ఆ వాతావరణంలో - తాను తన డ్యూటీ సక్రమంగా చేసుకుంటున్న తరుణంలో చిన్నస్వామి ఎదురయ్యేడు.
చిన్నస్వామిని చూడగానే కైలాసానికి పెద్దగా ఏడవాలనిపించింది. అతని క్కనిపిస్తే ప్రాణాలు తీస్తాడు. కనిపించకుండా పారిపోతే డ్యూటీ పాడై పోతుంది. ద్వారా ఉద్యోగం పోతుంది.
ఏం చేయాలి?
ఏం చేయాలో నిర్ణయం జరక్క ముందే చిన్నస్వామి తనని చేరుకున్నాడు. భుజమ్మీద చెయ్యివేసి ఆపేడు. బాగున్నావాని పలకరించేడు. కనిపించండం లేదేమిటని మందలించేడు. నా బాకీ మాటేమిటని కటువుగా అడిగేడు.
కైలాసం నీరసంగా అన్నాడు-
"అదే ఆలోచిస్తున్నాను!"
"ఏమిటి ఆలోచించేది"
"పదండి చెప్తా! నడుస్తూ చెబుతా!"
"నడుస్తూ వినడం నాకు చిరాకు! నిలబడే చెప్పు!"
నిలబడిపోతే నా డ్యూటీ చెడిపోతుంది సార్! నాతోపాటు నడవండి! సమస్తం చెబుతాను!"
"నేన్నడవను. నిన్ను ముందుకు కదలనివ్వను" అన్నాడు చిన్నస్వామి.
"అంతేనంటారా?" అడిగేడు కైలాసం నీరసంగా.
"ఏదో ఆలోచిస్తున్నావని అన్నావు!"
అవును! అన్నాను! బుద్ధిలేక అన్నాను."
"ఏమిటది?"
అయ్యా - ఎల్లప్పుడూ నాకు ఓకే ఒక్క ఆలోచన! ఏకైక ఆలోచన వస్తుంది"
"అదే చెప్పమంటున్నాను!"
"మీ అప్పు ఎట్లా తీర్చాలి?"
"దాన్ని ఆలోచన అనరు."
"మారేమంటారు!"
"కుట్ర అంటారు!"
"పోనీ ఆ మాటే ఖాయం చేసుకోండి. నన్ను వెళ్లనివ్వండి!"
"కదుల్తే కాలో చెయ్యో తీసేస్తా!"
"కదలకపోతే నా ఉగ్యోగం వూడిపోతుంది!"
"నా బాకీ తీర్చనప్పుడు - నీ బోడి ఉద్యోగం వున్నా ఒకటే - వూడిపోయినా ఒకటే!"
కైలాసం కన్నీళ్లు పెట్టుకున్నాడు. శారద అప్పటికే కనుమరుగవడం వల్ల కైలాసానికి దుఃఖం వస్తోంది. వచ్చే దుఃఖాన్ని దిగమింగుకుని స్టడీగా అన్నాడు-
"కానివ్వండి! మీ మాట ఎందుక్కాదనాలి? మీ బాకీ తీర్చాలి! అంతేగా! మా నాన్న మీ దగ్గర చేసిన అప్పుకి నన్ను మీకు తాకట్టు పెట్టేడు. అంతేకదా? తప్పకుండా మీ అప్పు తీర్చుకుంటాను. ఎప్పుడూ ఎలాగ అని అడక్కండి తీర్చుంటానంతే! తర్వాత మీయిష్టం!"
కైలాసం కాలర్ని చిన్నస్వామి పట్టుకుని - కోడిపెట్టని లాక్కు వెడుతున్నట్టు పక్క సందులోకి తీసుకెడుతున్నాడు.
* * *
చింతామణి శారీమందిర్లోకి అడుగుపెట్టింది శారద.
ఆమెను చూడగానే షాపు యజమాని ప్రసన్నవదనంతో 'రామ్మా! రా!" అని ఆహ్వానించేడు.
