పొలిటీషియన్స్ పోలీసుల్ని రంగంలోకి ఆహ్వానిస్తారు. బిజినెస్ మెన్స్ వాళ్ళకి దూరంగా వుండటానికి ప్రయత్నిస్తారు.
"మరెలా....ఏం చేద్దామిప్పుడు?" చంద్రయ్య అడిగాడు.
చైతన్య ఆలోచించాడు. కానీ అతడికేమీ పాలుబోవటంలేదు. సమస్య సముద్రం అంత పెద్దది.
అందరూ అతడి సలహా కోసం చూస్తున్నారు. "నాకు రేపటివరకూ టైమివ్వండి ఆలోచించి చెబుతాను....." అన్నాడు చైతన్య. అందరూ మౌనంగా అక్కణ్ణుంచి వెళ్ళిపోయారు. ఆ మౌనమే అతణ్ణి బాధ పెడుతోంది ఏదో చెయ్యాలి!
మరుసటిరోజు వరకూ టైముంది. కానీ ఏదయినా అద్భుతం జరిగితే తప్ప - ఈ లోపులో పరిష్కారం దొరకదు. చికాకుగా ఇంటికి బయలుదేరాడు.
అనవసరంగా ఇందులో వేలు పెట్టానా అని అతడు ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఏ మూలనుంచీ తనాశించిన సపోర్టు రాకపోవటంతో ఆందోళన చెందుతున్నాడు.
అతనింటికి వచ్చేసరికి రాత్రి ఎనిమిదయింది.
కాంపౌండు కర్రలు గేటు తెరచుకొని లోపలి ప్రవేశించాడు. వెన్నెలలో బంతిపూలు మరింత అందంగా వున్నాయి.
లోపలికి వెళ్ళబోతున్నవాడల్లా ఆగిపోయేడు. లోపల శారద సాధన చేస్తున్నట్లుంది-నాదం గాలిలో అలలు అలలుగా తేలివస్తోంది. అతణ్ణి చూసి ఆమె లేవబోయింది. సైగతోనే వద్దని వారించి, కిటికీ పక్కగా కుర్చీలో కూర్చున్నాడు.
ఆమె సన్నటి వేళ్ళు తీగెలమీద అలవోకగా కదులుతున్నాయి. తరంగాలు తరంగాలుగా వస్తున్నా ఆ నాదం మనసును సేద తీరుస్తోంది. వెనక్కి వాలి కళ్ళు మూసుకొన్నాడు. పది నిముషాల పాటు అతడు ప్రపంచంలోని సర్వబాధల్నీ, తనని వేధిస్తున్న సమస్యలన్నీ మర్చిపోయేడు. ఆమె ఆపుచెయ్యగానే "ఆనందభైరవి కదూ?" అనడిగేడు.
శారద చిరునవ్వుతో "కాదు.....నీలాంబరిలో శృంగారలహరి" అంది.
అతడు కళ్ళు తెరచి.... "నా కంతగా తెలీదు రాగాల సంగతి" అన్నాడు.
ఆమె వీణ పక్కగా పెట్టి లోపలికి వెళ్ళింది.
అతడు కిటికీలోంచి బయటకు చూసేడు. సన్నటి వెలుగు రేఖలు చెట్ల సందుల్లోంచి భూమ్మీదపడి, విశ్లేషణం చెందుతున్నాయి. చిన్న మబ్బు తునక నెమ్మదిగా ఉత్తర దిక్కువైపు సాగిపోతుంది.
అతడికెందుకో రిలాక్సయినట్టు అనిపించింది. ఎంతో శ్రమపడ్డాక ఎన్నో ఆలోచనలతో మనసు వేగిపోయేక అంత చిన్న పర్ణశాలలో అంత సులభంగా రిలాక్సయ్యే సాధనం కనిపించటం అతడికి ఆశ్చర్యంగా అనిపించలేదు.
* * *
"రిలాక్స్" అన్నాడు రవి. కిరణ్మయి మాట్లాడలేదు.
