కుక్కలు మొరిగేయి.
వాటిని ఎగాదిగా చూచి అన్నాడు సుబ్బయ్య -
"ఈ బీడీ నాదే! నా సొంతం మళ్లీ లగెత్తుకెళ్లి బీడీ దొంగతనం చేసేనని అయ్యగార్తో చెప్పమాకండి!'
* * *
హల్లో గోవిందం వైపు కాల్చుతున్నాడు. పక్కనే కైలాసం చేతులు కట్టుకుని నిలబడ్డాడు.
మేడమీంచి శారద దిగివచ్చింది. తండ్రిని పలకరించకుండానే వెళ్లిపోతుంటే ఆ అమర్యాదను భరించలేక గోవిందమే అడిగేడు.
"లైబ్రరీకి వెడుతున్నావా?"
"అవును. అవునవును. అక్కడికే!" అన్నది శారద.
"ఇవాళ లైబ్రరీకి సెలవుసార్ !" అని మాట సాయం చేసేడు కైలాసం.
అతని హెచ్చరిక విని మాట మార్చి అన్నాది శారద.
"లైబ్రరీ అంటే లైబ్రరీ కాదు నాన్నా! ఆ దగ్గిర్లోనేనూ ప్రెండుంది. దాన్తో అర్జంటుగా మాట్లాడాలి!"
"అందుకే అయితే -ఫోన్లో మాట్లాడవచ్చు సార్!" అన్నాడు కైలాసం శారద కైలాసాన్ని విసుక్కుంటూ అన్నది -
"ఫోను మన ఇంట్లో ఉండవచ్చు వాళ్ల ఇంట్లో ఉండద్దూ?"
గోవిందం సర్ది చెప్పేడు.
"అమ్మాయిని వెళ్లనీనయ్యా! అమ్మాయ్ నువ్వెళ్లు! త్వరగా రావాలి!"
శారద వెళ్లిపోయింది.
ఆమె వెళ్ళేక గోవిందం కైలాసంతో అలా అన్నాడు.
"నువ్వు అమ్మాయిని జాగ్రత్తగా ఫాలో అవ్వు!"
"చిత్తం!" అని కైలాసం గోవిందం పాదాలకు నమస్కరించాడు
గోవిందం కైలాసాన్ని లేవదీస్తూ అడిగేడు.
"యుద్దానికి పంపేస్తున్నానా ఏవన్నానా? అమ్మాయిని వెంబడించమన్నాను అంతేగా?"
"అంతేనండి! కానండీ - అమ్మాయి గార్ని ఫాలో అవడం కంటే యుద్దానికి వెళ్లడమే క్షేమంగా ఉంటుందండి! వస్తానండి!" అని అక్కడ్నించి కదిలేడు.
ఆ రోడ్డు మీద శారద నడుస్తోంది.
ఆమెకు తెలీకుండా ఆమెను వెంబడించేందుకు అన్ని జాగ్రత్తలు తిసుకుంటున్నాడు కైలాసం. ఆమె వెనక్కి చూస్తే తలోంచేసి రోడ్డు మీద ఏదో వెతుక్కుంటున్నట్టు నటిస్తున్నాడు.
అతని అవస్ధ గమనించి శారద చిన్నగా నవ్వుకుంది.
శారద బస్సు స్టాపు చేరుకుంది. ఆ వెంటనే కైలాసం కూడా ఆ బస్సు స్టాపుని చేరుకున్నాడు. ఆమెక్కనిపించకుండా జనం చాటున దాక్కున్నాడు. అతన్ని శారద ఓరగంట గమనిస్తూనే ఉంది.
అంతలో బస్సు వచ్చి ఆ స్టాపులో ఆగింది.
శారద బస్సేక్కేందుకు ముందు డోరు దగ్గరకి వెళ్లింది. ఆమె బస్సేక్కుతుందని గమనించి కైలాసం - ఖంగారుగా - జనాన్ని తోసుకుంటూ వెనక దొరునుండి బస్సేక్కేసేడు. అతను బస్సేక్కగానే శారద బస్సు దిగేసింది.
బస్సు వెళ్లిపోయింది. శారద వెనక్కి తిరిగి వచ్చిన దారిన నడుస్తోంది. అయిదు నిమిషాలు నడిచేక ఆమె చింతామణి శారీమందిర్ని చేరుకుంది.
శారదను చూడగానే ఎంతో మర్యాదగా ఆహ్వానించేడు ప్రొప్రయిటరు.
నువ్వు చెప్పినట్లు సత్యమూర్తి గారిని వెతికించి పట్టుకుని - ఉద్యోగంలో పెట్టుకున్నాను" అన్నాడు.
"చాలా థేంక్సండి."
"ఇంత మాత్రానికే థేంక్స్ ఎందుకమ్మా? అంతకంటే - నాకు పురమాయించిన పని పూర్తి చేసేనని నాన్నగార్తో ఒక్కమాట చెప్పు చాలు!"
"దానిదేముంది. లేండి! అల్లాగే చెబుతాను. సత్యమూర్తిని పలకరించి ఆ గదిలో కూచుని-"
అతను మాట పూర్తి చేయక ముందే అతని వేపు వేడిగా చూస్తో అన్నది-
"నో థాంక్స్"
"అని - సత్యమూర్తి కోసం షాపులోకి వెళ్లింది. ఆమె వెళ్లేక ప్రొప్రయిటరు బోలెడు బాధపడిపోతూ గొణుక్కుంటున్నాడు.
