Home » Yandamuri veerendranath » పర్ణశాల


    దాంతో ఆమె మరింత కంగారుపడింది. బస్టాండ్ దాదాపు ఖాళీ అయింది. చలికాలం అవటంవల్ల కొద్దిగా చీకటి పడేసరికి మనుష్య సంచారం తగ్గిపోయింది.

    ఎవర్నైనా అడుగుదామా అనుకుంటే - బిడియం. అయినా అది మరో అర్థాన్ని సూచిస్తే.....?? ఈ ఈ పరస్పర విరుద్ధమైన భావాలమధ్య ఆమె కొట్టుమిట్టులాడుతూ వుండగానే ఒక యువకుడు దగ్గరకు వచ్చి ఏదో పని వున్నట్టూ ఆమెని రాచుకుంటూ వెళ్ళిపోయాడు.

    దాంతో ఆమె మరింత బెంబేలుపడి, అక్కడ్నుంచి కదిలి, పది అడుగులు వేసి, వెనక్కితిరిగి చూసేసరికి ఆ నలుగురూ వస్తూ కనిపించేరు. ఆమె నడక వేగం హెచ్చింది.

    అక్కడనించి కదలటం, వెనక వాళ్ళు వస్తున్నారా లేదా అని తిరిగి చూడటం, తరువాత నడక వేగం హెచ్చించటం, వారికి మరింత హుషారు నిచ్చింది. ఇంకొంచెం దగ్గరగా వచ్చి అన్యాపదేశంగా మాటలు విసరసాగేరు.

    బస్టాండ్ దాటగానే దూరంగా విసిరేసినట్లున్న కటేజేస్, అక్కడి  చీకటి చూసి, తనెంత తప్పు చేసిందో ఆమెకి  అర్థమైంది.

    చిన్న వీధి దీపపు వెల్తురులో సత్రం అరుగుమీద కొంత మంది పడుకుని వుండటం చూసి, ఆమెకి ధైర్యం వచ్చింది. కానీ అదెక్కువ కాలం నిలవలేదు.

    నలుగురిలోనూ ఒకడు మరింత ధైర్యంచేసి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఆమె కెవ్వున అరవాలనుకుంది. కానీ భయంతో నోటమాట రాలేదు. ఇది అవకాశంగా తీసుకుని- అతడు పక్కకు లాగసాగేడు. ఆమె వదిలించుకోవాలని కూడా తోచకుండా మ్రాన్పడిపోయింది.

    "ఎవరూ-" అన్న మాటలు వినిపించి, నలుగురూ పక్కకు చూసేరు. ఒక ముసలివాడు - డెభై ఏళ్ళ పైబడినవాడుప్ నిల్చుని వున్నాడు. సన్నగా, గాలికి ఎగిరిపోయేలా వున్న అతణ్ణి చూసి వాళ్ళు  తిరిగి ధైర్యం తెచ్చుకున్నారు.

    అందులో ఒకడు "మావాళ్ళే-లే" అన్నాడు ఆమె మౌనం  చూసి కవర్ చేసుకుంటూ. ఆమె చప్పున స్పృహలోకి వచ్చినట్లు, "కాదు కాదు" అనరిచింది. కానీ ఆమె కంఠం ఆమెకే కీచుగా, సన్నగా వినబడింది.

    ముసలివాడి కేదో అనుమానం వచ్చి, దగ్గరగా రాబోయేడు. కానీ, అందులో ఒకడు అతడికి అడ్డుగా నిలబడి, అతడు ముందుకు రాబోతూ వుంటే  భుజం పట్టుకుని తోసేడు. దాంతో అసలే  బలహీనంగా వున్న వృద్ధుడు వెనక్కిపడ్డాడు. తల రాతికి కొట్టుకొని "అబ్బా......" అన్నాడు.

    "ఎవడ్రా అది" అంటూ చైతన్య అక్కడికి వచ్చేడు. వచ్చినవాడు నలుగురికీ సమాధానం చెప్పగలడని తోచగానే, నలుగురూ పరుగు తీసేరు.

    వంగి చెయ్యి అందిస్తూ. "దెబ్బ తగిలిందా తాతా....."అన్నాడు చైతన్య. వృద్ధుడు చేతులమీద లేస్తూ....."నా సంగతికేంగానీ ఆ అమ్మాయిని చూడయ్యా పాపం భయపడినట్లుంది" న్నాడు. చైతన్య అటు తిరిగాడు.

