"డాడీ! నేను వెళ్ళిపోతాను డాడీ! నన్ను పంపించేయండి. నావల్ల మీ అందరికీ బాధలు వద్దు, నా ఏడుపు నేను ఏడుస్తాను. నే వెళ్ళిపోతాను" అంది ఏడుస్తూ.
"చ..... చిన్నపిల్లలా ఏమిటమ్మా అది..... నా ఆరోగ్యం బాగులేదన్న బాధతో అమ్మ ఏదో అంటే ఇలా బాధపడ్తావా....."
"లేదు డాడీ..... మీకు తెలియదు ఈ మూడేళ్ళకే అంతా మారిపోయారు. అన్నయ్యలు నాతో ఇదివరకులా ఉండటంలేదు. అమ్మ అన్నింటికీ నేనే కారణం అన్నట్టు చూస్తుంది. నేనీ ఇంట్లో వుండను. వేరే ఇల్లు చూసుకుంటాను. లేదంటే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటాను.
"నేనుండగా నీకేం ఖర్మ తల్లీ..... అమ్మతో గట్టిగా చెప్పాను ఇవాళ నిన్నేం అన్నా వూరుకోనని. అసలు నీవా మాటలు పట్టించుకోవద్దు. ఈ ఇల్లు నాది. ఈ సంపాదన నాది. నా ఇంట్లో నేనున్నన్నిరోజులు నా ఇష్టంగా జరుగుతుంది."
నిర్మల కన్నీళ్ళ మధ్యనించి బేలగా చూస్తూ "పోనీ డాడీ..... ఆయన దగ్గరకి వెళ్ళిపోనా?" అంది.
"నీకేం మతిపోయిందా? ఇప్పుడు ఈ స్టేజిలో వెడితే నీ గతి ఏమవుతుందో, నిన్నెలా ట్రీట్ చేస్తాడో నేనూహించగలను. నో..... ఇట్స్ టూ లేట్" అన్నారు ఆయన.
నిర్మలకీ ఆ విషయం తెలుసు. ఆ భయమే లేకపోతే ఇంకో ఛాన్స్ ఇవ్వడానికి ప్రయత్నించేది. కాని ఇప్పుడు.... ఆ విషయం తలుచుకుంటేనే గుండె దడగా ఉంది ఆమెకి.
"పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడుచేసుకోకమ్మా.... చూద్దాం.... ఇంకో రెండు మూడేళ్ళు పోతే దారికి వస్తాడేమో? అతనికి మాత్రం సంసారం, పిల్లలు కావాలని వుండదూ? నీవు మాత్రం సంతోషంగా తిరక్కపోతే వూరుకోను" అని మందలించారు.
ఆ తర్వాత నాల్గురోజులు ఆయన ఎవరికి చెప్పకుండా విల్లు రాసి రిజిష్టర్ చేయించేశారు. ఉన్న ఇల్లు కూతురి పేర పెట్టి, ఓ లక్ష రూపాయలు ఆమె పేర బ్యాంకులో ఫిక్సెడ్ డిపాజిట్టులో పెట్టి, ఆ వడ్డీ ఆమెకి నెలనెలా వచ్చేట్టు! కొడుకుల ముగ్గురికి తలో లక్ష, వూర్లో పొలాలు! భార్య బతికున్నంతకాలం ఆ ఇంట్లో ఉండచ్చని, ఆమె కూతురికి తోడుగా అక్కడ ఉండాలని తన కోరిక అని విల్లులో స్పష్టంగా రాశారు. విల్లు రాశాక ఆయనకి కాస్త నిశ్చింత అన్పించింది. తనున్నా లేకపోయినా కూతురికి ఏ లోటూ రాదు అనుకున్నాక కాస్త స్థిమితపడ్డాడు. దాంతో బ్లడ్ ప్రెషర్ తగ్గుముఖం పట్టింది.
ఓ రెండేళ్ళు యాంత్రికంగా పెద్దగా ఏ మార్పులు లేకుండా గడిచిపోయాయి. రఘు లాయరు అయి, తండ్రి ప్రాక్టీసు అందుకున్నాడు. రెండోవాడు కృష్ణ - ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. మూడోవాడు మోహన్ - బి.కాం అయి ఎమ్.బి.ఏ.లో చేరాడు. నిర్మల ఉద్యోగానికి వెళ్ళడం రావడం..... అంతా రొటీన్ - ఆమే జీవితంలో ఓ రకమైన ఉదాసీనత చోటు చేసుకుంది.
ఆ ఏడాది రఘుకి మంచి సంబంధంవచ్చి పెళ్ళి సెటిల్ అయింది. పెళ్ళికూతురు దివ్యది ఆ వూరే. ఆమె తండ్రి పెద్ద కంపెనీలో పని చేస్తున్నారు. దివ్య ఎమ్మే పాసయి, లా చదువుతూంది. పిల్ల చాలా చక్కగా ఉంటుంది. చాలా మంచి సంబంధం అని అందరూ చాలా సంతోషించారు. రఘు అయితే చూసింది మొదలు ఆ అమ్మాయి అందానికి దాసుడయిపోయాడు. ముహూర్తం నెలా పదిహేను రోజులకి కుదిరింది.