"నువ్వు నన్ను తిట్టకు అర్థంచేసుకో. ఎంతో అలసిపోతాం.....పొద్దున్నుంచీ సాయంత్రం అయ్యేసరికి ఒక చిన్న పెగ్ తీసుకొంటే ఆ అలసట పోతుంది. ఎంతో రిలాక్సింగ్ గా వుంటుంది."
"ముందొక పెగ్గు తరువాత ఒక సీసా అవుతుంది".
"నీకు తెలీదు కిరణ్ ఈ బిజినెస్ వ్యవహారాలు....." అంటూ ముందుకు వంగి నచ్చచెప్పబోతున్నట్టు ఏదో అనబోయేడు. ఆమె తన సహజ స్వరంతో అతడి మాటల్ని ఖండిస్తూ అంది. "ఏమిటి నువ్వు చూస్తున్న బిజినెస్ వ్యవహారాలు? ఈవేళ ఐదో తారీఖు. ఇంతవరకూ నువ్వు చూస్తున్న బిజినెస్ వ్యవహారాలు? ఈవేళ ఐదో తారీఖా" అంటూ చివ్వున కుర్చీలోంచి లేచి ఫోన్ దగ్గరకు పరుగెత్తుడు.
అవతలివేపు మేనేజరు కంఠం వినబడగానే "మానేజర్ గారూ" అని అరిచేడు. "ఈవేళ ఐదో తారీఖు, ఇరవయ్యో తారీఖులోగా షిప్ మెంటు జరిగిపోవాలి మర్చిపోయారా?"
"ఇవరయ్యో తారీఖా?....నాకు తెలీదే" అవతల్నుంచి మానేజర్ అన్నాడు. ఆ కాగితం తన డ్రాయరులోనే వుందన్న విషయం జ్ఞాపకం వచ్చి నాలుక్కర్చుకొని, అంతలోనే ఆ విషయం కిరణ్మయి గమనిస్తుందని భయపడి సర్దుకొంటూ "సర్లెండి- వ్యాన్లన్నిటినీ పంపించండి. ఎక్కడ ఎంత దొరికితే అంతవరకూ ఏ ధరకయినా సరే కొనేయ్యమనండి".
"ఏ ధరకయినానా?" సంశయిస్తూ అడిగాడు మానేజర్.
"లేకపోతే కాంట్రాక్టు ఎలా పూర్తి చేస్తారండీ?" ఫోన్ బ్రద్దలయ్యేలా అరిచాడు రవి. ఇక్కడ రవి తీసుకున్న ఈ నిర్ణయం. సరైన సమయంలో అక్కడ చైతన్యకి సాయపడింది. ఆ రోజు సాయంత్రమె ఒక వాన్ వచ్చి ఆ ప్రాంతంలో వున్న సరుకంతా డెభ్భై రూపాయల చొప్పున కొనుక్కు వెళ్ళిపోయింది.
ఈ చిన్న సంఘటన ఆ తీరప్రాంతాల పరిస్థితిని మొత్తం మార్చేసింది.
* * *
తన సరుకుని తను చెప్పిన ధరకి ఎవరో కొనటానికి సిద్ధపడ్డారని తెలియగానే చైతన్య ఆశ్చర్యపోయినా, కొద్ది ప్రయత్నంలో ఆశ్చర్యాన్ని నొక్కిపట్టి అది తనకు తెలిసినట్లే ప్రవర్తించేడు. అతడి ప్రవర్తనని చాలా క్లోజ్ గా పరిశీలిస్తున్న బ్రోకర్లు-యిది అర్థంకాక తలలు బ్రద్ధలు కొట్టుకుంటున్నారు.
