ఈ స్వప్నకి, ఈ సౌందర్యరాసికి తను విడాకులివ్వాలనుకొన్నాడా? ఎన్నో మంచి గుణాలున్న ఈ స్వప్నని తూలనాడింది తనేనా?...... స్వప్నకి విడాకులివ్వాలనుకొన్న తన ఒకనాటి ఆలోచనకు తనను తాను నిందించుకోసాగాడు మాధవ్. స్వప్న తెలివైంది కాబట్టి తనలా తొందరపడకుండా తనకొక అవకాశం ఇచ్చింది! ఈ అవకాశంతో తన జీవితాన్ని స్వర్గతుల్యం చేసుకోవాలి!
ఒకనాటి ప్రేమ కథను స్వప్న ఎలా మరిచిపోవాలనుకొందో, అది తనూ మరిచిపోవాలి! ఆమె మనసులో స్వరూప్ స్థానాన్ని తను గెలుచుకోవాలి!
"ఆకలేస్తోంది! ఇక్కడ కూర్చొని తెచ్చినవి ఖాళీ చేసేద్దామా?"
"ఒక సౌందర్య భరిణె! ఒక సుగుణాల రాసి!" చూపు తిప్పుకోకుండానే అన్నాడు.
స్వప్న ఫక్కున నవ్వింది . "ఆ నిర్ణయానికి రావడానికి, ఆ బిరుదు లివ్వడానికి ఏడాదిలో వారమే దొర్లిపోయిందని మరచిపోకండి!"
ఒక చెట్టుకింద బెంచీ దగ్గరకి నడిచింది. వైర్ బాగ్ లోంచి ఫ్లాస్కు, మిగతా సామాను తీసింది.
డబ్బామూతలో బూందీ పోసి మాధవ్ కి ఇచ్చింది. మాధవ్ తింటూ అన్నాడు. "నిన్ను తెలుసుకోవడానికి ఏడాది అక్కరలేదు, స్వప్నా! నువ్విచ్చిన అవకాశం నిన్ను పోగొట్టుకొనే దురదృష్టం నుండి తప్పించిందనుకొంటున్నాను!"
"అవకాశం నేను మీ కివ్వలేదు! ఈ అవకాశాన్ని నేనే అర్దించి మీనుండి పొందాను!"
"నువ్వు పొందిన అవకాశం నా పాలిటి అదృష్టంగా భావిస్తున్నాను!"
టేబిల్ మీద గడియారంలో రేడియం డయల్ ముళ్ళు రాత్రి పదకొండు గంటల సమయాన్ని సూచిస్తున్నాయి. రాత్రి ఒంటరితనం ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంటే మాధవ్ అసహనంగా బెడ్ మీద దొర్లుతున్నాను. ఆ వయసుకి సహజమైన ఆకలి, దాహం అతడిని ఉడికించి వేస్తోంటే "భార్య వుండీ నాకీ ఒంటరితనం ఏమిటి?" అనుకోసాగాడు. కాని, స్వప్నని పిలువడానికి సాహసం చాలడంలేదు. తను ఏకాస్త చిలిపితనం ప్రదర్శించినా కళ్లలో తీక్షణత, ముఖంలో సీరియస్ నెస్ చోటు చేసుకొనే స్వప్న తన కోరిక మన్నిస్తుందా!
కరిగిపోతున్న కాలం మాధవ్ లో కోరికను రగిలిస్తూంటే స్వప్న తన కోరిక మన్నిస్తుందా అన్న మీమాంస తొలగి నా కోరిక తీర్చకపోతే తనెందుకీ ఇంట్లో? ఆమెను బలాత్కారంగానైనా ఆక్రమించుకొనే హక్కు తనకుండగా తన శరీరాన్ని ఇంత చిత్రహింస పెట్టుకోవడం ఎందుకన్న ధీమా పెరిగింది.
బెడ్ మీద నుంచి లేచి తూలుతూ వెళ్లి పక్కగది తలుపు తట్టాడు.