Previous Page Next Page 
పర్ణశాల పేజి 25


    ఎలాగని చెబుతాడు? సిక్త్ సెన్స్ తెలుగు తెలీదే? మౌనంగా వుండిపోయాడు.

    చైతన్యంటే గౌరవం వుంది అందరికీ. అతడి మౌనాన్ని చూసి మనస్సు నొప్పించానేమో అనుకొని చుక్కాని రెండు చేతులతోనూ పట్టుకొని "సెప్పు బాబూ- కుడికా ఎడమకా" అన్నాడు చంద్రయ్య. చైతన్య చంద్రయ్య మొహంలోకి చూసేడు. చంద్రయ్య నవ్వేడు.

    చైతన్య నవ్వి "కుడికి" అన్నాడు.

    పడవ సర్రున మలుపు తిరిగింది.

    అందరూ ఆశ్చర్యంగా చుక్కానివేపు చూసేరు. చంద్రయ్య లేచి నిలబడి, "వల ఎయ్యండ్రా ఆఖరిసారి అదృష్టం చూసుకొందాం-" అని అరిచేడు.

    వెన్నెలలో అతడి నల్లటి ఒళ్ళూ సముద్రంలో నీలినీళ్ళు తళతళా మెరుస్తున్నాయి. యువకులలో హుషారొచ్చింది.

    వల మళ్ళీ జల్లెడలా సముద్రంమీద పడింది.

    అయిదు...పది....పదిహేను నిముషాలు.

    వల నెమ్మదిగా పైకి లేస్తున్నది. చైతన్య వూపిరి బిగపట్టేడు.

    వల పైకి వస్తుంటే "ఓహే" అన్న శబ్దం చైతన్య నోటి నుంచి అప్రయత్నంగా వెలువడింది వలనిండా మిలమిలా మిలమిలా మెరుస్తూ సన్నగా కదులుతూ పుంజీలకొద్దీ రొయ్యలు.

    చంద్రయ్య గొంతుచిరిగిపోయేలా....."రేయ్, పదకొండూ పదిహేను రోయ్" అని కేక పెట్టాడు ఆనందం పట్టలేక.

    పదకొండూ.....పదిహేను కౌంటున్న రొయ్య సాధారణంగా దొరకదు.

    జాలరులు చేతులు మిషనుల్లా పనిచేస్తున్నాయి వలని ఖాళీ చేసి మళ్ళీ విసిరేరు. అంతర్లీనమైన నీటి ప్రవాహంతో పాటూ, గుంపులు గుంపులుగా వస్తున్న రొయ్యలు వలలోపడి పడవలోకి చేరుతున్నాయి. గంటలో పడవ నిండింది.

    జాలర్ల ఆనందానికి అంతులేదు. ఉన్నది పడవ కాకపోతే ఎగిరి గంతులేసి నాట్యం చేసేవాళ్ళే.

    చైతన్య పెద్దవులమీద నవ్వు.

    చంద్రయ్య మొహం నవ్వు.

    సముద్రం మీద వెన్నెల నవ్వు.

    వల మడిచేరు. జాలర్ల చేతులు లయబద్ధంగా కదుల్తున్నాయి. చంద్రయ్య చుక్కాని పట్టుకొన్నాడు. "హైలేస......ఐసా.....హైలేసా......" పది గొంతులు ఒకే కంఠంలోంచి వస్తున్నట్టుగా పాట....

    చైతన్య పడవగట్టుకి ఆనుకుని, వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. సముద్రం మీదనుండి వస్తోన్న గాలి మనసుని సేదతీరుస్తోంది. పడవ తీరంవైపు సాగిపోతోంది.

    ఒడ్డుకి వరుసగా పడవలు వచ్చి చేరుకుంటున్నాయి. ముందు వచ్చినవాళ్ళు అందరూ నిరాశగా వున్నారు. పీలర్లు సరుకురాక తెల్లమొహం వేసుకొని చూస్తున్నారు.

    వీళ్ళ పడవ ఒడ్డుకి రాగానే వార్త దావానంలా పాకి పోయింది.

