వెనకనుంచి తోసేవారు - ముందునుంచి ప్రతిఘటించేవారు, మధ్యలో నలిగేవారు, వంకర్లు తిరిగిన వరుసలు.......... వరుసల్లో మనుష్యులు....... తరగని వరుసలు..... వంకర్లు తిరిగిన వరుసలు..... "గోవిందా....." ఆగి నడిచి తొందరగా సాగి- మళ్ళీ ఆగి - గుడిలోకి క్యూ.
"ఎక్కడున్నాడయ్యా దేవుడు?"
"ఇంకొక్క వరుసేనయ్యా.....అదుగో ఆ మలుపు తిరిగేక......"
కాళ్ళు పట్టేసినయ్. పదిహేను గంటలు నడిచి, పదిగంటలు వరుసలలో నిలబడి...... ఇంతశక్తి ఎలా వచ్చింది. ఎవరిచ్చేరు? ఇంత బాధ పడితేగానీ దేవుడు కనపడడా?.....మరి బాధపడుతున్నట్లు తెలియదేం?
మలుపు తిరిగితే...?
వచ్చేసింది. మలుపు వచ్చేసింది. మలుపు వచ్చేసింది. తిరిగితే కనబడతాడా? ఆ మూర్తి నిజదర్శనం కనబడుతుందా? అసలు దేవుడున్నాడా?
ప్రమిదలు వెలుగుతున్నాయి. చుట్టూ గోడలు ప్రకాశిస్తున్నాయి. విగ్రంవెనుకనుంచి ఏదో వెలుగు.....ముందుకు జరిగే కొలదీ మనసు తేలిక పడుతున్న అనుభూతి. పడిన బాధ అంతా మర్చిపోయేలా ఏదో ఉద్వేగం, చేరుకోవటానికి ఎంత కష్టపడితే అంత ఉద్వేగం, అంత ఆనందం లభిస్తుంది కాబోలు. ఏదో అలౌకికమైన
అనుభూతి.
అయితే ఆ అనుభూతి దేవుణ్ణి చూడటం వల్లా? చూడటానికి పడిన కష్టంవల్లా?
అడుగు ముందుకు వేయబోయాడు.
ఎవరో ముఖ్యుడు ఇంకో దారివెంట వస్తున్నాడు. అతనికి దారి ఇవ్వటంకోసం ఇతణ్ణి వాలంటీర్లు ఆపుచేసేరు. వెనుక జనం ప్రవాహంలా వస్తున్నారు. ముందుకు సాగిపోవాలని ఆశ. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూడాలని ఆతృత. "గోవిందా- గోవిందా" అని నినాదాలు. గుండెల్లో గణగణా మ్రోగే గంటలు.
చైతన్య ఆగలేదు, సాగిపోతున్నాడు. మనసు ఉద్వేగంతో వూగిపోతోంది. పూజారుల మంత్రాలు ఉచ్ఛస్వరంతో వినబడుతున్నాయి. అంతా గోలగా వుంది. మనసు మాత్రం మౌనంగా వుంది. అతడు కదులుతూనే వున్నాడు. ఏదో శక్తి ముందుకు తోస్తున్నట్టు కదులుతూనే వున్నాడు. వాలంటీరు కర్ర అడ్డుపెట్టేడు. ఆగలేదు.
వాలంటీరు బలంగా తోస్తే, క్రిందపడి, తల అదిరి, మళ్ళీ స్పృహలోకి వచ్చేడు. ప్రక్కనుంచి వచ్చిన వి.ఐ.సి. విగ్రహం దగ్గరకు సాగిపోయేడు. చైతన్య చేతులమీద బలహీనంగా లేస్తూ గొంతు పగిలేలా అరిచాడు. "పదహారు గంటల్నుంచీ వరుసలో నిలబడి వస్తున్నాన్రా. ఇప్పుడు తోసేస్తావు కదూ. ఒరేయ్ సర్వనాశనమై పోతావురా."
