అకస్మాత్తుగా తనని వాటేసుకున్న ముగ్గురు వస్తాదుల మధ్య నలిగిపోతూ అరుస్తున్నాడు సత్యమూర్తి.
"ఎవరు మీరు.... వదలండి...నన్ను ఎత్తుకుపోతే మీకు ఎల్లాంటి ప్రయోజనమూ వుండదు. నిరుద్యోగిని. అనామకుడ్ని. వదిలిపెట్టండి!"
సత్యమూర్తి వస్తాదుల మధ్య నలిగిపోతూండగ - చింతామణి శారీ మందిర్ మనిషి అక్కడికి వచ్చేడు. అతన్ని చూడగానే సత్యమూర్తికి ప్రాణం లేచి వచ్చింది. ఆశగా అరుస్తున్నాడు-
"ఇదుగో గోపాలం.....వీళ్లేవరో రౌడీల్లాగా వున్నారు. నన్ను ఎత్తుకుపోతున్నారు. నువ్వయినా చెప్పువయ్యా తప్పని చెప్పు!"
"నిన్ను పట్టుకు రమ్మని సేఠే వీళ్లని పంపించాడు. నిన్ను గుర్తు పట్టేందుకు వీళ్లతో నన్ను పంపించాడు" అన్నాడు గోపాలం.
"అక్కడ ఉద్యోగం మానేసానుగా? నాతో సేఠ్ కేంపని?"
"నువ్వు రాకపోతే - రేపట్నుంచి చింతామణి శారీ మందిరే వుండదు. సేఠ్ కొట్టు మూసి అడుక్కుంటాడు మర్యాదగా వచ్చెయ్!"
"నేను రానయ్యా! నేను వస్తే సేఠ్ మళ్లీ తిడతాడు. నేను తిట్లు తినడం కంటే - అతను అడుక్కోడమే బెటరు!" అని మారాం చేస్తున్నాడు సత్యమూర్తి.
"మర్యాదగా చెబితే రాడు గానీ - బలవంతంగా ఆటో ఎక్కించండి!" అన్నాడు గోపాలం వస్తాదులతో
వస్తాదులు ముగ్గురూ సత్యమూర్తిని ఆటో ఎక్కించి, అతన్తో పాటు వాళ్లు కూడా ఎక్కేరు. ఇంకో ఆటోలో గోపాలం కూచున్నాడు.
ఆటోలు కదిలేయి!
ఎవరో ఎవర్నో కిడ్నాప్ చేస్తున్నారని టీ షాపు దగ్గిర జనం వింతగా చూస్తున్నారు. అయ్యో పాపమని జాలి పడుతున్నాడు.
ఆటోలు చింతామణి శారీ మందిర్ ముందర ఆగేయి.
సత్యమూర్తిని శవాన్ని మోస్తున్నట్లు నలుగురూ భుజాలమీద మోస్తూ ప్రొప్రయిటరు ముందు నిలబెట్టారు.
ప్రొప్రయిటరు సత్యమూర్తిని ఎంతో సాదరంగా ఆహ్వానించేడు-
"రండి సత్యమూర్తిగారూ! మీకోసమే ఎదురు చూస్తున్నాం!"
"అంత మర్యాదగా పిలవద్దు సార్! కరెక్టు రెట్లు చెప్పి రాంగ్ చేసేను... తిట్టరు. ఉద్యోగంలోంచి తీసిపారేసేరు. మళ్లీ ఎందుకీ శిక్ష? విడిచి పెట్టండి" అన్నాడు సత్యమూర్తి.
"అమ్మ! అంత మాటనకండి! మీరు వెళ్లిపోతే నేను మట్టి కొట్టుకుపోతాను. మీరు నా షాపులోనే వుండి నా పరపతిని పెంచండి."
"నేనా? మీ పరపతిని పెంచాలా?" అన్నాడు సత్యమూర్తి అర్థం గాక.
"అవునండి! దయచేసి లోపలికి వెళ్లండి!"
"అంటే నాకు మళ్లీ ఉద్యోగం ఇస్తున్నారా?"
"జీతం మీ ఇష్టం! ఎంతంటే అంత! మీరు మాషాపులో వుంటే చాలు! అదే మాకు మహాభాగ్యం కాదనద్దు!" అన్నాడు ప్రొప్రయిటరు సత్యమూర్తి చేతులు పట్టుకుంటూ.
27
గోవిందం బంగళా!
పెరట్లో -కుక్కలు రెండూ వ్యాయామం చేస్తున్నాయి.
అంతలో ఒక పనివాడు వంట గదిలోంచి బయట పడ్డాడు. వెండి కంచానికి టవలు చుట్టి చంకన పెట్టుకుని నక్కి నక్కి నపుడుస్తున్నాడు. వెండి కంచాన్ని ఎవరికీ తెలీకుండా దాటించేస్తే -నాలుగు రోజులు కులాసాగా గడపవచ్చుని అతని ఉద్దేశం.
వ్యాయామం చేస్తున్న కుక్కలు అతన్ని గమనించేయి. అతనికి ఎదురుగా వచ్చి నిలబడ్డాయి. తప్పు పని చేస్తున్నావు సుబ్బయ్యా అని రాగాలు తీస్తున్నట్లు మొరిగేయి.
సుబ్బయ్యకి భయం వేసింది. వెండి కంచాన్ని కనబడనీకుండా దాచుకుంటున్నాడు.
కుక్కలు ఇప్పుడు భయంకరంగా మొరుగుతున్నాయి.
వాటి గొడవ భరించలేక సుబ్బయ్య వెండి కంచాన్ని పక్కనే వున్న బావి లోకి విసిరి -నా చేతుల్లో ఏమీ లేదుగా అని కుక్కల ముందర రిక్తహస్తాలను ఆడిస్తున్నాడు.
అయినా కుక్కలు మొరగడం ఆపలేదు.
వాటి మొరుగుళ్లు విన్న గోవిందం గబగబా అక్కడికి వచ్చేడు. అతని వెంట కైలాసం వున్నాడు.
"ఏమిట్రా ఏం జరిగింది? అర్జంటుగా నన్నెందుకు పిలిచారు?" అడిగేడు గోవిందం.
ఆ పరామర్శ గమనించి సుబ్బయ్య ఆశ్చర్యపోతున్నాడు.
కుక్కలు ఒకటి తర్వాత మరొకటి లయబద్దంగా మొరిగేయి. ఆ మొరుగుళ్ల ద్వారా యజమానికి చెప్పదలచుకున్న ఉదంతం పూర్తిగా చెప్పేసాయి.
ఆ వరసకి సుబ్బయ్య మరింత ఆశ్చర్యపోతున్నాడు.
గోవిందం సుబ్బయ్యని అడిగేడు-
"సుబ్బయ్యా!
"బాబు!"
"కుక్కలెందుకు మొరుగుతున్నయో తెలుసా?"
"బహుశా మొరగడం ప్రాక్టీసుచేస్తున్నాయి కాబోలండి!"
ఇప్పుడు కుక్కలు రెండూ గోవిందానికి అటూ ఇటూ నిలబడి మొరుగుతున్నాయి.
వాటిని సముదాయిస్తూ అంటున్నాడు గోవిందం-
"మీరు చెప్పదలచుకున్నది చెప్పేసేరు గదా! నేనేం చేయాలో నాకు వదిలెయ్యండి! చూడు సుబ్బయ్యా - జరిగింది చెబితే క్షమించి వదిలేస్తా! చెప్పు!"
సుబ్బయ్య ఖంగారుగా అన్నాడు-
"ఏం జరుగుతుందండి? మామూలే! నా దారి నేను పోతుంటే - దొంగని చూచినట్టు - పిచ్చెత్తినట్టు మొరుగుతున్నయి" అన్నాడు సుబ్బయ్య.
సుబ్బయ్యని కైలాసం బుజ్జగిస్తున్నట్టు అన్నాడు-
"అబద్దాలు అయ్యగారి కుక్కలను బొత్తిగా గిట్టవు సుబ్బయ్యా! అనుభవమ్మీద చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో!"
"దొంగతనం ఒక తప్పు! అబద్దం చెప్పడం రండో తప్పు!" అన్నాడు గోవిందం.
"అమ్మో! దొంగతనమే!" ఆశ్చర్యపోతూ అన్నాడు కైలాసం.
"నిప్పులాంటి వాణ్ణి. దొంగతనం మా ఇంటావంటా లేదు. అయినా కుక్కల మొరుగుళ్లు నమ్మితే ఎట్లా?" అన్నాడు నిబ్బరంగా సుబ్బయ్య.
కుక్కలు సుబ్బయ్య వేపు రోషంగా చూచి మొరిగేయి.
"చూసేరా! మళ్లా మొరుగుతున్నాయి. వాటికి మొరగడం అలవాటు! అంతే!" అన్నాడు సుబ్బయ్య.
"నోర్ముయ్!" అన్నాడు గోవిందం.
"వెండి కంచం దోంగిలించేవు. అవునా?" రెట్టించి అడిగేడు గోవిందం.
"అట్టాగాండి? దొంగతనం చేస్తే ఆ కంచం నా దగ్గిరే వుండాలిగా! వెతుక్కోండి!" కొంచెం ఆందోళనగా అన్నాడు సుబ్బయ్య.
టైగర్ మొరిగింది. దాని మొరుగుడు విని అన్నాడు గోవిందం-
"ఎక్కడ దాచావో కూడా టైగర్ చెబుతోంది!" అన్నాడు గోవిందం!
సుబ్బయ్య భయపడాడ్డడు. అయినా బుకాయింపు ధోరణితో హెచ్చు స్ధాయిలో అన్నాడు -
"నాకేం తెలీదంటే నమ్మరే?"
"నరుకుతా? కంచాన్ని బావిలో విసిరేవు. అవునా?" నిగ్గదీసి అడిగేడు గోవిందం.
"వామ్మో!"
"ఒప్పుకుంటావా? నరకమంటావా?"
అని కళ్లేర్ర చేసి చూసేడు గోవిందం.
గోవిందం కాళ్ల మీద పడిపోయాడు సుబ్బయ్య.
కైలాసం రెండు కుక్కలముందూ మేధావులు అంటూ మోకారిల్లేడు. సబ్బయ్య ఏడుస్తూ అంటున్నాడు -
"తప్పయి పోయిందయ్యగారూ! బావిలో దూకి మీ కంచం మీకిస్తా నా నోట్లో దుమ్ము కొట్టమాకండి! బిడ్డలు గలోడ్ని ఇంకముందు అగ్గి పుల్లయినా సరే - అడగందే ముట్టుకొను!"
గోవిందం బదులేమీ ఇవ్వకుండానే పెద్దపెద్ద అంగల్తో బంగాళాలోకి నడిచేడు. అతన్ని వెంబడించబోయి - మనసు మార్చుకుని కుక్కలు ముందు నిలబడి అన్నాడు కైలాసం-
"మీరు ఆఫ్టరాల్ కుక్కలు కాదు. జామాజట్టీల్లాంటి పత్తేదార్లు"
కుక్కలు మొరగేయి. ఏమంటున్నాయో తెలీకుండానే నోటికొచ్చిన కూత ఒకటి కూసేడు స్టెయిల్ గా-
"మీరు అట్లాగే అంటారు! అది మీ సభ్యత! నేను మాత్రం నిజమే అన్నాను."
కుక్కలు మళ్లీ మొరిగేయి!
"ఏమిటో - మీరేదో అంటున్నారు! నా కేమిటో అర్ధమవుతోంది! వస్తా. అయ్యగార్తో మీటింగుంది!" అని గబగబా వెళ్లి పోయేడు.
సుబ్బయ్య బావిలోకి దూకడానికి ప్రయత్నం చేస్తూ -ఎందుకైనా మంచిదని బీడీ ముట్టించేడు.