    "ఎటేపు దొరికినయ్....." ప్రశ్న.

    "పదకొండూ పదిహేనోయ్....."సంభ్రమం.

    "రే జగ్గ .....రారో .....రారో...." అరుపు.

    పడవలో దిగినవాళ్ళు బయట వాళ్ళకి జవాబు చెపుతున్నారు......క్షణంలో అక్కడి పరిస్థితి మారిపోయింది. ఇళ్ళకెళ్ళినవాళ్ళు పరుగెత్తుకొస్తున్నారు. పడవల్లో లాంతర్లు అమరుస్తున్నారు.

    అంతా హడావిడి. కలకలం. వెతకాని వింటినుంచి వెలువడిన బాణాల్లా ఒకదాని తరువాత ఒకటిగా పడవలు సముద్రంలోకి దూరుకుపోయినయ్. రాత్రని లేదు, పగలని లేదు. చీకటని లేదు, ఎండని లేదు.

    కష్టానికి తగిన ప్రతిఫలం దొరుకుతుందా లేదా అన్న ఆలోచన లేదు, అదృష్టాన్ని వెతుక్కుంటూ ....రెక్కలూ ముక్కలు చేసుకోవటం ఒక్కటే తెలుసు.

    బ్రోకర్లు సరుకు చుట్టూ చేరేరు.

    "ఎంత?"

    "తెలియనిదేముంది బాబూ" చేతులు నులుముకుంటూ అన్నాడు చంద్రయ్య.

    జాలర్ల కళ్ళలో ఆశతో కూడిన కుతూహలం.

    బ్రోకర్ల కళ్ళలో తెలివికూడిన హాలహలం. "నలభయ్ రూపాయలు!"

    జాలర్లు ఉలిక్కిపడ్డారు. "నలభయ్ రూపాయలా......"

    "తొందరగా చెప్పండి" మనిషిని తొందరబెడ్తే మనసు బలహీనమవుతుందన్న టాక్టిక్స్ బ్రోకర్లకి బాగా తెలుసు.

    "చాలా తక్కువ బాబూ....."

    "నువ్వు చూసినావ్ కదా, వంద పడవలెల్లినయ్. అవి తిరిగొచ్చేయంటే ముఫ్ఫై ఎనిమిది రూపాయలయిపోతుంది ధర".

    అదీ నిజమే. సరుకు అమ్ముడు పోదేమోనన్న భయం జాలర్లని మెట్లు దింపుతుంది. నిల్వ వుంచడానికి వనరులు లేవు వాళ్ళ దగ్గర. (ప్రభుత్వమా! ప్రభుత్వమా- ఏం చేస్తున్నావు ప్రభుత్వమా?)

    ఏదో ఒక ధర అమ్యేయాలి. కొంచెంసేపు బెట్టుసరి చేస్తే దిగివస్తారని బ్రోకర్లకున్న నమ్మకం జాలర్లకి లేదు. చద్రయ్య క్షణం తటపటాయించేడు.

    బ్రోకర్లలో ఎవరో "సరే, నలభయ్ న్నర ఏసుకో-" అనబోవటం చైతన్య గమనించి, చంద్రయ్యని వారించే లోపులోనే  అతడనేసేడు....." సరే -బాబూ"

    పది నిముషాల్లో సరుకు చేతులు మారింది.

    దొరికిన డబ్బు చూసి- జాలర్ల కళ్ళల్లో ఆనందం, తాత్కాలికంగా....వదులుకున్న డబ్బు ప్రసక్తిలేదు. దక్కిందే ప్రాప్తం.

    "ఎల్లొస్తాం సైద్దొరా"

    చైతన్య తలూపేడు.

    "సైద్దొర రాకుంటే అలాగే ఎల్లొచ్చేవాళ్ళం" అనుకుంటున్నారు ఎవరో. అతనికి ఆ ఆనందం లేదు. మనిషికి మనిషి చేసే అన్యాయాన్ని చూడటం- మనిషిగా మారేక మొదటిసారి. ఎయిర్ కండిషన్డ్ రూమ్ లో తీసుకునే డెసిషన్ ల పరిణామాలు అన్యాయాలకి దారితీస్తాయన్న విషయం గుర్తుకు రాకుండా గుమాస్తాలూ, మానేజర్లు వడబోస్తారు.