* * *
వెనకున్న వృద్ధుడు సాయం చేసేడు.
మళ్ళీ ముందుకు పయనం. దూరంగా దేవుడు..... చెయ్యెత్తి అభయమిస్తున్నట్టు-
కళ్ళు మూసుకొన్నాడు. అంతా చీకటిగా వుంది. పడిన బాధ అంతా మరచిపోయేలా- మనసు సేదతీరుతోంది. ఏదో అసంతృప్తితోనే ఏదో అసంతృప్తి. పూజారి వెళ్ళమని తొందర చేస్తున్నాడు. మనసు ఆగమని గోల చేస్తోంది. ఆగతానికీ, వెళ్ళటానికీ మధ్య నిర్ణయించుకోవలసిన మనసుకి దేవుడ్ని ధ్యానించే ఏకాగ్రత ఏది? అతడు కళ్ళు తెరవబోయాడు.
అంతలోనే విచిత్రం జరిగింది.
మొక్కుకున్నదాన్ని హుండీలో వేస్తే దేవుడికి చేరదేమోనన్న అనుమానంతో ఒక భక్తుడు, వరుసలో నిలబడి, దేవుడి దగ్గరకు రాగానే పిచ్చివాడిలా ఒక్కసారి రెండు గుప్పిళ్ళతోనూ వెండిరూపాయ కాసుల్ని విగ్రహంమీదకు విసరసాగేడు.
క్షణంలో కలకలం బయలుదేరింది.
చైతన్య నుదుటికి ఒక రూపాయొచ్చి టప్ మని తగిలించి. లాగే నొక్కి పెట్టుకున్నాడు. తడిగా తగిలింది. తీసి చూడగానే ఎర్రటి రక్తపు మరకవున్న తెల్లటి రూపాయి, నుదుటిమీద చిన్న బొప్పి.... మంతలోనే వాలంటీర్లు రంగంలోకి వచ్చేరు. జనాన్ని సర్దుతున్నారు. అంతా తొక్కిసలాటగా వుంది.
ఇద్దరూ వెనుకనుంచి ఎవరో తోస్తున్నట్టు బయటకొచ్చి పడ్డారు.
"చూసేవా నాయనా దేవుణ్ణి?" వృద్ధుడు అడిగాడు.
"ఏది తాతా..... కళ్ళు మూసుకోగానే ఇదొచ్చి తగిలింది" అంటూ నవ్వి గుప్పెట విప్పేడు. సకల చరాచర సృష్టి స్థితిలయకారుని ప్రాంగణంలో దొరికిన సకల మానవకోటినీ ఆడించే రూపాయికాసు!!
* * *
రాత్రి రెండయ్యింది.
చలిగాలి రివ్వున వీస్తోంది. వెన్నులోంచి చలి పుట్టుకొచ్చి వళ్ళు చిగురుటాకులా వణికిపోతోంది. వేసుకున్న పాతకోటు చలిని ఆపలేకపోతోంది. దుబ్బులా పెరిగిన జుట్టూ, గెడ్డమూ కొద్దిగా చలి బారినుండి రక్షిస్తున్నాయి. సత్రం అరుగుమీద ముడుచుకొని పడుకొన్న చైతన్య లేచి కూర్చున్నాడు.
పక్కనే పడుకొన్న వృద్ధుడు మాత్రం గురకపెట్టి నిద్రిస్తున్నాడు. అతడిలాగే శవాకారంలో కొంతమంది ఆ అరుగుమీద పడుకుని వున్నారు.
అంతా నిశ్శబ్దంగా వుంది. చీకటి కొండల్ని కప్పేసింది. గుడిగోపురం మీదనుంచి ఏదో పిట్ట నిద్రలోంచి మెలకువ వచ్చినట్టు అందంగా కూసి, మళ్ళీ పడుకొంది. డానికి బదులిస్తున్నట్లు పిల్లగాలి చిన్న శబ్దంతో ఆకుల్ని కదిల్చింది.
