ఆడది ప్రేమలో పడితే ఎంత నికృష్టంగా చూడబడుతుంది? శారీరకంగా చెడక్కరలేదు. మానసికంగా ఒక పురుషుడి ఆకర్షణకు లోనైతేచాలు. నీతిమాలిన దానికింద, నికృష్టురాలి క్రింద లెక్క కట్టేస్తారు. మనసు చలించినంతమాత్రాన నీతిమాలిన దయ్యేట్టయితే ఈ ప్రపంచంలో కాగడా వేసి వెదికినా ఒక్క పతివ్రతను కూడా పట్టుకోలేరు ఈ మగవాళ్ళు! ఆడదాని హృదయంలోకి చూడగల దివ్యదృష్టే వీళ్లకుంటే భార్య, చెల్లెళ్ళు, తల్లులూ, వదినలూ - అందరూ పతితల క్రిందకి వస్తారు!
అప్పుడు ఆడవాళ్లందరిని త్యజించి ముక్కు మూసుకొని అడవుల్లోకి వెళ్లిపోతారా ఈ మగధీరులు!
మాధవ్ తనని ఎంత అవమానించినా సరే; ఎంత చులకనచేసి మాట్లాడినా సరే అతడి అంతు తేల్చుకోనిదే వెళ్లదు! ఒక నిశ్చయానికి వచ్చిన స్వప్న నిబ్బరం తెచ్చుకోగలిగింది.
ఆ బాధలో, దుఃఖంలో, కసిలో, చల్లటినీళ్లు తలనిండా గుమ్మరించుకొని శాంతపడింది స్వప్న. బాత్ రూం తలుపు తెరుచుకొని ఇవతలికి వచ్చేసరికి ఆమె ముఖం తేటపడి మామూలుగా అయింది.
వైర్ బాగ్ లోనుంచి టాయిలెట్ సామాను ఇవతలకితీసి పది నిముషాల్లో అలంకరణ ముగించింది స్వప్న.
ఉన్నది ఒకటే రూం గనుక గత్యంతరం లేనట్టుగా కుర్చీలో కూలబడి న్యూస్ పేపర్ అడ్డం పెట్టుకొన్నాడు మాధవ్.
బల్లమీద ఫ్లాస్కు, కప్పుసాసర్లు రెడీగా వున్నాయి.
వేడి వేడిగా ఒక కప్పు టీ తీసుకొని అలసటనీ, తలనొప్పినీ పోగొట్టుకోవాలని ఉన్నా అభిమానంతో ముట్టుకో దలచలేదు స్వప్న. తనూ ఓ కుర్చీలో కూర్చొని టేబిల్ మీదున్న మాగజైన్ చేతిలోకి తీసుకొంది.
మాధవ్ కాస్త తగ్గినట్టుగా లేచాడు. రెండు కప్పుల్లో టీ పోసి ఒకటి స్వప్న దగ్గరుంచాడు.
"తీసుకో. చల్లారిపోతుంది."
"అక్కర్లేదు."
"అంత అభిమానస్తురాలివి నా దగ్గరికి ఎందుకు వచ్చావ్?"
"వచ్చాను. పోతానుకూడా. కాని, నా ఒక్క ప్రశ్నకు మీరు జవాబు చెప్పాలి!"
"........."
"మీ వయసు ముప్పైకి రెండు తక్కువ!యువకులై ఏ పది పన్నెండు సంవత్సరాలో అయి వుంటుంది! ఈ పది పన్నెండు సంవత్సరాలలో ఏ స్త్రీ మిమ్మల్ని ఆకర్షించలేదా! ఏ స్త్రీతోనూ మీరు దగ్గరి సంబంధం పెట్టుకోవాలని తహతహ లాడాలేదా?"
"నేనేం అంత చపలుణ్ణి కాదు!"
"అదేం అంత గర్వించాల్సిన సంగతికాదు లెండి!"
"షటప్!'
"ఆడదాన్నై వుండీ తాళికట్టిన భర్తతో వేరొక పురుషుణ్ణి ప్రేమించానని చెప్పగలిగాను. నిజం చెప్పడానికి మీకెందుకు భయం?"
మాధవ్ వెటకారంగా అన్నాడు. "నువ్వు నన్ను వదిలేస్తావన్న భయంచేత!"
"తప్పుచేసింది అనే స్త్రీమీద ఒక రాయి విసరాలన్న కుతూహలాన్ని మించి మరేదీ కలుగదనుకొంటాను మనిషికి. ఆ రాయి విసిరే మనస్తత్వమే చూస్తున్నాను ఈ మాధవ్, బి. ఇ. లో."
"నిజాయితీ వ్యక్తం చేసే గుండె నిబ్బరమే మీకుంటే నాకు నిజం చెప్పండి. ఇన్నేళ్ల యవ్వనంలో మిమ్మల్ని చలింపజేసిన బలహీను క్షణాలు లేనే లేవా? మీ దగ్గరికి వచ్చిన స్త్రీ లేనే లేదా?"
"నేను బ్రహ్మచారిని కాదు!" ఈ మాట సగర్వంగా చెప్పాలనుకొన్నాడుగాని సూటిగా పదునెక్కిన కళ్లతో చూస్తున్న స్వప్న ముందు కించిత్ సంకోచానికి లోనుకాక తప్పలేదు!