    వలేసి పట్టుకొన్న రొయ్యల తాలూకు డబ్బట్టుకుని జాలర్లు ఇళ్ళకు పోయేరు.

    బ్రోకర్లు వలేసి జాలర్లని  పట్టుకోవటానికి ఇంకా ఆలస్యముందని టీకి పోయేరు. చైతన్య ఒక్కడే మిగిలాడే.

    ఎదురుగా పాపంలాంటి అంతులేని సముద్రం.....దాని మీద దాని మనిషి చేస్తున్న క్షమిస్తున్నట్టు తెల్లని వెన్నెల- మనసులో ఘర్షణలా పడిలేచే కెరటాలు.

    రెండు చేతులూ జేబులలో పెట్టుకొని, వడ్డు వెంబడే నడవసాగేడు చైతన్య.

    అంతా నిర్మానుష్యంగా వుంది. సముద్రం మీదనుంచి వస్తున్న గాలి జాలిగా అతణ్ణి పరామర్శించి ముందుకు సాగిపోతోంది. ఎవరో యువకుడు, చిన్న దొప్పలో కూర్చొని గెడవేసి తోస్తూ విషాదంగా పాడుతున్నాడు.

    "కరవుర్తని మీన్ ఇల్డ - ఏలియాయి-

    కడంతరానిని మీనిల్ల - ఏలియాయె-

    త్యాగర కడప్పరతిని - పుల్సబమాయె-

    పోయెవ - తక్కిళి కూకిళి- సైంగిళియె-"

    -సముద్రం అంతా ఓడ్చి మీ చేతుల్లో పోసేం. ఒక్క రొయ్యకూడా అక్కడ లేదిక. మమ్మల్ని అన్యాయం చేయకండి. రావాల్సిన డబ్బు న్యాయంగా ఇవ్వండి-


                                        16

    "ఈ రోజు నేను అకౌంట్స్ చూడాలనుకొంటున్నాను" అన్నాడు రవి. మానేజరు తలూపి బైటకెళ్ళేడు. ఐదు నిమిషాల్లో లెడ్జర్ పుస్తకాలు అతని బల్లమీదకు వచ్చినయ్.

    'డే' బుక్ తీసి చూసేడు. దాదాపు పదిహేనురోజుల క్రితం నుంచి వ్రాయబడలేదు. "ఏమిటిది?" అడిగాడు మానేజర్ని.

    మానేజర్ లెడ్జర్ క్లర్క్ ని అడిగేడు. అతడు నేలచూపు చూస్తూ మాట్లాడలేదు.

    "ఆఫీసులో పని ఎక్కువగా వుందా? ఇద్దరు చెయ్యాల్సిన పనిని ఒకరే  చేస్తున్నారా?" మానేజరూ, క్లర్కూ మాట్లాడలేదు. "దీన్ని బట్టి చూస్తే- ఎవరైనా పై నుండి అడిగితే తప్ప మీరు పని చెయ్యరన్న మాట-"

    క్లర్కు నసుగుతూ "తొందరలో పూర్తి చేస్తాను సార్" అన్నాడు. రవి మండిపడ్డాడు. "తొందరలో కాదు ఈ  రోజు పూర్తవ్వాలి. ఎంత ఆలస్యమైనా సరే  నేనూ వుంటాను. వెళ్ళి వెంటనే మొదలు పెట్టండి" అని, మేనేజర్ వైపు తిరిగి "క్యాషియర్ ని పిలవండి" అన్నాడు.

    క్యాషియర్ వచ్చేడు.

    "క్యాష్ బ్యాలెన్స్ ఎంతుంది?"

    అతడు మాట్లాడలేదు.

    "చెప్పరేం?" గద్దించేడు.

    "మూడువేలు....."

