చెల్లి జ్ఞాపకాల్తో అతడి మనసు వ్యాకులమైంది.
తన గదిలోకి వెళ్ళేడు. గ్లాసులో నీళ్ళు పోసుకుని తాగేడు. పక్కమీద ఇస్త్రీ దుప్పటి, చిన్న తలదిండు...... శారదని చూస్తోంటే అతడికి కాంతిమతి జ్ఞాపకం వచ్చింది.
పక్కమీద పడుకున్నాడు. చలిగా వుంది. కాళ్ళ దగ్గర దుప్పటి తీసి కప్పుకున్నాడు. చలిగా వుంది. అప్పుడతనికి అతడి తల్లి జ్ఞాపకం వచ్చింది.
పురుషుడికి తనలో చెల్లినీ, భార్యనీ, తల్లినీ చూపించగలిగే అదృష్టం చాలామంది స్త్రీలకుండదు.
15
బల్భు కనపడకుండా ఏర్పాటు చేసిన లైట్ల కాంతిలో స్పెషల్ గా ట్రైనింగ్ పొందిన వెయిటర్లు వడ్డిస్తూండగా డిన్నర్ పార్టీ పూర్తయింది. రవి సూట్ లో వున్నాడు.....
కిరణ్మయి పట్టుచీరెలో మెరిసిపోతుంది.
అంతా హడావుడి. స్పీకర్ లోంచి లాంగ్ ప్లే పియానోకన్నల్ నెమ్మదిగా వినిపిస్తోంది. గ్లాసుళ శబ్దాలు రవికి తాళం వేస్తున్నట్టూ వుంది. 'బఫే' అవటం వల్ల చిన్న చిన్న గ్రూపులుగా చేరి మాట్లాడుకుంటున్నారు. రవి అందరికీ అన్నీ అందాయో లేదో చూస్తున్నాడు.
అంతలో జైన్ అతడి దగ్గరకి వచ్చేడు. "ఏం సార్ - ఎలా వుంది ధర?"
"తెలియనిదేముంది జైన్ సాబ్! కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. వీధికో 'సీపుడ్' కంపెనీ బయల్దేరింది."
"ఒకటే బిజినెస్ చేస్తే అలానే వుంటుంది. సైడ్ లైన్ లో ఇంకొకటి ప్రారంభిస్తే బావుంటుంది, ఏమంటారు?"
"ఏం ప్రారంభిస్తే బావుంటుందని మీ ఉద్దేశ్యం?"
"ఆలోచించండి. నా ఉద్దేశ్యం నూనెగింజలు అయితే బావుంటుందని మీకా ఉద్దేశ్యంగానీ వుంటే చెప్పండి. నేనూ షేర్ తీసుకుంటాను."
రవి మొహం ఆనందంతో వెలిగింది, "తప్పకుండా సాబ్- కిరణ్ తో ఆలోచించి చెప్తాను."
జైన్ నవ్వి, "ఆడవాళ్ళని బిజినెస్ సలహాలు అడక్కూడదు సాబ్. వాళ్ళని అడిగే విషయాలు వేరు" అన్నాడు.
రవి కూడా ఆ జోక్ కి నవ్వేడు.
"వెళ్ళొస్తాను ఆలోచించి వుంచండి....." అంటూ అతడు శెలవు తీసుకున్నాడు.
ఒక్కొక్కరే వెళ్ళిపోసాగేరు. గార్డెన్ అంతా ఖాళీ అయింది. రవి అలసటగా కుర్చీలో కూర్చున్నాడు. ఖాళీ కుర్చీలు, కమ్యూనికేషన్ గ్యాప్ గురించి చర్చించిన అయినెస్కో అబ్సర్డు ప్లే "చైర్స్" అన్న నాటికలోలా వున్నాయి.
అతడు చాలాసేపు అలానే కూర్చొని వున్నాడు.
లోపల కిరణ్మయి, హోటల్ మేనేజర్ అకౌంట్ సెటిల్ చేసి బయటకు వచ్చింది. వేన్ వెళ్ళిపోయింది. బిల్ చూసినప్పటినుంచీ ఆమె వళ్ళు మండిపోతోంది. నౌఖర్లు కుర్చీలో లోపలి పట్టుకెళుతున్నారు.
ఆమె వచ్చి ఇతడి పక్కన కుర్చీలో కూర్చుంటూ "బిల్ ఎంతయిందో తెలుసా?" అంది.
"ఎంతయింది?"
"ఐదువేలు."
"అలాగా" అన్నట్టు తలూపేడు.
"నీకేం పట్టినట్టు లేదే?"
"అతడు ఆశ్చర్యంగా, "ఎందుకు?" అని అడిగేడు. దాంతో ఆమెకి మరింత కారం జల్లినట్టు అయి, "ఎందుకా? ఐదువేలు ఖర్చయినందుకు?"
"ముందు అనుకున్నదేగా పార్టీ ఇవ్వాలని" అన్నాడు అతడు అర్థంకానట్టు.
