Previous Page Next Page 
పర్ణశాల పేజి 23


    శ్రోతలు ఇద్దరూ శ్రద్దగా  వింటున్నారు.
   
    "తన మిత్రుల్నీ, పరిచయస్తుల్నీ ఏ మాత్రం కొద్దిగా పరిచయం వున్నా సరే ఆహ్వానించి పార్టీ ఇచ్చేడు. చాలా బ్రహ్మాండమైన పార్టీ అది! కొన్ని వేల ఖర్చుతో జరిగిన ఆ పార్టీ చివరలో అతడు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈ మనుష్యుల్నీ , వాళ్ళ కుత్సితమయిన స్వభావాల్నీ తిట్టిపోసేడు. అరగంటసేపు ఉధృతంగా సాగిన ఉపన్యాసం చివర తన నిర్ణయాన్ని వెల్లడించేడు- అన్ని లక్షల ఆస్థినీ అతడు ఆస్థినీ  అతడు ధర్మ సంస్థలకీ శరణాలయాలకీ వ్రాసి సన్యాసం స్వీకరించబోతున్నట్లు..... అది వినగానే సభలో హాహాకారాలు బయలుదేరాయి. అతణ్ణి వారించటానికి ఎందరో ప్రయత్నించేరు. కానీ అతడు వినలేదు. ఆ మరుసటిరోజు నుంచీ కనపడలేదు. మాట నిలబెట్టుకొన్నాడు. ఎవరికీ అర్థంకాని దొక్కటే. డబ్బు పోయినప్పుడే వెళ్ళిపోకుండా- మళ్ళీ దాన్ని సంపాదించడం కోసం ఎందుకంత కష్టపడ్డాడూ! కష్టపడి సంపాదించి, అనుకున్నది సాధించేక మళ్ళీ ఎందుకు వదిలేసేడూ అని."

    "అవునెందుకు వదిలేసేడు?" అడిగేడు చైతన్య.

    "చెప్పానుగా! నిరాశలోంచి వేదాంతం ఉద్భవించదని."

    "అదే కారణం అని నమ్మకం ఏమిటి? ఇంకేదయినా వుండొచ్చుగా." వృద్ధుడు ఆవేశంగా "లేదు. ఇంకోటీ లేదు.... ఇంకోటీ లేదు....." అన్నాడు.

    "ఏమిటా నమ్మకం?"

    "అవును....నమ్మకమే."

    "అంత నమ్మకంగా చెబుతున్నావ్. నీకేలా తెలుసు?"

    "నిరంజన్ దాస్ ని నేనే కాబట్టి....."

    దెబ్బతిన్నట్టు చూసేడు చైతన్య.

    ఎదురుగా వృద్ధుడు నిర్వీకారంగా కూర్చొని వున్నాడు.

    చైతన్య మనసులో ఏ మారుమూలో కొద్దిగా మిథ్యాదార్శనిక భౌతికవాదం వుంటే తనలాటి లక్షాధికారుల్ని చిన్న కనుసైగతో కొనగలిగే ఈ కోటీశ్వరుడి నిరాడంబరత చూచి.....నశించింది. అతడిని అప్పటివరకూ వేధిస్తూన్న తత్త్వజిజ్ఞాసాత్మక శూన్యత, మెటాఫిజికల్ ఎమ్టీనెస్ పోయింది.

    శారదవేపు తిరిగాడు. ఆమె అతడినే చూస్తోంది. అతను నెమ్మదిగా....."శారదా నేను నీతో వస్తాను" అన్నాడు. ఆమె మొహం ఆనందంతో వెలిగిపోయింది.

    "కానీ ఒక షరతు" అన్నాడు. "నా గురించి మన వాళ్ళకు చెప్పకూడదు సుమా...."

    అతడు తమలోకి వస్తే చాలనుకొన్న ఆమె వెంటనే డానికి వప్పుకుంది.

    "వెళ్ళిరా" అన్నాడు వృద్ధుడు చిరునవ్వుతో.

    దూరంగా ఎక్కడో ఎనిమిది కొట్టింది.

    తనదంటూ ఏమీలేదు తీసుకెళ్ళటానికి.

    వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చేడు గనుక?

    లేచేడు.

    "వెళ్ళొస్తాను తాతా"

    "మంచిది నాయనా."

    శారద మెట్లు దిగింది.

    "మళ్ళీ మనం కలుసుకోమా తాతా."

    "నువ్వే అన్నావు బాబూ, కాల ప్రయాణంలో వలసపోయే ప్రాణులు అని. కాలం కలిపితే మళ్ళీ కలుసుకొందాం, ఈ లోపులో నా కాలం పూర్తి కాకపోతే-"

    అతడు కదిలేడు ఆమెతోపాటు. ముందు ఆమె, వెనుక నెమ్మదిగా అతడు.

    కొద్దిదూరం నడిచి అతడు వెనుదిరిగి చూసేడు. ఆ వృద్ధుడు చీకట్లో అలానే కూర్చొని వున్నాడు.

    చైతన్య చేయి వూపేడు.