    వీధి దీపపు క్రీనీడలో ఆమె నిలబడి వుంది. చీకటి వెలుగుల మిశ్రమం ఆమె మొహంమీద ప్రతిబింబిస్తోంది. ఆమె మొహం దీనంగా ఆర్తిగా వుంది. పదిమంది కుర్రవాళ్ళు కలిసి, ఇల్లు ఖాళీ  చేయిస్తున్నప్పుడు ఏవిధంగా నిస్సహాయంగా, వేదనగా ఎటూ తోచని పరిస్థితిలో నిలబడి వుందో. ఇప్పుడూ అలాగే నిలబడి వుంది. అతడు విస్మయంగా "శారదా" అన్నాడు.

    ఆమె అయోమయంగా తలెత్తింది. అప్పటివరకూ జరిగిన సంఘటనలన్నీ ఆమె మెదడు మొద్దుబారేట్టు చేసినయ్.

    ముందు నిలబడ్డ వ్యక్తివైపు చూసింది.

    పొరలు నెమ్మదిగా విచ్చుకోసాగాయి.

    ఆ గెడ్డమూ, బట్టలూ తీసేస్తే....

    క్రమంగా ఆమె కళ్ళల్లో వెలుగొచ్చింది. చప్పున అడుగు ముందుకేసి పట్టుకొని "చైతన్య బాబూ!" అంది.

    అంతలో వృద్ధుడు వారి దగ్గరికొచ్చేడు. "ఇంత రాత్రి పూట......ఇదేమిటి శారదా.....ఇక్కడ" అంటున్నాడు చైతన్య.

    "నా సంగతికేంగానీ.....ఇదేమిటి.....ఇదేమిటి చైతన్య బాబూ.....మీ ఈ వేషమేమిటి - ఈ బట్టలేమిటి?' ఆమె కంఠం రుద్ధమైంది. "ఎటువంటివారు ఇలా అయిపోయారు? ఒక్కచూపుతో పదిమందిని శాసించగలవారు మీకీ స్థితి ఏమిటి?"

    చైతన్య నవ్వేడు. భావాన్నీ, వేదాంతాన్నీ రంగరించిన నవ్వు అది.

    వృద్ధుడు అతడ్ని పరిశీలనగా చూసి - "నేను అనుకుంటూనే వున్నాను సుమా- నువ్వు పుట్టుదరిద్రంలోంచి వచ్చినవాడివి కావని" అన్నాడు.

    "ఇక్కడెందుకు రండి" అంటూ సత్రం అరుగు దగ్గరికి దారితీసేడు వృద్దుడు. చైతన్య కనబడగానే  కలిగిన మొదటి ప్రశ్నని అడిగిందామె. అది వేయిరూపాలుగా ఆమెని అప్పట్నించీ వేధిస్తోంది.

    నవ్వేడు. "ఏం చెప్పమంటావు శారదా! ఒకరు నన్నొదిలీ, ఇంకొకరు లోకాన్నొదిలీ వెళ్ళిపోయారు" అన్నాడు.

    ఆమె ఏదో అడగబోతూ వుంటే "వద్దు శారదా..... ఇంకేమీ అడగకు" అన్నాడు వారిస్తున్నట్టు, కూర్చున్నాక అడిగాడు......

    "మనవాళ్ళంతా ఎలా వున్నారు? ఎక్కడున్నారు?"

    శారద ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేదు. చాలా సేపు మౌనంగా వుండి, నెమ్మదిగా  ఒక్కో విషయమే చెప్పసాగింది.

    గోడకు ఆనుకొని కూర్చుని వున్నాడు చైతన్య. ఒకవేపు చెంపమీద లైటు వెలుతురు మసకగా పడుతోంది. శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు. అతడి మొహంలో ఏ భావమూ లేదు. శారద మాత్రం జరిగినదంతా చెప్పటానికి చాలా బాధపడుతోంది. ముఖ్యంగా కౌసల్య సంగతి......అదికూడా చెప్పి ఆమె మౌనం వహించింది.

    చాలాసేపు నిశ్శబ్దం వాళ్ళమధ్య తాండవించింది. చుట్టూ చీకటి. చైతన్య కదలకుండా గోడకి అనుకొని అలానే కూర్చుని వున్నాడు. అతడికి చెల్లెలి తాలూకు స్మృతులు ఒకటొకటే గుర్తుకు రాసాగినయ్.

    తెల్లవారుజామునే లేచి, స్నానంచేసి చదువుకు కూర్చునే చెల్లి......ముగ్ధంగా, ముద్దబంతి పువ్వులా ఇంటిలో లక్ష్మిలా మసలిన చెల్లి......జలపాతంలా తృళ్ళుతూ వెన్నెల తీవెలా మెరిసే చెల్లి.... ఏ అంధకార  బంధుర పరేత నిలయంలో చిక్కుపడిపోయిందో...... ఏ కసాయి చేతుల్లో బాధలు అనుభవిస్తోందో......

