సుధ శ్రద్దగా వింది..
ఈ వేదాంతాన్ని గురించి సుధ ఆలోచించక పోలేదు. కామేశ్వరీ దేవి కాలేజీలో చేరటానికి వీల్లేదని గట్టిగా శాసించినప్పుడు....తన విముక్తికి ఏ ఆశా లేదని అనుకున్నప్పుడు....వేదాంతాన్నే ఆశ్రయించింది. కోరికలు చంపుకోవాలి! జీవ్గితం అశాశ్వతం! యవ్వనం క్షణభంగురం! పారంపర్యంగా వస్తోన్న ఇలాంటి సూత్రాలన్నీ ఒక్కసారి మనసులోకి తెచ్చుకుంది కానీ, ఆ సూత్రాలలో ఎలాంటి ఓదార్పూ లభించకపోగా, అవన్నీ అర్ధరహితమైనవిగా తోచాయి.
ఆశలే చంపుకుంటే మనసు శూన్యం చేసుకుంటే ఇక మిగిలేదేమిటి? జన్మ ఎత్తింది జీవచ్చవంలా మారటానికా? ముందుముందు నాశనమవుతామని ఈ అందాలన్నీ అనాదరించగలమా? చక్కని సూర్యచంద్రాదుల ఉదయాస్త మయాలూ... పరిమళాలతో ఊగిపోయే పుష్పాలు, పరవళ్ళతో ప్రవహించే నదులు... ఈ అందాలన్నీ మిథ్య అనుకుని మనసును చంపుకోవటానికే సృష్టించబడ్డాయా?
తన మనసును మధిస్తోన్న ప్రశ్నలన్నిటికీ సౌందర్య మాటలలో సమాధానం దొరికినట్లయింది.
ఏడ్చి ఏడ్చి ఉబ్బిన కళ్ళు ఒక్కసారి మెరిశాయి. వడిలిపోయిన ముఖంలోకి వికాసం వచ్చింది...
"నాకు డబ్బు అక్కర్లేదు. కాలేజిలో చదవకపోయినా ఫరవాలేదు. కానీ, నాకు నీ లైబ్రరీలో పుస్తకాలు ఇయ్యగలవా?"
సౌందర్య నవ్వుతూ- "మొదటి దాని కంటే రెండవది తక్కువదనుకుని అడుగుతున్నావా?" అంది.
"అది లోకం దృష్టిలో ...మన దృష్టిలో కాదు..." "మన" అనటం సౌందర్య గమనించి సుధను నిశితంగా చూసి "ఐతే కాలేజీలో చదవవా?" అంది.
"చదవను!"
"నీకు అవసరం కాదూ!"
"చదువు అవసరమే! కాలేజి అవసరం లేదు!"
"కాలేజికి పోకపోతే డిగ్రీ రాదు! డిగ్రీ లేకపోతే ఉద్యోగం రాదు!"
"డిగ్రీ ఉన్నా ఉద్యోగం వస్తుందని నమ్మకం లేదు. డబ్బు సంపాదించడానికి లక్ష మార్గాలున్నాయి. ప్రస్తుతం నాకు డబ్బు అక్కర్లేదు. కావాలని అనిపించినప్పుడు ఎలాగయినా సంపాదించగలను!"
సౌందర్య పకపక నవ్వుతూ అంది.
"డబ్బు అక్కర్లేదా? ఎలాంటి మాట విన్నాను! ఐతే అహంకార మమకారాలు చంపుకుని ...స్వార్ధరహితంగా ...విరాగిణిలా...."
"పొరబడుతున్నావు. నేను విరాగిణిని కాను. మమకారం అసలు చంపుకోను. నాది అనుకున్న దాని మీద నాకు వల్లమాలిన మమకారం. అహంకారం కూడా తక్కువ లేదు. ఈ సృష్టిలో భాగధేయ నిర్ణయం ఏ సూత్రాల ననుసరించి జరుగుతుందో ఊహించలేకపోయినా, ఏమి పొందగలిగినా, ఏమి పొందలేకపోయినా..నేను ఎవరికంటేనూ తక్కువ దానిని కాను, ప్రయత్నిస్తే అందరికంటే ఎక్కువదానినే కాగలను. నేను చాలా స్వార్ధపరురాలిని. నా ప్రతిమాటా, ప్రతి చర్యా, ప్రతి భావనా "నాది" గానే ఉండాలి!"