ఆమె షాపులోకిరాగానే అడిగేడు-
"ఒంటరిగా వచ్చేవే?"
ఆమె షాపంతా కళ్లతో వెతుకుతూ అన్నది -
"ఏం? ఒంటరిగా రాకూడదా?"
"రాకూడదని కాదనుకో! ఎప్పుడోచ్చినా నీ వెంట ఒకరో ఇద్దరో ఫ్రెండ్స్ వుంటారు కదా! అదన్నమాట!"
"ఫర్లేదు లేండి! ముగ్గురమూ ఎంత బిల్లు చేస్తామో! ఒక్కదాన్నీ అంతే చేస్తాను!" అన్నది శారద.
షాపు యజమాని మెలికలు తిరుగుతూ అన్నాడు -
"ఎంతమాట? ఆ మాట నేనడిగేనా? అవునమ్మా - నాన్నగారు ఊళ్లో వున్నారా?" అని మాట కూడా మార్చేడు.
"ఉన్నారు. అవునూ - మీ దగ్గర సత్యమూర్తి అనీ-"
"మీ క్లాస్ మెట్ అన్నావు! అతనే గదూ? ఎందుక్కనిపిస్తాడమ్మా! అప్పుడే - మీరొచ్చిన రోజే పంపించేశా!"
"పంపించేసేరా? ఎక్కడికి?" అని ఆత్రంగా అడిగింది.
"పంపించేసేనంటే - నా ఉద్దేశం - ఏదో కేంపుకి పంపించేనని కాదమ్మా! ఉద్యోగంలోంచి తీసేసి దిక్కున్న చోటకి పొమ్మన్నా!"
ఆ మాటకి శారద షాక్ తిన్నది. అయ్యో పాపమని కూడా అనుకుంది. అయితే తాన్ ఫీలింగ్స్ కనిపించకుండా జాగ్రత్తపడి అడిగింది.
"అతను మామూలుగా మంచివాడే! కదా?"
"ఏమి మంచి? వల్లకాడు మంచి! నిజాలు చెప్పుకుంటో ఆకల్తో అల్లాడిపోతూ రికార్డు స్థాపించమని ఆశీర్వదించి పంపించేను. ఎక్కడికి వెళ్లేడో -ఏం చేస్తున్నాడో తెలీదు. ఏమ్మా? అతన్తో పనేమైనా పడిందా?"
ఊహూ....ఊరికే అడిగేను! అంతే!....ఇవాళ మా రేవతి బర్త్ డే ! రేవతి మీకు తెలుసు గదా?"
షాపు యజమాని క్షణం ఆలోచించి అన్నాడు.
"తెలుసు.... పొడుగ్గా.. బక్కగా.... ఎర్రగా...."
"అవును ఆ అమ్మాయే! దానికి బాగా నప్పే చీర! ఖరీదెంతైనా సరే!"
"అల్లాగేనమ్మా! అల్లాగే!" అంటో అతను కౌంటరు మీంచి లేచేడు.
25
రేవతి ఇంటిముందు శారద ఆటో దిగింది.
డబ్బులిచ్చి ఆతోవాడ్ని పంపించి చీర పాకెట్టుతో ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది. సరిగ్గా అప్పుడే ఆ ఇంట్లో నుంచి ఒక పురుషకంఠం శ్రావ్యంగా గానం చేయడం వినిపిస్తోంది.
పక్కవాద్యాల హంగు లేమీ లేకుండానే అతనెంతో రాగయుక్తంగా, భావయుక్తంగా మనోహరంగా పాడుతున్నాడు.
"కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు -"
ఆ కీర్తిన వింటో ముగ్దురాలవుతున్న శారద అక్కడే నిలబడి వుంది. తన్మయత్వంతో పరిసరాలను మరిచి పోయింది. ఆ పారవశ్యంలో వెంకన్న దివ్య స్వరూపాన్ని తనివితీరా తిలకిస్తోంది. తిలకించి పులకరిస్తోంది.