    "ఎంతుండాలి?"

    "ప.....పన్నెండువేలు" అని చప్పున దణ్ణంపెట్టి "బాబూ, పిల్లలు కలవాణ్ణి రెండురోజులు టైమివ్వండి కట్టేస్తాను" అన్నాడు. ఇంకొంచెం మాట్లాడితే ఏడ్చేలా వున్నాడు. రవి మేనేజర్ వైపు తిరిగి, "ఈయనకి మెమో యివ్వండి. అదే ఆఖరి వార్నింగ్" అన్నాడు. క్యాషియర్ దణ్ణాలు పెడుతూ వెళ్ళిపోయాడు.

    రవి ఏమీ అనలేదు. నిజమైన మానేజర్ తనే అని అతడికి తెలుసు. అలాటిది తనే నిర్లక్ష్యంగా వుండి, ఇంకొకళ్ళని ఆనటంలో రీజన్ లేదు....

    ఆ రోజు లెక్కలు పూర్తయ్యేసరికి రాత్రి పదయింది.

    అప్పటివరకూ ఆఫీస్ లోనే కూర్చుని కాగితాలు అన్నీ ఓపిగ్గా చూసేడు. స్టాఫంతా ఇతడితోపాటు వుండిపోయింది. చివరికి లెక్క చూసుకొంటే అతడికి గాభరా పుట్టింది.

    "డెట్ ఈక్విటి కరెంట్ రేష్యో" లాటి పెద్ద పెద్ద  పదాలు అతడికి తెలియవు కానీ- ఈ పరిస్థితి ఇలాగే సాగితే ఇంకో సంవత్సరం తిరిగేసరికల్లా ఫ్యాక్టరీ మూతపడటం ఖాయం అన్న విషయం మాత్రం అర్థమైంది.

    ఆ తరువాత చాలాసేపు మేనేజర్ తో మాట్లాడుతూ వుండి పోయేడు.

    పదిన్నరకి బయటికి వస్తుంటే ఫస్ట్ షో నుండి ఇంటికి వెళుతూన్న పాత స్నేహితుడు కనబడ్డాడు. కార్లో ఎక్కించుకున్నాడు.

    "ఏమిటసలు కనబడటంలేదు" అడిగాడు అతడు.

    "చూస్తున్నావుకదా, ఇప్పుడు వెళుతున్నాను ఇంటికి" అన్నాడు రవి.

    కొంచెంసేపు ఎక్కడన్నా కూర్చొందాం. చాలాకాలం  అయింది కలిసి-" అన్నాడు స్నేహితుడు. రవికి  కూడా చాలా అలసటగా అనిపించింది. ప్రొద్దుట్నుంచీ లెక్కలూ, వాటి పరిణామాలూ-కారుని  బార్ కాంపౌండ్ లో ఆపేడు.

    ఇద్దరూ ఓ అరగంట గడిపేరక్కడ. స్నేహితుడి దగ్గర శలవు పుచ్చుకుని, రవి ఇంటికొచ్చేసరికి దాదాపు పదకొండున్నర అయింది. అతడికి ఆ రోజు చాలా  సంతోషంగా వుంది. తను చేసిన పనిని భార్యకి చెప్పి మెప్పు పోందాలన్న చిన్న ఆశతో కూడిన సంతోషం.

    అదే సమయానికి ఇంట్లో కిరణ్మయి అతడికోసం ఎదురు చూస్తోంది. ఆమె వళ్ళు మండిపోతోంది. తనేమో ఈ విషయాలపట్ల తల బ్రద్ధలు కొట్టుకొని ఆలోచిస్తూ వుంటే, ఈ మహాశయుడు అర్థరాత్రి వరకూ బజార్లవెంట, బారులవెంటా తిరుగుతున్నాడన్నమాట. ఆమె ఆ రోజు ఆ సంగతి అటో ఇటో తేల్చేయాలనుకొంది. అందుకే రవి తలుపు కొట్టగానే ఆమె వచ్చి తలుపు తీసింది.

 Previous Page Next Page