మళ్ళీ నిశ్శబ్దం.చైతన్య లేచి మెట్లు దిగేడు. గమ్యం లేకుండా బయలుదేరాడు. వెన్నెల జల్లులా కురుస్తోంది. నెమ్మదిగా నడుస్తున్నాడు.
ఎక్కడికో తెలీదు. నడుస్తూనే వున్నాడు.
సృష్టి అంతా విశ్రాంతి తీసుకొంటున్నట్లు మౌనంగా వుంది. వెళ్ళి కోనేరు గట్టు మెట్టుమీద కూర్చున్నాడు. దూరంగా గుడి.
కాళ్ళ దగ్గర పచ్చటి నీరు. పక్కనే నిద్రగన్నేరు చెట్టు. గాలికి రాలిన ఆకులు నీటిమీద తెప్పల్లా తేలుతున్నాయి.
ఓ పిల్లతెమ్మెర వచ్చి అతడ్ని నాజూగ్గా స్పృశించి ముందుకు సాగిపోయింది. ఆతడలాగే నిశ్చలంగా కూర్చొని కళ్ళు మూసుకొని వున్నాడు. దూరంగా ఎవరో నిద్రరాక సన్నటి కంఠంతో గీతాలాపన చేస్తున్నారు. పాత గాలిలో అలలు అలులుగా తేలి వస్తూంది.
"యోమం అజం అనాదించవేత్తి లోక మహేశ్వరం....
సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ-"
-నేను సర్వమునకు ప్రభవమును. నన్ను అజునిగా ఎరుగువాడు పాపముల నుండి విముక్తుడగును. నీవు నిమిత్తమాత్రుడవుకమ్ము. అనేకానేక సందేహాలతో భ్రాంతులైన వారికి చరమ సందేశమొక్కటే-
"-గీతా సుగీతా, కర్తవ్యా కిమన్యైః శాస్త్ర విస్తరైః"
......వీణియ తీవెలపై సున్నితంగా మీటినట్లు ఆ ధ్వని గాలిలో మందంగా వ్యాపిస్తుంది. అతడి ఒళ్ళు జలదరించింది.
కళ్ళు తెరిచేడు. పైన నీలాకాశం. క్రింద నిశ్చలమైన భూమి. ఆకాశంలో మినుక్కు మినుక్కుమనే నక్షత్రాలు-
ఓ చిన్న మేఘం మందగమనంతో తూర్పు దిక్కుగా సాగిపోతోంది. కోనేటి నీరు నిశ్చలంగా వుంది. నీటిలో ప్రతిబింబాలు- వెన్నెల్లో మెరుస్తూ కదలకుండా నిలబడి వున్నాయి.
నిద్రగన్నేరు చెట్టునించి పూవొకటి రాలింది. మెట్టుమీద కప్ప అలాగే వుంది. అతడిలో ఏదో ఎక్కడో కదులుతోంది.
తిరిగే భూమి, వీచేగాలి, కదలని ఆకాశం, స్థిరమైన కొండలు, స్వచ్చమైన నీరు, కదిలే చెట్లు - అన్నీ ఏకమై అందరూ నిద్రించే వేళ - ఆ నిశ్శబ్దంలో సకల చరాలూ విశ్రాంతి తీసుకొనే ఆ నీరసంలో ...... ఆ చరాలన్నీ కలిసి - తమను సృష్టించిన ఆ భగవంతుని ముక్తకంఠంతో మౌనంగా ప్రార్థిస్తున్నట్లున్నాయి.
ఆ నిశ్శబ్దం అతదికేదో బోధిస్తున్నట్లు వుంది. అతడి నరాల్లోకి ఏదో తెలియని ఉద్వేగం పాకుతోంది. సన్నగా గాలి వీచింది. ఆకులు కదులుతున్నాయి. కొమ్మా కొమ్మా రాచుకున్నప్పుడు విచిత్రమైన శబ్దం వినిపిస్తోంది.
