Previous Page Next Page 
పర్ణశాల పేజి 26


    రవి లోపలికి రాగానే - అతడు తాగి వచ్చినట్టు పసిగట్టింది. దాంతో ఆమె కోపం అవధులు దాటింది. "నీకు బుద్దిలేదు రవీ! ఇంత బాధ్యతా రహితంగా పుట్టినందుకు నీవు సిగ్గుపడాలి" అంది.

    ఆమె అలా మాట్లాడటం కొత్తేమీకాదు. కానీ ఇంతకు ముందు సంగతి వేరు. ఈ రోజు అతడు బాగా శ్రమపడివున్నాడు. మానసికంగా విశ్రాంతి కోరుకుంటున్నాడు. ఆ పరిస్థితుల్లో ఆమె అలా మాట్లాడటం అతడికి చిరాకు తెప్పించింది.

    "నోర్ముయ్" అన్నాడు విసురుగా.

    ఊహించని ఆ మాటలకు ఆమె అదిరిపడినా, వెంటనే సర్దుకొని- "ఏం...... ఎందుకని" అని రెట్టించింది.

    కోపంతో ఆమె ముఖం ఎర్రబడింది. "నేనన్న మాటలో ఏమన్నా తప్పుందా. నువ్వు ప్రవర్తిస్తున్న విధానానికి....." అంటూ రవి తలతిప్పి తీక్షణంగా చూడటంతో అర్ధాంతరంగా మాటల్ని ఆపుచేసింది.

    రవి క్షణంపాటు సూటిగా ఆమెను చూసేడు. చప్పున ఫోన్ దగ్గరకెళ్ళి ఆఫీసుకు డయల్ చేసేడు.

    "ఎవరూ! వాచ్ మెన్! ఆ.... నేనే రవిని" అంటూ కిరణ్మయివైపు తిరిగి "ఇట్రా" అన్నాడు. ఆ కంఠంలో కనపడిన ఆజ్ఞకి ఆమె అప్రయత్నంగా అడుగు ముందుకేసింది. అతడు ఫోన్ లో -"చెప్పు" అని నిశ్చేష్టంగా నిలబడ్డ ఆమె చేతిలో రిసీవర్ విసురుగా పెట్టి మేడమీదకు వెళ్ళిపోయాడు. తలుపు దభేలున వేసి పక్కమీదకు వాలిపోయేడు.

    అతడికి ఒక్కసారిగా భరించలేనంత నిస్పృహ ఆవరించింది..... తను ఏకాకినన్న భావం. కిరణ్మయి ఫోన్ పెట్టేసి, తొందర తొందరగా వచ్చేసరికి అతడి తలుపు వేసివుంది. కిటికీలోంచి చూసింది.

    గడియారం చప్పుడు తప్ప మరేమీ వినపడటం లేదు. చేయి నుదుటిమీద అడ్డంగా పెట్టుకుని అస్తవ్యస్తంగా పడుకొని వున్నాడు అతడు.

    అతడి కంటినుంచి ఒక నీటిచుక్క చెక్కిలి మీదుగా తలదిండు మీదికి జారుతోంది. ఆమె కిటికీ ఊచని పట్టుకుని చాలాసేపు అలానే  నిలబడి పోయింది. తల్లికీ, చెల్లికీ ఇవ్వకుండా దాచుకున్న ప్రేమని భార్యకి అర్పిద్దామనుకొన్న సున్నిత హృదయుడు..... ఆమె స్వీకరించకపోతే ప్రపంచంలోకెల్లా దురదృష్టవంతుడు.

    ప్రేమ డబ్బుతో వస్తుందా?


                              *    *    *


    చీమ చిటుక్కుమంటే వినబడేంత నిశ్శబ్దంగా వుంది అక్కడ. చైతన్య కూర్చొని వున్నాడు. అతడి ఎదురుగా కొంతమంది కూర్చొని వున్నారు- కొంత మంది చేతులు కట్టుకుని నిలబడి వున్నారు.

