"ష్యూర్. అంతేకాదు, వీలైతే అంకిత్ తో కూడా కూడా మాట్లాడాలని వుంది. వీలవుతుందా?"
"తప్పకుండా! ఇప్పుడే తీసుకొస్తాను" అంటూ ఫోన్ జాన్ కి ఇచ్చింది.
"ఏమైంది? కృష్ణానంద్ దొరికాడా?" అట్నుంచి జాన్ అడిగాడు. ".......అతడు కాదు మనక్కావల్సింది. కృపానందే....." అంటూ జరిగిందంతా చెప్పాను. అట్నుంచి జాన్ గాఢమైన శ్వాస వినిపించింది. "మరిప్పుడేం చేద్దాం?"
"చెయ్యటానికేమీ లేదు. నేనో గంటలో బయల్దేరి వచ్చేస్తున్నాను" నిస్పృహగా అన్నాను, జాన్ మాట్లాడలేదు. రిసీవర్ మృణాళినికి అందించిన శబ్దం వినిపించింది.......
"హలో"
"ఏమైంది మృణాళినీ? అంకిత్ వచ్చాడా?"
ఆమె ఒక క్షణం మౌనం వహించింది.
"ఏమైంది?" అనుమానంగా అడిగాను.
"అంకిత్..." ఆమె సందిగ్ధంగా అంది.
"ఏమైంది? అంకిత్ ఏమన్నాడు?"
"మీతో మాట్లాడనన్నాడు" ఆమె మాట శరాఘాతంలా నా గుండెని చీలుస్తూ వెళ్ళిపోయంది. భయంకరమైన స్థబ్దత ఆ హొటల్ గదినిండా నిండాపోయింది.
* * *
నేను చెమటోడ్చి కష్టపడటంలేదు. కానీ మానసికంగా చాలా కష్టాల్లో వున్నాను. ఇదంతా బయటికి కనపడనిది. ఎవరికోసం? అంకిత్ కోసం కాదూ? మరి వాడు అలా ప్రవర్తించటానికి కారణం ఏమిటి?
ఎప్పుడూ నేను ఏ పనీ చేయలేదు. నాక్కావాల్సిందంతా, పెళ్ళికాక ముందు అమ్మా, పెళ్ళయ్యాక అరుంధతీ అమర్చిపెట్టేవారు. నా బట్టలు కూడా నేనెప్పుడూ కొనుక్కోలేదు. ఏ వస్తువు కొన్నా అది అంకిత్ కీ! అప్పుడప్పుడు అరుంధతికీ!! ఇప్పుడు చాలా కష్టపడుతున్నా...... చివరికి మారు పేర్లతో కాలేజీలో ప్రవేశించి రికార్డులు వెతికినా అంకిత్ కోసమే గదా! చివరికి నాకే సంబంధమూ లేని సుమద్యుతి గురించీ, నా గురించీ పదిమందీ 'అనుమాన పడతా'రని తెలిసినా ఇదంతా చేస్తున్నది ఎందుకు? వాడికోసం కాదా?...... అటువంటిది.... వాడే నాతో మాట్లాడటానికి, ఇష్టపడలేదంటే ఇక నేనెవరి కోసం ఇదంతా చెయ్యాలి?
ప్రతి మనిషీ తన కుటుంబంలోని సభ్యులపట్ల కనీసం ఎప్పుడో ఒకసారి ఇలా ఆలోచిస్తాడేమో! కానీ అంకిత్ గురించి నేనలా ఆలోచించటం నాకే సిగ్గుగా అనిపించింది. వాడు చిన్నపిల్లాడు. తనని మిషన్లకి వదిలిపెట్టి నేను ఊళ్ళుపట్టుకు తిరుగుతున్నానని నా మీద కోపం పెట్టుకుని వుంటాడు.
ఈ ఆలోచన కలిగాక...... నేనూ ఎంత వివేకరహితంగా ఇప్పటివరకూ ఆలోచించానో తల్చుకుంటే నవ్వొచ్చింది. మన పన్లని మనం ఎంత వేగంగా పునఃపరిశీలించుకోగలిగితే అంత మంచిదని నాకు ఒక పుస్తకంద్వారా తెలిసింది!