ఇంతలో యునైటెడ్ స్టేట్స్ కి సంబంధించిన ఎగుమతిదారు పదకొండు డాలర్లు ఇవ్వటానికి సిద్ధపడ్డాడనీ- అందుకే సరుకు అలా అమ్ముడు పోయిందనీ ఓ రూమరు పుట్టింది. దీన్ని పుట్టించింది చైతన్య. చైతన్య మాట విని సరుకుని అప్పటివరకూ దాచిన జాలర్ల ఆనందం పట్టశక్యం కాలేరు. వారి ఆనందాన్ని మరింత ప్రతిబింబించటానికి కావలసిన చర్యలన్నీ తీసుకున్నాడు చైతన్య.
అమాయకత్వం కూడా ఒక్కోసారి మంచికే దారితీస్తుంది. రెండురోజులు సరుకు ఆపి, కేజీకి ఇరవై రూపాయల లాభం పొందొచ్చని వాళ్ళ కళ్ళముందు ప్రత్యక్షంగా కనపడుతూ వుంటే తక్కువ ధరకి అమ్మటానికి ఎవరూ ముందుకు రాలేదు.
ఒకర్ని చూసి ఒకరు- వాళ్ళని చూసి ఇంకొకరు- ఇలా అందరూ సరుకు బిగదీసేసరికి పరిస్థితి గందరగోళమైపోయింది. ధర ఎనభై తొంభై మధ్యకి వెళ్ళింది.
దీంతో బ్రోకర్లు గిలగిల్లాడిపోయేరు. ఎగుమతిదార్లు ఏం చెయ్యాలో తెలియక తలబ్రద్ధలు కొట్టుకుంటున్నారు.
చైతన్య పరిస్థితిని గమనించసాగేడు. తాడు తెగేవరకూ లాక్కూడదని అతనికి తెలుసు. జపానులో ప్రాన్స్ కన్ స్యూమర్సు సొసైటీ (రొయ్యల తినేవాళ్ళ సంఘం) ఏర్పడిందనీ, ఓకే ధరకు మించి కొనకూడదని నిర్ణయించిందనీ అతడు క్రితం రోజు పేపర్లో, చదివేడు.
కానీ ఇంకా తాడు తెగేస్థితి రాలేదు. ఇంతలో ఫ్రాన్స్ ఎక్స్ పోర్టర్ల అసోసియేషన్ నుంచి అతడికి సంప్రదింపులకి పిలుపొచ్చింది.
అన్ని బలగాలూ సరిగ్గా వున్నాయో లేవో నిర్ధారణ చేసుకొని మంత్రిని జరిపి 'షా' చెప్పే సమయం వచ్చింది.
17
విశాలమైన ఎయిర్ కండిషన్డ్ రూమ్ మధ్య వెడల్పాటి టేబిల్ మీద తెల్లటిగుడ్డ, మూడు యాష్ ట్రేలు, చిన్న ప్లవర్ వేజ్. ప్రతి మెంబర్ ముందూ రైటింగ్ ప్యాడ్, పెన్సిల్, గాజు గ్లాసుతో నీళ్ళు!
టేబిల్ చెరోవేపునా మెంబర్లు కూర్చొని వున్నారు. ఒకవేపు చైర్మన్ భైరవమూర్తి కూర్చొన్నాడు. ఇవతలివేపు జాలర్ల తరపు ప్రతినిది కోసం కేటాయించబడింది. గదిలో నిశ్శబ్దం తాండవిస్తుంది.
కుడివేపు రెండో కుర్చీలో గంగరాజు కూర్చుని వున్నాడు. అతడు రాసుకొన్న సెంటు పరిమళం గాలిలో కలిసి గదంతా వ్యాపిస్తుంది. దాన్ని ఆపటం కోసం చుట్టని వెలిగించేడు.
పది అవటానికి ఇంకా రెండు నిముషాలుంది. గంగరాజు విసురుగా కుర్చీలోంచి కదిలి "ఊరూ పేరూ లేని జాలరికోసం ఏమిటీ హంగామంతా?" అన్నాడు.
