స్వరూప్ తన భగ్నప్రణయం గురించి చెప్పిననాటి నుండి గుండెలో భగభగలాడుతున్నదేదో కొద్దిగా చల్లారినట్లనిపించింది మాధవ్ కు.ఎవరికో మనసిచ్చి అతడితో ప్రేమ వ్యవహారం నడిపిన అమ్మాయి మెడలో తాళికట్టిన తన దౌర్బాగ్యానికి ఎంత విచారించాడో, తన భార్య ప్రేమకథ నలుగురిలో పడితే తన బ్రతుకు, తన కుటుంబం ఎంత నవ్వుల పాలు అవుతుందో ఊహించుకొంటూంటే ఒంటికి కారం రాచుకొన్నట్టుగా అనిపించేది! నిజంగా ఆనాటినుండి ఒక విధమైన నరకం అనుభవించాడు తను!
స్వప్న చెప్పిన పద్దతి బాగానే వుంది!
భౌతికంగానే కాదు, మానసికంగా కూడా గతాన్ని ఆమె సమాధి చేయగలిగితే ఆమెతో కాపురం చేయడానికి తనకేమీ అభ్యంతరం లేదు!
స్వప్న డ్యూటీలో జాయిన్ అయింది.
ఇద్దరూ కలిసి మూడురోజులు తిరిగారు ఇంటికోసం. ఒకమాదిరి ఇల్లు దొరికింది.
స్వప్న ఊరికివెళ్లి పెళ్లిలో తనకి బహుమతులకింద వచ్చిన సామాను, పుట్టింటివాళ్లిచ్చిన సామాను తెచ్చుకొంది. అయిదువందలు ఖర్చు చేసి సంసారానికి అవసరమైన మరికొంత సామానుకూడా కొంది. ఒక సెలవు రోజున ఇల్లంతా నీట్ గా సర్దుకొంది. ఆఫీసునుండి వచ్చిన మాధవ్ కి గృహిణి నేర్పరితనం కొట్టవచ్చినట్టు కనిపిస్తున్న ఇంట్లో సేదదీరినట్టయింది. గోడలకి చక్కని చిత్రపటాలు, కిటికీలకీ గుమ్మాలకీ మంచి డిజైన్ల లో వున్న తెరలు, చక్కగా అమర్చిన ఫర్నిచర్ - ఇంటి రూపమే మారిపోయినట్టుగా వుంది.
స్వప్న టీచరేకాదు. మంచి గృహిణికూడా నన్నమాట!
మనసులో తృప్తిలాంటిదేదో నిండిపోగా ఈజీచెయిర్ లో శరీరం వాల్చాడు.
"ముఖం కడుక్కువస్తేటా ఇస్తాను!" స్వప్న గుమ్మం దగ్గరికి వచ్చి అంది.
"పిక్చర్ కి వెడదామా, స్వప్నా?"
"ఉహుఁ చాలా అలసిపోయాను. వచ్చే ఆదివారం వెడదాం" పని అలసట ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది.
వాడిపోయిన ఆ ముఖం చూస్తూంటే జాలేసింది మాధవ్ కి. బట్టలు మార్చుకొని లోపలికివచ్చి "చాలా అలిసిపోయినట్టున్నావు! నేనేమైనా సాయం చేయగలనా?" అని అడిగాడు.
డికాక్షన్ ఫిల్టర్ చేస్తున్న స్వప్న చిన్నగా నవ్వింది."మీ కేం చేతవుతుంది!'
"మరీ మగాణ్ణని అలా తీసివేయకు! తలచుకొంటే మాకు చేతగాని విద్యేముంటుంది? ఈ నైట్ కు నేను వంట చేయనా?"
"మీకు వంట వచ్చా?" స్వుప్న కళ్లలో తెచ్చిపెట్టుకున్న ఆశ్చర్యం.
"రాదు. నీ శ్రమ పంచుకోడానికి నేనూ వంట నేర్చుకొంటాను. ఇద్దరం బయట కష్టపడి వచ్చేవాళ్లం. ఇంట్లో నువ్వొక్కదానివే కష్టపడడం న్యాయంకాదు."
ఒక సెలవురోజు మాధవ్ పిక్చర్ ప్రోగ్రాం పెడితే స్వప్న జూపార్క్ కు వెడదామంది.
సరేనన్నాడు మాధవ్.
తినడానికి కొంచెం ఫలహారం ఫ్లాస్కులో టీ తీసుకొంది స్వప్న. టీ తాగడానికి గ్లాసులతో సహా వైర్ బాగ్ లో సర్దేసి బయల్దేరింది.
పార్కులో అడుగుపెట్టాక ఈ లోకాన్నే మరిచి పోయినట్టుగా అయింది స్వప్న. రంగు రంగుల్లో సుమబాలల సౌందర్యం విరబోస్తుంటే రకరకాల వన్యమృగాలు కళ్లను తిప్పనీయడం లేదు! ప్రతీదీ చిన్నపిల్లలా చూస్తూ మనసారా ఆనందిస్తున్న స్వప్నను చూస్తూంటే ఆమెపట్ల ఆకర్షణ పెరిగిపోతోంది మాధవ్ కి. ఏ బాధా తెలియని దానిలా సరదాగా క్షణాలు దొర్లిస్తున్న స్వప్న భగ్నప్రేమిక అంటే ఎవరూ నమ్మరు!