పాట పూర్తయింది!
ఒకానొక తియ్యటి అనుభూతి నుంచి బయట పడినట్టు శారద గాఢంగా నిట్టూర్చింది.
వెంటనే మరో పురుషకంఠం అదే కీర్తనను ప్రాక్టీసు చేస్తోంది! ఆ ప్రాక్టీసు భయంకరంగా వుంది. కర్ణకఠోరంగా వుంది. గొంతు పిసుకుతున్నట్టుగా వుంది. ఆ కంఠంలోంచి వెలువడే శబ్దాలు తుపాకీ గుళ్లులాగా మారిపోవడం వల్ల - చెట్టుమీది పక్షులు గుంపులు గుంపులుగా ఎగిరి పోతున్నాయి. మొక్కలకి నీళ్లు పోస్తున్న తోటమాలికి మతి స్తిమితం తప్పింది. మొక్కలకి పోసే నీళ్లను తాన్ నెత్తి మీద పోసుకుంటో గంతులు వేస్తున్నాడు.
శారద కూడా తాను వచ్చిన పని మరిచి పోయింది కాబోలు- పోడానికి వెనక్కి తిరిగింది. ఆమె వెనక్కి తిరగ్గానే భయంకరమైన ఆ పురుషకంఠం నుంచే వచ్చే కీర్తన కూడా ఆగిపోయింది.
శారద వెళ్లబోతుండగా-
"హాయ్ శారూ!" అని రేవతి పిలిచింది.
శారద ఆగిపోయింది.
రేవతి శారదను చేరుకొని ఆప్యాయంగా అడిగింది-
"వచ్చి ఎంత సేపైంది?"
శారద సమాధానం చెప్పలేదు. చీర పాకెట్టు రేవతి చేతిలో పెట్టి-
"మెనీ హేపీ రిటర్న్స్ ఆఫ్ ది డే!" అంది.
"థాంక్స్! మన వాళ్లంతా వచ్చే వేళయింది. మొట్టమొదట వచ్చింది నువ్వు! నీకు నా ప్రేత్యేక కృతజ్ఞతలు! రా కూచో!"
రేవతితో పాటు హాల్లోకి వచ్చి కూచుంటో అడిగింది శారద-
"ఎవరే పాడుతున్నారు?"
"ఓహొ! అందుకా భయపడి పారిపోవాలనుకున్నావ్? వర్షాకాలంలో కుక్కలు ఏడ్చినట్టు పాడుతున్నాడు కదూ?"
"ఇంచుమించు అట్లాగే వుంది. ఇంతకీ ఎవరాయన?"
"మా ఫాదర్!"
ఆ మాట వినగానే శారద నొచ్చుకుంటూ అన్నది-
"సారీ రేవతీ! మీఫాదరని తెలీకుండా కామెంటు చేసేను.ఏమీ అనుకోవద్దు!"
రేవతీ నవ్వేస్తూ అన్నది-
"ఎందుకనుకొడం? పోలిక చేసింది నేను!"
"మీ నాన్న కంటే ముందు పాడేరు చూడు"
"అతనా అతను సంగీతం మేష్టారు! చాలా శ్రావ్యంగా పాడగలరు."
"అంతేకాదు ఆయన పాడుతుంటే స్వామి వారినిచూస్తున్న అనుభూతి కలిగింది. గోల్డెన్ వాయిస్!"
"మనిషి కూడా బంగారమే! ఎంత అందంగా వుంటాదో అంత మర్యాదగా ప్రవర్తిస్తాడు. మా నాన్నకి ప్రమోషన్ రావాలంటే అన్నమయ్య కీర్తన నేర్చుకోవాలని షరతు పెట్టేరుట - వాళ్ల చైర్మన్! అంచేత ట్యూషన్ చెప్పించుకుంటూ కష్ట పడుతున్నాడు మా నాన్న! వుండు .... కాఫీ తెస్తాను!" అని అక్కడ్నించి రేవతి వెళ్లిపోయింది.