భైరవమూర్తి మాట్లాడలేదు నవ్వి ఊరుకున్నాడు. ఆ నవ్వులో చాలా అర్థాలున్నాయి. ఆ వాతావరణాన్నీ, అంతమంది మనుష్యుల గాంభీర్యాన్ని చూస్తే అవతలివ్యక్తికి అదోలాంటి జంకు కలగటం సహజం. భైరవమూర్తికి కావలసింది అదే. వస్తున్నవాడు లేమికి ప్రాతినిధ్యం ఇచ్చేవాడు!! ఒక్కసారి ఎయిర్ కండిషన్డ్ రూమ్ లోకి రాగానే సగం ధైర్యం పోతుంది.
అందమైన చైనీస్ పింగాణీ ప్లేటులో జీడిపప్పు తింటూ వాళ్ళ ప్రోబ్లమ్స్ చర్చిస్తారు. అద్భుతమైన భాష- ఎనిమిది మంది ఒక్కడ్ని కన్విన్స్ చేసే విధానం- ఆ ప్రతినిధిని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. దేనికైనా వప్పుకుంటాడు. ఈ మత్తు బయట కొచ్చిన తరువాత విడిపోతుంది. కానీ అప్పటికే అంతా అయిపోతుంది.
ఇదీ ట్రిక్- భైరవమూర్తి ఉపయోగించదల్చుకొన్నది.
ఇది మామూలు కార్మిక నాయకులకి వర్తించదు. కానీ ఇప్పుడు చర్చలకు వస్తోంది. అధమాధమ వర్గానికి చెందిన ప్రతినిధి. చాలా సులభంగా బుట్టలో పడెయ్యొచ్చు.
"ఈళ్ళకి టైమ్ విలువ కూడా తెలియదు" అన్నాడు గంగరాజు కుర్చీలో మళ్ళీ అసహనంగా కదిలి.
"ఇంకా పదవలేదుగా" అంటూ వుండగానే గడియారం పది కొట్టడం- తలుపు నెమ్మదిగా తెరుచుకోవటం- ఒకేసారి జరిగినయ్.
అందరి దృష్టి అటు మరిలింది. చైతన్య లోపలికి వచ్చేడు. చాలా సాదా దుస్తులలో వున్నాడతను. కానీ అతడి కళ్ళలో తీక్షణతనీ, చురుకునీ భైరవమూర్తి ఒక్కడే కనిపెట్టగలిగేడు.
ఎవరికీ అతడ్ని విష్ చెయ్యాలన్న భావం కూడా రాలేదు. ఏదో తప్పనిసరి అయితే ఈ సమావేశానికి ఒప్పుకున్నట్టు వున్నారందరూ. అతడీ విషయాన్ని మొదటి చూపులోనే గుర్తించేడు.
"నీ పేరు?- భైరవమూర్తి అడిగాడు.
"చైతన్య - కృష్ణచైతన్య".
"చూడు చైతన్యా" సమావేశాన్ని ప్రారంభిస్తూ అన్నాడు భైరవమూర్తి. "ఈ ప్రాంతపు చరిత్ర చాలా గొప్పది. ఎవరికి ఎంత కావాల్సివచ్చినా లేదనకుండా సప్లయ్ చేసే శక్తి ఒక్క మన జాలర్లకే వుందని ప్రతీతి. అటువంటి పేరు చెడగొట్టుకోవటం మనకి మంచిదికాదు".
"మధ్యలో ఆపుచేస్తున్నందుకు క్షమించాలి" అన్నాడు వినయంగా చైతన్య. "మా జాలర్లు ఎవరికన్నా సరుకు లేదన్నారా? నాకింతతవరకూ ఈ సంగతి తెలియదే? ఈ విషయాన్ని ఇప్పుడే కనుక్కుంటాను. ఎవరికెంత సరుకు కావాలో చెబితే మా వాళ్ళని రాత్రీ- పగలూ అని కూడా చూడకుండా వెళ్ళి తెమ్మని చెబుతాను. ఇన్నాళ్ళనుంచీ నిలబెట్టుకుంటూ వస్తున్న ఖ్యాతిని ఈ రోజు మా వాళ్ళు పాడుచేస్తారని నేను అనుకోను".