"అనుకున్నాంకానీ- నువ్వు కనబడిన ప్రతి పరిచయస్తుణ్ణీ పిలుస్తావను కోలేదు. ఈ పార్టీవల్ల మనం సాధించేది ఏమిటో నాకు తెలియటం లేదు."
"బిజినెస్ కమ్యూనిటీలో ఇలా టీ పార్టీలవల్లే పనులు జరుగుతాయి."
ఆమె అతడి మొహంలోకి తీక్షణంగా చూసి, "పుస్తకాలు చదివి బిజినెస్ ఎలా చెయ్యాలో మాట్లాడకు. బిజినెస్ థియరీ కాదు" అంది.
దాంతో అతడికి వళ్ళు మండింది. "వంటింట్లో వుండాల్సిన ఆడవాళ్ళు బిజినెస్ విషయాలలో వేలు పెడుతోంటే ఇలాగే తగలబడుతుంది" అన్నాడు.
ఆమె రెచ్చిపోయి, "ఏమన్నావ్?" అంది.
అతడు చాలా కూల్ గా , కిరణ్మయీ! నువ్వు చాలా అందమైన దానివి. మాటిమాటికీ చిరాకునీ, కోపాన్నీ అరువు తెచ్చుకుని ఆ అందాన్ని పోగొట్టుకోకు" అన్నాడు ఎందుకయినా మంచిదని కొంచెం దూరంగా జరిగి.
అంత కోపంలోనూ ఆమెకి నవ్వొచ్చింది. "మాట మార్చకు" అంది ముఖాన్ని సీరియస్ గా వుంచి.
"మాటేం మార్చాను. ఈవేళ జైన్ తో బిజినెస్సే మాట్లాడేను." ఆమె ఆతృతగా. "ఏ విషయం?" అంది.
అతడు చాలా పెద్ద వ్యవహార కర్తలా ముఖం పెట్టి "ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దామనుకుంటున్నాం-నూనెగింజల వ్యాపారం" అన్నాడు.
"నీకేమైనా బుద్ధి వుందా" అంది ఆమె.
అతడి ముఖం ఎర్రబడింది. "ఏం?" అన్నాడు.
"ఆ జైన్ ఈ రోజో, రేపో దివాళా తీసేట్టు వున్నాడు. అతనితో కలుస్తావా?" అంది.
"నీకెలా తెలుసు?
"ఇప్పుడే పార్టీలో అనీల్ భార్య చెప్పింది."
అతడి ముఖం ఆనందంతో వెలిగింది. "చూసేవా-పార్టీళవాళ్ళ ఏం లాభం అన్నావు- ఎలా రక్షింపబడ్డామో చూశావుగా" అన్నాడు.
ఆమె తల కొట్టుకొని "ఖర్మ" అనుకొంది.
* * *
"హైలేసా.....ఒసా.....హైలేసా...." అన్ని గొంతులూ కలిసి ఒకే కంఠంలోంచి వస్తున్నట్టుగా లయబద్ధంగా వినిపిస్తోంది పాట. బోటుకి ఒక మూలగా కూర్చొన్నాడు చైతన్య.
తీరానికి నెమ్మదిగా దూరమవుతోంది బోటు.
సముద్రం గంభీరంగా-నిశ్చలంగా వుంది.
తీరం దగ్గర ఉవ్వేత్తుగా పడి లేచే కెరటాలు- తీరం దూరమయ్యేక లేవు.
విశాలమైన సముద్రం. పిపీలికం లాంటి మనిషి అస్థిత్వాన్ని ప్రశ్నిస్తోంది.
పడవలో దాదాపు పది పన్నెండుమంది వున్నారు. చుక్కాని పట్టడంవల్లా గెడ వేయడంవల్లా కండలు మెలిదిరిగి, ఉదయకాలపు అరుణారుణ కాంతితో నిగనిగ లాడుతున్నాయి. స్వచ్ఛమైన చిరునవ్వు వాళ్ళ పెదవులమీద కదులుతోంది. అమాయకత్వం తప్ప మరొకటి తెలియని మనుష్యుల్లా వున్నారు వాళ్ళు. కష్టపడటం తప్ప ఇంకొకటి తెలియని మరల్లా వున్నాయి వాళ్ళ శరీరాలు.
లయబద్ధంగా గెడవేస్తూ ముందుకు సాగిపోతున్నారు. నీలిసముద్రం తెల్లదనాన్ని సంతరించుకొంది. ఏటవాలు కిరణాలు నీటిమీద పరావర్తనం చెంది కెరటాలు తళతళా మెరుస్తున్నాయి. మొదటిసారి వల విసరటానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
నలుగురు కలిసి వల విప్పేరు. గాలిలోకి ఎగిరి జల్లెడలా సముద్రంమీద పడింది.
చైతన్య కుతూహలంగా చూస్తున్నాడు. నెమ్మదిగా నీటిలోకి దిగిపోయి అదృశ్యమైంది. పడవ నెమ్మదిగా కదులుతోంది. సమయం కూడా.
"అదిగో అటు చూడు" అన్నాడు చంద్రయ్య.
చైతన్య చూచేడు. దూరంగా సముద్రంలో ఏదో ఆకారం కనబడింది.
