"అవునవును!" అన్నాడు రమేష్...
సౌందర్య చూపులు విక్రం చూపులతో కలుసుకున్నాయి. ఆ చూపులలో కనిపించే వ్యథకు సౌందర్య చూపులు నవ్వాయి, సవాల్ చేస్తున్నట్లు...
"మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుగా ఉంది...." విక్రంణు చూస్తూ అంది మిసెస్ కామేశ్వరీ దేవి.
"అవును, చూశారు!"
"చూశానా? ఎప్పుడు?"
"ఇక్కడి హాస్పిటల్ లో నామీద రిపోర్టు చేసిన వాళ్ళలో మీరూ ఉన్నారు. ఆ సందర్భంలో చూశారు!"
మిసెస్ కామేశ్వరీ దేవి ముఖం తెల్లగా పాలిపోయింది. నలుగురి ముందు అలా ఆవిడ ఎప్పుడూ తేలిపోలేదు.
"మీరు...మీరు..."
"ఇక్కడ హాస్పిటల్ నుండి మీరందరూ తొలగించిన డాక్టర్ని!"
ఒక్క క్షణం ఆవిడ ఏమీ మాట్లాడలేకపోయింది. కానీ ఎలాంటి సందర్భంలో నయినా నిలదొక్కుకోగలిగే శక్తి ఆవిడకుంది.
"అరె! ఎంత వింత సంఘటన! ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంటాయి. ఒక ప్రిన్సిపల్ కి కట్టుబడిన వాళ్ళం. ఆ కారణం చేత పొరబాటు జరిగిందంటే...ఆ పొరపాటు వల్ల ఒక ప్రాణం పోయిందంటే, సహించలేకపోయాం! పోనీయండి! మళ్ళీ అప్లయ్ చేయండి."
విక్రం ముఖంలో వెలుగులకు ఎదురుచూసిన కామేశ్వరీ దేవికి ఆ ముఖంలో కోపం అర్ధం కాలేదు.
"మీ క్షమాపణలు ఎవరూ కోరారు? అసలు నన్ను క్షమించే అధికారం మీకెక్కడిది?"
విక్రంణు నమిలి మ్రింగాలనిపించింది కామేశ్వరీ దేవికి.
"మీకు ఉద్యోగం అక్కర్లేదా?"
"కావాలి!"
"మరి?"
"ఉద్యోగం కోసం చెయ్యని తప్పుకు క్షమాపణలు ఎందుకు చెప్పుకోవాలి? క్షమించవలసింది మీరు కాదు! నేను! మీరు క్షమాపణ కోరినా నేను క్షమించను. క్షమించలేను!"
మిసెస్ కామేశ్వరీ దేవి కళ్ళలోంచి నిప్పులు కురిశాయి.
అంతలోనే తీయగా నవ్వుతూ "ఇలా అయితే మీకు ఉద్యోగం రాదు!" అంది.
"నాకు తెలుసు!"
ఈ సంభాషణ వింటున్న రమేష్ గాభరా పడి "నాకు పని ఉందంటూ" లేచాడు. డాక్టర్ విక్రం కూడా లేచాడు. మిసెస్ కామేశ్వరీ దేవి చిరునవ్వుతో వాళ్ళకు వీడ్కోలు చెప్పింది. సౌందర్య కూడా వెళ్ళిపోయింది. వామనమూర్తి మాత్రమే మిగిలాడు.
"వామన్! నీకు విక్రం స్నేహితుడా?"
"అవును. అతనికి మన హాస్పిటల్ లో ఉద్యోగం ఇప్పించింది నేనే...మీ ద్వారా"
"తరువాత! అతనికి వ్యతిరేకంగా రిపోర్టు చేసింది నువ్వే కదూ!"
"రిపోర్టు నేను చెయ్యలేదు. కానీ రిపోర్టు చెయ్యడం జరిగాక నేనూ మిగిలిన వాళ్ళలాగే మాట్లాడవలసి వచ్చింది!"
