"సరిగా మూత పెట్టలేదు. లైట్ పురుగు పడింది నీళ్లలో!" అతడి గొంతు మామూలుగా లేదు! ఒక విధమైన వణుకుతో వస్తోంది మాట.
"అబ్బ ! నిద్రవస్తోంది. కిచెన్ లోకి వెళ్లి తెచ్చుకోండి."
"ముందు నువ్వు తలుపు తెరు" అతడి కంఠంలో కఠినత్వంతో పాటు అధికారం కూడా చోటు చేసుకొంది.
"ఎందుకు?"
మాధవ్ పాదం ఎత్తి తలుపుమీద గట్టిగా తన్నాడు. "ముందు తలుపు తీస్తావా లేదా?"
స్వప్నకి పరిస్థితి అర్దమైపోయింది. మగవాడిలో సహజంగా మేల్కొనే మృగం మేల్కొందని! ఇప్పుడు తను తలుపు తీస్తే ఆ మృగానికి తను ఆహారమైపోతుంది. ఆహారం కావడానికి తను సిద్దమే. మాధవ్ కి తనపట్ల కలుగుతున్న ఆకర్షణ ఇక్కడితే ఆగిపోతుంది. మామూలు భర్తగా మారిపోతాడు. ఈ ఆకర్షణ పెరగాలి, బాగా పెరగాలి. తనంటే పడిచచ్చేంత పెరగాలి. భవిష్యత్తులో అతడు తనను శంకించలేనంతగా అనురాగ బద్దుణ్ని చేసుకోవాలి. అప్పుడూ అతనికి తను లొంగడమనేది!
స్వప్న తలుపు దగ్గరగా వచ్చి అంది. "మనం పెట్టుకున్న గడువు దాటేదాకా రాత్రి పూట ఈ తలుపు తెరుచుకోదండీ!"
" ఈ గడువు నేను తమాషాకి పెట్టలేదు. మీరు నన్ను అర్దం చేసుకోవాలని, మీలో ఏ అనుమానం మిగల కుండా నన్ను విశ్వసించాలని! మనం భార్యా భర్తలంగా జీవించడం మొదలుపెట్టాక మన మధ్య ఏ విధమైన కలతలూ రాకూడదండీ!"
మాధవ్ స్వరం మృదువుగా మారిపోయింది. "నిన్ను అర్దంచేసుకోవడానికి ఏడాది కాలం అక్కరలేదు, స్వప్నా! నువ్వు నాకు అర్దమైపోయావు! నువ్వు చాలా మంచి అమ్మాయివి! నిన్ను భార్యగా పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను!"
"ఉహుఁ. ఈ ఏడాది గడువు కేవలం మీ కోసమే పెట్టలేదు. నన్ను నేను అదుపులోకి తెచ్చుకోడానికి, స్వరూప్ తలంపు తుడిచివేసుకోడానికి నాకు కొంతకాలం కావాలి! నేను మీ కౌగిలిలో వున్నప్పుడు నాలో స్వరూప్ మెదలకుండా ఉడడం కోసం ఈ గడువు నాకు కావాలి! ప్లీజ్! నన్ను అర్దం చేసుకోండి!"
ఈ సమయంలో స్వప్న నోటినుండి స్వరూప్ పేరు వినేసరికి మాధవ్ మైకం వదిలిపోయింది. పళ్లు పటపట కొరుకుతూ వచ్చి బెడ్ మీద పడ్డాడు. "దెయ్యం రేపే పంపేస్తాను! ఆ స్వరూప్ తోనే ఊరేగు!" అని గొణుక్కుంటూ.
తెల్లవారింది.
మామూలుగా ఆరుగంటలకల్లా లేచి స్నానం చేసి వంట ముగించింది స్వప్న.
ఎనిమిది అయినా మాధవ్ మాత్రం లేవలేదు!
మెలుకువ అయినా బద్దకంగా అలాగే పడుకొన్నాడు.
"ఏమండీ!" స్వప్న గదిలోకి వచ్చి పిలిచింది. "లేవండి! ఆఫీసుకు వేళవుతూంది!"
మాధవ్ కళ్ళు తెరవకుండానే అన్నాడు "ఆఫీసు! ఉద్యోగం! ఎవడికి కావాలి?పోతేపోనీ! జీవితమే నాశనమై పోగా....."
"ఒక ఆడది మోసగించినంత మాత్రాన మగవాడి జీవితం నాశనమౌతుందా? ఈ స్వప్న కాకపోతే మరో స్వర్ణ దొరుకుతుంది మీకు!"