    వృద్ధుడు కూడా చెయ్యెత్తి ఆశీర్వదిస్తున్నట్టు అస్పష్టంగా ఏదో అన్నాడు. వాళ్ళిద్దరూ చీకట్లో కలిసిపోయి నెమ్మదిగా అదృశ్యమయ్యారు.


                              *    *    *

    శారద వున్న ఇల్లు చైతన్యకి బాగా నచ్చింది. చుట్టూ పూల చెట్లు, పక్క పోర్షనులో ఇంటిగలవాళ్ళు.

    రెండ్రోజులలో అతడూ చిన్న ఉద్యోగం సంపాదించేడు. ఉద్యోగం అంటే అది ఉద్యోగం కాదు పీలింగ్ యూనిట్ లో వచ్చే సరుకు, పోయే సరుకు లెక్కలు వ్రాసే ఉద్యోగం.

    అది దొరగ్గానే అతడు వేరే వెళ్ళిపోదామనుకున్నాడు. కానీ శారద వప్పుకోలేదు.

    చైతన్యకి ఉద్యోగం కొత్తగా ఏమీలేదు.

    అతడు బిజినెస్ చేసే రోజుల్లో ఇటువంటి చిన్న చిన్న పీలర్స్ అతడి చేతిక్రింద ఎంతోమంది వుండేవారు. అటువంటి పీలర్ దగ్గర గుమాస్తాగా తను.

    అన్ని కోట్ల వ్యాపారం చేసిన చైతన్యకి ఇప్పుడు అన్ని మెట్లూ దిగి బెస్తవాళ్ళతో కలిసి పని చెయ్యటం కొత్త అనుభవం. అతడు వాళ్ళతో పరిచయం పెంపొందించుకోసాగాడు.

    వాళ్ళ అమాయకమైన చిరునవ్వూ, స్వచ్చమైన హృదయం, కష్టపడటం తప్ప మరొకటి తెలియనితనం అతణ్ణి ఎంతో ఆకర్షించాయ్. వాళ్ళకి అతడి పేరు నోరు తిరిగేది కాదు. 'సైద్దొరా' అని పిలిచేవారు.

    ఒకరోజు వాళ్ళు అతనిని సముద్రం  మీదికి ఆహ్వానించారు..... "రా సైద్దొరా సానా బావుంటాది మొత్తం రెండు రోజుల ఏట."

    చైతన్య నవ్వి, "అలాగే వస్తాను" అన్నాడు.

    అయిదారు రోజులకి సరిపడా మూట కట్టుకొని సముద్రం మీద వేటకు పోవటం చాలా అరుదైన అనుభవం.

    మరుసటి రోజు సముద్రం మీద ప్రయాణం. ఆ రోజు అతడు ఇంటికి వచ్చేసరికి చాలా ఆలస్యమైంది. ఊరంతా నిద్రపోయింది. అతడొచ్చేవరకూ శారద మెలకువగా వుంది. ఆమెను చూసి అతడు ఆశ్చర్యంతో "టై మెంతయింది" అని అడిగాడు. "పదకొండున్నర" అంది.

    "నువ్వింకా మెలకువగానే వున్నావా?"

    ఆమె తల తిప్పుకొని "ఫర్లేదు" అని అతనికి భోజనం వడ్డించసాగింది.

    "మళ్ళీ నువ్వు ఆఫీసుకు వెళ్ళాలికదా. ఇలా నా కోసం నిద్ర పాడుచేసుకుంటే ఎలా చెప్పు?"

    ఆమె చిరుకోపంతో. "ఇంక ఆ విషయం తప్ప మరొకటి మాట్లాడటానికి లేదా ఏమిటి" అంది.

    అతడు నవ్వి, "ఉంది. రేపు సముద్రంమీదకి వెళుతున్నాను - వాళ్ళతో కలసి. ఒకటి రెండు రోజులవరకూ రాను" అన్నాడు. ఆమె వ్యాకులమైన మొహంతో "ఎందుకు ఇప్పుడు సముద్రంమీదకి, అసలే తుఫాను రోజులు కూడాను" అంది.

    అతడు భోజనం ముగించి చెయ్యి తుడుచుకుంటూ, "రెండు రోజులకే ఇలా అంటున్నావు - జీవితాంతం సముద్రం మీద గడిపే జాలరి గురించి మాట్లాడవేం" అన్నాడు.

    "అది వాళ్ళకి అలవాటయిపోయింది."

    చైతన్య నవ్వేడు. "ప్రాణం పోవటం ఎవరికీ అలవాటవదు శారదా - ఎందుకంటే అది ఒకేసారి పోతుంది కాబట్టి."

    ఆమె మాట్లాడలేదు.

    అతడు వరండాలో వున్న కుర్చీలో కూర్చొన్నాడు. ఆమె బయట మెట్టుమీద కూర్చొని వుంది. కర్రలతో కట్టిన ప్రహరీ అవతల రోడ్డు నిర్మానుష్యంగా వుంది. సన్నగా వీచే గాలికి ముద్ద బంతిపూలు నెమ్మదిగా తలలూపుతూ వుంటే వాటిమీద పిండార బోసినట్టు పడుతున్న వెన్నెల మరింత అందాన్ని సంతరించుకొంది.