మృణాళిని నాకా పుస్తకం ఇచ్చింది.
అంకిత్ ఆస్పత్రిలో చేర్పించిన కొత్తలో - వరండా కుర్చీలో ఒక్కడ్నే ఒంటరిగా, దిగులుగా కూర్చుని వుంటే, చదవమని ఇచ్చిన పుస్తకం.
వివేకానందుని కర్మయోగమది!
మానవ జీవితాలకు పరమావధి "సుఖం కాదనీ 'జ్ఞాన' మనీ అంటాడు వివేకానందుడు.
సుఖమే పరమావధి అనుకోవటమే దుఃఖానికి కారణభూత మౌతుందంటాడు. తృప్తే సుఖం! తృప్తి లేనంతకాలం 'సుఖం' ఆనందాన్నివ్వదు. అందీ అందకుండా వూరించి, విషాదాన్ని ఇస్తుంది. సుఖాన్ని ఆశించకుండా చేసే కర్మ మనిషిని ఆత్మభోగిని చేస్తుంది. అదీ ఆ పుస్తకంలో చెప్పింది. అటువంటి కర్మయోగాన్ని గుర్తుచేసుకుంటే నా వ్యధ కాస్త తగ్గింది.
తెల్లవారుఝామున ఎప్పుడో నిద్రపట్టింది. మెలకువ వచ్చేసరికి రైలు విశాఖపట్టణం స్టేషన్ లో ఆగి వుంది.
* * *
"కన్నా!"
అంకిత్ కళ్ళు తెరిచాడు. వాడి కళ్ళల్లో నన్ను చూసిన ఆనందం క్షణంపాటు మెరిసి మాయమయింది! కానీ వెంటనే తల ప్రక్కకి తిప్పుకుని గోడవంక చూస్తుండిపోయాడు.
"నా మీద కోపం వచ్చిందికదూ?" వంగి నుదుటిమీద ముద్దు పెట్టుకుంటూ అన్నాను.
వాడు సమాధానం చెప్పలేదు. నేను నిశ్శబ్దంగా అంకిత్ నే గమనించసాగాను. శరీరమంతా వడలిపోయినట్టు తయారయింది. సూదులు గుచ్చిన చోటంతా నల్లటి మచ్చలతో నిండిపోయంది. కళ్ళక్రింద చారలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
నా కళ్ళకి వాడు జీవచ్ఛవంలా కనిపిస్తున్నాడు. నా హృదయం ద్రవించింది.
"మీకన్నా అంకిత్ ఇంకా అందంగా వున్నాడు" అనేది అరుంధతి. ఇప్పుడు...... నా కొడుకుకన్నా నేను అందంగా వున్నందుకు సంతోషపడాలా? నాకన్నా నా కొడుకు అందవిహీనంగా తయారౌతున్నందుకు దుఃఖపడాలా?
అంకిత్ మెల్లగా చేయిపట్టి లేపి కూర్చోబెట్టాను. ఒక్కక్షణం వాడి తల నిమిరి, గట్టిగా గుండెలకి హత్తుకున్నాను. ముందు వాడు గింజుకున్నా, తర్వాత ప్రతిఘటించటం మానేసి, ఏడవటం ప్రారంభించాడు.
"నేనిక్కడ వుండను డాడీ! రోజూ రెండుసార్లు నాలుగేసి సూదులు గుచ్చుతున్నారు. నా వీపంతా నొప్పి పుడుతోంది......నాకు యిక్కడ వుండాలని లేదు. నేను మనింటికి వచ్చేస్తాను. మీతో కలిసి జాగింగ్ చేస్తాను. వచ్చేస్తాను డాడీ! నన్ను తీసుకు వెళ్ళిపోండి, నేనిక్కడ వుండను."
నేను శిలలా మారిపోతే బావుణ్ను. అన్న కోరిక.... వాడింకా ఏడుస్తూ చెపుతూనే వున్నాడు. "నేనుండను డాడీ! మమ్మీ నడిగితే మీరొచ్చాక తీసుకెళతారంది. మీరేమో నన్నిక్కడ వుంచేసి, వూరుకెళ్ళి పోయారు. నాకు అన్నం కూడా సరిగ్గా పెట్టటంలేదు. ఏదేదో తినమంటారు. అవన్నీ నాకసలు ఇష్టంలేనివి. ఊరకే మందులు ఇస్తారు. ఇంజక్షన్ లు చేస్తారు."
