Previous Page Next Page 
తపస్వి పేజి 21


    రమేష్ గారు డాక్టర్ విక్రంను కలుసుకుని ఆ తరువాత మన ఇంటికి వస్తానన్నారు. నేను డాక్టర్ విక్రమ్ ను కూడా మన ఇంటికి తీసుకురమ్మన్నాను."
    "డాక్టర్ విక్రమ్ వస్తానన్నారా?" ఆశ్చర్యంగా అడిగింది సౌందర్య.
    ఆ ఆశ్చర్యం అర్ధంకాలేదు కామేశ్వరీ దేవికి.
    "ఎందుకు రాడూ? నా ఇంటికి..."
    సౌందర్య ఇంక మాట్లాడలేదు. అప్పటి వరకూ ఉన్న నిర్లిప్తత ఎగిరిపోయి కుతూహలంతో కాబోయే కామేశ్వరీ దేవి, విక్రమ్ ల సమావేశానికి ఎదురు చూడసాగింది.
    సుధ ఎప్పటిలా ఏర్పాటులన్నీ చూస్తోంది.
    వామనమూర్తి నిశ్చేష్టుడే అయ్యాడు. అది చూసి కామేశ్వరీ దేవి కులాసాగా నవ్వుకుంది.
    "నువ్వు చెప్పనంత మాత్రాన నాకు ఎవరెలాంటివాళ్ళో తెలియదనుకున్నావా? నీకు తెలుసా డాక్టర్ విక్రమ్?"
    "అతడు ...అతడు నాకు స్నేహితుడు...."
    తడబడ్డాయి వామనమూర్తి మాటలు.
    "అలా చెప్పు! అంతేలే! తెలివయినవాళ్ళకు తెలివైనవాళ్ళే స్నేహితులవుతారు!"
    వామనమూర్తి చూపులు సౌందర్య చూపులతో కలుసుకున్నాయి. నవ్వే ఆ కళ్ళ నుండి తన చూపులు గిరుక్కున తిప్పుకున్నాడు.
    ట్రేలో కాఫీలమర్చి ఎవరికో తీసుకెళుతున్న సుధ కనిపించింది.
    చటుక్కున సుధ దగ్గరగా నడిచి ఒక కప్పు తీసుకుని త్రాగి "థాంక్స్!" అని వచ్చి కూచున్నాడు.
    కామేశ్వరీ దేవి ముఖం ఎర్రబడింది.
    "సుధా!" అని పిలిచింది చాలా ప్రేమగా...
    కామేశ్వరీ దేవి ప్రేమపూరితమైన పిలుపులు సుధకు బాగా అలవాటు. వచ్చి నిల్చుంది.
    "చూడు! నువ్వంటే నాకెందుకో కన్న కూతురి కంటే ఎక్కువ అభిమానం. అందుకే మేలుకోరి నీకు కష్టం కలిగినా కొన్ని విషయాలు చెపుతున్నాను. అరిటాకు మీద ముల్లు పడ్డా, ముల్లు మీద అరిటాకు పడ్డా అరిటాకుకే నష్టమంటారు. ఆడదానివి, నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి. ఎవరికయినా కూడని చనువివ్వకూడదు..."
    కామేశ్వరీ దేవి చూపులు ఎర్రగా కందిపోతున్న వామనమూర్తి ముఖం మీదకు మళ్ళాయి. మరింత ప్రేమగా అంది...
    "ఎంత మంచి మగాళ్ళయినా ఆడది ప్రోత్సహించి రెచ్చగొడుతుంటే నిలవలేరు. చిన్నతనంతో అలా రెచ్చగొట్టాక తర్వాత ఫలితం అనుభవించవలసింది ఆడవాళ్ళే! నీ మేలుకోరి చెపుతున్నాను. జాగ్రత్తగా ఉండు!"
    సుధ తల వొంచుకుని వెళ్ళిపోయింది.
    అంతమంది ముందు అలా ముఖంమీద చెప్పగలిగిన కామేశ్వరీ దేవి ప్రేమకు ఎంతగా అలవాటు పడిన...మనసులో మూర్చపోయింది సౌందర్య.
    ఎదురుచూస్తున్న అతిథులు వచ్చారు. రమేష్ ను చూడగానే కామేశ్వరీ దేవిలో కలిగిన ఉత్సాహం డాక్టర్ విక్రంను చూడగానే నీళ్ళు కారిపోయింది.
