నువ్వు ఏడు సంవత్సరాలు ఉపవాసాలుండి కష్టపడితే తప్ప నీ మొగుడు తిరిగిరాడు అని చెప్తే, అన్ని సంవత్సరాలూ అలాగే తపస్సు చేస్తావా?"

    "ఏడు సంవత్సరలేమిటండీ, ఎంత కాలమైనా చేయాల్సిందే-"

    "మొగుడి కోసమా?"

    "కాకపోతే..."

    ఆమె మాట పూర్తికాకుండా "కాకపోతే మొగుడు లేకుండా ఇల్లెలాగ గడుస్తుంది? అనా-" అన్నాడు. ఆమె అతడివైపు చూసి, ఉన్నట్లుండి కళ్ళనీళ్ళెట్టుకుంటూ "అయ్యో! వద్దంటున్నా ఆ అడవుల్లోకి వెళ్ళారు. ఏదో సోకింది మీకు. నేనేంచేతున్రోయ్ - దేవుడోయ్" అని విలపించసాగింది. ఆవిడ్ని ఓదార్చేసరికి తల ప్రాణం తోకకి వచ్చింది శాస్త్రికి.

    "అదికాదోయ్! నా ఉద్దేశ్యం ఏమిటంటే- ఒక్క పండక్కి చీరె కొనకపోతే అలిగి ఇల్లంతా ఒక కొలిక్కి తెస్తారు కదా మీ ఆడవాళ్లు... మొగుడు వరసగా నాల్రోజులు కాస్త ఆలస్యంగా ఇంటికొస్తే రకరకాల అనుమానాల్తో వేధిస్తారు కదా- రెండు నెలలపాటూ మా చెల్లి ఇబ్బందుల్లో వున్నదని జీతంలో కాస్త పంపిస్తే మనకీ ఎదిగిన కూతుళ్ళున్నారని సాధించావు కదా- మన పెళ్ళయ్యాక నేను చేసిన పనుల్లో కనీసం సగానికి పైగా నీకు నచ్చలేదు కదా -అయినా నా కోసం నువ్వు ఏడు సంవత్సరాలు తపస్సు చేస్తానంటే -అది నీ మొగుడు కోసమా లేక నా కోసమా అన్న అనుమానం వచ్చిందంతే".

    పైకి అనలేదు. మనసులోనే అనుకున్నాడు.

    భార్య అప్పటికే నిద్రలోకి జారుకుంది.

    రైలు నెమ్మదిగా వెళుతుంటే తనూ నిద్ర కుపక్రమిస్తూ అనుకున్నాడు. "అనుదీప్! నీ తపస్సు సంగతి దేవుడెరుగు కానీ మొత్తం వైవాహిక వ్యవస్థనే ప్రశ్నించేటంత అనుమానం కల్గించావు కదయ్యా. మామూలు ఇన్ స్పెక్టర్ గా వున్నప్పుడే బావుండేది. కాస్త జ్ఞానం వచ్చాక అన్నీ అనుమానాలే కలుగుతున్నాయి".

                                        *    *    *

    అతను లేచేసరికి రైలు ఖమ్మంలో వుంది.

    "దిగి నడిచి వెళ్దామా. తొందరగా వెళ్ళొచ్చు" అంటోంది కూతురు. శాస్త్రి విసుక్కుంటూ ప్లాట్ ఫాం మీదకు వెళ్ళాడు. అప్పటికా రైలు పదిగంటలు లేటు.

    పేపరు కొనుక్కొచ్చి చదవటం ప్రారంభించాడు.

    రెండో పేజీలో అతడి చూపు ఆగిపోయింది. విద్యాధరి అరెస్టు- చక్రధర్ హత్య వార్త అక్కడ వుంది. అక్కడ ముందుకు వంగి, గబగబా ఆ వార్త చదివాడు.

    అతడి మొహం పాలిపోయింది. విద్యాధరి కోసం కాదు. అనుదీప్ మీద జాలితో -"ఈ వార్త నాకే ఇంత షాక్ లా తగిలితే, ఇక అతడు దీన్నెలా భరించాడో" అనుకున్నాడు.

    రైలు కదుల్తున్నంతసేపూ అతడి ఆ ఆలోచనలు దీని గురించి సాగినయ్. రెండు గంటల తర్వాత రైలు విజయవాడ స్టేషన్ లో ఆగింది.

                                          *    *    *

    ఎవరో వచ్చారని పోలీసు ఆమెని విజిటర్స్ గదిలోకి తీసుకొచ్చింది. ఈ మూడు రోజుల్లోనూ ఆమె బాగా వడిలిపోయింది. కమీషనర్ గారి తాలూకు అవటం ఆమెని బాగా చూస్తున్నారు కానీ లేకపోతే మామూలుగా అయితే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేది. అంత ఘోరంగా ఉందా వాతావరణం.