    చెంపమీద తడిగా తగిలేసరికి అప్రయత్నంగా తుడ్చుకున్నాడు. ఒకే ఒక  కన్నీటిచుక్క....నెమ్మదిగా క్రిందికి జారుతోంది. అలాగే వేలుమీదకి తీసి పట్టుకొని అనుకొన్నాడు-

    "కన్నీటిచుక్కా.....కన్నీటిచుక్కా..... ఆస్థి సర్వస్వం పోయినప్పుడు రాలేదు...... నా కొడుకు చచ్చిపోయినప్పుడు రాలేదు..... నా భార్య లేచిపోయినప్పుడు రాలేదు......ఇప్పుడెందుకొచ్చావే కన్నీటిచుక్కా."


                              *    *    *


    అతడిని తిరిగి తనవాళ్ళతో కలుపుదామన్న ఆమె ఆశ నెరవేరలేదు. ఎన్నో విధాల ప్రయత్నించింది.

    చైతన్య తల అడ్డంగా వూపుతూ, "లేదు శారదా! నేను వెళ్ళి కిరణ్మయి ఆస్థి అనుభవించే ప్రసక్తే లేదు" అన్నాడు.

    "పోనీ దాని అజమాయిషీ చూస్తూ....." అంటూన్న ఆమె మాటలని మధ్యలోనే ఆపుచేసేడు. "అది కుదిరే పనేనంటావా? నేను కనబడగానే వాళ్ళిద్దరూ అంతా నా చేతుల్లో పెడతారు. నేనే వాళ్ళకి యజమాని అన్నట్టు ప్రవర్తిస్తారు. అదే నాకిష్టంలేదు. ఒక్కసారి నా కొడుకు చచ్చిపోయేముందు డాక్టర్ని తప్ప- ఇంత వరకూ ఎవర్నీ చేయిచాచి ఆశించలేదు. ఇపుడా పరిస్థితి రానివ్వకు-"

    "మీరు ఆశించే పరిస్థితి ఏమిటి? మీరు కనబడగానే వాళ్ళే మిమ్మల్ని." ఆమె పూర్తిచేయలేదు.

    "అదే నాకిష్టం లేదు" అన్నాడు చైతన్య "ఎలా అయితేనేం - చివరికి అదే జరుగుతుంది. వద్దు శారదా! వాళ్ళు సంపాదించుకొన్నది వాళ్ళే అనుభవించనీ. వాళ్ళ పెళ్ళి గురించి మంచి వార్త చెప్పేవు అదే చాలు. కౌసల్య పట్ల బాధ తప్ప ఇంకేమీ లేదు నాకు. ఇంకేముందని ఆ ఇంటికి రావాలి నేను....."

    "కానీ మీరిలా వున్నారని తెలిసే రవిబాబు వూరుకుంటాడంటారా?"

    "మరి అన్ని లక్షలకు అధికారి అయిన మీ అక్కయ్య.....నువ్వు ఇలా చిన్న ఉద్యోగం చేసుకుంటూ వేరే వుంటానంటే యెలా ఒప్పుకొంది?"

    "తన సంగతి వేరు....."

    చైతన్య నవ్వాడు. "నీకున్న వ్యక్తిత్వం నాకుండదని ఎందుకు అనుకున్నావ్ శారదా?" అన్నాడు.

    ఆమె ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయింది. ఒక కోణంలోంచి చూస్తుంటే అతడు చెప్పిందీ నిజమేలా కనిపిస్తోంది.

    ఆమె సంతోషంగా ఉంది. అతడు ఇలా కనిపిస్తాడనుకోలేదు. ఈ సంగతి అక్కకీ, రవికీ తెలిసిందంటే చాలు - వాళ్ళే వచ్చి తీసుకువెళతారు. తనతో వాదించినట్లు తమ్ముడితో వాదించలేడుగా. కానీ ఆమె ఆశ నెరవేరలేదు. చైతన్య ఆ జాగ్రత్త ముందే పడ్డాడు. అదెలా జరిగిందంటే.....?

    "రండి, వెళదాం" అంది శారద.

    "ఎక్కడికి?"

    "మా ఇంటికి...." 

    చైతన్య నవ్వి, "అప్పుడే ఇల్లు కూడా ఏర్పరుచుకొన్నావన్నమాట..."అన్నాడు.