    ఫుల్ సూట్ లో ఎంతో దర్జాగా ఉన్నాడు రమేష్.....మాసిపోయిన పాంటు...నలిగిపోయిన షర్ట్....చినిగిపోయిన ఆకు చెప్పులు....రేగిన జుట్టు....అప్పుడే ఏ కార్ఖానాలో నుంచో వచ్చినట్లున్నాడు విక్రం...
    పరస్పర పరిచయాలవుతున్నప్పుడు సౌందర్యను చూసి కొంచెం ఆశ్చర్యంగా "మీరు కూడా ఇక్కడున్నారా?"అన్నాడు డాక్టర్ విక్రమ్.
    "నేను ఈ వర్గానికి చెందినదాన్ని....ఇక్కడుండక ఇంకెక్కడుంటాను?"
    "నేనూ ఇక్కడే ఉన్నానుగా! కానీ, ఏ వర్గానికీ చెందను."
    "మీరు ఎక్కడున్నా ఒకటే!"
    డాక్టర్ విక్రమ్ నవ్వి "మీరు మీదికాని స్థలంలో ఉన్నట్లున్నారు" అన్నాడు.
    "అవునేమో! కానీ, ఇక్కడే ఉంటాను. కదలను, కదలలేను!"
    వాళ్ళ సంభాషణ ఆశ్చర్యంగా వింటోంది కామేశ్వరీ దేవి "మీరేం మాట్లాడుకుంటున్నారో నాకు అంతుబట్టడం లేదు" అంది.
    సౌందర్య నవ్వి ఊరుకుంది.
    "ఈయన నీకు తెలుసా?"
    "తెలుసు!"
    "మరి ఇందాక నాతో చెప్పలేదేం?"
    "ఈయనను మీరు తెలుసుకున్నదానికీ, నేను తెలుసుకున్నదానికీ సంబంధం లేదు. ఈయనమీద మీకున్నలాంటి గౌరవం నాకు లేదు!....అందుకని..."
    "చాల్లే! ఊరుకో! మా సౌందర్య మాటలు లక్ష్యపెట్టకండి. మనసులో ఒకటి, పైకొకటి-భగవద్గీత నాలుగో అధ్యాయం అయిదో శ్లోకంలో చెప్పినట్టు...."
    "నేను భగవద్గీత చదవలేదు. ఏ అధ్యాయంలో ఏ శ్లోకంలో ఏముందో నాకు తెలియదు!"
    అతి మామూలుగా అన్నాడు విక్రం. కామేశ్వరీ దేవి తెల్లబోయి అంతలో సర్దుకుని విక్రంను "ఈ మాత్రం తెలియదా?" అన్నట్లు చూసి ఓదారుస్తున్నట్లు "మీ లైను వేరు కదూ! ఇవన్నీ ఎలా తెలుస్తాయిలెండి" అంది.
    వామనమూర్తి విక్రమ్ పక్కగా వచ్చి నిల్చుని "హలో విక్రం!" అంటూ భుజం మీద చెయ్యి వేశాడు.
    విక్రం ఆ చేతిని ఆప్యాయంగా అందుకోనూ లేదు. ముఖం ముడుచుకోనూ లేదు. మామూలుగా నవ్వాడు.
    రమేష్ సౌందర్య మీది నుంచి చూపులు తిప్పుకోలేకపోతున్నాడు. అది గమనించి సౌందర్య అతడిని పలకరిస్తూ "అమెరికాలో మీరేం చదువుకున్నారు?" అని అడిగింది.
    "తెలుగు!" సగర్వంగా సమాధానం చెప్పాడు.
    ఒక్క క్షణం బిత్తరపోయిన సౌందర్య అంతలో తేరుకుంది.
    "సరి అయిన తెలుగు రావాలంటే అమెరికాలోనే నేర్చుకోవాలండీ!" అంది.
    రమేష్ వెంటనే ఒప్పుకుంటూ "అవును. అసలు ఏదయినా అమెరికాలోనే నేర్చుకోవాలి" అన్నాడు.
    "మిగిలిన అన్నింటి విషయమూ వదిలెయ్యండి. తెలుగు మాత్రం అమెరికాలో వచ్చినట్లు ఇక్కడ చచ్చినా రాదు. నిర్దిష్టమైన భాష పద్దతిలో వస్తుంది. తెలుగు వాళ్ళు మాట్లాడితే సహజంగా మాట్లాడేస్తారు గనుక తప్పులు రాక మానవు...అదే తెలుగు నేర్చుకున్న అమెరికన్లు మాట్లాడితే ఎంత అసహజంగా వినిపించినా ఒక తప్పు రాదు!"

 Previous Page Next Page