అతడు సమాధిలో వున్నట్లు నిశ్చలంగా వున్నాడు.
గాలి పయనించినా....
కొమ్మలు రాచుకొన్నా......
ఒకటే శబ్దం నెమ్మదిగా-మనస్సు స్పందించేలా ఒకే శబ్దం.
"ఓమ్ - ఓమ్"
అన్ని వేపుల్నుంచీ అదే నాదం- అలలు అలలుగా, అలలు అలలుగా! అతడి మొహం ఒక దివ్యమైన తేజస్సు తో వెలిగిపోతోంది. అన్ని దిక్కుల్నుంచీ ప్రకృతి ఓంకార నాదాన్ని గానం చేస్తోంటే అతడు వింటున్నాడు. అతడి చుట్టూ వున్న జీవకోటి స్నేహ పురస్సరంగా అతడిని అభినందిస్తూంది. అతడి కళ్ళలో ఉజ్వలమైన వెలుగు ప్రతిబింబిస్తున్నది. అతడి శూన్యమైన మనసులో ఒక చిన్న జ్యోతి అఖండమై, ప్రతిభంజనం తోడై, మనసంతా ఆక్రమించుకుంది.
అతడు లేచేడు.
వడివడిగా తన నెలవు కేసి నడవసాగాడు.
తూర్పురేఖలు నెమ్మదిగా విచ్చుకుంటున్నాయి.
అతడు వెళ్ళేసరికి తాత లేచే వున్నాడు.
"ఎక్కడి కెళ్ళావయ్యా ఇంత రాత్రి?"
"దేవుడ్ని చూడటానికి వెళ్ళానయ్యా"
బోసిగా నవ్వాడు తాత. "మరి చూసేవా?"
"చూసేనయ్యా. మెరిసే నీళ్ళలో, కదిలే మేఘాలలో, నిలిచినా కొండల్లో దేవుణ్ణి చూసేనయ్యా."
14
పెళ్ళివాళ్ళతో కలిసి వెళ్ళిపోకుండా ఇటు రావటం ద్వారా ఎంత తప్పు చేసిందో శారదకు అర్థమైంది.
రావటం అయితే అందరూ కలిసి వచ్చేరు.
స్నేహితురాలు, వాళ్ళ కుటుంబం, అంతా బాగానే జరిగింది. కాని ఆ రష్ లో దారి తప్పిపోవటంతో కంగారు పడింది. ఒక్కతే వెళ్ళిపోగలదు, అదేమంత కష్టమైన పనికాదు. అదే వుద్దేశ్యంతో కౌంటర్ లో టిక్కెట్టు కొనుక్కుందామని బ్యాగ్ లోంచి పది రూపాయల నోటుతీసి పెడితే అది చిరిగిందనీ చెల్లదనీ అన్నారు. ఇంక డబ్బు లేదు. బ్యాగ్ అంతా కంగారుగా వెతికింది. ఓ పావలాకాసూ, రెండు పది పైసల బిళ్ళలూ దొరికినాయి.
ఆమె కళ్ళవెంట నీరు గిర్రున తిరిగింది. చప్పున క్యూలోంచి బయటకొచ్చింది. ఒకటి రెండు కోట్లలో మారుద్దామంటే ఎవరూ తీసుకోలేదు. ఒక పక్క చీకటి పడుతోంది. ఆ తటపటాయింపులోనే మరింత సమయం గడిచిపోయింది. ఆమెకేం చెయ్యాలో తోచలేదు.
నుదుటిమీద చెమట పడుతోంది. కాల్లి వణుకుతున్నాయి. ఆమె కంగారునీ, బిత్తర చూపుల్నీ పసిగట్టి ఒక యువకబృందం దగ్గర చేరింది.