"కాని, నేను కన్యను! మీ ముందు నేను సిగ్గుపడాల్సింది, జంకాల్సింది లేదనుకొంటాను! స్త్రీ ప్రేమ వ్యభిచారంగా, పురుషుడి ప్రేమ శృంగారంగా వర్ణింపబడడం - నిజంగా న్యాయమైందనే అంటారా?"
"న్యాయం సంగతేమోగాని ఇద్దరిని ఆనందపరిచే క్షణాలే పురుషుణ్ణి తప్పించుకొనేలా, ఆడదాన్నితల్లిగా చేస్తాయి! ప్రకృతిలోనే వుందికదా పక్షపాతం?"
ప్రకృతి పక్షపాతం చూపించినంతమాత్రాన ఆమెను పతితను చేయాలా ఈ మనుషులు? పురుషుణ్ణి రసికమహా రాజులా కీర్తించాలా? ఇదెక్కడి న్యాయం?
"నా కథ అంతదూరం వెళ్లకపోయినా నన్ను ఇంత హీనంగా, అగౌరవంగా మీరెందుకు చూస్తున్నారు? ప్రేమించడం అంత పాపమా? పెళ్లికాకముందే బ్రహ్మచర్యం కోల్పోయిన మీకంటే పాపినా?"
"............"
"నేను స్వరూప్ ని ప్రేమించాను. పెళ్లికూడా చేసుకోవాలనుకున్నాను. కాని, కుటుంబం, సంప్రదాయం, మానమర్యాదలు సంకెళ్లువేసి వెనక్కిలాగాయి. విడాకులిస్తానంటూ మీ దగ్గరినుండి ఉత్తరం వచ్చేదాకా నేను అదే విషాదంలో కుమిలినమాట నిజం! పెద్దగీతను చిన్నగీతను చేయాలంటే దానిపక్కన దానికంటే పెద్దగీతను గీయాలన్నట్టు మీ ఉత్తరం చూసాక నా మనసులో స్వరూప్ బాధ మాయమైనా సంసారం ఎలా నిలబెట్టుకోవాలా, నా బ్రతుకు నవ్వులపాలు కాకుండా ఎలా కాపాడుకోవాలా అన్న తాపత్రయం మొదలైంది! అవివాహితగా నాజీవితం ఒక్క కుటుంబంతోనే ముడిపడివుంటే ఇప్పుడు రెండు కుటుంబాలతో ముడిపడింది!"
"ఇంత ఆలోచన ప్రేమకు ముందు రాలేదా?"
"వస్తే ఇవాళ మీతో ఇన్ని మాటలు పడాల్సిన అవసరం వచ్చేదికాదు! సుమపరిమళంలా గుండెలోకి చొచ్చుకువచ్చే ప్రేమను వారించడం ఎవరితరం? ఈ ప్రేమ నన్ను పిచ్చిదాన్ని చేసి నా కుటుంబం పరువుప్రతిష్టలు రచ్చ కీడ్చకముందే నేను నిగ్రహించుకోగలిగాను! నా పెద్దల ఆజ్ఞకు లోబడి మీ ముందు తలొంచి తాళిగట్టించుకోగలిగాను!"
"గొప్పపనిచేశావ్! దీన్ని త్యాగమనరు! మనసు ఒకరికిచ్చి శరీరాన్ని యంత్రంగా మార్చి మరొకరితో కాపురం చేయడం మోసం! వంచన! మనసులేని ఒక బొమ్మతో కాపురం చేయాల్సినంత దిక్కుమాలినవాడినికాదు!"
"నన్ను గాయపరిచేలా మాటలని మాటమీద మాట అనేలా చేశారుగాని, లేకపోతే నా నోటినుండి ఇన్నిమాటలు వొచ్చివికాదు. నేను వచ్చింది మిమ్మల్ని ప్రార్దించడానికి! మీరు నానుండి విడిపోవడానికే నిశ్చయించుకొంటే ఒక సంవత్సరందాకా ఆగమని నా ప్రార్దన! నేను బొమ్మనో మనిషినో మీకు తెలిసిపోతుంది ఈ సంవత్సరంలో ! ఆ తరువాతకూడా మీరు విడిపోవడానికే నిశ్చయించుకొంటే ఏ కోర్టులూ అక్కరలేదు!నేనే దూరమైపోతాను! నా ప్రేమ కథ, నా భర్త నన్ను త్యజించడం ప్రజలు అసహ్యంగా చెప్పుకోకముందే ఈ ప్రపంచంనుండే వెళ్లిపోతాను?"
"బెదిరింపా?" భుజాలు ఎగరవేశాడు మాధవ్.
"బెదిరింపులకు లొంగి ఏ మగాడూ ఆడదాన్ని చేరదీయడన్న సంగతి నాకు తెలుసు. నా ప్రేమకోసం నా కుటుంబం మానమర్యాదలు మంటగలిపే ఇష్టంలేక నేను స్వరూప్ ని దూరం చేసుకొన్నాను. దూరం చేసుకొనికూడా నేను అనుకొన్నది సాధించలేకపోతే నేన బ్రతకడమెందుకు?"
"మనిషిని దూరం చేసుకొన్నావేమోగాని మనసులో కూడా దూరం చేసుకోగలవా?"
"ఏడాదికాలంలో మీరా సత్యం గుర్తించలేరా!"
"అయితే ఏడాదిపాటు మనం కలిసి వుండాలంటావు! ఆపైన మనం భార్యాభర్తలంగా జీవించడమో, విడిపోవడమో జరగాలంటావు!"
"అవును, ఇది ఒక అగ్రిమెంటు అనుకొందాం."
"ఆల్ రైట్! నేనెందుకు కాదనాలి?"