"కన్నా! ఒక్క పదిరోజులు ఓపికపట్టు. ఇక నీకీ బాధ వుండదు. ఎవరూ నిన్నిక్కడ ఉంచమన్నా వుంచను. సరేనా?" సముదాయించబోయాను.
"ఊహూ.......నేనసలుండను. నన్ను తీసుకెళ్ళిపోండి" నా మాట వినకుండా గట్టిగా ఏడుస్తూ మారాం చేయసాగాడు. వాడికెలా సర్దిచెప్పాలో తెలీలేదు.
ఇంతలో మృణాళిని వచ్చింది. నా చేతుల్లోంచి అంకిత్ ని తీసుకుంది.
"చూడు అంకిత్! నువ్వు మరీ పసివాడిలా ఏడుస్తున్నావు. డాడీ నీ కోసమే తిరిగి-తిరిగి అలసిపోయి వచ్చారు. రాగానే నువ్విలా ఏడుస్తూ కనబడితే ఆయనకి మనశ్శాంతి వుండదు. ఊరుకో" అంటూ వాడిని తనతో తీసుకువెళ్ళింది.
నేను నిశ్శబ్దంగా ఆ బెడ్ మీదే కూర్చుని వుండిపోయాను. ప్రక్కనే వున్న డయాలిసిన్ మిషన్ సానుభూతిగా చూస్తోంది. నా కళ్ళకయితే అది ఒక వికృత జంతువులా కనిపిస్తోంది. కానీ ఏమీ చేయలేను.
అవును ఏమీ చేయలేను.
తమ ప్రయత్నం తాము చేస్తున్న డాక్టర్లనీ తప్పుపట్టలేను.
తనవంతు బాధని అనుభవిస్తూన్న అర్థాంగినీ ఏమీ చేయలేను.
తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న ఆ మిషన్ నీ మీ చెయ్యలేను.
అనాల్సిందల్లా ఒక్కదాన్నే కానీ నాకది సమాధానం చెప్పదు. అది ఎవరి మాటా వినదు కూడా!
తాను చెయ్యాల్సిన పని మానేసి నిర్వీర్యం చేస్తున్న ఒకే ఒక చిన్న భాగం అది.
.......కిడ్నీ!
........... ది కిడ్నీ!!
* * *
మనిషి కష్టాలకి ఒక ప్రమాణంలేదు. ఎవరి కష్టం వారికి హిమాలయం లాగానో తోస్తుందనుకుంటాను. అంకిత్ బ్రతికించుకోవటానికి నేనింత కష్టపడుతున్నాను. కానీ మృణాళిని.
ఎప్పుడూ హాయిగా నవ్వుతూ తృళ్ళుతూ కనబడే నలభై ఏళ్ళ మృణాళినితో నా సంభాషణ...... కష్టానికి అవతలి కోణాన్ని చూపించింది. ఒకరోజు ఆమె నాతో అన్నది....... "మీరు అదృష్టవంతులు...... నాతో పోల్చుకుంటే".
అనుమానంగా తలెత్తాను........."అంటే?"
"నాకు పిల్లలు లేరు" తల దించుకుని గోళ్ళవంక చూసుకుంటూ చెప్పింది. విస్మయంగా తలెత్తాను. అందరు రోగుల్ని తన పిల్లలుగా చూసుకునే ఈ మాతృమూర్తికి పిల్లలు లేరా? "అంటే...... అసలు పుట్టలేదా? పుట్టిపోయారా?" అని అడిగాను.
"రెండూ కాదు. నా భర్త బలవంతంగా చంపేసాడు."
అదిరిపడి, "ఏమిటీ?" అని కీచుగా అరిచాను. ఆమె విషాదంగా నవ్వింది.