ప్రధానం చిన్నసైజు పెళ్ళిలా చాలా ఆర్భాటంగా చేశారు పెళ్ళివారు. నిర్మల దివ్యని ఆమె చలాకీతనాన్ని చూసి ఇంక తనకు ఇంట్లో బాగా కాలక్షేపం వుంటుందని సంబరపడింది. ఆ నెలాపదిహేను రోజులలో దివ్య, రఘు పెళ్ళి అయిపోయినట్టే సినిమాలకి, షికార్లకి తెగ తిరిగారు. రఘు సగం రోజులు వాళ్ళింట్లోనే భోజనం చేసేసేవాడు. ఇద్దరూ ఒకరికొకరు చాలా ప్రెజంట్స్ ఇచ్చుకున్నారు దివ్య - దివ్య అంటూ ప్రతి మాటకి ముందు ఆమె గురించే మాట్లాడేవాడు. వాళ్ళిద్దరినీ చూస్తుంటే నిర్మల ఆశ్చర్యంతో పాటు అదోరకం భావం కల్గింది.
పెళ్ళి కాకుండానే అన్న వదినని ఎంత అపురూపంగా చూస్తున్నాడు. ఎలా వెంట వెంట తిరుగుతున్నాడు - ఒక మగవాడు తనని ఆరాధిస్తూ! ఆరాటపడ్తూ వెంట తిరగటంకంటే ఆ ఆడపిల్లకి కావల్సింది ఏముంటుంది! ఆ గరం, ఆ సంతోషంతో దివ్య మొహం వెలిగిపోవడం చూసి..... తన పెళ్ళిరోజులు గుర్తుకు తెచ్చుకునేది. ఈ కళ్ళల్లో మెరుపులు, మైమరపులు, ఈ నవ్వులు తన జీవితంలో ఒక రోజయినా లేవు - పుస్తకాలలో చదవడం, సినిమాలలో చూడటం తప్ప నిజజీవితంలో ఉంటాయా అన్న అనుమానం ఈరోజు తీరిపోయింది.
ఇది మనుష్యుల ప్రవృత్తి బట్టి వుంటుందా, లేక అదృష్టాల మీద ఆధారపడి వుంటుందా? మగవాడు ఆ కొత్తమోజులోనయినా భార్యని కాస్త బాగా చూస్తాడే, ఆ మాత్రం దానికి కూడా తాను నోచుకోలేదు. ఆ మనిషిలో ప్రేమ అనురాగం ఆప్యాయత అన్న పదాలకి అర్థం తెలిస్తే తన జీవితం ఇలా ఎందుకయ్యేది అని విచారించింది నిర్మల.
కొడుకు, కాబోయే కోడలు ఎంతో సరదాగా తిరుగుతుండటం చూసి, నిర్మల మొహంలో భావాలు చదివినట్టే శివశంకరంగారు బాధపడ్డారు. ఏ ఆనందానికీ నోచుకోని కూతుర్ని చూసి, కాస్త సర్దుకున్న బాధ తిరిగి మొదలైంది. శారదాంబ కూడా కూతురి మనోభావాలు గుర్తించింది.
పెళ్ళి కుదిరాక నిర్మల భర్త ప్రసక్తి, నిర్మల అత్తవారి గురించి అడిగారు వియ్యాలవారు. శివశంకరంగారు ఏదీ దాచకుండా నిష్కర్షగా కూతురు అల్లుడు విడిపోయారని చెప్పేశాడు. వాళ్ళు మొహాలు చూసుకున్నారు. నిర్మల ఉద్యోగం చేస్తుంది కనక ఆమె బారం తమ అల్లుడు మీద ఉండదు కనక మనకెందుకులే అని వూరుకున్నారు. వియ్యపురాలు అయితే మాత్రం "అమ్మాయికి మళ్ళీ పెళ్ళి చేస్తారా. ఎన్నాళ్ళు ఇంకా వుంచుకుంటారు?" అంది.
"మళ్ళీ ఒకసారి అల్లుడి దగ్గరికి వెళ్ళి పెద్దవాళ్ళతో చెప్పించకపోయారా?" అని ఉచిత సలహా పారేసింది.
"ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుంటే ఇబ్బందులు వస్తాయి వదినగారూ ముందు ముందు 'ఆడపిల్ల' అన్నాక 'ఆడ'నే ఉండాలిగాని ఈడపిల్లకాదు కదా! ఎంత పుట్టింటివారికి వున్నా అత్తింటి కాపురం చేసుకుంటే వున్న తృప్తి ఇలా పుట్టింట్లో పడి వుంటే వస్తుందా?" నీతులు బోధిస్తున్న వియ్యపురాలిని ఏమీ అనలేక మొహంగంటు పెట్టుకుంది శారదాంబ.
ఆ కోపం అంతా భర్త మీద చూపింది.