"మళ్ళీ ఇవాళ అతడిని స్నేహంగా పలకరించావు!"
"అఫ్ కోర్స్. అతను నాకెప్పుడూ స్నేహితుడే!"
కామేశ్వరీ దేవి వామనమూర్తిని చూసి చిరునవ్వు నవ్వింది!
"వామన్! నువ్వు నా కంటే కూడా చాలా గొప్పవాడివి!"
13
వామనమూర్తి డాక్టర్ గా ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా భాస్కర రావుని కలుసుకోవటం మానలేదు. అతడు తన చదువుకు చేసిన సహాయానికి కనీసం ఆ మాత్రం కృతజ్ఞత చూపించటం తన కర్తవ్యమనిపించింది.
అదీ గాక "నువ్వెందుకొస్తున్నావో నాకు తెలియదనుకుంటున్నావా? రా! ఇంకెప్పుడూ అలా మాట్లాడకు!" అన్న భాస్కరరావు మాటలు వామనమూర్తి ఎప్పుడూ మరిచిపోలేక పోతున్నాడు. మంచంలో పడుకుని తన స్నేహంలో ఉల్లాసాన్ని వెతుక్కోవాలనుకునే భాస్కరరావు పట్ల వామనమూర్తికి నిజంగా సానుభూతి.
ఆ రోజు భాస్కరరావు ముఖంలో ఏదో నూతనోల్లాసం చూసి "ఏమిటి కథ?" అన్నాడు వామనమూర్తి.
"ఇప్పుడే పేపరులో నీ కథ చదివాను. అదీ కథ!"
"నా కథా!"
"అంటే- డాక్టరుగా నువ్వు సాధించిన విజయాల కథలు, ఈ రోజు పేపరులో వచ్చాయి చూడలేదా?"
వామనమూర్తి చూశాడు. ఇటీవల హాస్పిటల్లో రకరకాల వింత కేసులు నయమయ్యాయి. ...అవన్నీ వివరిస్తూ... వామనమూర్తిని ప్రశంసిస్తూ పేపర్లలో వ్యాసం వ్రాసారు...
"అదా! దానిదేముందీ? నాదేం లేదు" ఏదో వినయంగా "నాదేం లేదు" అన్నాక తన మాటలకు తనే ఉలిక్కిపడ్డాడు వామనమూర్తి.
"నువ్వు కాకపోతే ఎవరు చేస్తున్నారు ఈ ఆపరేషన్ లన్నీ!" మామూలుగా నవ్వుతూ అడిగిన భాస్కరరావుకు ఏ సమాధానమూ చెప్పలేదు వామనమూర్తి....
"ఆ పేపరులో నన్ను ఆకర్షించి...నాకు క్రొత్త ఆశలు కల్పించిన విషయం ఒకటి ఉంది...."
వామనమూర్తి బెదిరి చూశాడు.
"టి.బి. లంగ్స్ లోనే కాక వెన్నెముకలో కూడా వస్తుందట కదా! ఆపరేషన్ వల్ల నయం కావచ్చునటగా! సరిగ్గా అలాంటి కేసు నువ్వు నయం చేశావట కదా! పేపర్లన్నీ నిన్నెంతగానో మెచ్చుకున్నాయి. ఒకవేళ నా కేస్ కూడా అలాంటిదేనేమో! నువ్వెందుకు ప్రయత్నించ కూడదూ? ఒకవేళ ఆపరేషన్ జరిగితే బాగవుతుందేమో!"
వామనమూర్తి శరీరమంతా చెమటలు క్రమ్మాయి. కాళ్ళు, చేతులు వణికాయి. దీనంగా ఆశతో మాట్లాడుతున్న భాస్కరరావును చూడలేకపోయాడు.
"ఏమంటావు వామన్?"
వామన్ గొంతు పెగలించుకున్నాడు.