"అదే ట్రాలర్. మొన్న మనూరికి వచ్చింది. పెదరాజుగారు కొన్నారట అదేదో దేశంనుంచి-"
వాళ్ళు చూస్తూ వుండగానే ఆ ట్రాలర్ సముద్రంలో అదృశ్యమైపోయింది.
వల నెమ్మదిగా పైకి లాగుతున్నారు. చైతన్య ఉత్సుకతతో చూడసాగాడు. పూర్తిగా వల పైకి వచ్చింది. అందరి ముఖాల్లో నిరాశ కొట్టొచ్చినట్టు కనపడింది. వలలో చిన్న చేపలూ, రాళ్ళూ, నీటినాచూ తప్ప ఇంకేమీలేదు.
"అపశకునం" గొణుక్కున్నాడు చంద్రయ్య. చైతన్యకు జాలేసింది. దురదృష్ట దేవత ఇంకా తనతోనే వస్తోందా?
వేట ఇంకో రెండు గంటలు సాగింది. ఫలితం అంతంత మాత్రంగానే వుంది. పడవ కొద్ది చేపలతో నిండింది. చేపలు లాభదాయకం కాదు. ఇంకేమీ దొరక్కపోతే ఆ సంగతి వేరుగానీ రొయ్యలు దొరికితే వలల్లో పడిన చేపల్ని కూడా మళ్ళీ సముద్రంలోనే వదిలేస్తారు జాలర్లు. పడవలో ఏమాత్రం చోటున్నా దాన్ని రొయ్యలతోనే నింపటానికి ప్రయత్నిస్తారు. ఈసారి కనీసం చేపలు కూడా దొరకలేదు.
ఎండ తీక్షణత ఎక్కువయింది.
నల్లటి శరీరాలమీద చెమట మెరుస్తోంది. జుట్టుల్లోంచి ధారగా కారుతోంది. తూర్పున దొరక్కపోతే, ఉత్తరానికి- ఉత్తరంవేపు దొరక్కపోతే దక్షిణానికి ప్రయాణం చేస్తున్నారు. అయినా లాభంలేకపోతుంది. అందరి మొహాలలోనూ నిరాశ తాండవిస్తోంది.
"ఈ ట్రాలర్లొచ్చినాక మననోట్లో మన్నే "నిస్పృహతో అన్నాడు చంద్రయ్య. "పెనంలోంచి గరిటతో తీసినట్లు రొయ్యల్ని సముద్రంలోంచి తీసుకుపోతున్నారాల్లు. ఇక మనకేం దొరుకుతాయి." ఈసారి వల అంత తొందరగా రాలేదు. ఇంకో ఇద్దరూ పట్టి లాగాల్సోచ్చింది. చైతన్య ప్రక్కన కూర్చొన్న చంద్రయ్య ఒక్క ఉదుటున లేచి వెళ్ళి "నెమ్మదిగా, ఒరేయ్ నెమ్మదిగా" అంటూ అరిచేడు. చైతన్య వూపిరి బిగబట్టేడు. వలని జాగ్రత్తగా లాగుతున్నారు. నెమ్మదిగా లాగుతున్నారు.
అందరి మొహాలూ నెత్తురుచుక్కలేనట్టు వాడిపోయాయి. వలకి ఓ మూల పెద్ద బండరాయి వుంది. నీళ్ళపైకి రాగానే ఆ బరువుకి ఆగలేక వలని చింపుకొని మళ్ళీ నీళ్ళలోకి జారిపోయింది. వల ఓ మూలగా పూర్తిగా చిరిగిపోయి పనికిరాకుండా పోయింది. నిరు పేదలైన జాలర్లకి అది సామాన్యమైన నష్టంకాదు.
శ్మశాన నిశ్శబ్దం ఆ నవలో పరచుకొని వుంది. సాయంత్రపు చీకటులు నెమ్మదిగా ముసురుకొంటున్నాయి పడవ వెనక్కి తిరిగింది.
చాలామంది మౌనంగా కూర్చుండిపోయేరు. ఆశ చావని వాళ్ళు ఇంకా వల విసిరి పైకి తీస్తూనే వున్నారు. ఖాళీగా వస్తున్న వలని చూసి నిరాశ పడుతూనే వున్నారు. పడవ మాత్రం ఆశ నిరాశల మధ్య వూగే మనిషి జీవితంలా తీరంవేపు సాగిపోతోంది.
"చంద్రయ్యా" చైతన్య పిలిచేడు.
"ఏం సైద్దొరా"
"తిరిగి వెళ్ళిపోవటమేనా?"
"ఇంకేం చేస్తామయ్యా...."
చైతన్య కొద్దిసేపు మౌనంగా వుండి- "ఇంకోసారి ప్రయత్నిద్దాం చంద్రయ్యా" అన్నాడు.
"చీకటి పడుతున్నది కదయ్యా".
"చీకటిలో వల వేయటం అలవాటే కదయ్య."
"అవుననుకో దొరా, కానీ ఈ రోజు జలం కనికరించలేదే".
"కనికరిస్తుందని నాకెంతో నమ్మకం వుందయ్యా".
"ఎలాగేటి?"