    అందరి కళ్ళల్లోనూ ఏదో వూహించనిది విన్న ఆశ్చర్యం..... కొందరి కళ్ళల్లో సంభ్రమం- మరికొందరిలో సంశయం.

    చైతన్య లేచేడు. "ఆలోచించుకోండి. తొందరలేదు. కానీ ఒక్క విషయం మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. ఒక్కసారి నిర్ణయంతీసుకున్నాక వెనుక వెళ్ళడం అనే  ప్రసక్తిలేదు"

    అతడు ఇంటికొచ్చేక శారద నవ్వుతూ అడిగింది..... "ఏమిటి! స్ట్రయిక్ చేయిస్తున్నారట?"

    అంతంత పెద్ద మాటలెందుకు" అన్నాడు చైతన్య. "ధర.....డిమాండ్, సప్లయ్ ల మ్,మధ్య నిర్ణయింపబడుతుందన్న చిన్న  సత్యం తెలియని స్థితిలో వున్నారు జాలర్లు. చేస్తున్నదల్లా సప్లయ్ ని కృత్రిమంగా తగ్గించడమే".

    "కానీ అవతలివైపున్న వాళ్ళు చాలా శక్తివంతులు, బాగా డబ్బున్న వాళ్ళు."

    "ఈ జాలర్ల వెనుకనున్న వాడు కూడా అంత తీసివేయదగ్గవాడు కాదు" అన్నాడు చైతన్య, "నీళ్ళు కొద్దిగా మాటమీద నిలబడితే చాలు, చిన్న ఆట ఆడిస్తాను".

    ఆ మరుసటిరోజు వరకూ ఆగనవసరం లేకపోయింది. రాత్రి దాదాపు పదకొండు అవుతూవుందా చంద్రయ్య నలుగుర్ని తీసుకొని  యింటికి వచ్చేడు.

    "అందరం కలిసి ఆలోచించేం బాబూ! ఒక మాటమీద కొచ్చేసినం. మీరు చెప్పింది సేస్తం".

    చైతన్య వెంటనే కొలుకోలేదు "బాగా ఆలోచించండి. కొంతమంది విడిపోయినా మొత్తం నష్టపోవలసి వస్తుంది".

    చంద్రయ్యతో వచ్చిన నలుగుర్లో ఒకడు ముందుకొచ్చాడు. "లేదు సైద్దొరా, గంగమ్మతల్లి దగ్గర ఒక్కరొక్కర్నీ పమాణం చేయిస్తాం. ఒక్కసారి చేసినారంటే మల్లీ మాట తిరిగిపోరు".

    చైతన్య తలూపేడు.

    మరుసటిరోజు నావలు సముద్రంమీదకు వెళ్ళి తెచ్చిన రొయ్యల్ని అమ్మకానికి పెట్టేరు జాలర్లు.

    "ఎంత?"

    "డెబ్భై రూపాయలు".

    బ్రోకరు ఉలిక్కిపడి, అంతలోనే సర్దుకుని "ఈ ఒడ్డున ఏ రోజయినా యాభయ్ దాటిందట్రా ధర? ఇన్నేళ్ళ జీవితంలో చూసేవా" అడిగేడు.

    "సూడ్లేదు. కానీ బ్రతికుండగానే సూడాలనుకుంటున్నాం" ఒక యువకుడు నిశ్చలంగా సమాధానం యిచ్చేడు.

    "పోనీ యాభయ్ అయిదేసుకోండి".

    "పైస తగ్గేది లేదు".

    "ఇంకో వంద పడవలు వస్తయి, ధర నలభయ్ అవుద్ది".

    "రానీ....."

    "వచ్చినయ్- వంద పడవలూ వచ్చినయ్. కానీ అంతా ఒకే ధర. డెబ్భై రూపాయలు".