    "నా మాటల గురించి ఆలోచిస్తున్నావా?"

    ఆమె తత్తరపడి, "లేదు లేదు" అంది.

    కొద్ది క్షణాల నిశ్శబ్దం తరువాత తలెత్తింది. చైతన్య కుర్చీ వెనక్కివాలి కళ్ళు మూసుకొని వున్నాడు.

    ఆమె కళ్ళవెంట ఆప్రయత్నంగా నీరు తిరిగింది. ఎటువంటివాడు ఎలా అయిపోయేడు. గతంలో జరిగిన ఎ విషయమూ ఆమె స్మృతిపథం దాటిపోలేదు. అతడి ప్రతి కదలికలోనూ అదో రకమైన హుందాతనం వుండేది. చిన్న కనుసైగతో పదిమందిని శాసించగలిగే ధీమా వుండేది. విధి ఎంత విచిత్రమైంది? కానీ ర్ర్  మానవుడు విధికన్నా విచిత్రమైనవాడు. విధి ఎలా ఆడించినా కళ్ళలో తీక్షణత కోల్పోనివాడు.

    నిజమే కొద్దిగా నల్లబడ్డాడు. బుగ్గలు లోపలికి పోయినయ్. కానీ మొహంమీద పూర్వంలేని నవ్వు ఇప్పుడొచ్చింది. కొంచెం ఆత్మవిశ్వాసాన్నీ, భవిష్యత్తు బావుండాలనే కోర్కెనీ కలగాచేస్తే చాలు. అంచెలంచెలుగా పైకి వెళతాడు.

    ఆమె ఆలోచనలో వుండగానే "నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావో" అన్నాడు అతడు.

    ఆమె ఉలిక్కిపడి "ఏమిటి" అంది.

    "నన్నెలా ఒప్పించి మనవూరు తీసుకెళ్ళాలా అని."

    ఆమెకి నవ్వొచ్చింది. "అదేంకాదు. నేను చెబితే మాత్రం వింటారా మీరు?"

    "ఎవరో సంపాదించుకొన్న డబ్బు తగుదునమ్మా అని మనం వెళ్ళి అనుభవించటమనే సలహా తప్ప ఇంకేదైనా వింటాను. అయినా ఈ చర్చ ఇప్పటికి మనమధ్య కొన్ని వందలసార్లు వచ్చిందనుకొంటాను?"

    "నేను దాని గురించేమీ ఆలోచించటం లేదులెండి" అంది.

    "మరి దేనిగురించి?" అడిగేడు.

    "ఇది మరీ బాగుంది. నేను ఆలోచించే ప్రతిదీ మీతో చెప్పాలా ఏమిటి?"

    అతడికి నవ్వొచ్చింది. అది చూసి ఆమె మరింత ఉడుక్కుంటూ, "లేవండి. లేవండి. చాలా రాత్రయింది" అంది.

    "లేదు శారదా. నువ్వు పడుకో నాకు అప్పుడే నిద్రరావటం లేదు" అన్నాడు.

    అతడికది అలవాటే అవటంవల్ల, ఆమె మరి మాట్లాడకుండా లోపలికి వచ్చి తలుపు దగ్గరకేసి వెళ్ళి పడుకొంది.

    అతడు వెన్నెల్లోకి చూస్తూ చాలాసేపు అలానే కూర్చొన్నాడు. తన జీవితంలోంచి వెళ్ళిపోయిన ఒక్కొక్క వ్యక్తిని గురించిన ఆలోచనల్తో ఎంతసేపు గడిపాడో అతనికే తెలీదు. దూరంగా ఎక్కడో గడియారం రెండు కొట్టి అతడి ఆలోచన్లు భగ్నం చేసింది.

    కుర్చీలోంచి లేచి లోపలికి వెళుతూ..........ఆగేడు.

    గదిలో ఒక మూలగా -పక్కకి వత్తిగిలి పడుకొని వుంది శారద. కిటికీలోంచి పడ్తున్న వెన్నెల ఆమె చెంపలమీదకి జారుతోంది.

    అతడికి తన చెల్లెలు జ్ఞాపకం వచ్చింది. ఒద్దికగా, పొందికగా ఇలానే పడుకోనేది కౌసల్య.... ఆమెవైపే చూస్తూ క్షణంపాటు నిల్చున్నాడు. కాంతిమతి, కిరణ్మయిల అందంతో పోల్చుకుంటే కౌసల్య. శారదల అందం ఏమాత్రం సరికాదు. కానీ ఈ ఇద్దరి కళ్ళలో ఏదో ఆర్తి వుంది. లీలగా ఎక్కడో విషాదం వుంది. పురుషుణ్ణి ఆహ్లాదపరిచే అందంకాదు - లాలించే విషాదం - ఆత్మీయత కలిగించే ఆర్తి.

 Previous Page Next Page