    ఆమె విజిటర్స్ రూమ్ లోకి అడుగు పెడ్తూండగా గడియారం తొమ్మిది కొట్టింది. తనకోసం వచ్చినదెవరా అని తలెత్తి చూసింది.

    అనుదీప్ కూర్చుని వున్నాడు.

    ఆమె మనసులో ఏదో తెలియని భావం... అది సంతోషమో- ఇదంతా ఇతనివల్లే జరిగింది అన్న కోపమో- తను దోషిగా అతడిముందు నిలబడవలసి వచ్చిందే అన్న బాధో-

    "ఐయామ్ సారీ" అన్నాడు అనుదీప్. "....మూడు రోజుల్నుంచీ రావాలని ప్రయత్నం. కానీ వీళ్ళు విజిటర్స్ ని రానివ్వటం లేదు".

    ఆమెకి ఎవరిమీదో తెలియని కసి, నిస్సహాయత, కోపం.

    "ఇదంతా నీ వల్లే... నీ వల్లే జరిగింది" అంది రుద్ధమైన కంఠంతో.

    అతను ఆశ్చర్యపోయి "నావల్లా?" అన్నాడు.

    "ఆ సినిమాహాల్లో నువ్వుగానీ వెంటపడకపోతే ఆ ధర్మారావుగారు ఎవరో నాకు తెలిసేది కాదు" అంది.

    అతడు వప్పుకుంటున్నట్టు మౌనం వహించాడు. అది నిజంగా గొప్ప ఫిలాసఫీ. చాలా గొప్ప వేదాంతం.

    మనుష్యులు తమకేదైనా కష్టంగానీ, నష్టంగానీ కలిగితే "నేను కాదు. ఇదిగో దీనికి కారణం ఇది" అని వెంటనే ఒక ముగింపు నిర్ణయానికి వచ్చేస్తారు. మనిషి జీవితంలో ప్రతీ మూవ్ (Move)కీ ఒక స్వలాభాపేక్ష ఉంటుందని- ఒక్కొక్కసారి అది నష్టం తెప్పిస్తుందని గ్రహించరు. భర్తకి గుర్రప్పందేల్లో అయిదువేలు వచ్చిందని తెలియగానే నెక్లెస్ కొనుక్కొంటానని గారాబం పోయే భార్య, మరుసటి రోజు అయిదువేలు పోయి ఆ బాధలో తాగివస్తే "దానికితోడు ఇదికూడా నేర్చుకున్నారా" అని రాగాలు తీస్తుంది. ఆ రోజు అతనివల్లే ధర్మారావుకి పరిచయం అయిందని ఆమె నెపం వేసింది. అతడు కూడా వెంటనే అని వుండవచ్చు. "ఆ రోజే నేనూ చెప్పాను. అనవసరంగా పోలీసు గొడవల్లో ఇరుక్కోకూ, నిన్నెవరూ రక్షించరూ" అనొచ్చు. అలా అనటం చాలా సులభం కూడా. కొడుకుని "నేను చెప్పానా-సైకిల్ వద్దు పడతావురా అని, అయినా వినలేదు. చూశావా ఎలా దెబ్బలు తగిలాయో" అని తిట్టే తల్లి, "జ్వరం వచ్చినప్పుడే డాక్టర్ కి చూపించుకోమన్నానా. వినలేదు. చూడు -జాండిస్ లోకి దింపింది" అని తిట్టే భర్తా - నేను చెప్పానా - చెప్పానా-చెప్పానా -అంటూ తమని తాము సమర్ధించుకోవటానికి ఇచ్చే విలువ... పడకపోతే సైకిల్ రాదనీ, డాక్టర్ కి చూపించినా జాండిస్ ని అతడు ఆపలేడనీ రీజనింగ్ కి వస్తే ఎంత బావుణ్ణు. తమ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవటానికి అవతలివాళ్ళ మీదకు తప్పు తోసేసే నైజాన్ని మనిషి వదిలి పెట్టాలంటే, బహుశా అనుదీప్ లాగా ఏడేళ్ళు తపస్సు చేయాలేమో?  

 

    అతడు నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ "నువ్వేమీ బెంగపడకు విద్యాధరీ! ముఖ్యంగా - ఎక్కువ ఆలోచించి మనసు పాడుచేసుకోకు" అన్నాడు.