    "కొనకుంటే ఏం చేస్తారుట?" తుపుక్కున చుట్ట ఉమ్మేస్తూ అడిగేడు గంగరాజు, ఆయనే అందరికన్నా పెద్ద కొనుగోలుదారు. చేతిక్రింద నాలుగు పెద్ద పీలింగ్ యూనిట్లున్నాయి. బ్రోకరు నవ్వేడు. "మళ్ళీ సముద్రంలో పారేస్తారేమో సూద్దామండి" అన్నాడు.

    రొయ్యలు సముద్రంలో పడలేదు. ఒక లారీ  వచ్చి తీసుకుపోయింది.

    "ఎక్కడికి వెళ్ళేయిరా అవి?" గంగరాజు అడిగేడు.

    "కోల్డ్ స్టోరేజికండి".

    గంగరాజు కళ్ళు ఆశ్చర్యంతో టపటపా కొట్టుకున్నాయి. అంతలో సర్దుకొని నవ్వేడు. "ఎన్నాళ్ళుంచుతారట స్టోరేజిలో? అద్దె వాళ్ళ బాబు కడతాడా?"

    అదే సమయానికి చైతన్య కోల్డు స్టోరేజి యజమాన్లతో మాట్లాడుతున్నాడు.

    "మా దగ్గర డబ్బులేదు కానీ సరుకుంది. ఇప్పటి రేటు బట్టి వెల కట్టండి. మీ అద్దె - ఈ వెలా సమానం అయిన రోజు సరుకంతా మీరే తీసుకోండి అలా అని అగ్రిమెంటు రాసుకుందాం. ఇప్పుడు మాత్రం అద్దె అడక్కండి".

    స్టోరేజి యజమాన్లకు ఇందులో నష్టం ఏమీ కనబడలేదు. ఒప్పుకున్నారు.

    అగ్రిమెంట్ సైన్ అయ్యాక లేస్తూ చైతన్య అన్నాడు. "కొంతమంది జీవన్మరణ సమస్య ఇది. దీనికి మీరు చేయూత యిచ్చినందుకు కృతజ్ఞతలు. ఇదే మానవతావాదంతో ఇంకో చిన్న సాయం చెయ్యండి. దయచేసి మన అగ్రిమెంటు సంగతి మూడో కంటికి తెలియనివ్వకండి. అదే మేము కోరే సహాయం".

    దీనికీ వాళ్ళు ఒప్పుకున్నారు.

    ..........

    "ఎక్కణ్ణుంచి తెచ్చి కడుతున్నార్రా డబ్బు?" గంగరాజు అడిగేడు.

    "తెలీదు బాబూ....."

    "చూద్దాం. ఎన్నాళ్ళు బింకంగా వుంటారో? -రేయ్.....పక్కూరిలో రేటు కనుక్కుని దొరికిన సరుకంతా కొనేయ్....."

    అయిదు నిముషాల్లో వాడు మొహం వేలాడేసుకొచ్చాడు. పక్కూరిలో ధర అరవై రూపాయలయిందట దొరా! మనూరి రాజుగారు వున్నదంతా అప్పుడే కొనేసిన్రంట. అంతేకాదు బాబూ..... ఆల్లుకూడా రేపట్నుంచీ డెబ్భైయ్ కి పైస తక్కువైతే అమ్మరంట".

    తీరప్రాంతం అంతా దావానలంలా వ్యాపించిపోయిందీ వార్త. అప్పటివరకూ  కొన్ని నిషిద్డాల మధ్య కంట్రోల్ చెయ్యబడుతూన్న ధరతో ఈ కదుపుకి అకస్మాత్తుగా ఎత్తుపల్లాలొచ్చినయ్. కొంతమంది అరవైకి అమ్ముతూంటే మరికొంతమంది ఎనభయ్ వరకూ వెళ్ళేరు.

    "ఇది స్ట్రయిక్ కాదు. సరుకుంది, కావల్సినవాళ్ళు కొనుక్కోవచ్చు. ధర డెభ్భయ్. ఇంకొన్ని రోజులుపోతే కోల్డుస్టోరేజి అద్దెతో కలుపుకుని ఎనభయ్ చేయాల్సి వస్తుంది" ప్రకతించేడు చైతన్య.