"అవును. నా భర్త ఒక క్రూరమైన మనస్తత్వం ఉన్నవాడు- మొదటిసారి గర్భం దాల్చగానే 'ఆడపిల్లను కనొద్దు. మగసంతానం కావాలి నాకు' అన్నాడు. "అదేమీ నా చేతుల్లో లేదుకదా" అంటే 'ఏమో అదంతా నాకు తెలీదు. మగపిల్లాడిని కనకపొతే బిడ్డతోసహా మీ పుట్టింటికి పంపించేస్తాను' అన్నాడు. నేను తిరుగు సమాధానం చెప్పలేదు. మూడో నెల దాటగానే స్కానింగ్ చేయించాడు. ఆడపిల్ల అని తెలగానే బలవంతంగా అబార్షన్ చేయించాడు. అలా రెండుసార్లు జరిగింది. మూడోసారి నేను అతనికి ఛాన్సివ్వదలుచుకోలేదు. కానీ అప్పటికే నా గర్భసంచీ పాడయిపోయింది. ఈసారి ఎవరూ తీసేయకుండానే నా గర్భం దానంతటదే పోయింది. జీవితాంతం పిల్లలు కనడానికి అనర్హురాలనిప్పుడు. అంతేకాదు, ఒంటరిని కూడా."
నిశ్సబ్దంగా తలెత్తాను. ఆమె కళ్ళు విషాదానికి అతీతమైన స్థితిలో ఉన్నాయి. గాజుకళ్ళలా కూడా కాదు. భావరహితంగా........ బాధారహితంగా.......చాలా............. చాలా..... నిర్లిప్తంగా.......
ఆ స్థితి నాకు అనుభవమే. మా అమ్మ పోయినప్పుడు నేనూ అలాంటి స్థితినే అనుభవించాను.
సానుభూతిగా చూడాలనుకున్నాను. కానీ అంతకుమించిన ఆత్మీయతేదో నన్ను కుదిపేసింది. టేబుల్ మీద నిస్త్రాణంగా ఆనివున్న ఆమె చేతిని నా రెండు చేతుల్లోకి తీసుకున్నాను. అప్పుడన్నాను,
"నువ్వు ఒంటరిదానివి అసలేకాదు మృణాళినీ....... నేనూ, అరుంధతి, అంకిత్ మేమంతా నీ పిల్లలమే. ఈ క్షణం నుండీ నువ్వు నా కుటుంబంలో ఒక సభ్యురాలివే. ఇంతమంది ఆత్మీయులం వుండగా నువ్వు ఒంటరి దానివి ఎలా అవుతావు?"
మృణాళిని నవ్వింది. కళ్ళు మెరుస్తుండగా చిన్నగా నవ్వింది. తరువాత నా చేతిని చిన్నగా నొక్కి వదిలేస్తూ "హమ్మయ్య. ఇక నాకే నిశ్చింతాలేదు. నా కొడుకూ కోడలినీ...... మనుమల్ని చూసుకుంటూ ఓ మూల కృష్ణారామా అనుకుంటూ పడివుంటాను. ఈ వయసులో ఈ జంజాటమంతా ఇక నాకు దేనికి?" అంది.
నేను నవ్వాను. చాలా గట్టిగా నవ్వేశాను. నాతోపాటు మృణాళిని కూడా శృతి కలిపింది. అలా మేము చాలాసేపు నవ్వుతూనే వుండిపోయాం. మా మనసుల్లోని బరువు పూర్తిగా దిగిపోయేదాకా నవ్వుతూనే వున్నాం.
* * *
ఆ రోజు నా పుట్టినరోజు. కానీ నాకేమీ సంతోషంగా లేదు. ఇది వరకు నా కళ్ళకు ఈ ఇల్లు ఎంతో అందంగా కనిపించేది. ఇప్పుడు......ఒక భయంకరమైన అగ్నిపర్వతం బ్రద్ధలై పొంగిన లావా ఈ ప్రదేశాన్నంతా ముంచివేసిన స్థబ్దత.
ఎవరో నియంత్రించినట్టు మేమంతా యాంత్రికంగా పనులు చేస్తున్నామేతప్ప ఎందులోనూ ఒక ఆనందం లేదు. అనుభూతి లేదు. ఒక రమ్యమైన ఆస్వాదన లేదు.