    "బయట గట్టుమీద ఉండి చెప్పటం చాలా సులభం"

    అతడు దాన్ని పట్టించుకోకుండా అన్నాడు. "కష్టాల్లో ఉన్నప్పుడు 'నా' అనేవాళ్ళు దగ్గిరుండాలని ప్రతివాళ్ళూ అనుకుంటారు. నువ్వు ఇప్పుడు కష్టాల్లో ఉన్నావు. కాబట్టి నీకు సానుభూతి చెప్పి, ఆ మార్గం గుండా ప్రేమని పొందాలనే ఉద్దేశ్యంతో రాలేదు నేను. చాలా మంది ఆడవాళ్ళకి మొగవాళ్ళు దగ్గిరయ్యేది ఇలాగే. నేనీ మూడురోజులూ నిన్ను కలుసుకోకపోవటానికి కారణం కూడా అదే. ప్రేమకి పునాది సానుభూతి కాకూడదు అని నా ఉద్దేశ్యం. ముఖ్యంగా నా మీద నీకు ప్రేమ ఉద్భవించటానికి".

    రోషంగా ఆమె తలెత్తింది. అతనే కొనసాగించాడు.

    "మరి ఇప్పుడెందుకు వచ్చానన్నది నీ ప్రశ్న కావొచ్చు. నీ బాధ తగ్గేమార్గాలు చెప్పటానికి వచ్చాను. నువ్వు ఇక్కడ బౌతికంగా పడే బాధకన్నా, నలుగురూ బైట ఏమనుకుంటున్నారో అన్నబాధే ఎక్కువ. అంటే శారీరక బాధకన్నా కృత్రిమమైన మానసిక బాధే ఎక్కువన్నమాట..రేపేమవుతుందో అని 'భవిష్యత్తు' గురించి బాధ. అయ్యో- ఇలా జరిగిపోయిందే అని 'గతం' గురించి బాధ. చూశావా! వర్తమానపు బాధకన్నా గతం భవిష్యత్తుల బాధే ఎక్కువ. అదిగ్రహిస్తే- వర్తమానంలో బాధే ఉండదు".

    ఆమె చేతులు జోడించి "వెళ్తావా - ఇక" అంది. చేసింది చాలు. బాధల గురించీ, ఉపన్యాసాల గురించీ నేను వినలేదు".

    "నువ్వు తప్పు చేయలేదుగా, ఎందుకంత బాధ నీకు?"

    ఆమె నిరాసక్తంగా- "తప్పు చెయ్యకపోతే జైల్లో ఎందుకుంటాను?" అంది.

    "గాంధీ నుంచి ఇందిరాగాంధీ వరకూ ఏ తప్పూ చెయ్యకుండానే కాస్తో కూస్తో జైల్లో వున్నారు".

    "నీ కిదంతా నవ్వులాటగా వుందా?"

    "లేదు. నిన్ను నవ్వించే ప్రయత్నంలో ఘోరంగా విఫలమవుతున్నానని మాత్రం తెలుస్తోంది. అతడు నిన్ను రేప్ చేయబోయాడా..."

    అనుదీప్ మాటలు పూర్తికాకుండానే ఆమె "లేదూ. లేదూ. లేదూ" అని అరిచింది. "- ఎన్నిసార్లు చెప్పినా నమ్మరేం? రేప్ చేయబోతుంటే పొరపాటున చంపేనంటే వదిలి పెట్టేస్తారట! అలా అని చెయ్యని నేరాన్ని నేనెందుకు వప్పుకోవాలి? నేనొప్పుకోను" అంటూ అరవసాగింది.

    బయట గుమ్మం దగ్గరున్న పోలీసు లోపలికి తొంగిచూసి మళ్ళీ తప్పుకుంది. ఆమె ధర్మారావుగారి తాలూకు కాకపోతే విజిటర్ ని అంతసేపు ఉంచేవారే కాదు.

    "నువ్వు చెప్పినమాట అబద్ధమని నేననలేదే" అన్నాడు. అప్పటివరకూ ఉద్వేగంగా వున్న ఆమె, అతడివైపు చూసి "మరి" అంది సందిగ్ధంగా.

    "నువ్వు దోషివి కాదని తెలిసీ వాళ్ళు అనవసరంగా అలా ఎందుకంటున్నారు - అంటున్నాను".

    ఇన్నాళ్ళకి కనీసం తను చెప్పేది వినేవాడూ, నమ్మేవాడూ దొరికేడు అన్న తృప్తి ఆమె కళ్ళలో కనిపిస్తూ వుండగా- "కనీసం నువ్వు నమ్ముతావా నన్ను" అంది.

    "నువ్వు చెప్పేదాంట్లో కాస్త తర్కం కనిపిస్తోంది. పోలీసుల కళ్ళబడే సమయానికి కాస్త అటూ ఇటూగా నీ చేతిలో ఫ్లవర్ వేజ్ ఉందని వాళ్ళు కూడా వప్పుకుంటున్నారు కదా. పిస్తోలుతో చంపి అరక్షణంలో దాన్ని పడేసి, ఎవరూ ఫ్లవర్ వేజ్ ఎత్తి పట్టుకోరు. దాని అవసరం ఏముంది? శవం తల బ్రద్ధలు కొట్టటానికా???"

 Previous Page Next Page