    పీలర్లు దిగిరాలేదు.

    దిగిరారని తెలుసు. అది సులభం కాదు. ఇంకా ఎన్నాళ్ళో తను స్టాకు ఆపుజెయ్యలేడు. కానీ ఈ సమయంలోనే బింకంగా వుండాలి.

    పక్క కేంద్రాలవాళ్ళు ఈ చర్యతో తాత్కాలిక లాభం పొందుతున్నారు. ధర కొద్దిగా పెరిగింది. ఆ కొద్ది పెరుగుదలతోనే వాళ్ళు సంతృప్తి పడుతున్నారు. సరుకు అమ్మేస్తున్నారు. అదే దెబ్బతీస్తోంది. కనీసం కొన్ని మైళ్ళ తీరప్రాంతం అయినా ఈ సరుకుని కంట్రోల్ చేయగలిగితే బావుణ్ణు. కానీ ఎలా?

    చైతన్య మనసు పాడయింది.

    ముఖ్యంగా తనమాట నమ్మి ఇందులో దిగిన చంద్రయ్య పరిస్థితి చూస్తోంటే! అతడు చాలా ఇరకాటంలో పడిపోయాడు. తీరప్రాంతంలో పడవలు కదలటం లేదు. కానీ ఎన్నాళ్ళు కదలకుండా వుంచగలరు?

    కొంతలో కొంత నయం! వీళ్ళకి పని చెయ్యకపోతే తిండి ఎలా అన్న సమస్య లేదు. నాలుగు చేపలు పడితే కడుపు నిండుతుంది.

    కానీ జాలర్ల జీవితం విచిత్రమైంది. భవిష్యత్తు గురించిన ఆలోచన అసలు లేదు. మామూలప్పుడు ఎంత నికృష్టమైన జీవితం గడుపుతారో- అదృష్టం బావుండి మంచి రొయ్య దొరికి, అయిదారు వేలు ఒకరోజు చేతిలో పడితే అకస్మాత్తుగా ధనవంతులు అయిపోతారు.

    ఎరుపు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం సముద్రం మీద వెళ్ళేటప్పుడు ధరించవలసిన) దుస్తుల్లోనే స్టార్ హొటల్స్ లోకి వెళతారు. రెండ్రోజులలో అంతా ఖర్చు పెట్టేస్తారు తరువాత మళ్ళీ మామూలే.....బీదతనం! చెల్లెళ్ళనీ, భార్యల్నీ బ్రోకర్ల కప్పగించే బీదతనం. ఆ బీదతనంతో ఆడుకొనే మనీ లెండర్లు. మళ్ళీ చర్విత చరణం....

    తాడూ బొంగరంలేని ఇలాటి వాళ్ళని తన మాటమీద కట్టుబడి వుండేటట్టు చెయ్యటానికి చైతన్య కష్టపడవలసి వచ్చింది. అవతలివ్యక్తులు సామాన్యులు కారు. గంగరాజు లాటివాళ్ళ వ్యానులు నిండా ఐస్ నింపుకొని దూర ప్రాంతాలకి వెళ్ళి రొయ్యల్ని తెస్తున్నారు.... వ్యాపారం సాగిపోతోంది. ఆ ప్రాంతీయ జాలర్లు  నిస్సహాయంగా చూస్తూ వూరుకోవలసివస్తోంది.

    "కరెంటు తీగల్ని కలుపుదామయ్యా" అన్నాడు చంద్రయ్య.

    "ఏమవుతుంది?" అడిగేడు చైతన్య.

    "కరెంట్ పోతే ఐస్ తయారవదు. దూరంనుంచి సరుకుతెచ్చే వీలుండదు".

    ఒప్పుకోలేదు చైతన్య. లా జరిపిన వెంటనే పోలీసులు రంగంలోకి వస్తారు.

 Previous Page Next Page