    శారద సిగ్గుపడింది. చైతన్యే అన్నాడు. "వద్దు శారదా! ,మళ్ళీ నన్నా  ఝంఝాటంలోకి ఈడ్చకు-"

    ఆమె తెల్లబోయి "అదేమిటి........ఇలాగే వుండిపోతారా?" అంది. అతడు మాట్లాడలేదు. అప్పటివరకూ వాళ్ళ సంభాషణ వింటున్న వృద్ధుడు కల్పించుకొని......"అంత ఆస్థి వుంచుకొని నీకీ ఖర్మేమిటి బాబూ, వెళ్ళు....."అన్నాడు.

    చైతన్య తల అడ్డంగా ఊపుతూ, "అది నాదికాదు తాతా....." అన్నాడు.

    "అయినా నీ వాళ్ళందరూ వున్నారన్నావుగా...... వాళ్ళకోసమన్నా వెళ్ళాలి....."

    "లేదు తాతా! నేను లేనివాడ్ని - వున్నవాళ్ళు నా వాళ్ళు కాదు."

    వృద్ధుడు నవ్వేడు. "వేదాంతం నిరాశలోంచి ఉద్భవించదు బాబూ! అన్నీ అనుభవించాకే ఆ స్థితి రావాలి."

    "నే అన్నీ అనుభవించాను తాతా....."

    "నేనలా అనుకోను. స్త్రీ  పట్ల నీ మనసులో ఎక్కడా పూర్ణ విశ్వాసంలేదు. అంతేగాదు. విధిపట్ల కూడా నీకు గౌరవం పూర్తిగా లేదు. నీపట్ల నీకు పూర్తిగా ఏకీకరణ అవుతేగానీ  ఆ స్థితి సాధ్యంకాదు. ఆ స్థితి నిరాశలోంచి మాత్రం రాదు."

    చైతన్య మనసు అట్టడుగు పొరల్లో ఎక్కడో అహం దెబ్బతిన్నది. "అది నీ కొచ్చిందా?" అన్నాడు.

    వృద్ధుడు బలంగా నిశ్వసించేడు. కొద్దిసేపు మౌనంగా వుండి అన్నాడు- "చాలా రోజుల క్రితం ఢిల్లీలో రంజనీ స్టూడియోస్ అని వుండేది. జ్ఞాపకం వున్నదా? దాని ప్రొప్రయిటరు నిరంజన్ దాస్. ఆ రోజుల్లో దేశం మొత్తంమీద అదే  పెద్ద  స్టూడియో. ఒకరోజు నిరంజన్ దాస్ కి ఓ విచిత్రమైన కోర్కె కలిగింది. అంతా విదేశీ నటులతో 'భారతం' సినిమా  తీయాలని! అందరూ వారించారు, హితవు చెప్పేరు. అయినా అతడు విన్లేదు. ఉన్నదంతా పెట్టుబడి పెట్టేడు. దొరికిన చోటల్లా అప్పు చేసేడు. చివరికి ఆ చిత్రం  పూర్తిచేసేడు. కానీ దురదృష్టవశాత్తూ అది ఘోరంగా  దెబ్బతిన్నది. కోట్ల రూపాయల్ని ఆ చేతిలోకి ఈ చేతిలోకి ఆడించిన నిరంజన్ దాస్ తెల్లవారుజాముకల్లా వీధిన పడ్డాడు. హితవు విననందుకు తగినశాస్త్రి జరిగినదని సంతోషించారు కొందరు. కాంపిటీషన్ తగ్గింది ఫీల్డులో అని మరికొంతమంది సంబరపడ్డారు. ఇచ్చే చెయ్యి ఇస్తున్నప్పుడు తీసుకొన్న వేలాదిచేతుల్లో ఒక చెయ్యి చెందలేదు. నీలా  వైరాగ్యాన్నే వేదాంతం అనీ ఆత్మవంచన చేసుకోలేదు. ఏ సమాజం అయితే అతడ్ని చూసి నవ్విందో దాన్నే ఒక ఆట పట్టించాలనుకొన్నాడు. మేధస్సు, శ్రమా పెట్టుబడులుగా పెట్టి అహోరాత్రాలు కష్టపడ్డాడు! ఇరవై అయిదు సంవత్సరాలు తిరిగేసరికల్లా మళ్ళీ సెంట్రల్ స్టూడియోస్ కొనగలిగే స్థితికొచ్చాడు. అందరూ అదే చేస్తాడనుకొన్నారు కానీ అతడు ఏం చేశాడో తెలుసా?"

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra