రేవతి వెళ్లగానే పక్కగదిలోంచి మేనేజర్తో పాటు సత్యమూర్తి వస్తున్నాడు.
సత్యమూర్తిని చూడగానే అకస్మాత్తుగా లేచి నిలబడింది శారద.
సత్యమూర్తి శారదని చూడ్లేదు.
సత్యమూర్తితో అంటున్నాడు మేనేజర్.
"ఏవైనా సరే! నెలాఖరులోగా నేను పొడి తీరాలి. నా పాటని మా చైర్మన్ గారు మెచ్చుకోవాలి! ఏం చేస్తావో నీ యిష్టం!"
సత్యమూర్తి ఏమీ చెప్పకుండానే చేతులు జోడించేడు.
"మంచిది! వెళ్లిరా!" అని మేనేజరు కొండలలో అనుకుంటూ తన గదిలోకి వెళ్లిపోయేడు.
అప్పుడు - శారదను చూసేడు సత్యమూర్తి.
గబగబా ఆమె దగ్గరికి వచ్చి అన్నాడు
"వండ్రపుల్! ఏమిటిలా వచ్చేవు?"
"రేవతి నాకు మంచిఫ్రెండు!"
"అయ్ సీ! మళ్లీ మనం కలుస్తామనుకోలేదు."
"అనుకోనివి జరగడమే - జీవితం!"
"నేను చెప్పదలుచుకున్నది నువ్వు చెప్పేవు!"
"చింతామణిలో ఉద్యోగం?"
"అదొక అధ్యాయనం! అంతే. చుక్క పెట్టేసెను" అన్నాడతను నిర్లిప్తంగా.
"అసలేం జరిగింది?"
"చాలా చెప్పాలి!"
"చెప్పండి!"
"ఇక్కడ కాదు!"
"అయితే పదండి!"
"ఎక్కడికి?"
"మీ యిష్టమొచ్చిన చోటుకి!"
"నో ... నో... వద్దు! అభ్యంతరం లేక పోతే అట్లా బస్సు స్టాపు వరకు నడుచుకుంటో వెడదాం! బస్సు స్టాపు చేరుకోగానే చెప్పదలచుకుంది కూడా పూర్తవుఅతుంది."
"ఒ.కె అన్నది శారద."
ఆ ఇంటోంచి ఇద్దరూ బయట పడ్డారు.
26
గోవిందం మేడ!
సోఫాలో ఠీవిగా కూచుని వున్నాడు గోవిందం. దర్జాగా పైపు కాలుస్తున్నాడు. అప్పుడప్పుడు క్రీగంట తైలవర్ణచిత్రాన్ని తిలకిస్తున్నాడు.
ఆ పనిలో వుండి-
తన ఎదుట చేతులు కట్టుకుని దోషిలా నిలబడ్డ కైలాసం మాటల్ని కూడా శ్రద్దగా వింటున్నాడు.
కైలాసం ఒంటి మీద దుస్తులు చిరిగిపోయివున్నాయి. చిన్నస్వామి కైలాసాన్ని చితగ్గోటి పంపించిన గుర్తులు శరీరమ్మీద స్పష్టంగా కనిపిస్తున్నాయి. కైలాసం విషాదంగా అన్నాడు.
"నా జాతకం బాగోలేదు సార్! నాది గండాల బతుకై పోయింది."
ఒక కుక్క మొరిగింది.
"జాకీ తమకేదో చెబుతోందిసార్!" అన్నాడు కైలాసం.
"మరేం లేదు. నువ్వు నిజమే చెప్పేవంటోంది!" అన్నాడు గోవిందం.
ఆ మాట విని తృప్తిగా గాలి పీల్చుకున్నాడు కైలాసం.
"థేంక్సండి! జాకీకి కూడా థేంక్స్! అసలు నేను అమ్మాయి గార్ని వెయ్యి కళ్లతో వెంబడిస్తూనే వున్ననండి! నా వెనక నుంచి ఏ ఏ వాహనాలు వెడుతున్నాయో - నా ముందు నుంచి ఏ ఏ బళ్లు వస్తున్నాయో పట్టించు కోకుండా ఏకదీక్షగా అమ్మాయిగార్ని వెంబడిస్తున్నానండి!" అన్నాడు కైలాసం.
ఇప్పుడు టైగర్ మొరిగింది.
దాని మొరుగులు విని గోవిందం చిరునవ్వు నవ్వేడు.
కైలాసం కొంచెం బెంగగా అడిగేడు-
"టైగరేదో జోకు వేసింది కాబోలు!"
"అది జోకు వేయలేదు."
"చిత్తం!"
"నువ్వు అతిశయోక్తులు విసురుతున్నావని హెచ్చరించింది!" అన్నాడు గోవిందం.
"ఇంకా నయం! అబద్దాలు చెబుతున్నానని అనలేదు!" అన్నాడు కైలాసం.
"రెండూ ఒక్కటే! నువ్వు చెప్పు!"