సౌందర్య సుధను వింతగా చూస్తూ "మన భావాలు ఇంచుమించు ఒక్కలాగానే ఉన్నాయి. కానీ ఏదో భేదం ఉంది" అంది.
"అవును. శాస్త్రవేత్తకు, కళాకారుడికి ఉండే భేదం. నువ్వు నీ మానసిక శక్తితో మేధను పదును పెట్టుకుంటూ జ్వలిస్తున్నావు. నేను నా మేధతో మనసును రాగరంజితం చేసుకోవాలనుకుంటున్నాను."
12
అమెరికా నుండి తిరిగి వచ్చిన ఒక ప్రముఖుని గౌరవార్ధం మిసెస్ కామేశ్వరీ దేవి పార్టీ ఏర్పాటు చేసింది.
"ఇవాళ మనం మరొక వ్యక్తిని కూడా కలుసుకోబోతున్నాం!"
చాలా గర్వంగా సౌందర్యతో అంది మిసెస్ కామేశ్వరీ దేవి.
"ఎవరా ప్రముఖుడు?"
సౌందర్యకు ఏ ప్రముఖులలోనూ కుతూహలం లేదు. కానీ, మిసెస్ కామేశ్వరీ దేవి మాటలు వినటం సరదా.
"డాక్టర్ విక్రమ్!"
ఉలిక్కిపడింది సౌందర్య.
ఆ ఉలికిపాటు గమనించి చాలా సంతోషించింది మిసెస్ కామేశ్వరీ దేవి. సౌందర్య ప్రతిదానికి హేళనగా నవ్వటమే తప్ప దేనినీ పట్టించుకోదు, అలాంటి సౌందర్య ఉలిక్కిపడిందంటే...
"డాక్టరు విక్రమ్ చాలా తెలివయినవాడు తెలుసా?" మరింత గొప్పగా అంది.
మతిపోతోంది సౌందర్యకు. సౌందర్యను అలా చూస్తున్న కొద్దీ కామేశ్వరీ దేవికి హుషారు ఎక్కువవుతోంది.
"అంత తెలివయినవాడు మన ఊళ్ళో ఉన్నాడంటే నాకు చాలా సంతోషంగా ఉంది."
"ఆయన మీకు తెలుసా?" తనను తను నిగ్రహించుకుంటూ అడిగింది సౌందర్య.
"ఎందుకు తెలియదూ? భలేదానివి. అంత కూపస్థమండూకాన్ననుకుంటున్నావా? నాకు అన్నీ తెలుసు!"
తన మనోభావాలు నిగ్రహించుకోవటం సౌందర్యకు బాగా తెలుసు. అందుకని ఫకాలున నవ్వలేదు కానీ, చిన్న చిరునవ్వు పెదవుల మీద విరిసింది. అది చూసింది కామేశ్వరీ దేవి.
"తెలుసంటే ముఖాముఖి తెలియదనుకో! కానీ చాలా విన్నాను."
"వినే ఉంటారు" గంభీరంగా అంది సౌందర్య. అంతలో ఏదో స్ఫురించి "ఇన్నాళ్ళుగా లేనిది ఇప్పుడెందుకు డాక్టర్ విక్రమ్ ను ఆహ్వానిస్తున్నారు?" అంది.
కామేశ్వరీ దేవి కొంచెం ఇబ్బందిగా కదిలింది.
"ఎప్పటికప్పుడు పిలుద్దామనే అనుకుంటున్నాను కానీ, నా మతిమరుపు నీకు తెలుసుగా! ఒకటా, రెండా లక్ష వ్యాపకాలు. ఎన్నని గుర్తు పెట్టుకోను? అమెరికా నుండి వచ్చారన్నానే...రమేష్ గారు- ఆయన చెప్పారు! అక్కడ అమెరికాలో డాక్టర్ శ్రీరాములు గారు డాక్టర్ విక్రమ్ గురించి చాలా చెప్పారట! తప్పకుండా కలుసుకోమన్నారుట! "రేర్ జూనియర్" అన్నారుట డాక్టర్ శ్రీరాములు గారు.