చుట్టూ అందంగా పూలు కట్టబడిన వాడిబాణం గుచ్చుకొన్నట్టు అయి అక్కడున్న ఎనిమిదిమందికీ నిమిషంపాటు ఏం మాట్లాడాలో తెలియలేదు.
భైరవమూర్తి ముందు తేరుకున్నాడు. "నిజమే! కాని ఈ ధర....." అన్నాడు. "మీ ధరా మా ధరా ఒకటే అయితే మరి మా ఖర్చులూ లాభాల సంగతి?"
"మీరు చెప్పింది నిజమే" అన్నాడు చైతన్య. "ఇక్కడన్నీ ఒక టన్ను- రెండు టన్నుల మిషనులు. చిన్న రొయ్యలే లాభదాయకం మనకి. అయిదు టన్నుల మిషనైతే పెద్ద రొయ్యలకి లాభదాయకం. ఎవరైనా పెట్టదల్చుకుంటే ఎంత లాభం వస్తుందో లెక్కలుకట్టి బ్యాంకులకీ ప్రభుత్వానికీ చెబుదాం. మీరేమో పక్కప్రాంతం నుంచి చిన్నవి తెప్పించుకోవచ్చు. మేం ఆ పెద్ద మిషనుకి సప్లయ్ చేస్తాం. దాంతో మన జాలరుల ఖ్యాతి మరింత ఇనుమడిస్తుంది- మీకూ సమస్యా వుండదు."
గంగరాజు మెదడుకి అతడు చెబుతున్నది ఏమీ అర్థం కాలేదు. కాని రక్తం ఇంకిపోయిన భైరవమూర్తి మొహం చూసి ఏదో పెద్ద తిరకాసు వుందని గ్రహించేడు. దాంతో మామూలు మార్యాదలు మర్చిపోయి కుర్చీలోంచి లేచి బిగ్గరగా అరిచేడు.
"రాత్రికి రాత్రి నావలు తెప్పించెయ్యగల్ను జాగ్రత్త. అంత పరపతిలేదనుకొన్నావా ఏం?"
చైతన్య ముందుకు వంగి "ఎలాగూ మీ పరపతి ఉపయోగించవలసి రావచ్చు. మేం పెద్ద ప్లాంట్ కి సప్లయ్ చేస్తే మరి మీకు సప్లయ్ చేసే వాళ్ళుండాలి కదా! అయితే ఒక చిక్కుంది ఇందులో, మేం డెభ్భయ్ రూపాయలకు అమ్ముతూంటే వాళ్ళు యాభయ్ కి మీకు అమ్మాలి. అమ్ముతారులెండి, వాళ్ళు మీ వాళ్ళేకదా-"
అన్నాడు తాపీగా.
దాన్నే మామూల భాషలో చెప్పాలంటే "ఒరే వెధవా! నువ్వెవ్వర్ని తెప్పించినా కొంతకాలానికి మమ్మల్ని చూసి వాళ్ళు కూడా రేటు పెంచుతారు జాగ్రత్త" అని.
గంగరాజు కోపంగా ఏదో అనబోతూంటే భైరవమూర్తి వారించి "ఇలాంటి వాదనలవలన ఫలితం వుండదు" అన్నాడు చైతన్యవేపు తిరిగి, చైతన్య మాట్లాడలేదు. తలూపి వూరుకొన్నాడు.
భైరవమూర్తి అన్నాడు "మీరు అడిగిన రేటు మేం ఇస్తే..... సర్వం నష్టపోవలసి వస్తోంది."
"మీకు తొంభయ్ ఇస్తున్నారు కదా వాళ్ళు- ఇందులో నష్టం ఏముంది?" చైతన్య అడిగేడు.
"జపాన్ కరెన్సీ సంగతి నీకు తెలీదు. ఏ రోజు ఏ రేటుంటుందో ఎవరూ వూహించలేరు. మేం చేస్తున్నది నిజంగా కత్తిమీద సాము. 'ఎన్' విలువ రోజూ మారుతూనే వుంటుంది".