"ఏం చెప్పనండి! దిక్కుమాలిన గుర్రబ్బండి వెనక నుంచి వేగంగా వచ్చి గుద్దేసింది. పచ్చడైపోయేను. రోడ్డుమీద జనం అయ్యో పాపమన్నారు. నన్ను లేవదీసి సోడా కూడా తాగించేరు. సోడా గొంతులో పడగానే మళ్లీ ఊపిరి వచ్చింది. అమ్మాయి గారి కోసం అటూ ఇటూ చూసేను. ఎటు వెళ్లిపోయేరో ఏమో! కనిపించలేదు. సార్ - నన్ను మీరు క్షమించాలి! నా డ్యూటీ నేను ఎంత సక్రమంగా చేస్తున్నా విధి నా మీద పగతీర్చకుంటోంది! అదేమిట్సార్ - కుక్కలు వెళ్లి పోతున్నాయి ?" అన్నాడు కైలాసం.
"అవి చాలా క్రమశిక్షణతో పెరుగుతున్న కుక్కలు!"
"చిత్తం!"
"అంచేత చెత్త ఖబుర్ల వినవు!"
"అనుకున్నాన్లెండి!"
"గుర్రబ్బండి నీ మీద ఎక్కిందో - రౌడీ వెధవ నిన్ను చితకబాదేదో నాకు అనవసరం!"
"చిత్తం!"
"డ్యూటీలో వుండి దెబ్బలు తిన్నావు గనక - జాలి పడి రెండు రోజులు సెలవిస్తున్నాను" అన్నాడు గోవిందం.
"ఆహా! తమది జాలిగుండె!"
"పొగడోద్దు!
"పొగడను"
"వెళ్లి రెస్టు తీసుకో!"
"తీసుకుంటాను!" అని కైలాసం అక్కడ్నించి వినయంగా కదిలేడు.
* * *
మేడ మీద తన గదిలో శారద విచారంగా వుంది.
సత్యమూర్తిని తలుచుకుంతూంటే జాలి వేస్తోంది. అతను సుఖంగా బతకాలి. అతను సుఖంగా బతికేందుకు తాను చేయూత నివ్వాలి. అందుకేమైనా చేయాలి!
ఫోన్ తీసింది. డయల్ చేసింది.
అవతల-
చింతామణి శారీమందిర్నించి ప్రొప్రయిటరు 'హల్లో' అన్నాడు.
"నేను శారదను గోవిందం గారమ్మాయిని!"
"గొంతు గుర్తు పట్టేనమ్మా! చీర లేమైనా కావాలా?"
"నాకు చీర లోద్దు. సత్యమూర్తి కావాలి!"
"సత్యమూర్తా? ఎక్కడున్నాడో - ఏమో?"
"వెతికించండి. మీకు వీలు కాకపోతే - నాన్నగార్తో చెప్పి వెతికిస్తాను!"
ప్రొప్రయిటరు ఖంగారుగా అన్నాడు -
"వద్దులేమ్మా! ఇంత చిన్న పని ఆయన కెందుకు చెప్పడం? నేనే వెతికిస్తాను!"
"ఎట్లాగైనా సరే! అతను మీక్కనిపించాలి!"
"తప్పకుండా కనిపిస్తాడు. ఆ గ్యారంటీ నేనిస్తాగా!"
"అతను కనిపించగానే మీరతన్ని ఉద్యోగంలో పెట్టుకోవాలి!"
"అంటే? ప్రొప్రయిటరు నీళ్లు నమిలేడు."
"వీల్లేదంటే చెప్పండి! నాన్నగార్తో చెప్పి వేరే ఉద్యోగం"
"వద్దమ్మా! వేరే ఉద్యోగం కోసం నాన్నగార్తో చెప్పాలా ఏమిటి? నేనే యిస్తాను. వెతికించి పట్టుకొని ఉద్యోగ మిచ్చి నీకు ఖబురు చేస్తాను. సరా?"
"థాంక్స్ అంకుల్!"
"నాతల్లే! అంకులన్నావ్! అదే పదివేలు! ఇదిగో ఇప్పుడే సత్యమూర్తిని వెతికేందుకు మనుషుల్ని పంపుతున్నాను. నాన్నగార్ని అడిగేనని చెప్పు" అని ప్రొప్రయిటరు యింకా ఏదో చెప్పబోతుండగా - శారద ఫోన్ పెట్టేసింది.
* * *
సత్యమూర్తి ఒక టీ దికాణం దగ్గర వున్నాడు. బన్ను తినడం పూర్తి చేసి, టీ తాగుతున్నాడు. ఆ పేటలో వున్న నలుగురు వ్యక్తులు ఆ సందు చివరికి వచ్చారు. అందులో ముగ్గురు వస్తాదుల్లా వున్నారు. ఒకతను మాత్రం చింతామణి శారీ మందిర్లో పనిచేస్తుంటాడు. అతను సత్యమూర్తిని చూసేడు. చూడగానే వస్తాదులతో అంటున్నాడు.
"అదుగో - అతనే! టీ తాగుతున్నాడు చూడండి! అతనే సత్యమూర్తి!"
ముగ్గురు వస్తాదులు సత్యమూర్తి దగ్గరికి పరుగెత్తారు.
టీ దికాణం మనిషికి సత్యమూర్తి డబ్బులిచ్చి వెళ్లబోతుండగా వస్తాదులు సత్యమూర్తిని వాటేసుకున్నారు.