"అమ్మాయికి కోసం వచ్చిందో ఏమో? గది కూడా వుందన్నాను గదా? కోపందీసి అపార్థం చేసుకుందో ఏమో"
సత్యమూర్తి ఇప్పుడు సేల్స్ మెన్ గా లేడు.
వేరే గదిలో కూర్చుని లేక్కలవీ తనిఖీ చేస్తున్నాడు. ఆ పనిలో అతను బిజీగా వుండగా ' బావున్నావా' అనే పిలుపు వినిపించింది.
తలెత్తి చూసేడు. అక్కడ శారద కనిపించగానే తత్తరపడుతూ అన్నాడు.
"ఏమిటో?" ఈ రోజుల్లో ఉద్యోగం దొరకడమే కష్టం. అల్లాంటిది పీకేసిన ఉద్యోగం మళ్లా దొరకడమంటే మాటలా? ప్రొప్రయిటరు పిలిపించి మళ్లీ ఉద్యోగమిచ్చేరు. ఆశ్చర్యంగా లేదూ?"
"పార్టీ ఎప్పుడు?" అడిగింది శారద.
"ఎప్పుడంటే అప్పుడే"
"ఎప్పుడు కావాలో చెప్పాలంటే - ఇక్కడ కుదర్దు"
"ఎక్కడ కుదుర్తుంది?"
"రేపు సాయంత్రం గాందీ పార్కులో కలుసుకుందాం"
అక్కడ చెబుతానని హామీ యిస్తే తప్పకుండా వస్తాను" అన్నాడు సత్యమూర్తి.
"థేంక్సు" అని ఆమె అక్కడ్నించి కదిలింది.
శారద కౌంటరు దగ్గరికి రాగానే ప్రొప్రయిటరు అన్నాడు.
"గదిలో కూచుని మాటాడుకొండని అడిగేను కదా! అసలు ఆ మాట వెనక నా ఉద్దేశమేమిటంటే"
"ఇట్సాల్ రైట్! నాన్నగార్తో చెబుతాలేండి"
"ఏం చెబుతావమ్మా? గది గురించా? అసలు నా ఉద్దేశం -"
ఖంగారుగా అంటున్న అతని మాటకి అడ్డంపడి -
"గది మాట మరిచిపోండంకుల్! అడగ్గానే ఉద్యోగమిచ్చేరు గదా! ఆ విషయం నాన్నగార్తో చెబుతాను. మీరు మాత్రం సత్యమూర్తిని జాగ్రత్తగా చూసుకోండి"
"ఆ మాట వేరే చెప్పాలా?"
"నాన్నగారి రికమెండేషన్ మీద ఉద్యోగమిచ్చేనని పొరపాటున కూడా అతనికి చెప్పద్దు."
"ఎంచేత?"
"అతని గురించి మీకు తెలీదంకుల్! అలా వున్నాడే గాని అతను వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఆ విషయం ముందు ముందు మీరే తెలుసు కుంటారు" అని శారద వెళ్లిపోయింది.
శారద చేసిన హెచ్చరికను మననం చేసుకుని అనుకుంటున్నాడు ప్రొప్రయిటరు.
"వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనా? అయితే బట్టల కొట్టులో ఎందుకు దాకున్నట్టు? అయినా - ఆ వివరాలు మన కెందుకు? చెప్పింది చెప్పినట్టు చేస్తేపోలా?"
28
గోవిందం బంగళాలో-
కైలాసం తన జాతకాన్ని మళ్లీ తిట్టుకుంటున్నాడు-
"తమరెన్నైనా చెప్పండి. అంతా నా జాతక ప్రభావం. ఈ మధ్య నేను చేపట్టిన పనులేవీ సక్రమంగా పూర్తి కావడం లేదు. దిక్కుమాలిన అవాంతరాలు నన్ను అతలాకుతలం చేస్తున్నాయి. తమ దృష్టిలో చవటగా మిగిలిపోతున్నాను. అంతా నా జాతకం."
గోవిందం జాలి పడ్డాడో ఏమో స్వరం పెంచకుండా అన్నాడు-
"అంతే! జాతకం బాగుండకపోతే బంగారం ముట్టుకుంటే బంక మట్టి అవుతుందని శాస్త్రం."
"అమ్మాయిగారు బస్సెక్కేను. నేను బస్సేక్కేలోగా అమ్మాయిగారు మాయమయ్యేరు."
"మాయమవ్వడానికి అమ్మాయి మాయల ఫకీరు కూతురు కాదు."
"చిత్తం"
"నువ్వు బస్సెక్కగానే తాను దిగేసి వుంటుంది."
"అనుకున్నానండి."
కుక్కలు మొరిగాయి. గోవిందం శ్రద్దగా వింటున్నాడు. తన మీద ఫిర్యాదులు చేస్తున్నాయని కైలాసం ఆందోళన పడుతున్నాడు. గోవిందం కుక్కల్తో అంటున్నాడు-
"ఆ అయిడియా అతనికెప్పుడో చెప్పేను"
జాకీ మొరిగింది.
"నిజమే కావచ్చు. మరిచిపోయి వుంటాడు"
టైగర్ మొరిగింది.
"అల్లాగే! ఇప్పుడు నొక్కి మరీ చెబుతాను సరేనా?" .